*సాయి..స్వామి..*
"మేము శ్రీ సాయిబాబా భక్తులమండీ..తరచూ శిరిడీ వెళ్లి, ఆ సాయినాథుణ్ణి దర్శించుకొని వస్తూ వుంటామండీ..రెండు మూడు సార్లు గాణుగాపురం, పిఠాపురం కూడా వెళ్ళొచ్చాము..ఎందుకనో తెలీదండీ గత సంవత్సరకాలంగా ఏ క్షేత్రానికి వెళ్లినా..అక్కడ దైవం మీద మనసు లగ్నం కావడం లేదు..ఏదో అశాంతి..మా ఇద్దరికీ ఆర్ధికంగా ఇబ్బందులేవీ లేవు..మా ఇద్దరికీ వచ్చే పెన్షన్ తోటి మాకు హాయిగా జరిగిపోతున్నది..ఒకరికి పెట్టగలిగే స్థితిలోనే ఉన్నాము..పిల్లలు కూడా స్థిరపడ్డారు..అమ్మాయి అల్లుడు కెనడాలో వుంటారు..కొడుకూ కోడలు అమెరికా లో వున్నారు..ఇక్కడ ఒక అవధూత సిద్ధిపొందారు అని తెలుసుకున్నాము..ఆ తరువాత ఈ స్వామివారి చరిత్ర చదివాము..దత్తక్షేత్రం దర్శించుకోవాలి అని అనిపించింది..బయలుదేరి వచ్చాము..గురువారం నాడు గురుదర్శనం చేసుకుంటే మంచిదనే అభిప్రాయం తో ఈరోజు ఇక్కడికి వచ్చాము..తీరా ఇక్కడికి వచ్చాక తెలిసింది ఈ క్షేత్రం లో పల్లకీసేవ శనివారం విశేషంగా జరుగుతుందని..రేపుదయాన్నే తిరిగి వెళ్లాలనే సంకల్పంతో వచ్చాము..పల్లకీసేవ లో పాల్గొనలేకపోతున్నామే అనే అసంతృప్తి ఉన్నది..చెప్పాను కదా..ఏదో ఒక కొరవ..ఏదో ఒక అశాంతి.." అన్నారా దంపతులు..
ఆ దంపతుల జీవనానికి ఏ కొరవా లేదు..కానీ వాళ్లకు మనోశాంతి లేదు..ఇంకా ఏదో ఉన్నది..అది మనకు అందలేదే అనే ఒక బాధ తప్ప..నా వరకూ వాళ్ళ మాటలు విన్నప్పుడు.."అన్నీ వుండి కూడా అసంతృప్తితో బాధ పడుతున్నారు.." అని అనిపించింది.."ముందు మీరిద్దరూ స్నానాదికాలు ముగించుకొని రండి..స్వామివారి సమాధిని దర్శనం చేసుకుని..ఆపై మాట్లాడుకుందాము.." అని చెప్పాను..ఇద్దరూ వెళ్లారు..మరో గంట తరువాత ఆ దంపతులు ఇద్దరూ మందిరం లోకి వచ్చారు..మందిరం చుట్టూ ప్రదక్షిణాలు చేసి వస్తామని చెప్పి వెళ్లారు..మొదటి ప్రదక్షిన చేస్తూ..స్వామివారి గర్భాలయం కు నైరుతి మూల ఉన్న శ్రీ సాయిబాబా మందిరం వద్దకు వచ్చి..అలాగే నిలబడిపోయారు..ఆ దంపతులిద్దరిలో..ఆవిడ ఒక్కసారిగా "సాయిబాబా..తండ్రీ..సాయినాథా..ఇక్కడ కూడా ఉన్నావా..?"అని బిగ్గరగా కేక పెట్టింది..శ్రీ సాయిబాబా విగ్రహం వద్దకు వెళ్లి రెండు చేతులతో సాయిబాబా పాదాలు పట్టుకొని..తల ఆనించి..రెండు మూడు నిమిషాలు అలానే వుండిపోయింది..ఆ తరువాత ఇవతలికి వచ్చి..మళ్లీ సాయిబాబా విగ్రహానికి నమస్కారం చేసుకొని..ప్రదక్షిణ పూర్తి చేశారు..మందిరం లోకి వచ్చి..స్వామివారి సమాధి వద్దకు వెళ్లారు..గర్భాలయం లో స్వామివారి సమాధి ప్రక్కన పడమర గోడలో అమర్చిన స్వామివారి పాలరాతి విగ్రహం వద్దకు వెళ్లి నమస్కారం చేసుకుని..స్వామివారి పాదుకులకు కూడా నమస్కారం చేసుకొని..అక్కడే నిలబడ్డారు..దాదాపు ఐదు నిమిషాలపాటు కళ్ళుమూసుకుని నిలబడిపోయారు..పూజారి గారు వాళ్ళను ఇవతలికి వచ్చేయమని చెప్పారు..ఇవతలికి వచ్చి..స్వామివారి ఉత్సవ మూర్తి వద్ద హారతి తీసుకొని..ఆ మంటపం లోనే ఒక ప్రక్కగా ఇద్దరూ ధ్యానం చేసుకుంటూ సుమారు ఒక అరగంట ఉండిపోయారు..
ఆరోజు సాయంత్రం స్వామివారి మందిరం తలుపులు మూసివేసిన తరువాత.."ప్రసాద్ గారూ..మేమిద్దరం శనివారం నాటి పల్లకీసేవ లో పాల్గొనాలి అని అనుకున్నాము..ఈరాత్రికి, రేపు రాత్రికి కూడా ఇక్కడే మంటపం లో పడుకుంటాము..మా ఆవిడకు ఇక్కడే వుండి పల్లకీసేవ లో పాల్గొనండి అని సాయిబాబా ఆదేశం ఇచ్చినట్లు అనిపిస్తోందట..బాబా మాట మీరలేము కదా..అందుకని పల్లకీసేవ లో పాల్గొంటాము.." అన్నారు.."మీ ఇష్టం..అలాగే వుండండి.." అన్నాను..ఆరెండు రోజులూ ఆ దంపతులు స్వామివారి మంటపం లోనే వున్నారు..శనివారం నాడు సాయంత్రం స్వామివారి పల్లకీసేవ లో పాల్గొన్నారు..ఆదివారం ఉదయం వాళ్ళ ఊరు వెళ్లిపోతూ.."ప్రసాద్ గారూ ఏదో తెలీని అసంతృప్తి తో వచ్చాము..కొండంత తృప్తి తో వెళుతున్నాము..సాయినాథుని ఆదేశం వల్ల ఈ స్వామివారి పల్లకీసేవ లో పాల్గొన్నాము..ఆ తరువాత మనసంతా ప్రశాంతంగా ఉంది..మళ్లీ మళ్లీ ఇక్కడకు రావాలని అనిపించింది..ఆ సాయినాథుడే..మాలో ఉన్న అశాంతి దూరం చేయడానికి మాకు ఈ క్షేత్రాన్ని దర్శించే ఏర్పాటు చేసాడేమో అనిపిస్తోంది.." అని చెప్పి.."ఈ మారుమూల ప్రదేశం లో వచ్చిన భక్తులందరికీ అన్నదానం చేస్తున్నారు..అన్నదాన సత్రం బాగు చేస్తున్నారు..వసతి కొఱకు కూడా మీరు ఏర్పాట్లు చేస్తున్నారని విన్నాము..మేమూ మా వంతుగా సహకరిస్తాము..ఈ క్షేత్రం ఇంకా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉన్నది..మేము ప్రతి సంవత్సరం రెండు మూడు సార్లు శిరిడీ వెళతామని చెప్పాము కదా..ఈరోజు నుంచి..శిరిడీ తో పాటు ఇక్కడికి తరచూ వస్తాము..మావరకూ..ఆ సాయినాథుడు..ఈ స్వామివారు ఇద్దరూ రెండు కళ్ళ లాంటి వారు.." అని ఉద్వేగంతో చెప్పారు..
ఆ శిరిడీ సాయినాథుడు మార్గం చూపితే..మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారు తమ మనసు లోని అశాంతి ని దూరం చేశాడని ఆ దంపతులు విశ్వసించారు..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి