26, ఫిబ్రవరి 2021, శుక్రవారం

కుమ్మరి కేశప్పకథ

 🏵️🌸🌸🏵️🌸🌸🏵️🌸🌸కుమ్మరి కేశప్పకథ

అటికేశ్వరుని కథ

          పూర్వం శ్రీశైలమునకు కొంతదూరంలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో కేశప్ప అనే కుమ్మరి ఉండేవాడు. గొప్ప శివభక్తుడు అయిన కేశప్ప కుండలు చేసుకుని జీవిస్తూ కాలినడకన శ్రీశైలమునకు వచ్చే భక్తులకు అన్నదానం చేస్తూ తేనె పండ్లు మొదలైన పదార్థాలను అతిథి సేవకు ఉపయోగించుతూ కాలం వెళ్ళబుచ్చేవాడు. ఆ ఊరి మీదుగా వచ్చి వెళ్లే భక్తులు, జంగములు కేశప్ప భక్తిని, అతిధి సేవలనూ ఊరురా చెప్పుకుంటూ వెళ్ళేవారు. ఈవిధంగా కేశప్ప గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందాడు.

             కేశప్పకు మంచిపేరు రావడాన్ని అతని ఇంటిలో భక్తులు సందడిని చూసి సాటి కుమ్మరులు కొందరు ఓర్చుకోలేకపోయారు. ఎలాగైనా సరే అతడు దానధర్మములు చేసే అవకాశం లేకుండా చేయాలని అనుకొని కుట్రపన్ని అర్ధరాత్రి వేళ కేశప్ప కుండలను ముంతలను ఇతర సామాగ్రిని పగులగొట్టి ఉన్న కాస్త సొమ్ము దొంగిలించి కుండలు తయారు చేసే అటికను(సారెను) కూడా పగులగొట్టారు. కేశప్ప తెల్లవారుజామున లేచి ఇల్లంతా చూసి బావురమన్నాడు. శివరాత్రి వచ్చింది. వచ్చే యాత్రికులు లో కనీసం కొంతమంది కి అయినా అన్న సంతర్పణ చేయలేకపోతానే అని దిగులు పడ్డాడు.

        కేశప్ప చేసేది ఏమి లేక చివరకు ధైర్యం తెచ్చుకుని అటిక తయారు చేయడం ప్రారంభించాడు. ఆ సమయం చూసి సాటి కుమ్మరులు దారిని పోయే కొందరు భక్తులు ను పిలిచి కేశప్ప ఇంటికి భోజనానికి పంపించారు. చీకటి పడింది. శివభక్తులకు భోజనం ఎలా ఏర్పాటు చేయాలో కేశప్పకు తోచలేదు. ఆరోజు తన ఇంటిలో ఎవరూ భోజనం చేయలేదు. పదార్థాలు కూడా లేవు. అయినా భక్తులు ను ఇంట్లో కి ఆహ్వానించాడు. పెరటిలోకి వెళ్లి మారేడు చెట్టు కింద దిగాలుగా కూర్చుని ఆలోచించసాగాడు. అతనికి ఏడుపు ఆగలేదు. కంటి నిండా నీళ్లు నిండినాయి. ఎదురుగా అటికపై పగిలిన కుండ పెంకులో శివుడు బంగారు లింగ రూపంలో ప్రత్యక్చమయ్యాడు. "కేశప్పా! ఇంటిలోనికి వెళ్లి నా భక్తులు కు భోజనం వడ్డించు. నా భక్తులు కు ఎన్నడూ లోటుఉండదు. లే! వెళ్ళు!" అన్నాడు. కేశప్ప లోపలికి వెళ్లి చూసేసరికి కుండల నిండా వివిధ భోజన పదార్థాలు ఉన్నాయి. భక్తులకు భోజనం పెట్టి పంపించాడు కేశప్ప.

      శివుడు అటికలో ప్రత్యక్చం అయిన ప్రదేశమే అటికేశ్వరము.

శ్రీశైలం లో ఈ అటికేశ్వరుని లింగ రూపంలో చూడవచ్చును. 🌸🏵️🌸🏵️🌳🏵️🌸🏵️🌸🏵️

కామెంట్‌లు లేవు: