30, నవంబర్ 2020, సోమవారం

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహాత్మ్య.ము

 శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహాత్మ్య.ము



                 నాల్గవ అధ్యాయము 


అంత సాధువు , యల్లుడు యచట నున్న 

పుణ్యతీర్థంబు లెల్లను పూర్తిజేసి

విరివి దానంబు లిచ్చియు విప్రులకును 

పోవ సాగిరి సొంతూరు నావ పైన 119


అట్లు సంద్రంబు పైనను సాగుచుండ 

సత్యనారాయణస్వామి సాధుయొక్క 

సత్యశీలత వీక్షించ దలచి మదిలొ 

వచ్చె సన్యాసివోలెను వణిజు కడకు 120


అంత సన్యాసి వణిజుని చెంత కొచ్చి 

ప్రముఖునాతని, యాతనిపడవ జూచి 

"ప్రముఖవాణిజ్యశ్రేష్ఠుడా ! పడవలోన 

యేమి కల" వంచు యడిగెను యెరుగ దలచి. 121


యతి మాటలు విని వణిజుడు 

యతిమదమున పరిహసించి యపహాస్యమునన్ 

యితనొక దొంగని తలచియు 

మతిదప్పియు పలికెనిట్లు మఱచియు తనువున్ 122


"తస్కరుడ వీవు యడిగేవు తరచి తరచి 

సంగ్రహించెడి తలపున సంపదలను 

యాకు లలములు తీగెలు యంతె గాని 

యిందు యేమియు లేవింక వెడలు వెడలు " 123


అట్లు వణిజుడు బలుకగ నాలకించి 

" యట్లె యగుగాక " యనుచును యాగ్రహమున 

సత్యనారాయణస్వామి శాపమిచ్చి 

వెడలి నటనుండి నిలిచెను వేఱు స్థలిన. 124


సత్యదేవుని శాపాన సత్వరంబె 

నావలో నున్న సరుకులు నవ్య ధనము 

మాయమయ్యును లతలుగా మారిపోయి 

బరువు తగ్గియు యా నావ పైకి లేచె 125


కాలక్రియల పిదప గాంచెను వణిజుండు 

పడవ తేలికయ్యు పైకిలేవ 

పైకి లేచి నట్టి పడవను గాంచియు 

వింత జూచి మిగుల విస్తు పోయె 126


పడవ తేలి కవగ పరికించ వణిజుడు 

ధనపు మూటలెల్ల తరలి పోగ 

యాకు లలము లెల్ల యచ్చోట నగుపించె 

సత్యదేవు ఘోర శాపమునను 127



ధనమంతయు యావిధముగ 

కనులెదుటనె లేక జూచి కడు దుఃఖమునన్ 

తన కింకను దిక్కెవరని 

వణిజుడు యత్యంత గాను వలవల యేడ్చెన్ 128



మామ యారీతి యేడ్చుచు మహిని బడగ

యల్లు డత్యంత మదియందు తల్లడిల్లి 

"సర్వ మిది యయ్యె సన్న్యాసి శాపమునను"

యనియు మదినెంచి మామతొ ననియె నిట్లు 129


" ఇప్పు డిట్లేడ్వ సమకూరు నేమి ఫలము ?

శాపమిచ్చిన సన్యాసి సర్వ జ్ఞాని 

యతని పాదంబులంబడి యాశ్రయించ 

కామితంబును దీర్చును కరుణ జూపి " 130



                                  సశేషము…..


        ✍️గోపాలుని మధుసూదన రావు 🙏

కామెంట్‌లు లేవు: