16, ఫిబ్రవరి 2021, మంగళవారం

వసంత పంచమి

 🌹🥀🌾🌺💐🌸🌷🌹

*మాఘ శుద్ధపంచమి వసంత పంచమి విశేషం?*


*మనం శ్యామలా నవరాత్రులు అని చెప్పుకున్నాం, శ్యామల రూపములు శ్యామలా తంత్రప్రకారం    ఎనిమిది. శ్యామలా నవరాత్ర మధ్యంలో విశేష స్వరూపం పంచమి రోజున శ్యామలా మాత సరస్వతీ స్వరూపంలో దర్శనం.*


*అక్షరాలకు అధిదేవత సరస్వతీదేవి. సకల విద్యలకు ఆమె రాణి జ్ఞానప్రదాయిని. ఆమె జన్మదినమే వసంత పంచమి.*


*ప్రతి ఏటా మాఘ శుద్ధ పంచమిరోజు పర్వదినాన్నే వసంతపంచమి, సరస్వతీ జయంతి, మదన పంచమి అని కూడా వ్యవహరిస్తారు.*

            

*మానవ జాతి మనుగడకు, అక్షయ సంపదకు మూలమైన ప్రణవ స్వరూపిణిగా వసంతపంచమినాడు సరస్వతీదేవి పూజలందుకుంటుంది*


*యాకుందేందు తుషారహార ధవళా. అని, తల్లీ నిన్ను దలంచి.. సరస్వతీనమస్తుభ్యం....క్షోణితలంబు నెన్నుదురు... అంటూ ఎన్నోవిధాలుగా మనతో ప్రార్థనలు అందుకుంటుంది.*


*వాగ్దేవీ ఉపాసన వేదాలలో సరస్వతీ సూక్తాలున్నాయి*


*అంచితమే నదీతమే దేవీతమే సరస్వతీ అని శ్రీవాణిని శ్రుతి కీర్తించింది. వేదజ్ఞానానికి మాతృక అయిన గాయత్రి, సావిత్రి సరస్వతీ రూపాలే. ఆమెను విద్యావాహికగా ఆరాధిస్తారు. లౌకిక అలౌకిక విద్యలన్నీ ఆమె అధీనంలోనే ఉంటాయి. సరస్వతీ అనుగ్రహం కలిగితే ప్రతిభ, మేధ, శ్రద్ధ స్ఫురణ, ధారణ, చైతన్యం, కళానైపుణ్యం 1 జ్ఞానరహస్యం, సంస్కారం, సత్కీర్తి లభిస్తాయి.*


*సరస్వతీదేవిని అహింసాదేవతగా, జ్ఞానదేవతగా పురాణాలు కీర్తించాయి మన పురాణాల్లో శుంభ, నిశుంభులను సంహరించినది మహాసరస్వతియే. తెల్లని వస్త్రాలు, తెల్లని పువ్వులు, తెల్లని ముత్యాల సరాలు. తెల్లటి గంథపు పూత, తెల్లటి వీణ ఇవన్నీ సరస్వతీ దేవికి ఇష్టమైనవి. అవి శాంతికి, స్వచ్ఛతకు సంకేతాలు.*

            

*లక్ష్మిని, సరస్వతిని ఇద్దరినీ కలిపి కూడా పూజిస్తారు. ఆ పూజావిధానాన్ని గురించి పురుషార్థ చింతామణి గ్రంథం అభివర్ణిస్తుంది. కాగా సరస్వతి ప్రధానంగా సకల కళాధిదేవత. కవిత్వం, సంగీతం నృత్యం, శిల్పం, చిత్రలేఖనం వంటి లలితకళలు అభ్యసించే వారిపై ఆమె అపార కరుణారస వృష్టిని వర్షిస్తుంది.*


*మంత్రశాస్త్రంలో సరస్వతీ రూపాలు ఎన్నెన్నో ఉన్నాయి. మాతంగి, వాగేశ్వరి వాగ్వాదిని, మహాసరస్వతి, సిద్ధ సరస్వతి నీలసరస్వతి, అంతరిక్ష సరస్వతి ఇంకా మరెన్నో రూపాల్లో సాధకులు ఆమెనుపూజిస్తూ ఉంటారు.*

🌹🌷🌸💐🌺🌹

*వాక్కుకు అధిదేవత అయిన సరస్వతికి మనదేహంలో నాలుగు స్థానాలున్నాయి నాభి, హృదయం, కంఠం, జిహ్వ అనే నాలుగు స్థానాల్లోనూ వరుస పర పశ్యంతి, మధ్యమ, వైఖరి వాక్కుల రూపంలో సరస్వతీదేవి కొలువై ఉంటుంది. ఈ స్థానాలన్నింటి నుంచి వెలువడే మూలనాదాన్ని సరస్వతిగా యోగులు ఆరాధిస్తారు. వీటికి సరస్వతి రూపమే మూలమైన నాదం.*


*సరస్వతి హంసవాహినీ. హంస నీటిని విసర్జించి పాలను స్వీకరించినట్లే చెడును త్యజించి మంచిని స్వీకరించాలని ప్రబోధిస్తుంది అక్షరాధి దేవత. ఆమె మనలోని ఆత్మజ్యోతికి ప్రతీక*


*సరస్వతీ భక్తులు పరాశక్తిని శారద రూపంలో దర్శించి ఆరాధించి సృష్టి చేసే శక్తిని బ్రహ్మ పొందగలిగాడు. వాల్మీకి రామాయణ రచన చేసినట్టు పురాణ కథనం. వాల్మీకి నుంచి వ్యాసమహర్షి శారదా దీక్ష స్వీకరించి వేద విభజన చేయగలిగాడు. భారత, భాగవత బ్రహ్మసూత్రాది రచనలు చేయగలిగాడు అష్టాదశ పురాణాలను ఆవిష్కరించగలిగాడు.*


*బృహస్పతి కూడా విద్యాసిద్ధి కోసం గీర్వాణినే అర్చించాడు. మహాపండితునిగా పేరుపొందిన ఆదిశేషుని భూదేవి జ్ఞానరహస్యాలు బోధించమని కోరితే అతడు శారదను ఆరాధించి శాస్త్ర జ్ఞానరహస్యాలు గ్రహించి భూమాతకు చెప్పగలిగాడు*

          

*దక్షిణాదిన కంటే ఉత్తరభారతంలో ముఖ్యంగా రాజస్థాన్ లోనూ ఈ పర్వాన్ని విశేషంగా నిర్వహిస్తారు. పూర్వం ఈరోజు యవేష్టి అనే యజ్ఞం చేసేవారు. యవలతో చేసే యజ్ఞం కనుక దీనికి ఆ పేరు వచ్చిందంటారు. వంగదేశంలో పండితులంతా సరస్వతి జయంతిని చాలా భక్తి శ్రద్ధలతో జరిపే పండుగగా కీర్తించారు. ప్రాచీన కాలంలో రోమనులు కూడా వసంతరుతు సంబంధమైన పండుగను శ్రీవాణి ఆరాధనగా నిర్వహించుకునే వారు. గ్రీకులు, రోమనులు సరస్వతిని మినర్వా పేరుతో కొలుస్తారు. బెంగాల్లో కవులంతా ఈ పంచమి తమ గ్రంథ రచన ప్రారంభించేవారు.*


*నిగమార్ధ నిధులున్న నెలవు సరస్వతి అనే శబ్దానికి ప్రవాహ రూపంలో ఉండే జ్ఞానమని అర్థం ప్రవాహం చైతన్యానికి సంకేతం. అమృతమయమైన జ్ఞానప్రకాశ కాంతిపుంజమే సరస్వతి.*

🌹🌺💐🌸🌷🌷🌸🌹

*(సరః అంటే కాంతి. మన జీవితాన్ని జ్ఞానకాంతిమంతం చేసే మాతృశక్తి సరస్వతి. ఆమె శ్వేత వస్త్రాలతో అలంకృతమై హంసవాహినిగా తెల్లతామరపుష్పంపై కొలువు తీరి ఉంటుంది. అక్షమాల, గ్రంథం ధరించి వీణానాదం చేస్తుంటుంది. సరస్వతీదేవి నివసించే మూలస్థానం పేరు శశాంక సదనం అంటారు. గంగా సరస్వతులు సవతులై పరస్పరం శపించుకొని నదులై పోయాయన్న కథనం ఒకటి ప్రచారంలో ఉంది. సరస్వతీ నది గంగ యమునలతో కలిసి త్రివేణీ సంగమమైంది.)*


🌹🌸🌷💐🌺💐🌹

*ఈ వసంత పంచమినాడు ఏవిధంగా సరస్వతిని ఆరాధించాలనే విధివిధానాలను శ్రీ మహావిష్ణువు నారదునికి వివరించినట్టు దేవీ భాగవతం చెబుతోంది*

                

*చండీ సప్తశతి, బ్రహ్మపురాణం, సరస్వతీ రహష్యోపనిషత్తు, ప్రపంచసార సంగ్రహం, శారదా తిలకం తదితర గ్రంథాలు పలుకుల తల్లి వ్రత, ఉద్యాపనల విధానాలను తెలియ చేస్తున్నాయి. పెరుగు, వెన్న, పేలాలు, తెల్లనువ్వు ఉండలు, చెరకు, పటికబెల్లం, తేనె, తెల్లచందనం, తెల్లని పూలు, తెల్లని వస్త్రం, పాలకోవ, ముల్లంగి, పంచదార, కుడుములు, పళ్లు, టెంకాయలు తల్లికి సమర్పిస్తారు*


 *ఇవేకాకుండా మత్స్య, మార్కండేయ, స్కంద పురాణాలు, ధర్మసింధు, మానసారాది లాక్షణిక శిల్పశాస్త్రాల్లోనూ వాణీ వైభవం వర్ణితమైంది.*


*సాహిత్య సంగీతాలనే అమృతకలశాలను మానవాళికి అందిస్తున్న జగన్మాత సకల కళారూపిణి. భగవతి కృపాకటాక్ష ప్రసాదానికి వాక్కుద్ధి, వాక్సిద్ధితో స్వరార్చన చేసి ధన్యులమవుదాం. అక్షర సంపదను లోకకల్యాణానికి వినిమయం చేద్దాం.*


🌹💐🌷🌸🌺🌾🌾🌹


*ఓం ఐం హ్రీం సరస్వత్యే నమః*


*వసంత పంచమిని విద్యారంభ దినంగా బ్రహ్మవైవర్త పురాణం అభివర్ణించింది. ఆ తల్లి బీజాక్షరం ఐం. ఆమె మూలమంత్రం .ఓం ఐం హ్రీం సరస్వత్యే నమః మనం ఏదైనా మంచిమాట పలుకుతున్నామంటే ఆ తల్లి చలువే. సంపదకు, కీర్తికి పదోన్నతికి, మనుగడకు అన్నింటికీ ఆమెను అర్చించాల్సిందే.*   


             🙏🙏🙏

కామెంట్‌లు లేవు: