30, నవంబర్ 2020, సోమవారం

అభేదదృష్టి

 .      *🌻ఆదిశంకరులు - అభేదదృష్టి🌻*


       మానవుడు జీవన్ముక్తుడు కావాలంటే అభేదదృష్టి అత్యావశ్యకం. అభేదదృష్టితో మనః ప్రక్షాళనం జరుగుతుంది. ముక్తి కరతలామలక మౌతుంది. శ్రీ శంకర భగవత్పాదులు విరచించిన కొన్ని రచనలలోను, వాటి నేపథ్యంలోను, వారు పంచాయతన పూజా విధిని ప్రవేశపెట్టడంలోను అభేదదృష్టి ఏవిధంగా ప్రతిబింబించిందో దిఙ్మాత్రంగా చూపటం ప్రస్తుత వ్యాసోద్దేశ్యం.


*సౌందర్య లహరి*


     యత్ కరోషి , యదశ్నాసి,

     యజ్జుహోషి దదాసియత్

     యత్ తపస్యసి కౌంతేయ! 

      తత్ కురుష్వ మదర్పణమ్ 9-27

     అని భగవద్గీతలో చెప్పబడినట్టు సమస్త కర్మలూ పరమాత్మునికి సమర్పణం చేశాక అవన్నీ పరమాత్ముని సేవలుగానే పరిణమిస్తాయి. ఇది పూజా కార్యక్రమం, ఇది నిత్యకృత్యం అనే తేడా అంతరించిపోతుంది. సర్వత్ర అభేదమే వెల్లివిరుస్తుంది.

     అందుకే ఆదిశంకరులు సౌందర్య లహరిలో ఇలా స్తుతిస్తాడు.


        జపో జల్ప శ్శిల్పం సకల మపి

            ముద్రా విరచనం

        గతిః ప్రాదక్షిణ్య క్రమణ మశనా

             ద్యాహుతి విధిః

         ప్రణామః సంవేశః సుఖ మఖిల

             మాత్మార్పణ దృశా

          సపర్యా పర్యాయ స్తవ భవతు

              య న్మే విలసితమ్


     మాటలే జపాలుగా మారుతాయి. చేతులు అటూ ఇటూ తిప్పడమే ముద్ర లౌతాయి.వీధుల్లో తిరుగడాలే ప్రదక్షిణలుగా మారిపోతాయి. తినే తిం డ్లన్నీ యజ్ఞంలో వేస్తున్న హవిస్సు లైపోతాయి. పడుకోవడాలే సాష్టాంగ ప్రణామాలుగా మారిపోతాయి. 

     ఎప్పుడూ అర్చనలు చేయలేము. నిత్య కృత్యాలూ మానుకోలేము. కాని రోజు వారీ పనులనే దేవీ సేవలుగా భావించి చేస్తే అవన్నీ అలాగే పరిణమిస్తాయి. ముక్తి అన్నది చాలా సులభ మౌతుంది..

      ఇదే విషయాన్ని "శంకరాభరణం" అనే సమూహంలో 17.2.18 నాడు "యెంతయో యనుకొంటి, మీ రింతె యంద్రు.." అనే సమస్యగా నొసంగగా.. మామూలు మాటలలో నే నిలా పూరించినాను.


"ఉబుసుపోని కబుర్లు నుత్తమ జపములౌ..

    పొసగఁ జేతులుఁ ద్రిప్ప ముద్ర లగును..

ఇటు నటు తిరుగుడులే ప్రదక్షిణ లగు..

    నశనముల్ లో నగ్ని కాహుతు లగు..

పొసగ సెజ్జల మీది పొర్లాటలే సుమ్మి

     పొరలుడు దండాల పొలుపు మీరు..

మన సుఖా లన్ని యాత్మ స్వరూపిణి, దేవి

     కర్పింప నిటు సపర్య లయి మించు..

ముక్తి యెంతయో సులభమైపోవు శిష్య!"

యనుచు *సౌందర్య లహరి* లో నాది శంక

రులు వచించిన తీరు గురు వరులైన

*మామిడన్న* చెప్పగ వింటి; మరల నంటి ---

"యెంతయో యనుకొంటి, మీ రింతె యంద్రు.."


*పంచాయతనం*


       ఆది శంకరుల కాలంనాటి పరిస్థితి పరిశీలిద్దాం!

       

       "ఆయన కాలం నాటికి మన దేశంలో చిన్నవి పెద్దవి కలిసి కొన్ని వందల మతా లున్నవి. కనుక అవన్ని చూసినప్పుడు శంకరునికి పరబ్రహ్మం ఒక్కటే అయినప్పుడు దాన్ని చేరడానికి ఇన్ని మతాలు ఇన్ని మార్గా లెందుకని అనిపించింది. అంతేగాక మతాలలో సత్య మున్నా వా రవలంబించు మార్గాలలో మాత్రం ఎన్నో అవకతవకలు అపక్రమాలు గూడ వున్నవి. అందువల్ల ఆయన ఆసేతు శీతాచలం పర్యటించి తన ప్రతిభతో ఆనా డున్న మతా లన్నింటిని ఖండించి వానిలో శైవం, వైష్ణవం, శాక్తేయం, గాణాపత్యం, సౌరం, కాపాలికం అనే ఆరు మతాలను మాత్ర మంగీకరించి షణ్మత స్థాపకు డైనాడు.....

    ....ఆరు మతాలలో కాపాలికం మాత్రం గృహస్థులకు యోగ్యం కా దని విడిచి తక్కిన ఐదింటితో పంచాయతన పూజ నేర్పాటు చేసినాడు. ఈ పంచాయతనం ఏ దేవుణ్ణి ప్రధానం చేసికొంటామో ఆ దైవంపేర పంచాయతన మనబడుతుంది..."


(కీ.శే. ఇమ్మడిజెట్టి చంద్రయ్య గారు రచించిన శ్రీ "చంద్రమౌళీశ్వర శతకం" (2004) లో నేను వ్రాసిన "శివపంచాయతనం" అనే పీఠికలోనుంచి పై సమాచారం స్వీకరించబడింది.)


       కుర్తాళం పీఠాధిపతి శ్రీ  సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు ఒకసారి ఇలా వివరించారు. 

       "అందరు దేవతలూ ఒకటే!

ఏకం సత్ విప్రా... ఉన్న సత్ పదార్థం అనంత చైతన్యం ఒకటే! దాన్ని ధ్యానయోగులు ఋషులు ఒకడు శివునిగా ఒకడు విష్ణువుగా ఒకడు గణపతిగా ఒకడు సూర్యునిగా ఒకడు అమ్మవారిగా రకరకాలుగా దర్శించారు. ఎవరి దర్శనమూ తప్పు కాదు. అందరి దర్శనాలూ సత్యములే! అందరూ ఒకటే! అనంతమైన పరమ చైతన్యం యొక్క అభివ్యక్తీకరణమే రూపములూ భేదములూ కూడా. కనుక ఆ తత్వాన్ని ప్రపంచానికి తెలియజేయాలి. అందరూ ఒకటే!అన్నభావం.

    ఆ ఒకటే అని చెప్పినటువంటి సనాతన ధర్మం హిందూధర్మం కాబట్టి.. దీని ఆధిక్యాన్ని చెప్పాలి. అని చెప్పటంకోసం జగద్గురు శంకరాచార్యుల వారు తన కాలం నాడే దానికి మార్గదర్శనం చేశాడు. బాటలు వేశాడు.

    ఆ రోజుల్లో శైవులు, వైష్ణవులు పోట్లాడుకుంటూ వుంటుంటే అందరూ కూడా కలిసివుండండి. ఇదంతా ఒకటే జాతి. ఒకటే ధర్మం అని పంచాయతన పూజా విధానాన్ని ప్రవేశపెట్టా డాయన. శివుడు విష్ణువు సూర్యుడు గణపతి అమ్మవారు. ఐదుగురు ప్రధాన దేవత లానాడు. వీళ్ళల్లో వీళ్ళు పోట్లాడుకుంటుంటే ఆయ నన్నాడు

"మీరు మీ పంచాయతన పీఠం పెట్టుకోండి. మీ పీఠంమీద ఈ ఐదుగురు దేవతలనూ పెట్టుకోండి. ... మీ యిష్టదేవతను మధ్యలో పెట్టుకోండి. మిగిలిన దేవతలు ఆ దేవతకు పరివార మని అనుకోండి.  అందరూ ఒకటే ఐనా మీకు మీ దేవత యిష్టం. మీ దేవత గొప్పది." అని ఆయన ఆ రకంగా మత సామరస్యాన్ని తీసుకు రావటానికి, జాతి జీవన స్రవంతిలో పవిత్రమైనటువంటి భావనను తీసుకురావటానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఆ శంకర భావనా ప్రపంచాని కందించాలి. 

   మహనీయుడైనటువంటి వివేకానంద స్వామి తన మొదటి ఉపన్యాసంలో చెప్పిం దదే!

త్రయీ సాంఖ్యం యోగం పశుపతి మతం వైష్ణవ మితి..అని పుష్పదంతుడు మహిమ్న స్తోత్రంలో చెప్పాడు.

    అన్ని నదులూ సముద్రంలోకి వెళ్ళినట్టుగా.. పరమేశ్వరా! అన్ని మతాలూ నీలోకే వెళుతున్నై. అ నన్నా డాయన.  ఆ భావన శంకరులవారు ఇచ్చినటువంటి భావన అది. శంకర సంప్రదాయానికి చెందినటువంటివాడు వివేకానందుడు ఆ మార్గాన్ని  అందించడానికి మొదటిసారి ఈ దేశంలో ప్రయత్నం చేశాడు అమెరికా ఖండంలో. అందువల్ల ఎవరు వచ్చినా ఏ సన్యాసి వచ్చినా భావన యిదే!"


(శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి స్పెషల్ ఇంటర్వ్యూ (మన టివి) 

డిసెం 2018 PMC వీడియో నుండి..)


*స్తోత్ర సాహిత్యం*


    ఆదిశంకరులు రూపుదాల్చిన విజ్ఞానం. ప్రపంచానికే జ్ఞానాన్ని అందించిన జగద్గురువు. లక్ష్మి, శారద, మీనాక్షి, నృసింహుడు, పరమేశ్వరుడు మొదలైన దేవతల నెందరినో తన భారత పర్యటనలో భాగంగా దర్శిస్తూ స్తుతిస్తూ సాగిపోయినారు.

     అన్ని స్తోత్రాలలో శివునిగురించి వారు రచించిన శివానందలహరి.. పార్వతి గురించి రచించిన సౌందర్య లహరి.. అనే స్తోత్రాలు సుప్రసిద్ధములు.

     వారు ఏయే దేవతలపై ఏయే స్తోత్రాలు వెలయించినారో అందినంతమేరకు అతి సూక్ష్మంగా గురుతుకు తెచ్చుకుందాం.


విష్ణువు... శ్రీ విష్ణు భుజంగ ప్రయాత స్తోత్రం

               షట్పదీ స్తోత్రం

               అచ్యుతాష్టకం

శివుడు... శ్రీ శివభుజంగ ప్రయాత స్తోత్రం

              శివపంచాక్షర నక్షత్ర మాలా స్తోత్రమ్

              ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం

              ఉమా మహేశ్వర స్తోత్రం

              శివనామావళ్యష్టకం

              శివాపరాధ క్షమాపణ స్తోత్రం

               దక్షిణామూర్తి స్తోత్రం

కాలభైరవుడు... కాలభైరవాష్టకం

గణపతి... గణేశ భుజంగ ప్రయాత స్తోత్రం

రాముడు... శ్రీ రామ భుజంగ ప్రయాత స్తోత్రం

కృష్ణుడు... కృష్ణాష్టకం, జగన్నాథాష్టకం

నృసింహుడు... లక్ష్మీ నృసింహ స్తోత్రం

                        లక్ష్మీ నృసింహ పంచరత్నం

పాండురంగడు... పాండురంగాష్టకం

హనుమంతుడు... హనుమత్ పంచరత్నం

లక్ష్మి... కనకధారాస్తోత్రము

పార్వతి... మీనాక్షీ పంచరత్నం

                మీనాక్షీ స్తోత్రం, భ్రమరాంబాష్టకం

                భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం 

                అన్నపూర్ణాష్టకం,

సరస్వతి... శారదా భుజంగ ప్రయాతాష్టకం

లలిత... లలితా పంచరత్నం

గంగ... గంగాష్టకం, మణికర్ణికాష్టకం

యమున... యమునాష్టకం

నర్మద... నర్మదాష్టకం

    ఇంకా ఎన్నో...ఎన్నెన్నో...


     ఇవన్నీ మధురాతిమధురమైన నిత్య పఠనీయములైన స్తోత్రములు. వీటన్నిటి వెనుక నున్న పరమమైన ఉద్దేశ్యం.. పరతత్వం అంతా ఒకటే! రూపములు మాత్రం వేరువేరు.. అనేదే! అదే ఏకం సత్.. విప్రా బహుధా వదంతి.. ఆ ఏకమే... అద్వైతం.. (రెండవది లేనిది.) ఆదిశంకరుల భావన అదియే! సనాతన భారతీయ భావనా అదియే!


      రచన~డా.వెలుదండ సత్యనారాయణ

                          పరమార్థ కవి

                            29.11.20

కామెంట్‌లు లేవు: