26, ఫిబ్రవరి 2021, శుక్రవారం

మన మహర్షులు - 34

 మన మహర్షులు - 34


రైభ్య మహర్షి 


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


రైభ్యుడు చిన్నతనం నుంచే వేదాధ్యయనం ప్రారంభించాడు. ఇతనికి గురుభక్తి చాలా ఎక్కువ. గురువుగారి కంటే ముందుగా నిద్రలేచి ఆయన పడుకొనే వరకు ఆయనకు కావల్సినవన్నీ చేస్తూ చదువుకునేవాడు.


గురువుగారు కూడా అతని గురుభక్తికి సంతోషించి అన్ని వేద శాస్త్రాలు అతనికి బాగా వచ్చేటట్లు నేర్పించాడు. మొత్తం అన్నీ నేర్చుకున్నాక గురువుగారి ఆజ్ఞ తీసుకుని బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు


రైభ్యుడు తనకి సందేహాలు కలిగినప్పుడు బృహస్పతినడిగి తెలుసుకునే వాడు. 


ఒకసారి వసు మహారాజుని తీసుకుని బృహస్పతి దగ్గరకి వెళ్ళి దేవా! మోక్షం కర్మలు చెయ్యడం వల్ల వస్తుందా? జ్ఞానాన్ని సంపాదించడం వల్ల వస్తుందా? అనడిగాడు.


మునీంద్రా! తామరాకు మీద నీరు ఎట్లాయితే అంటుకోదో అట్లాగే చేసిన కర్మల్ని పరమేశ్వరార్పణమస్తు అని భగవంతుడికి అర్పిస్తే మనల్ని ఏ కర్మా అంటదు. 


దీనికి ఒక కథ చెప్తాను వినమన్నాడు బృహస్పతి.


            పూర్వం సంయముడనే మహారాజు భగీరథీ తీరంలో తిరుగుతుండగా ఒక బోయవాడు లేళ్ళ గుంపుని కొట్టబోతే సంయముడు ఆపి పాపం! అవేం చేశాయి? వాటిని చంపకు అన్నాడు.


బోయవాడు చంపడానికి మానడానికి నేనెవర్ని? అంతా ఈశ్వరేచ్ఛ అన్నాడు.


 సంయముడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్! అన్నాడు.


 బోయివాడు వీపు మీదున్న ఇనప వల క్రిందపడేసి దీంట్లోంచి అగ్ని పుట్టించమన్నాడు సంయముడిని. 


అతడి వల్ల కాలేదు.

బోయవాడు మంటల్ని పుట్టించి ఆర్పేసి ఇలా అన్నాడు. ..ఈ మంటలు ఎల్లా అయితే వెలిగి ఆరిపోతున్నాయో, అలాగే భగవంతుడు ప్రకృతి స్థితుడైనప్పుడు జీవులు నశించి, వికృతడై మళ్లీ పుట్టిస్తాడు.


ఇంక శరీర ధర్మాలకొస్తే ఎవరికేదిష్టమో అది చేసి పరమాత్మకి అర్పించాలి. 

అంటే మనం ఏదేనా తింటున్నా త్రాగుతున్నా, ఎవరికేనా ఏమన్నా ఇస్తున్నా ఏపని చేస్తున్నా 'పరమేశ్వరార్పణం' అంటే అది భగవంతుడికే చెందుతుందని చెప్పగానే దేవతలు బోయవాడి మీద పుష్పవర్షం కురిపించారు.


తర్వాత దేవతలు విమానంలో బోయవాణ్ణి సంయముడు చూస్తూండగానే తీసుకుపోయారు. 


బృహస్పతి చెప్పింది విని రైభ్యవసువులు ఆనందంగా వెళ్ళారు.


  రైభ్యునికి అర్వావసువు, పరావసువు అని ఇద్దరు కొడుకులు పుట్టారు. పిల్లద్దరికి వేద విద్యలు నేర్పించి వాళ్ళతోపాటు రైభ్యుడు చదువుతుంటే మిగిలిన మహర్షులు ఆనందంగా చూసి ఆశీర్వదించి వెళ్ళేవాళ్ళు.


 రైభ్య మహర్షి కొడుకులు అర్వావసువు, పరావసువుల్ని చూసి భరద్వాజుడి కొడుకు అవక్రీతుడు అసూయపడేవాడు. 


రైభ్యుడు, భరద్వాజుడు మాత్రం అన్నదమ్ముల్లా కలిసి

మెలిసి వుంటూ తప్పస్సు చేసుకుంటూ వుండేవాళ్ళు.


 అన్నీ వేదాలు రావాలని అవక్రీతుడు ఇంద్రుడి గురించి తపస్సు చేశాడు. వేదాలు

గురువు ద్వారా నేర్చుకోవాలి గానీ తపస్సు ద్వారా కాదన్నాడు ఇంద్రుడు.


 అవక్రీతుడు వినకపోతే ఇంద్రుడు సరే తీసుకో వరమయితే ఇస్తానుగాని అలా

వచ్చిన వేదాలు నీకు ఎంతవరకు ఉపయోగ పడతాయో మాత్రం చెప్పలేనన్నాడు. 


అవక్రీతుడుకి వేదాలు నేర్చుకున్నానన్న గర్వం పెరిగిపోయింది. 

బృహస్పతి గర్వం

మంచిదికాదని ఎంత చెప్పినా వినలేదు .


ఒకరోజు రైభ్యుడి కోడల్ని అవమానించాడు అవక్రీతుడు. రైభ్యుడు ఒక రాక్షసిని, ఒక రాక్షసుడ్ని పుట్టించి అవహేతుడ్ని చంపించాడు.


భరద్వాజుడు కొడుకుకి జరిగినది న్యాయమే అని దహనక్రియ జరిపించి పుత్రశోకం భరించలేక శరీర త్యాగం చేశాడు.


ఒకనాడు రైభ్యుడి కొడుకు రాత్రి యింటికి వస్తుండగా ఒక మృగం మీదపడింది. దాన్ని కొట్టడానికి కర్రవిసిర్తే అది అక్కడే నిద్రపోతున్న తండ్రి రైభ్యుడికి తగిలి మరణించాడు. రైభ్యుడి కొడుకు అర్వావసువు తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. అతని తపస్సుకి మెచ్చుకుని దేవతలు వరాలు కోరుకోమన్నారు. రైభ్య భరద్వాజ అవక్రీతుల్ని బ్రతికించమన్నాడు అర్వావసువు. 


అప్పటి నుండి అవక్రీతుడు గర్వం వదిలి అందరితో కలిసిమెలిసి వున్నాడు.


రైభ్యుడు తీర్థ యాత్రలు చేస్తూ అనంతశాయిని, రంగధాముణ్ణి, కంచి వరదరాజుని వెంకటేశ్వరస్వామిని, అహోబలేంద్రుణ్ణి సింహాచల నాయకుణ్ణి, శ్రీకూర్మపతిని, పురుషోత్తముడ్డి అందర్నీ దర్శించి ప్రయాగ వెళ్ళి గయలో పితృదేవతలికి పిండ ప్రదానం చేసి ఒకచోట తపస్సు చేసుకుంటూ వుండిపోయాడు.


అలా తపస్సు చేస్తూవుండగా సనత్కుమారుడు రైభ్యుడి దగ్గరికి వచ్చి అతని తపోదీక్షని పొగిడాడు.


 రైభ్య మహర్షి తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి కనిపించి ఏం కావాలనడిగాడు. సనకాదులుండే చోటికి నన్ను కూడ పంపమని మోక్ష సామ్రాజ్యాన్ని పొందాడు రైభ్య మహర్షి.


ఇదీ  రైభ్యమహర్షి కథ...


విద్య గురువు ద్వారా నేర్చుకోవాలనీ, ఏ పని చేసినా భగవంతుడి మీద భారం వెయ్యాలనీ ఈ కథ ద్వారా నేర్చుకొన్నాము కదా...


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

కామెంట్‌లు లేవు: