✍️...నేటి చిట్టికధ
కులశేఖర ఆళ్వారు తిరునక్షత్రం సందర్భం గా...
ఆళ్వార్లలో ఐదవ వాడు కులశేఖర ఆళ్వార్. కొల్లినగర్ (తిరువన్జిక్కళమ్) అను రాజ్యములో క్షత్రియ వంశములో శ్రీకౌస్తుభం అంశతో జన్మించాడు. ఇతడిని కొల్లికావలన్, కొజియర్ కోన్, కూడల్ నాయకన్ మొదలగు నామములతో కూడా వ్యవహరిస్తారు.
తనియన్ లో వివరించినట్లుగా ‘మాఱ్ఱలరై వీరంగెడుత్త శెంగోల్ కొల్లి కావలన్ విల్లవర్ కోన్ శేరన్ కులశేఖరన్ ముడివేందర్ శిఖామణియే’
ఆళ్వారు చేరరాజ్యమునకు రాజుగా, శత్రువులను నిర్మూలించే గొప్ప సైన్యము కలిగి రథములు, గుఱ్ఱములు, ఏనుగులతో చతురంగ బలగాలు కలిగి ఉన్నాడు.
రాజైన ఆళ్వార్ ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ, శ్రీరాముడి లాగా ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకుంటూ, సరైన నిర్ణయములతో రాజ్యమును తమ ఆధీనంలో ఉంచుకొనేవాడు.
శ్రీమన్నారాయణుడు మాత్రమే పరమ పదమునకు మరియు సంసారమునకు సర్వాధికారి అని నమ్మేవాడు. వారి నిర్హేతుక కృపచే, అపారమైన దైవిక విషయములందు పరిఙ్ఞానమును కలిగి, రజో/తమో గుణములు నిర్మూలించుకొని పూర్తిగా సత్వగుణముచే భగవంతుడి దివ్యస్వరూపమునే ఆరాధిస్తూ , కులశేఖరాళ్వార్ తమ రాజ్యముతో ఎటువంటి సంభదము పెట్టుకోకుండ శ్రీవిభీషణాళ్వాన్ వలే తమ సంపదను శ్రీ రాముని పాదాల వద్ద ఉంచి శరణువేడాడు.
అధిక సమయమును శ్రీవైష్ణవులైన సాధువులతో గడిపెడివాడు. ‘అన్నియరంగన్ తిరుముట్రత్తు అడియార్’ అంటే అధికముగా తమ దినచర్యను శ్రీరంగనాధుడి ఆలయం లోనే గడిపేవాడు.
కులశేఖరాళ్వార్ ప్రతిరోజు దినచర్యగా శ్రీరామాయణాన్ని శ్రవణం చేస్తూ ప్రవచిస్తూ ఉండేవాడు. ఒక్కొక్కసారి శ్రీరామాయణ శ్రవణంలో తన్మయత్వంగా మునిగి తనను తాను మరచిపోతుండేవాడు.
ఒకానొకసారి పురాణ శ్రవణంలో ఒక ప్రవచకుడు రామాయణంలోని ఖరదూషణ ఆదిగాగల పదనాల్గువేలమంది రాక్షసులతో శ్రీరాముడు యుద్ధానికి సిద్ధమయ్యే సన్నివేశం చెబుతున్నాడు.
శ్రీరాముడు ఒక గుహలో సీతాదేవిని ఇళయపెరుమాళ్ (లక్ష్మణుని) సంరక్షణలో ఉంచి, తానొక్కడే పదనాల్గువేల మంది రాక్షసులను ఒంటి చేత్తో ఎదుర్కొనుచుండగా, ఋషులందరు భయముతో చూస్తుండే ఘట్టం ప్రవచిస్తున్నారు.
అది విన్న ఆళ్వార్ వళ్లు తెలియని భావోద్వేగముతో శ్రీరాముడికి యుద్ధంలో సహాయం చేయాలనే తలంపుతో, తన సేనలను యుద్ధరంగం వైపు వెళ్ళడానికి సిద్ధం కావల్సినదని ఆఙ్ఞాపించాడు.
ఇది చూసిన మంత్రులు ఆశ్చర్యపోయి రాజును ఆ భ్రమనుండి మళ్లించడం కోసం కొందరు ప్రముఖులను దండయాత్రకు బయలుదేరిన రాజుగారికి ఎదురు వచ్చేలా చేసారు. వారు రాజుగారితో...
“మహారాజా శ్రీరాముడు యుద్ధములో విజయాన్ని వరించాడు, సీతాదేవి అతని గాయాలకు ఉపశమన చర్యలు చేస్తున్నది కావున మీరిక వెళ్ళవలసిన పనిలేదు” అని చెప్పారు.
దానితో కులశేఖర ఆళ్వార్ సంతృప్తి చెంది తన రాజ్యానికి వెనుదిరిగాడు. మంత్రులంతా ఆళ్వార్ వింతప్రవర్తన గురించి ఆలోచించి శ్రీవైష్ణవుల అనుభంధ వ్యామోహము నుండి విడదీయాలని నిర్ణయించుకొన్నారు.
అందుకోసం వారొక యుక్తిని పన్నారు. వారు ఆళ్వార్ తిరువారాధన గది నుండి ఒక వజ్రాలనగను దొంగిలించి ఆ దొంగతనాన్ని అత్యంత సన్నిహితులైన శ్రీవైష్ణవులపై మోపారు. ఇది విన్న ఆళ్వార్ విషనాగుతో ఉన్న ఒక కుండను తెప్పించి దానిలో తన చేతిని పెడుతూ
“శ్రీవైష్ణవులు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడితే పాము నన్ను కాటువేయును గాక” అనగా, వారి నిజాయితికి ఆ పాము కాటువేయలేదు.
దీనిని చూసిన మంత్రులు సిగ్గుపడుతూ ఆ నగను తిరిగి ఆళ్వార్ కు ఇచ్చి, ఆ శ్రీవైష్ణవులను క్షమాపణ అడిగారు.
గొప్ప రామభక్తుడైన అతడిని పెరుమాళ్ (అతి గొప్పవాడు) అనికూడా పిలిచేవారు. ఇది సాక్షాత్తూ శ్రీవెంకటేశ్వరస్వామికి ఉపయోగించే పేరు.
అతడి భక్తి ఎంత గొప్పదంటే స్వామి భక్తులను సైతం స్వామిని పూజించినట్లు పూజించే వాడు. అతడు శ్రీరంగములో నివసిస్తూ అక్కడి ఆలయములో రంగనాథ స్వామికి సేవచేస్తుండేవాడు.
క్రమంగా, ఆళ్వార్ ఈ సంసారుల మధ్యన ఉండటానికి ఇష్టపడక, ‘శౌనక సంహిత’ లో చెప్పిన విధంగా ‘భగవంతుడిని కీర్తించని సంసారుల మధ్య నివసించుట ఒక అగ్నిగోళం మధ్యన ఉండుట లాటింది’ అని ఆలోచించి...
ఆళ్వార్ తన రాజ్యభారాన్ని, బాధ్యతలను తన కుమారుడి చేతిలో ఉంచి, పట్టాభిషేకం చేసి ఇలా నిర్ణయించుకొన్నాడు ‘ఆనాద శెల్వతత్తు అరంబైయర్గళ్ తార్చుజ వానాళుం శెళ్వముం మన్నాన్నరశుం యాన్ వేన్నాదెన్’ అంటే సేవకులచే పరివేష్టించబడి ఉండే వినోదాలను మరియు సంపదను ఇక కోరను అని.
ఆళ్వార్ తన సన్నిహితులైన శ్రీవైష్ణవులతో రాజ్యాన్ని వదిలి శ్రీరంగమును చేరి, బంగారపు పళ్ళెములో వజ్రమువలె ఉన్న(ఆదిశేషునిపై పవళించి ఉన్న) శ్రీరంగనాధున్ని మంగళాశాసనము చేసాడు. తన భావ సంతృప్తి ఫలముకై ప్రతి క్షణమును ఎంపెరుమాన్ కీర్తిస్తు, ‘పెరుమాళ్ తిరుమొజి’ రచించి అందరి ఉన్నతికై ఆశీర్వదించాడు.
తర్వాత కాలంలో స్వామి పుష్కరిణితో కూడిన తిరువేంగడంపై (తిరుమల) అధిక వ్యామోహం పెంచుకున్నాడు. స్వామి పుష్కరిణి గంగాయమునాది నదులకన్నా విశేషమైనదని కీర్తించబడింది.
ఆండాళ్ కూడ ‘వేంకటత్తైప్ పతియాగ వాళ్వీర్గాళ్’ అంది. అంటే సదా మనసా వాచా తిరువేంకటముపై నివాసము చేయాలి అని. అక్కడ గొప్పఋషులు మరియు మహాత్ములు నిత్యవాసము చేస్తారు కారణం వారు కూడా అదేవిధమైన కోరికని కలిగిఉన్నారు కనుక.
పెరుమాళ్ రచించిన తిరుమొజి 4 వ పదిగంలో తిరుమల దివ్యదేశములో పక్షిలా, చెట్టులా, రాయిలా, నదిలా ఉండాలనే ఆళ్వార్ కోరిక మనకు కనపడుతుంది. ఇది కాకుండా దివ్యదేశములలోని అర్చావతార భగవానుడిని వారి భక్తులను సేవించాలనే కోరికను కలిగి ఉండేవాడు.
అతడొకరోజు వేంకటేశ్వరస్వామితో “స్వామీ నీ గర్భగుడి ముందు గడపగా నైనా పడివుండే వరమివ్వండి” అని అడిగాడు. దానికి స్వామి “తదాస్థు !” అన్నాడు.
అందుకే తిరుమలలో గర్భగుడి ద్వారాని కున్న గడపని 'కులశేఖర పడి' అని అంటారు. ఇతడు ముకుందమాల అను భక్తి స్తోత్రాన్ని సంస్కృతంలో రచించాడు.
ముకు౦ద మాలలో శ్రీకృష్ణుడు దేవదేవుడుగా గీతాచార్యుడిగా కూడా కనిపిస్తాడు. పెరుమాళ్ తిరుమెళి అనే ప్రబ౦ధ౦లో తానే దశరధుడిగా శ్రీరాముని మీద ప్రేమని, శ్రీరాముని యొక్క సౌ౦దర్యాన్ని, గుణస౦పదని పొగడట౦ కనిపిస్తు౦ది.
‘శ్రీరామ, శ్రీకృష్ణ అనే ఏ నామన్ని ఉచ్చరి౦చినా అది మ౦త్రమే ! అజ్ఞానమనే వ్యాధిని పోగొడుతు౦ది. మహర్షులకు భగవద్దర్శన౦ కలిగి౦చి౦ది రాక్షసులకి బాధ కలిగి౦చి౦ది కూడా ఆ నామమే.
మూడు లోకాలకి జీవమిచ్చేది , భక్తులకు మ౦చిని కలుగ చేసేది, పాప భయము పోగొట్టేది, మోక్షాన్నిచ్చేది వైష్ణవ శక్తి. భగావన్నామ౦ దివ్యౌషధ౦ వ౦టిది. దీన్ని సేవి౦చి తరి౦చ౦డి’ అని బోధి౦చాడు.
బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసము అనేటటువ౦టి చతురాశ్రమాలను నియమబద్ధ౦గా లోక కళ్యాణార్థ౦ గడిపిన పుణ్య పూర్ణజీవి కులశేఖరాళ్వారు.
కొంతకాలము ఈ సంసారములోజీవించి చివరకు దివ్యమైన పరమపదమునకు వేంచేసి పెరుమాళ్ కి నిత్య కైంకర్యమును చేసారు.
🙏🏻🙏🏻🌸🌸🌸🙏🏻🙏🏻
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి