30, నవంబర్ 2020, సోమవారం

శ్రీమన్నారాయణీయం

 *శ్రీమన్నారాయణీయం*


శ్రీ కృష్ణుని విషయానికి వస్తే నాలుగు ఆలయాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇవి ఉత్తర భారతంలో ఉత్తరప్రదేశ్ లోని మధుర, గుజరాత్ రాష్ట్రంలో ద్వారక, కేరళలోని గురువాయూరు, కర్ణాటకలోని ఉడుపి.


నారాయణీయంతో సంబంధంవున్న గురువాయూర్ గురించి చూద్దాం. దక్షిణ ద్వారకగా పిలవబడే ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు 'గురువాయూరప్పన్' అనే పేరుతో కొలవబడుతున్నాడు. 


నాలుగు చేతులలో పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కౌమోదకం, పద్మాలయాలను ధరించి తులసి మాలలతో, ముగ్ధ మనోహర రూపంతో అలరించే బాలగోపాలుడి ఆలయం "గురువాయూర్". 


కేరళలోని త్రిసూర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయంలోని స్వామిని కన్నన్, ఉన్నికృష్ణన్ (బాలకృష్ణుడు), ఉనికన్నన్, గురువాయురప్పన్ అనే పేర్లతో కొలుస్తుంటారు.


ఇక్కడి శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠకు ముఖ్య కారకులు గురు - వాయువులు కాబట్టి ఈ ఊరిని 'గురువాయూరు' (గురువు+వాయువు+ఊరు) గా నిర్ణయించారు.


ఐదువేల సంవత్సరాలక్రితం నాటిదిగా చెప్పే ఆలయ గర్భగుడిలోని నారాయణ విగ్రహం పౌరాణిక ప్రాశస్త్యమైనది. ఈ విగ్రహాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ ఆరాధించారని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. పాతాళశిలతో తయారైన ఈ విగ్రహాన్ని వెుదట శివుడు బ్రహ్మకు ఇచ్చాడనీ ఆయన దాన్ని సంతానంకోసం తపిస్తోన్న సూతపాశ ఋషికి ప్రసాదించాడనీ, ఆయన నుంచి వారసత్వంగా కశ్యప ప్రజాపతి అందుకోగా ఆయన దాన్ని వసుదేవుడికి అనుగ్రహించగా, తండ్రి నుంచి దాన్ని శ్రీకృష్ణుడు అందుకుని ద్వారకలో ప్రతిష్ఠించి పూజించాడనీ పురాణాలు చెబుతున్నాయి. 


స్వర్గారోహణ సమయంలో కృష్ణుడు తన శిష్యుడైన ఉద్ధవుని పిలిచి 'త్వరలోనే ద్వారక సముద్రంలో మునిగిపోతుందనీ అప్పుడు ఈ విగ్రహం నీళ్లలో తేలుతుందనీ దాన్ని దేవతల గురువైన బృహస్పతికి అందజేయమ'నీ చెప్పాడని పురాణప్రతీతి. ఉద్ధవుని సందేశం ప్రకారం బృహస్పతి- వాయుదేవుడి సహాయంతో కేరళ తీరానికి వచ్చాడట.


అక్కడ ఓ కోనేరు సమీపంలో శివుడు తపస్సు చేస్తూ కనిపించి ఆ విగ్రహాన్ని కోనేటి ఒడ్డున ప్రతిష్ఠించమని చెప్పాడట. అదే ఈ విగ్రహ ప్రాశస్త్యం. ఆ కోనేరే నేటి రుద్రతీర్థం. గురువు-వాయువు ఇద్దరూ కలిసి ప్రతిష్ఠించడంవల్లే ఈ ప్రాంతం గురువాయూర్‌గా ప్రసిద్ధిచెందింది. 


గురువాయురప్ప బాలకృష్ణుడి రూపంలో భక్తులకీ అర్చకులకీ కలల్లో కనిపించి వాళ్ల తప్పొప్పుల్ని విప్పిచెప్పిన వైనం గురించిన గాథలెన్నో. ఆయన గురించి భక్తులూ, పురాణేతిహాసాలూ చెప్పేవన్నీ ఒక ఎత్తు. కవితాత్మకంగా కృష్ణుణ్ణి కీర్తిస్తూ నారాయణ భట్టతిరి రాసిన నారాయణీయం మరో ఎత్తు. 


ఇక్కడి క్రృష్ణుడిని భక్తులు గురువాయురప్పని కన్నన్‌, ఉన్నికృష్ణన్‌, బాలకృష్ణన్‌... అంటూ పలుపేర్లతో అర్చిస్తారు. ప్రధానపూజారి వేకువజామున 3 గంటలకే పచ్చిమంచినీళ్లు కూడా ముట్టకుండా ఆలయంలోకి ప్రవేశించి నాదస్వరంతో చిన్నికృష్ణుణ్ణి నిద్రలేపుతారు. దీన్నే నిర్మలదర్శనం అంటారు. రోజూ విగ్రహాన్ని పాలు, గులాబీ అత్తరు, కొబ్బరినీళ్లు, గంధాలతో అభిషేకించి, పట్టుపీతాంబరాలూ స్వర్ణాభరణాలతో అలంకరిస్తారు. 


బియ్యప్పిండి, బెల్లం, నెయ్యితో చేసిన తీపిరొట్టెలు; కొబ్బరి ఉండలు; కొబ్బరిపాలు, బెల్లం, బియ్యంతో చేసిన పాయసం; పాలలో ఉడికించిన పిండిరొట్టెల్ని స్వామికి నైవేద్యంగా పెడతారు. 


పుత్తడితో చేసిన స్వామి ఉత్సవవిగ్రహాన్ని అంబారీ ఎక్కించి మేళతాళాలతో ప్రహరీలోపల ఆలయం చుట్టూ మూడుసార్లు తిప్పుకొస్తారు. 


గురువాయురప్ప సన్నిధిలో రోజూ ఎంతోమంది చిన్నారులకు అన్నప్రాశన నిర్వహిస్తారు. ఇలా చేయడంవల్ల భవిష్యత్తులో ఆ పిల్లలకి ఎలాంటి విపత్తూ వాటిల్లదనేది భక్తుల విశ్వాసం. అలాగే స్వామిసమక్షంలో వివాహబంధం ద్వారా ఒక్కటైతే జీవితం ఆనందమయంగా ఉంటుందన్న నమ్మకంతో ప్రముఖుల నుంచి సామాన్యులవరకూ ఇక్కడ పెళ్లిళ్లు చేసుకునేందుకు ఇష్టపడతారు. అందుకే కేరళలో మరే గుడిలో లేనన్ని కల్యాణాలు ఇక్కడ జరుగుతుంటాయి. 


ఇక్కడ నిత్యం జరిగే మరో వేడుక తులాభారం. తమ బరువుకి సమానంగా అరటిపండ్లు, బెల్లం, కొబ్బరికాయలు, పంచదారల్ని స్వామివారికి నివేదిస్తారు భక్తులు. 


ఆ గురువాయూర క్రృష్ణ ఆరాధనతో ఈ నారాయణీయం మొదలవుతుంది.


 స్వస్తి. 

🙏🙏🙏

సేకరణ

దశకరాము

కామెంట్‌లు లేవు: