30, నవంబర్ 2020, సోమవారం

మొగిలిచెర్ల అవధూత

*ఆశీర్వాదం..ఆయుష్షు..*


అప్పటికి మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారు కపాలమోక్షం ద్వారా సిద్ధిపొంది సుమారు రెండు సంవత్సరాల కాలం గడిచింది..ఆ సరికే మొగిలిచెర్ల చుట్టుప్రక్కల ఓ ముప్పై కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల్లో శ్రీ స్వామివారి గురించి కథలు కథలుగా చెప్పుకోసాగారు..శ్రీ స్వామివారి ని నమ్మి కొలిస్తే తమకు కష్టాలు తీరుతాయని ప్రచారం జరిగిపోయింది..


1978 వ సంవత్సరం..ఒక పల్లెటూరు నుంచి మరొక పల్లెటూరికి ప్రయాణం చేయాలంటే..ఎడ్లబండి కానీ..కాలినడక గానీ శరణ్యం అనుకునే రోజులు..తాము ఉంటున్న వెంగళాయిపల్లె గ్రామం (ప్రస్తుత ప్రకాశం జిల్లా..P C పల్లె మండలం) నుంచి కరణం మాలకొండయ్య, లక్షమ్మ దంపతులు, ఇరవై కిలోమీటర్ల దూరం నడచివచ్చి, మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సమాధి ముందు నిలుచున్నారు..తమ మనసులో సుడులు తిరుగుతున్న వేదన..ఆ స్వామికి విన్నవించుకుందామనే బలీయమైన కోరిక.. వారిని అంతదూరం నడిపించింది..కారణం..అప్పటికి తమకు పుట్టిన ఇద్దరు బిడ్డలూ అల్పాయుష్కులై చనిపోయారు..కడుపుకోత భరించలేనిదిగా ఉంది..


ఆ సమయంలో, శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి మొక్కుకుంటే ఫలితం ఉంటుందనే ఆశతో..మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి వచ్చారు..స్వామి దగ్గర మంటపంలో సాగిలపడి, తమ బాధ చెప్పుకున్నారు..అలా వరుసగా ఐదు శని,  ఆదివారాల పాటు, రాను ఇరవై, పోను ఇరవై కిలోమీటర్ల దూరం కాలినడకనే ప్రయాణం చేసి, శ్రీ దత్తాత్రేయుడిని కొలుచుకున్నారు..


ఈసారి వారి ప్రార్ధన ఆ స్వామివారినీ కదిలించిందేమో..1980 లోమగపిల్లవాడు పుట్టాడు.. దంపతులిద్దరూ..ఆ పిల్లవాడిని  మొగిలిచెర్ల అవధూత దత్తాత్రేయుడి ప్రసాదంగా భావించి "దత్తాత్రేయుడు" అని పేరు పెట్టుకున్నారు..ఆ తరువాత మరో రెండేళ్లకు ఆడపిల్ల పుట్టింది..ఆ అమ్మాయికి.."దత్తాత్రేయమ్మ" అని పేరు పెట్టారు..


ఇక పిల్లలిద్దరి భారం శ్రీ స్వామివారి మీదే వేసి..తమ బిడ్డలు ఇంతకుముందు పుట్టిన వాళ్ళలా అల్పాయుష్కులు కాకూడదని శ్రీ స్వామివారిని వేడుకున్నారు..భక్తితో ఆర్తిగా వేడుకుంటే స్వామివారు కరుణించరా...?..స్వామివారి చల్లటి చూపుతో పిల్లలిద్దరూ లక్షణంగా పెరిగారు..


పిల్లలిద్దరికీ...తాము మొగలిచెర్ల దత్తాత్రేయుడిని నమ్ముకోబట్టే.. మీరిద్దరూ ఇలా  లక్షణంగా ఉన్నారు అని చెప్పుకునేవారు ఆ దంపతులు..ఆ పిల్లలకూ స్వామి వారి మీద అపరితమైన విశ్వాసం కుదిరింది..వివాహాలూ జరిగాయి..జీవితంలో ఏ కష్ట సుఖాలైనా దత్తాత్రేయుడి కృపే నని ఆ సంసారం మొత్తం నమ్మి, స్వామివారిని కొలిచేవారు..


 కొన్నాళ్ల క్రితం  శ్రీ మాలకొండయ్య గారు మరణించారు.."నాన్నగారు మరణించి సంవత్సరం దాటిపోయింది..ఏటి సూతకం అయిన తరువాత, ఈరోజు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాను.." అంటూ బెంగుళూర్ లో PG (పేయింగ్ గెస్ట్ హోమ్) నడుపుతున్న మాలకొండయ్యగారి పెద్దకుమారుడు దత్తాత్రేయుడు నాతో చెప్పుకొచ్చాడు..శ్రీ స్వామివారి దయవల్ల తన సోదరి కూడా బాగుందని..క్రమం తప్పకుండా స్వామి వారిని దర్శించుకుంటామనీ..భక్తి పూర్వకంగా చెప్పుకున్నాడు..సాక్షాత్తూ శ్రీ స్వామివారి ఆశీస్సులతో పెరిగిన ఆ పిల్లలకు ఏ ఇబ్బందీ లేదు కదా...


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రము మండలం..ప్రకాశం జిల్లా.. పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: