3, నవంబర్ 2020, మంగళవారం

17-07-గీతా మకరందము

 17-07-గీతా మకరందము.

           శ్రద్ధాత్రయ విభాగ యోగము

   

  -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - ఇక మూడువిధములైన ఆహారము, యజ్ఞము, తపస్సు, దానములను గూర్చి చెప్పుచున్నారు - 


ఆహార స్త్వపి సర్వస్య 

త్రివిధో భవతి ప్రియః | 

యజ్ఞస్తపస్తథా దానం 

తేషాం భేదమిమం శృణు || 


తాత్పర్యము:- ఆహారముకూడ సర్వులకును (సత్త్వాది గుణములనుబట్టి) మూడు విధములుగ ఇష్టమగుచున్నది. ఆలాగుననే యజ్ఞము, తపస్సు, దానముకూడ జనులకు మూడువిధములుగ ప్రియమై యుండుచున్నది. ఆ యాహారాదుల ఈ భేదమును గూర్చి (చెప్పెదను) వినుము.


వ్యాఖ్య:- ఆహారాదులను నాలుగింటిని గుఱించి చెప్పదలంచి భగవానుడు వానిలో ఆహారమును గూర్చియే మొట్టమొదట ప్రస్తావించుట గమనింపదగినది. జీవుని ఆధ్యాత్మిక సాధనక్రమములో ఆహారశుద్ధి ప్రప్రథమమైనది. ఆహారశుద్ధిచే చిత్తశుద్ధి, చిత్తశుద్ధిచే జ్ఞానోదయము సంభవించును. ఆహారము శుద్ధముగలేనిచో మనస్సున్ను మలినముగానుండుటవలన దానివలన లక్ష్యప్రాప్తి చేకూరకయేయుండును.


ప్రశ్న:- ఆహారము, యజ్ఞము, తపస్సు, దానము జనులకు ఎన్నివిధములుగ ప్రియమై యుండును? 

ఉత్తరము:- వారివారి గుణముననుసరించి మూడు విధములుగ ప్రియమైయుండును (సత్త్వగుణము గలవారికి సాత్త్వికాహారము - ఈ ప్రకారముగ).

కామెంట్‌లు లేవు: