30, నవంబర్ 2020, సోమవారం

క్షణభంగురం

 క్షణభంగురం


🍁🍁🍁🍁


 మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్కాలః సర్వమ్

మాయామయమిదమఖిలం బుధ్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా ||


-----ఆదిశంకరుల భజగోవిందం నుండి


ధనము – జనము – యౌవనము చూచి గర్వపడకుము.వీటన్నిటినీ కాలము ఒక్కక్షణములో హరించును.


 మాయామయమయిన ఈ ప్రపంచమును విడిచి జ్ఞానివై బ్రహ్మపదము పొందుము.




ఈ ప్రపంచంలోని లౌకిక సంపదలన్నీ అనిత్యమైనవి, భ్రమాత్మకమైనవి.


 ఈ క్షణికమైన సంపదలను చూచుకొని మనిషి గర్విస్తాడు. అహంకరిస్తాడు. శాశ్వతమనుకొని భ్రమ పడతాడు. 


ధన జన యౌవన గర్వం:- కొందరికి ధన గర్వం, కావలసినంత ధనం ఉన్నదని, ఇళ్ళూ, వాకిళ్ళు, తోటలు, దొడ్లూ, భూములు, బ్యాంకు బ్యాలెన్సులూ ఉన్నాయని, ఎవరి దగ్గరా చేయి చాపనవసరం లేదని, గర్విస్తారు. వీటిని చూసుకొని కళ్లు మూసుకొని పోతాయి. ధన పిశాచి పట్టిన వాడికి భార్యా, పిల్లలు, బంధువులు, మిత్రులు, ఇరుగు, పొరుగు అనే భావం ఉండదు. అంతా డబ్బే. డబ్బున్నవారు మిత్రులు, డబ్బులేని వారు శతృవులు. అన్నింటిని డబ్బుతోనే విలువ కడతారు.  


 కొందరికి జనగర్వం. తన వెనుక ఎందరో ఉన్నారనుకుంటారు. తనవల్ల ఏదో ప్రయోజనం పొందాలని తన నాశ్రయించిన వారందరూ తనవారేననుకుంటారు. అందరూ తన శ్రేయోభిలాషులే అనుకుంటారు. సాధారణంగా రాజకీయ నాయకులు ఈ కోవలోకే వస్తారు. తన అధికారాన్ని చూచి తన చుట్టూ చేరిన వారిని చూచి గర్విస్తారు. కాని ‘అధికారాంతము నందు చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్’ అన్నట్లు అధికారం పోతే తెలుస్తుంది. తన శ్రేయోభిలాషులెవరో.


 ఇక కొందరికి యౌవన గర్వం. యవ్వనం శాశ్వతం అనుకుంటారు. శరీరంలోని బిగువులు ఎల్లప్పుడూ ఇలాగే ఉంటాయని అతడి గర్వం. ఆ గర్వంలో అతడు మంచి చెడూ గమనించడు. కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తాడు. అహంభావంతో ఉంటాడు. ముసలివాళ్ళను ఎగతాళి చేస్తాడు. 


*హరతి నిమేషాత్కాలః సర్వం* :- ఈ మొత్తం ఒక్క క్షణంలో హరించిపోతాయి అని తెలిసుకోలేడు. ఒక్క 10 సెకండ్లు భూకంపం వస్తే నీ ఇళ్ళూ, వాకిళ్ళు, ధనసంపదలూ అన్నీ నేలమట్టమైపోతాయి. నాకేం? కోట్ల ఆస్తి ఉంది. బ్రహ్మాండమైన భవనం ఉంది అని గర్వించినవాడు మరుక్షణంలో ఎవరో దయతో పంపించే ఆహారపొట్లాల కోసం ఎగబడాల్సి వస్తుంది. ఇప్పుడేమయింది ఆ గర్వం? నీ ధనం నిన్ను రక్షిస్తుందా? నీ జనం నిన్ను రక్షిస్తారా? అలాగే యౌవనం కూడా ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది కాదు. వృద్ధాప్యం ఎక్కిరిస్తూ మననెత్తి మీదికి వచ్చి కూర్చుంటుంది.


 కాబట్టి ఇదంతా మాయాజాలం అని, క్షణికమైనవని భావించు. అంటే అనుభవించు తప్పులేదు. కాని వాటితో సంగభావం పెట్టుకోకు.



T.me/namonarayana


🌸 *జై శ్రీమన్నారాయణ🌸* 


🍁🍁🍁🍁🍁

కామెంట్‌లు లేవు: