**దశిక రాము**
**మహాభారతము**
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /
దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//
115 - విరాటపర్వం.
కీచక, ఉపకీచకుల మరణానంతరం ద్రౌపది సుధేష్ణా మందిరానికి వెళ్ళగానే, సుధేష్ణ నొసలను చిట్లించి, యేమాత్రం ఆత్మీయభావం చూపించకుండా, ' సైరంధ్రీ ! జరిగినదేదో జరిగిపోయింది. నీవు వెంటనే విరాటనగరం వదలి, వేరే యెక్కడకైనా, నీ కిష్టమైన చోటుకువెళ్ళు. ' అని సూటిగా ఆజ్ఞాపించింది.
ద్రౌపది ఆలోచనలో పడింది. ఇప్పుడు యీ అజ్ఞాతవాసం చివరిరోజులలో, అజ్ఞాతవాసం ముగిసేసమయంలో, ఇంతమంచి ఆశ్రయం వదులుకుని వెళ్లడం యెంతమాత్రం మంచిపనికాదని తర్కించుకుని, ' అమ్మా ! సుదేష్ణాదేవీ ! ఇంతకాలం నన్ను మీకుమార్తె వలే కడుపులో పెట్టుకునిచూసుకున్నారు. మీ మేలు మరువలేను. నాపతులకు మీగురించి యెంతో గొప్పగా చెప్పాను. వారి నుండి మీకెవరికీ, యీ నగర ప్రజలకూ, యెట్టి ఆపదారాదు. నా పలుకులు విశ్వసించండి. ' అని దీనంగా చెప్పింది.
' నా భర్తలు నాతో సంభాషిస్తూ, ' నీకు మేలు చేసిన సుధేష్ణా విరాటులు మాకు దైవ సమానులు. వారికీ, వారి రాజ్యానికి మనం యేదో విధంగా మేలుచేద్దాము.' అని నాతో చెప్పారు. కాబట్టి మీరు నిశ్చిన్తగావుండి,, నాకు మరికొంతకాలం, కనీసం యింకొక పదమూడు రోజులు ఆశ్రయమివ్వండి. ఆతరువాత నాత్రోవ నేను చూసుకుంటాను. ' అని చెప్పింది ద్రౌపది.
ద్రౌపది అంతగా అడుగుతుంటే, సుధేష్ణ మనస్సు కరిగిపోయింది. ఆమెకు ద్రౌపదీ, ఆమె భర్తలు యెంత శక్తిమంతులో అర్ధమయ్యింది. అందుకని, సుధేష్ణా దేవే, ద్రౌపదిని దీనంగా, ' సైరంధ్రీ ! నీవు యెంతకాలం వుండదలచుకుంటే అంతకాలం మావద్ద వుండు. కానీ, నాకూ, నా భర్తకు, నా పిల్లలకూ, యేఆపదా రాకుండా కాపాడు. ' అని సామాన్య గృహిణి లాగా ప్రార్ధించింది. ఆవిధంగా విరాటనగరంలో ద్రౌపది వుండడానికి, యే యిబ్బందీ లేకపోవడంతో, పాండవులకు ప్రస్తుతానికి, స్వాంతన చిక్కింది.
ఇక, హస్తినలో, పాండవుల జాడ తెలుసుకోవడానికి, కాళ్లకు బలపాలు కట్టుకుని తిరుగుతున్న దుర్యోధనుని గూఢచారులకు, విరాటనగరంలో కీచకుని మరణవార్త, కొంత సమాచార సేకరణకు వుపయోగబడింది. సేకరించిన సమాచారాన్ని, వారు త్వరితంగా దుర్యోధనునికి చేర్చారు. కీచకుడూ, అతని నూట అయిదుగురు సోదరులూ గంధర్వుల చేతిలో హతమైన విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు దుర్యోధనాదులు.
ఈ విషయం విన్నప్పటినుండి దుర్యోధనుని కంటిపై కునుకులేదు. తనలో తాను, తర్కించుకుని, పెద్దలందరితో సమావేశం యేర్పాటుచేసి, ' మాన్యులారా ! పాండవుల అరణ్యవాసము, కొద్దిరోజులలో అజ్ఞాతవాసమూ, పూర్తికావస్తోంది. యీ సంవత్సరమంతా, వారి వునికిని కనిబెట్టడంలో మనమంతా విఫలమయ్యాము. యీ కొద్దిరోజులూ మనం వుదాసీనంగా వుంటే, వారు స్వేచ్ఛావాయువులు పీల్చుకుని, వారి రాజ్యభాగం వారికి యివ్వమంటారు. లేదా కయ్యానికి కాలుదువ్వుతారు. మీకెవరికీ యీ విషయంలో చీమైనా కుట్టినట్లు లేదు. వారు ప్రతీకార వాంఛతో వూగిపోతూ వుంటారు. వారిని ఎదుర్కొనడం కష్టం. మీరంతా యేదైనా వుపాయం అలోచించి, కీచకవధ వలన మనకు వారి ఆధారాలు దొరికే వీలువుందేమో విశ్లేషించండి. ' అని అనేకవిధాల వారిని రెచ్చగొట్టాడు.
కర్ణ దుశ్శాసనులు, యీ విషయాన్ని చాలా తేలికగా తీసుకున్నారు. పాండవులు బ్రతికి వుండే అవకాశమే లేదన్నారు. ఉంటే మన గూఢచారులకు కనబడక పోయే ప్రశ్నే లేదన్నారు. ద్రోణాచార్యుడు వీరి మనసులలో ఆందోళన కనిబెట్టి, ' ధర్మాన్ని రక్షించేవారిని ధర్మం రక్షిస్తుంది. మనం ధర్మ జీవితం గడుపుతున్నామనే భావన మనకుంటే, ఆందోళనకు ఆస్కారమే లేదు. ' అని నర్మగర్భంగా చెప్పి వూరుకున్నాడు. పాండవులు మరణించి వున్నారని దుశ్శాసనుడు భావిస్తే, పాండవులు తప్పక జీవించే వుండి వుంటారని ద్రోణుడు చెప్పాడు.
' ధర్మరాజు యెక్కడవుంటే అక్కడ ధర్మం తాండవిస్తూ వుంటుంది. ఆయన సోదరులూ, ద్రౌపదీ నీడవలె ఆయన వెంటనేవుంటారు. ధర్మరాజును గుర్తించడం సామాన్యుల తరంకాదు. ధర్మరాజును గుర్తించాలంటే ఒక్కటేమార్గం. చుట్టుప్రక్కల రాజ్యాలలో, నిత్యమూ యజ్ఞయాగాదులు జరుగుతున్న ప్రదేశం, పాడిపంటలు, గోసంపద, సమృద్ధిగా వున్న రాజ్యము, తోటలూ వనాలూ రసభరితమైన ఫలాలతో, పుష్పాలతో వున్న ప్రదేశం గుర్తించండి, వ్యర్ధ ప్రసంగాలతో పాండవులు మరణించారని అమంగళవాక్యాలు పలుకకండి. ' అని నిర్ద్వందంగా చెప్పాడు భీష్మాచార్యులు.
కృపాచార్యులు, ' పాండవులను యెదిరించి సమరంలో గెలువగలిగితే, వారు యెక్కడ వున్నా మనకు యిప్పుడు నిమిత్తంలేదు. లేదూ, సంధి చేసుకుని వారి ఇంద్రప్రస్థముతో కూడిన రాజ్యం వారికి వప్పజెప్పినా మీరందరూ సుఖశాంతులతో వుండే ఆస్కారం వున్నది. ' అని వున్నమాటగా చెప్పాడు.
అందరి అభిప్రాయాలు విన్న తరువాత, దుర్యోధనుడు కొంచెము సేపు కనులు మూసుకుని, దీర్ఘంగా అలోచించి, తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు :
' ఆత్మీయులారా ! నేను పుట్టి, పెరిగి, పెద్దవాడిని అవుతున్నప్పటినుంచీ, నాకు ధర్మాధర్మాల గురించి అనేకమంది పెద్దలు యేదో ఒకవిషయంలో చెబుతూనే వున్నారు. వారికి ధన్యవాదాలు. నాకువున్న నీతి అనేనేత్రం ద్వారా, నేనూ విషయాలను ఆకళింపు చేసుకుంటూనే వుంటాను. నాకు తెలిసినంత వరకూ, నేనువిన్నంతవరకూ, భుజ బలం, శక్తియుక్తులు, ధైర్యము అనే విషయాలలో, అన్నివిధాలుగా సములైనవారు, యీ భూమిపై నలుగురు మాత్రమే వున్నారు. వారు బలరాముడు, భీముడు, మద్ర రాజ్యాధిపతి శల్యుడు, నాలుగవవాడు కీచకుడు. వీరు తప్ప అయిదవడెవరికీ అట్టి లక్షణాలు లేవు.'
' దీనిని బట్టి నాకు అర్ధమవుతున్నవిషయం ఒక్కటే. కీచకుని చంపిన గంధర్వుడు భీమసేనుడే. సైరంధ్రి యెవరోకాదు, పాండవుల పట్టమహిషి ద్రౌపదే ! ద్రౌపదిని పరాభవించాడనే కీచకుని, ఉపకీచకులనూ భీముడు మట్టుబెట్టాడు. అంతేకాకుండా, భీష్మ పితామహుడు చెప్పినట్లు, కొద్దిరోజులుగా మత్స్యదేశం, యెన్నడూ లేనంతగా సశ్యశ్యామలంగా ధనరాశులతో నిండి వున్నదని, వ్యాపార ప్రముఖులు మాతో ముచ్చటిస్తూ వున్నారు. అయినా మేము పట్టించుకోలేదు. ఇప్పుడు మత్స్యదేశం పై దండెత్తడమే మన తక్షణకర్తవ్యమ్. ముందుగా మనం వారి గోసంపదను అపహరించి వారిపై కయ్యానికి కాలు దువ్వుదాము. అదృష్టవశాన మనం పాండవులను గుర్తించామా, తిరిగి వారు పన్నెండుసంవత్సరాలు అరణ్యవాసం గడుపుతారు. వృద్ధులై తిరిగి వెళ్తారు, అజ్ఞాతవాసానికి, మళ్ళీ. పాండవులు అక్కడలేని పక్షాన కూడా మనకు నష్టమేమీ వుండదు. మత్స్యదేశ గోసంపద మనతో కలుపుకుంటాము. ఇదేఇప్పుడు ఆచరించవలసిన రాజనీతి. ' అంటూ వికటాట్టహాసం చేశాడు.
అన్నదే తడవుగా మత్స్యదేశంపై యుద్ధ సన్నాహాలకు ఆజ్ఞాపించాడు. కీచకుని శత్రువైన త్రిగధాధీసుడైన సుశర్మను, తమతో చేతులు కలిపేట్లుగా మలుచుకున్నాడు.
ఆవిధంగా గోగ్రహణ కార్యక్రమానికి బీజంపడింది .
స్వస్తి.
వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.
🙏🙏🙏
సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి