**దశిక రాము**
**సౌందర్య లహరి**
**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి భాష్యం**
పన్నెండవ శ్లోక ఉపోద్ఘాతం - మూడవ భాగం
అయితే మనలో ఎంతమందికి అందాన్ని సరియైన రీతిలో ఆస్వాదించడం తెలుసు? దగ్గర దగ్గర మనలో ఎవరికీ మన మనస్సును సౌందర్యానుభూతిలో లగ్నం చేయదం చేతకాదని చెప్పుకోవాలి. అందంలోని దైవత్వాన్ని గుర్తించదలిగిన పరిణతి మనలో చాలా మంది సాధించలేదు. అందాన్ని అభినందించి ఆస్వాదించగలిగి తద్వారా మనం పొందగలిగిన ఆనందం అత్యల్పం, క్షణికం. ప్రపంచ సంస్థితి నుండి విముక్తి మార్గంగా ఎంచుకొని సౌందర్యం పై దృష్టి సారించడానికి అధిక సంఖ్యాకులకు కుదరడం లేదు.
మనకు ఏది అందమైనదని తోస్తుంది. మనకు ఆనందాన్ని, సంతోషాన్నీ కల్గించే వస్తువు అందమైనదంటాం. ఏ వస్తువునైతే మళ్ళీ మళ్ళీ చూడాలనే ఇచ్ఛ జనిస్తుందో అది అందమైనది. అయితే దీనికి ఒక ముఖ్యమైన లక్షణం చేర్చాలి. ఆ వస్తువును చూడటం వల్ల జనించిన సంతోషం మన మనస్సును కలవర పరిచేలా ఉద్విగ్నతలకు లోను చేసేదిగా ఉండకూడదు. మనం ఆ వస్తువును చూసినప్పుడు అది మన మనస్సును ఒక పరిపూర్ణమైన పవిత్రమైన ఆనందంతో నింపివేయాలి. అప్పుడే ఆ వస్తువు అందమైనదని చెప్పవచ్చు. ఒక వ్యక్తి క్రూరమైన, అశ్లీలమైన దృశ్యాలను చూసి ఆనందించడంలో అభిరుచిని పెంచుకుంటే అటువంతి దృశ్యాలను అందమైనవి అనలేము. అందాన్ని అనుభూతిలోనికి తెచ్చుకునే వ్యక్తి మానసిక రుగ్మతలు లేనివాడై ఉండాలి.
ఇక్కడ ఇంకోక విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అందంగా కనిపించే ఆ వస్తువు మనకు భయాన్నీ, శోకాన్నీ, క్రోధాన్నీ కలిగించరాదు. విశాలమైన పచ్చికబయలు లోతయిన లోయలో కనిపిస్తుందనుకోండి. అందమైన జలపాతం ప్రమాదకరమైన అగాథమైన లోయలో పడుతోందనుకోండి. వీటిని కొంత దూరం నుండి మాత్రమే చూసి ఆస్వాదించగలం. దగ్గరకు పోతే పడిపోతామనే భయంతో ఆ అందాన్ని ఆస్వాదించలేం. లేదూ! తళ తళ లాడుతూ ఎంతో అందమైన కృష్ణ మహా సర్పమున్నదనుకోండి, ఎంత అందమైనది అయినా వెళ్ళి చూసి ఆనందించే ధైర్యం మనకుండదు కదా. *జూ*లో పెట్టెల్లో బంధించబడి ఉన్న చిరుతలను, పులులను చూడగలమే గానీ అడవుల్లో తిరిగే మృగాల అందాలను ఆస్వాదించగలమా ? యోగి ఆ పాముతోనో, పులితోనో ఆడుకోవచ్చు. ఒక కవి (విలియం బేక్) వాటి సౌందర్యాన్ని అభివర్ణించవచ్చు. మనం మాత్రం ఆ వస్తువు మనలో భయాన్నీ, ప్రమాదశంకనూ కలిగించనంతవరకే ఆ వస్తువు అందాన్ని ఆస్వాదించగలం. కమలం, చంద్రుడు అటువంటివి. మనకు మల్లెపూవు వాసన ఎంతో అనందం కలిగించేదైనా మల్లిపోదలో పామును చూసినపుడు ఆ వాసన గురించి మరచి పారిపోతాం కదా !
ఇక మనుష్యుల సంగతి. ఒక మనిషి అందాన్ని అతనిలో ప్రేమాభిమానాలున్నప్పుడు మాత్రమే మెచ్చుకోగలం. ఒక అందమైన యజమాని సేవకుని ఎప్పుడూ తిడుతూ, అకారణంగా శిక్షిస్తూ ఉంటే ఈ సేవకునికి అతడు అందవికారంగానే కనిపిస్తాడు. కొండలు, మబ్బులు, వాగులు, తీగలు వలె కాక ప్రాణుల విషయంలో కూడా ఆ ప్రాణులు మనయెడ చూపే భావాన్ని పురస్కరించుకొని వాటి అందాన్ని మెచ్చుకోవడం జరుగుతుంది. మనుష్యులు మనపై ప్రేమ చూపకపోయినా మన ఎడల ద్వేషభావం చుపించనంత వరకూ వారి అందాన్ని హర్షించగలుగుతాం. అదే వారి స్ఫురద్రూపానికి మంచితనం, ప్రేమ కూడా తోడయితే ఇష్టపడతాం.
(సశేషం)
కృతజ్ఞతలతో🙏🙏🙏
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
#ParamacharyaSoundaryaLahariBhashyam
🙏🙏🙏
సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి