26, ఫిబ్రవరి 2021, శుక్రవారం

మొగలిచెర్ల

 *శిష్యుడికి బోధ..*


"మీరొకమారు స్వామివారి సహాధ్యాయి అని ఒక సాధువు గురించి వ్రాసారు..మొగిలిచెర్ల గ్రామ సరిహద్దులో ఉన్న ఫకీరు బీడు..లేదా ఫకీరు మాన్యం అనే పేరుతో పిలువబడుతూ..ఉన్న పొలంలో ఒక అవధూత ఆశ్రమం నిర్మించుకొని..తీవ్రమైన తపస్సు చేసి..కఠోర నియమాలు పాటించి..తనకుతానే హఠయోగం పట్టి..కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన దిగంబర అవధూత దత్తాత్రేయుడి తోపాటు కొంతకాలం ఏర్పేడు వ్యాసాశ్రమం లో సాధన చేసాను..అని మా గురువుగారు నాతో చెప్పేవారు..ఆయన ఇక్కడికి ఒకసారి వచ్చి వెళ్లారని కూడా చెప్పారు..అదే విషయాన్ని మీరు కూడా వ్రాసారు..మీరు చెప్పిన సాధువు గారి వద్ద శిష్యరికం చేస్తూ ఉండేవాడిని..వారు హృషీకేశ్ లో వున్నప్పుడు కూడా నేను కొంతకాలం వారివద్ద శిష్యరికం చేసాను..ప్రస్తుతం నేను మా ఊరిలో ఉంటున్నాను..సంవత్సరం లో రెండు మూడు సార్లు మా గురువు గారి వద్దకు వెళ్లివచ్చేవాడిని..గత ఆరునెలలుగా వారి వద్దకు వెళ్ళలేదు..వారెక్కడ ఉన్నారో కూడా నాకు సమాచారం తెలియలేదు..మా గురువుగారి తో పాటు సాధన చేసి సిద్ధిపొందిన ఈ స్వామివారిని చూడలేకపోయాను..కనీసం వారి సమాధిని దర్శించుకొని వెళదామని వచ్చాను.." అని కాషాయ వస్త్రాలు ధరించిన ఆ వ్యక్తి నాతో చెప్పాడు..అతనితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా వచ్చారు..


"ముందుగా మీరు కాళ్ళూ చేతులూ శుభ్రం గా కడుక్కొని రండి..స్వామివారి సమాధి దర్శించుకొని వచ్చిన తరువాత మనం మాట్లాడుకుందాము.." అని చెప్పాను.."అలాగే నండీ.." అని ముగ్గురూ బైటకు వెళ్లి..స్నానాలు చేసి వచ్చారు..శిష్యరికం చేసాను అని చెపుతున్న అతనితో పాటు మిగిలిన ఇద్దరు కూడా స్వామివారి సమాధి వద్దకు వెళ్లారు..సమాధికి నమస్కారం చేసుకొని..ఇవతలికి వచ్చి ఉత్సవ మూర్తి వద్ద హారతి తీసుకొని..మళ్లీ నావద్దకు వచ్చారు..


"ఇప్పుడు చెప్పండి..మీరు శిష్యరికం చేశానన్నారు కదా..మీరు కూడా సాధన చేసేవారా..?" అని అడిగాను..


"మా గురువుగారు కొంత బోధ చేసారండీ..కానీ నాకు సాధన మీద పట్టు దొరకలేదండీ..ఆయన వద్ద వున్నంతకాలం నాకేదో ఒకటి చెప్పేవారు..అలా చెప్పే క్రమం లోనే..ఈ స్వామివారి గురించి కూడా చాలాసార్లు చెప్పారు..సాధన చేస్తే..అలా మొగిలిచెర్ల లో సిద్ధిపొందిన దత్తాత్రేయ స్వామిలాగా కఠోర సాధన చేయాలి..అప్పుడే మోక్షప్రాప్తి కలుగుతుంది..సగం లౌకికం..సగం సాధన అనుకుంటే..ఎటూ కాకుండా పోతావు..ఒక్కసారన్నా మొగిలిచెర్ల వెళ్లి ఆ స్వామివారి సమాధిని దర్శించు..నీకు జ్ఞానం వస్తుంది..పో..పోయి..ఆ స్వామిని శరణు వేడుకో..ఇంతదూరం నా వద్దకు వచ్చి నువ్వు సాధించేది ఏమీ లేదు." అని పదే పదే చెప్పారు..నేను అంతగా ఆలకించలేదు..ఈమధ్య నాకు రాత్రివేళ "నువ్వు మొగిలిచెర్ల వెళ్ళావా..?" అని మా గురువుగారు తీవ్ర స్వరంతో అడుగుతున్నట్టు ఆలాపనగా అనిపించింది..ఒకసారి కాదు..రెండుమూడు సార్లు అలానే అనిపించింది..ఇక వుండబట్టలేక ఈరోజు వచ్చాను..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి అక్కడ నిలుచున్నప్పుడే నా ఒళ్ళంతా ఒక విధమైన జలదరింపు కలిగింది..ఆ ప్రకంపనలు తట్టుకోలేకపోయాను..స్వామివారి పాదుకలు ముట్టుకొని..వాటికి నా శిరస్సు ఆనించి కళ్ళుమూసుకున్న తరువాతే నా ఒళ్ళు నా స్వాధీనం లోకి వచ్చింది..మా గురువుగారు నన్ను ఎందుకు ఇక్కడికి వెళ్ళమన్నారో అర్ధం అయింది..ఈ స్వామివారు సిద్ధిపొంది సుమారు నలభై ఏళ్ళు పైబడే అయింది..కానీ ఆయన తపశ్శక్తి ఇక్కడ ఉన్నది..స్వామీ యేదారీ తెలియక అటు సంసారం లోనూ..ఇటు సన్యాసం లోనూ ఇమడలేకుండా వున్నాను..నువ్వే దారి చూపించు అని మొక్కుకున్నాను..నా ప్రశ్నకు సమాధానం దొరికింది..స్వామివారి ఆదేశం అనిపించింది..మా గురువుగారు కూడా ఈ స్వామినే శరణు వేడుకో అన్నారు..మా గురువుగారి జాడ తెలిసిన తరువాత వారిని కలిసి..ఈరోజు నేనుపొందిన అనుభూతి వారికి చెప్పుకుంటాను..ఇన్నాళ్లకు ఒక సాధకుడి సమాధి వద్ద నాకు మార్గ నిర్దేశనం జరిగింది.." అంటూ కళ్ళ నీళ్లతో చెప్పాడు..


స్వామివారి తపశ్శక్తి గురించి చాలామంది తాము పొందిన అనుభూతులను నాతో చెప్పుకుంటూ వుంటారు..ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా స్వామివారు తమ అనుగ్రహాన్ని చూపుతారు..అది వారి వారి మనో పరిపక్వత మీద ఆధారపడి ఉంటుందని అనుకుంటూ ఉంటాను..అది నా భావన..కానీ స్వామివారు తనను శరణు వేడిన వారికి ఏ రకంగా తన కృప చూపుతారో అది వారికే తెలియాలి..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: