16, ఫిబ్రవరి 2021, మంగళవారం

మొగలిచెర్ల

 *స్వస్థత...సంతానం..*


"స్వామీ దత్తాత్రేయా మా ఆయనకు ఆరోగ్యం బాగు చేయి తండ్రీ..ఈ మాయదారి రోగాన్ని తగ్గించు.." అంటూ ఆ యువతి మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం యొక్క ముందున్న పందిరి కింద కూర్చుని పరి పరి విధాలా వేడుకుంటున్నది..ఆమెతో పాటు ఎనిమిదేళ్ల వయసున్న ఆమె కుమారుడు బేల చూపులు చూస్తూ ప్రక్కనే కూర్చుని వున్నాడు..ఆమె భర్త ఆ ప్రక్కనే పడుకొని వున్నాడు..


ఆమె పేరు చంద్రమ్మ..భర్త పేరు మాలకొండయ్య..వాళ్ళది నెల్లూరు జిల్లా లోని సిద్దనకొండూరు గ్రామం ప్రక్కనే ఉన్న చిన్న పల్లెటూరు పరికోట..వాళ్లకు పెళ్లి జరిగి అప్పటికి సుమారు పది సంవత్సరాలు..ఒక కుమారుడు కలిగాడు..వ్యవసాయాధారిత కుటుంబం..అయినా లక్షణంగానే వున్నారు..అంతా బాగుంది అని సంతోషం గా ఉన్న సమయం లో మాలకొండయ్యకు హఠాత్తుగా మూర్ఛ వ్యాధి సోకింది..ఉన్నట్టుండి మూర్ఛ వచ్చి పడిపోతున్నాడు..చంద్రమ్మ కు భయం పట్టుకుంది..ఆరోజుల్లో అంటే 1978, 79 నాటికి నెల్లూరు లో ఉన్న పెద్ద పెద్ద వైద్యులకు చూపించారు..కానీ ఫలితం దక్కలేదు..


సిద్దనకొండూరు లో ఉన్న చంద్రమ్మ బంధువులు.."నీ భర్తను తీసుకొని మొగిలిచెర్ల వెళ్ళు..అక్కడ దత్తాత్రేయ స్వామి సిద్ధిపొందిన ఆశ్రమం ఉంది..ఆ స్వామి సమాధి వద్ద మొక్కుకో..నీ భర్త బాగుపడతాడు.." అని సలహా ఇచ్చారు..ఆ సలహా ఇవ్వటానికి కూడా ఒక కారణం ఉంది..శ్రీ స్వామివారు మాలకొండలో తపస్సుకు వెళ్లేముందు..ఈ సిద్దనకొండూరు గ్రామం లో కొన్నాళ్ళు వున్నారు..శ్రీ స్వామివారు సిద్ధపురుషుడని ఆ గ్రామస్థులకు ఒక నమ్మకం ఆనాడే కలిగింది..ఆ నమ్మకం తోనే వాళ్ళు చంద్రమ్మకు సలహా ఇచ్చారు..


ఆ సలహా ను నమ్మి, చంద్రమ్మ తన భర్తను, కుమారుడిని తీసుకొని మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చింది..శ్రీ స్వామివారి తల్లిగారైన సుబ్బమ్మ గారు కూడా అప్పుడు మందిరం వద్దే ఒక గదిలో నివాసం ఉండేవారు..సుబ్బమ్మ గారు కూడా చంద్రమ్మ కు ధైర్యం చెప్పారు..చంద్రమ్మకు మానసికంగా కొంత ఊరట కలిగింది..కానీ భర్త పరిస్థితి మరికొంత క్షీణించింది..


రెండురోజులు గడిచాయి..చంద్రమ్మ ప్రార్ధన ఫలితమో..మరే కారణమో తెలీదు కానీ..మాలకొండయ్య కు తరచూ వస్తున్న  మూర్చలు కొద్దిగా తగ్గాయి..మనిషి కొద్దీ కొద్దిగా కోలుకుంటున్నాడు..ఆరోజు మధ్యాహ్నం భర్తకు ఆహారం పెట్టి..చంద్రమ్మ తన కుమారుడితో సహా శ్రీ స్వామివారి మందిరం లోకి వచ్చి, ఆ పందిరి కింద పడుకుంది..వెంటనే నిద్ర పట్టింది..నిద్రలో..ఒక యోగి నడుచుకుంటూ వచ్చి.."అమ్మా..నీకు సంతాన యోగం ఉంది..పొత్తిగుడ్డలు నీ దగ్గర ఉంచుకో..నీ భర్త బాగుపడతాడు..ముగ్గురు బిడ్డల్ని కంటావు.." అని చెప్పినట్లు కల వచ్చింది..ఉలిక్కిపడి లేచిన చంద్రమ్మ శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి, "స్వామీ నాకు కుమారుడు వున్నాడు..ఇప్పుడు నేను నా భర్త ఆరోగ్యం గురించి వచ్చాను..నా భర్త బాగుంటే అదే పదివేలు..నాకు ఒక కుమారుడు ఉన్నాడు..మళ్లీ సంతానం కలుగక పోయినా పర్వాలేదు.." అని ప్రార్ధించింది..


మరో మూడురోజుల్లోనే మాలకొండయ్యకు మూర్చలు తగ్గిపోయాయి..వారం లోపలే మాలకొండయ్య మామూలు మనిషిగా మారిపోయాడు..చంద్రమ్మ కు పట్టరాని సంతోషం వేసింది..స్వామివారికి పరి పరి విధాల నమస్కారం చేసుకొని..భర్తనూ, కుమారుడిని తీసుకొని పరికోటకు వెళ్ళింది..సరిగ్గా మూడు నెలలకు చంద్రమ్మ గర్భవతి అయింది..ఆరోజు చంద్రమ్మ కు తనకు వచ్చిన కల గుర్తుకొచ్చి, భర్తతో వివరంగా చెప్పింది.."స్వామివారి ప్రసాదం అనుకుందాము..ఆయన దయ " అన్నాడు మాలకొండయ్య..


చంద్రమ్మ కు మొదటి కుమారుడు పుట్టిన తొమ్మిది ఏళ్లకు మళ్లీ రెండో సంతానం గా కుమారుడే పుట్టాడు..చిత్ర మేమిటంటే..ఆ తరువాత మరో కుమారుడు..మళ్లీ కుమారుడు..ఇలా ముగ్గురు కొడుకులు ఐదేళ్ల వ్యవధిలో పుట్టారు..శ్రీ స్వామివారు కలలో చెప్పిన మాట సత్యమై పోయింది..


"అయ్యా..ఆ తరువాత మా సంసారం లో ఏ ఇబ్బందులూ లేవు..నా నలుగురు కొడుకులూ చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటూ లక్షణంగా వున్నారు..ఏటా ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని దర్శించుకొని వెళుతుంటాము..నా పసుపుకుంకుమలు స్వామి కాపాడి, సంతానాన్ని కూడా ఇచ్చాడు.." అంటూ నాలుగురోజుల క్రితం మందిరానికి వచ్చిన చంద్రమ్మ నాతో చెప్పుకొచ్చింది..ఆ సమయం లో ఆమె కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి.."స్వామిని నమ్ముకుంటే చాలయ్యా..అన్నీ ఆయనే చూసుకుంటాడు.." అన్నది..ఇప్పుడు చంద్రమ్మ కు వయసు మీద పడింది..కానీ శ్రీ స్వామివారి మీద భక్తి కొంచెం కూడ తగ్గలేదు..తాను శ్రీ స్వామివారి మందిరానికి వచ్చినప్పుడల్లా..తన అనుభవాలను నాతో చెప్పుకోవడం ఒక అలవాటు..


"పొద్దస్టం స్వామి దగ్గర ఉంటావు కదయ్యా..నీకు చెప్పుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది.." అంటూ వుంటుంది..స్వామి వద్దనే ఉంటున్న మాట వాస్తవమే కానీ..చంద్రమ్మకున్నంత భక్తి ప్రపత్తులు ఉన్నాయా అన్నదే ప్రశ్న..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: