పుల్లంపేట జరీచీర
రచయిత : శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు
ఆంధ్రభూమి 1940 నాటి సంచికలో వచ్చిన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి చిన్నకధ “పుల్లంపేట జరీ చీర” !
***************
అతని సంపాదన అంతంత మాత్రమే అయినా తన భార్యకు ఎలాగైనా సరే పండక్కి కొత్త చీర కొనాలనే అతని తపన, చేసిన త్యాగాలు హర్షనీయంగా ఉన్నాయి. మధ్య తరగతి జీవితాలలో ఇటువంటి ఆనందాలు, అనుభూతులు ఎంతో మనోహరంగా ఉంటాయి. తన ప్రియమైన భార్య కళ్లలో వేయి దీపాల కాంతిని చూస్తూ మురిసిపోవాలని ఏభర్తకు ఉండదు ? భార్యను సంతోషపెట్టడానికి అప్పులు చేయలేదు, భేషజాలకు పోలేదు. కేవలం తన దైనందిక జీవితంలో భార్యకు తెలియకుండా చిన్న చిన్న త్యాగాలు చేస్తూ, పొదుపుచేసుకుంటూ, పండక్కి చక్కని చీరకొని ఆమె చేత కట్టించి మురిసిపోయిన ఒక మధ్యతరగతి భార్య్భర్తల ముచ్చటైన సంసార సరిగమలు ఎంత మధురంగా కధ ద్వారా చూపించారో రచయితగారు. మంచి మనసున్న భర్త దొరకడం ఆ ఇల్లాలి అదృష్టం. పుట్టింటి నుండి కట్నకానుకలకై వేధించే కొంతమంది కైనా ఇటువంటి కధలు కనువిప్పు కలిగించకమానవు. ఎలాగైనా సరే పండక్కి గాని తన పుట్టినరోజుకిగాని ఖరీదైన చీరలే కాకుండా బంగారు నగలు కావాలని వేధించి క్రెడిట్ కార్డ్స్ ద్వారా కొనిపించుకున్న స్త్రీలు ఎంతో మంది ఉన్నారు. చక్కని దాంపత్యజీవితానికి భార్యా భర్తల మధ్య మంచి అవగాహన ఎంత అవసరమో తెలియ చేసే ఒక పాతకాలపు కధ ..దాదాపు దగ్గరగా ఎనభైసంవత్సరముల నాటి కధ .. కాని ఎప్పటికీ నిత్యనూతనంగా అనిపించే " పుల్లంపేట జరీచీర " ....
-----------------------------------------------------------
యాజులు నెల్లూరి జిల్లా కోర్టులో గుమస్తాగా వుండినప్పటి సంగతి
ఇక నెలా పదిహేనురోజులుందనగా, సంకురాత్రి పండుక్కి రాధమ్మని పుట్టింటివారు తీసుకెళ్లరని తేలిపోయింది.అప్పటికామె పద్ధెనిమిదేళ్ల పిల్ల. పండుగులనీ, పబ్బాలనీ, అచ్చట్లనీ, ముచ్చట్లనీ కిందా మీదా పడిపోతూ ఉండే వయస్సు.దగ్గిరగా ఉన్నంత కాలమూ పుట్టింటివారామెకి లాంఛనాలన్నీ బాగానే తీర్చేవారు. కానీ నెల్లూరికి, పిఠాపురానికీ రానూ పోనూ కూతురికీ, అల్లుడికీ కావలసిన రైలు ఖర్చుల మొత్తం తెలిసేటప్పటికి వారికి గుండెలాగిపోయాయి.
ఇది ఆలోచించి చివరికి రాధమ్మ కూడా సరిపెట్టుకుంది.మొదట మాత్రం తండ్రి రాసిన ఉత్తరం చూసుకొని ఆమె నిర్ఘాంతపడిపోయింది.ఇది యాజులు గుర్తించాడు. అతని హృదయం దడదడ కొట్టుకుంది. కాని ఒక్క క్షణంలో తేరుకుని, ఆమె కళ్లల్లోకి జాలిగా చూసి, తన వెచ్చని పెదవులతో తాకి ఆమె పెదవులకు చలనం కలిగించుకున్నాడు.తరువాత ‘మడి కట్టుకోండి’ అంటూ ఆమె వంటింట్లోకి వెళ్లిపోయింది.అతను తాపితా కట్టుకున్నాడు.
కుచ్చెళ్లు పోసుకునేటప్పుడు ‘‘రెండేళ్ల కిందట విజయదశమినాడు నీ అత్తవారిచ్చారు నీకిది. ఇంత గొప్పవి కాకపోయినా, ప్రతీ సంవత్సరమూ నువ్వు నీ అత్తవారి బహుమతులు కట్టుకుంటూనే ఉన్నావు. కానీ పుట్టింటి వారిస్తూనే ఉన్నారు గదా, లోటు లేదు గదా అనుకుంటున్నావే కాని రాధకి నువ్వొక్క చీర అయినా కొనిపెట్టావా పాపం? చిలక వంటి పెళ్లానికి మొగుడు చూపించవలసిన మురిపెం ఇదేనా? చివరకి వొక్క రైక అయినా కుట్టించావా? నీకిది బాగుందనిపించిందా?’’ అని ఎవరో నిలవతీసి అడిగినట్టనిపించింది.
దీంతో వల్లమాలిన సిగ్గు వచ్చి ఊదర గొట్టేసింది.దాని మీది ‘ఇప్పుడైనా రాధకొక మంచి చీర కొనిఇవ్వాల’నుకున్నాడు. ‘ఇచ్చి తీరాలి. పండుక్కి కొత్త చీర లేని లోటు కలగనివ్వకూడదు’ అని దృఢపరుచుకున్నాడు.కానీ, డబ్బేది?ఏనెల జీతం ఆనెలకే చాలీచాలనట్టుంది. అక్కడికీ నెల్లూరిలో ఇంటి అద్దెలు చౌక కనుక సరిపోయింది. కాని లేకపోతే ఎన్ని చేబదుళ్లు చేస్తూ ఎన్ని వొడిదుడుకులు పడవలసి వచ్చేదో?రాధమ్మ కూడా పొదుపయిన మనిషి కనక ఆటసాగుతోంది. కానీ కాకపోతే, ఆ చేబదుళ్లకు సాయం ఎన్ని అరువులు పెరిగిపోయి ఉందునో?ఏమైనా చీర కొనితీరాలని శపథం పట్టుకున్నాడు.ఖర్చులు తగ్గించుకోడం తప్ప మార్గాంతరం కనపడలేదు. ఆ ఖర్చులలో నేనా సంసారం కోసం రాధమ్మ చేసేవాటిలో తగ్గించడానికి వీలు కనపడదు.దీని మీద ‘నా ఖర్చులు తగ్గించుకుంటా’నని అతను నిశ్చయించుకున్నాడు.అది మొదలు, అతను నాటకాలకి వెళ్లడం కట్టిపెట్టేశాడు. పుస్తకాలు కొనడం మానేసి భాండాగారానికి వెళ్లసాగాడు. ఒకటి రెండు వినోదయాత్రలు చాలించుకున్నాడు. కోర్టుకి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడూ బండెక్కడం తగ్గించుకున్నాడు. మధ్యాహ్నం కోర్టు దగ్గర ఫలహారం ఒక్కటే కాదు, కాఫీ కూడా మానుకొన్నాడు.
పొద్దుటి పూట మాత్రం యింటి దగ్గర కాఫీసేవ మానుకోలేదు. అంచేత రాధమ్మ కిదేమీ తెలవకుండా జరిగిపోయింది.
ఆవేళ పెద్దపండుగ.
మధ్యాహ్నం. రెండు గంటల సమయంలో యాజులు, రాధమ్మ యేం చేస్తోందో చూద్దామని వసారాలోకి వెళ్లి జంట వెదురుకుర్చీలో కూర్చున్నాడు.
ఉన్న చీరల్లో మంచివి నాలుగు పట్టుకువచ్చి 'వీటిలో యేది కట్టుకోను చెప్పండీ' అంటూ రాధమ్మ పక్కని కూచుంది.
'నన్నడగడం యెందుకూ?'
'మంచిచీర కట్టుకోవడం మీకొసమా, నా కోసమా?'
'నా కోసమే అయితే, ఆ చీరలన్నీ మీవాళ్ళిచ్చినవి, వాటిమీద నాకేమీ అధికారం లేదు'
'అదేమిటండీ?'
'ఎకసెక్కం చెయ్యడం లేదు నేను'.
'చె-ప్పండీ పెడర్ధాలు తియ్యకా.'
ఇలా గునుస్తూ ఆమె కుడిచెయ్యి అతని నడుముకి చుట్టేసింది.
దానిమీది, ఆనందమూ, వుద్వేగమూ అతికష్టం మీద అణుచుకుంటూ అతను 'నేను మానెయ్యమన్నది మానేసి కట్టుకోమన్నది కట్టుకుంటావా?' అని గంభీరంగా ప్రశ్నించాడు.
'ఆ'
'అయితే అవన్నీ పెట్టిలో పెట్టేసి రా'
ఆమె కేమీ అర్ధం కాలేదు. అయినా, యేదో లేకుండా అతనలా చెప్పడని యెరుగును కనుక, అతనికి అడ్డుమాట చెప్పలేదు కూడా కనిక, వొక్కమాటు గంభీరంగా చూసి అవి యింట్లో పెట్టేసి వచ్చి, మళ్ళీ పక్కని కూచుని 'మరి చెప్పండి' అని అడిగింది.
వెంటనే అతనొక్కమాటు మందహాసం మొలిపించి, అతి తాపీగా లేచి, అతిదర్జాగా వాకిట్లోకి వెళ్ళి, మేజా సొరగులోనుంచి వొక పొట్టం తీసుకువచ్చిఅతిప్రేమతో ఆమెకందించి దగ్గిరగా కూచున్నాడు.
ఆమె చేతులు గబగబలాడిపోయాయి.
విప్పిచూడగా, అల్లనేరేడుపండు ఛాయతో నిగనిగ మెరిసిపోతూ పుల్లంపేట జరీచీర.
'ఇదెలా వచ్చిందండీ?' అని అడుగుతూ ఆమె మడత విప్పింది. వెంటనే మైజారు కొంగున వున్న జరీ నిగనిగ, ఆమె కళ్లలోనూ, చెక్కిళ్ళమీదా, పెదవులమీదా తళుక్కుమంది.
దాంతో అతని మొగం మరీ గంభీరముద్ర వహించింది.
'చెప్పండీ'.
'వెళ్ళి కట్టుకురా'.
'మానేస్తానా యేవిటి చె-ప్పండీ'
'చెప్పనా యేవిటి కట్టుకురా'.
'ఆమె గదిలోకి వెళ్ళి మడత పూర్తిగా విప్పగా యేదో కింద పడింది.
'ఇందిలో పట్టు జాకెట్టు కూడా వుందండీ!
'ఇంకేం తొడుక్కురా'.
యాజులిక్కడ మాట్టాడకుండానే కూచున్నాడు. కాని 'మామిడిపిందె లించక్కున్నాయో! బాబోయ్ పద్దెనిమిది మూళ్ళ పొడుగున్నట్టుంది. మా అమ్మాయిలాంటిది వొక్కటీ పెట్టలేకపోయింది. ఎన్నాళ్ళనుంచో మనసుపడుతున్నా నీరంగుకోసం. పాపం, చెప్పినట్టు తెచ్చిపెట్టారు' అంటూ అక్కడ రాధమ్మ రిమార్కులమీద రిమార్కులు దొర్లించేసింది.
అదివిని తన కష్టం పూర్తిగా ఫలించినందుకతను చాలా సంతోషించాడు.
తరువాత ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వచ్చి వొళ్లోకూచుని ఆమె 'యిదెలా వచ్చింది చెప్పరూ?' అని మళ్ళీ అడిగింది.
'పుల్లంపేటలో వొక దేవాంగి నేశాడు'.
'ఊహూ'.
'అది తెప్పించి నాతా సుదర్శనశెట్టి నెల్లూరి పెద్దబజారులో పెట్టి అమ్మాడు'.
'సరే'
'నేను కొన్నాను'.
'బాగుంది'.
'నువ్వు కట్టుకున్నావు'.
'ఎలా వచ్చిందీ?'
'మళ్ళీ మొదలా?'
'మరి నా ప్రశ్న అలాగే వుండిపోయింది. కదూ!'
'లేదు, బాగా ఆలోచించుకో'.
'పోనీ, యిది చెప్పండి డబ్బెక్కడిదీ?'
'మిగిలిస్తే వచ్చింది.'
'ఎవరూ?'
'నేను.'
'ఎలా మిగిల్చారూ?'
అతను రెప్పవెయ్యకుండా చూశాడు.
'చెప్పరు కాదూ? అయితే నన్ను -'
'ఆగు ఆగు. ఇవాళ పెద్ద పండుగ. అలాంటి మాటలు రాకూడదు.
'అయితే మరి చెప్పండి'.
'యాజులు జరిగిందంతా చెప్పాడు; కానీ, నమ్మలేక, ఆమె 'నిజంగా?' అని చెయ్యి చాపింది.
'అక్షరాలా నిజం. ముమ్మాటికీ నిజం' అంటూ అతనాచేతిలో చెయ్యివేసి, ఆ చెయ్యి గిల్లాడు.
ఆమె మనస్సు గుబగుబలాడిపోయింది. హృదయం నీరయిపోయింది. కళ్ళు చెమ్మగిల్లాయి.
'చూశారా? నా చీరకోసం కారెండలో నడిచివెళ్ళారా?' అక్కడ కడుపు మాడ్చుకుని వుసూరుమంటూ పని చేశారా? చీర లేకపోతే నాకు పండుగ వెళ్ళగనుకున్నారా? నేను రాకాసినా?' అని యిక మాట్టాడలేక చేతులు అతని కంఠానికి పెనవేసి తన శిరస్సు అతని భుజం మీద ఆనికుని దుఃఖించసాగింది.
అది చూసి, మొదట అతను నిర్విణ్ణుడయిపోయాడు; కాని తరువాత ఛా! ఏడుస్తున్నావా? నేను ఏది వద్దనుకున్నానో అదే చేస్తావా? ఇలా చూడూ, అబ్బే! అయితే నాకూ నీకూ మాటల్లేవు. నాకూ నీకూ జతలేదు, అని బెదిరిస్తూ మూతి బిడాయించుకుని ఆమె మొగం పైకెత్తి కొంటెచూపులు చూశాడు.
ఏడ్పల్లా ఆమెకి నవ్వయిపోయింది.
'మరి నాతో యెందుకు చెప్పారు కారూ? నేను మాత్రం కాఫీ మానుకోకపోదునా? దాంతో మీక్కూడా జామారు రాకపోవునా?'
'ఇప్పుడు రాకపోతేనా?'
'ఏదీ, చూపించరూ?'
ఇద్దరూ లేచారు. ఒకర్ని వొకరు పొదిపి పట్టుకుని వాకిట్లో మేజా దగ్గరికి వెళ్ళారు. యాజులు సొరగు లాగి వెంకటగిరి సరిగంచు చాపు పైకి తీశాడు.
అది చూసి, ఆమె సంతోష విహ్వాల అయి మరి తొరగా కట్టేసుకోండి' అంటూ అతని భుజాలు వూపేసింది.
***
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి