17, ఫిబ్రవరి 2021, బుధవారం

మొగలిచెర్ల

 *ఉపాధి..ఉపశమనం..*


"అయ్యా..అతనెవరో మాకు తెలీదు..మొన్న శనివారం నాడు సాయంత్రం ఇక్కడికి వచ్చాడు..పల్లకీసేవ లో పాల్గొన్నాడు..నిన్న ఆదివారం నాడు స్వామివారి సమాధి దర్శించుకొన్నాడు..నిన్న రాత్రి మంటపం లో పడుకున్నాడు..ఉదయం కూడా స్వామివారికి హారతులు ఇచ్చిన తరువాత..తీర్ధం తీసుకొని..మంటపం లో ఒక ప్రక్కగా కూర్చుని వున్నాడు..అతని వివరాలు తెలుసుకోలేదు..తీసుకోమంటారా?.." అంటూ మా సిబ్బంది నాకొక యువకుడిని చూపించి అడిగారు.."అతని పాటికి అతను స్వామిని దర్శించుకొని..తన పాటికి తాను ధ్యానం లో వున్నాడు కదా..మనమెందుకు అతనిని విసిగించడం..రేపు కూడా చూద్దాము..అంతగా అతని వల్ల ఏదైనా ఇబ్బంది కలిగితే అప్పుడు పిలిపిద్దాము.." అన్నాను..మా వాళ్ళూ సరే అన్నారు..ఇక అతని విషయం మరచిపోయాము..


మరో రెండురోజులు గడిచిపోయాయి..ఆ యువకుడు రోజూ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం స్వామివారి హారతుల సమయానికి మంటపం లోకి వచ్చి, హారతి కళ్లకద్దుకొని, అర్చకస్వామి ఇచ్చే తీర్ధాన్ని స్వీకరించి తిరిగి వెళ్లిపోతున్నాడు..మధ్యాహ్నం అన్నదాన సత్రం వద్దకు వెళ్లి భోజనం చేస్తున్నాడు..మిగిలిన సమయం లో ఎక్కువ భాగం మంటపం లో కళ్ళుమూసుకుని ధ్యానం లో ఉంటున్నాడు..ఎవరితోనూ మాట్లాడటం లేదు..ఆ ప్రక్కరోజు గురువారం ఉదయం..పది గంటల వేళ..అతను నేరుగా నావద్దకు వచ్చి..ఏ ఉపోద్ఘాతమూ లేకుండా.."గత ఐదు రోజులుగా నేను ఇక్కడ ఉంటున్నాను..స్వామివారి సన్నిధి లో నాకు చాలా ప్రశాంతత లభ్యమైంది..మరో వారం రోజులు వుందామని అనుకుంటున్నాను..మీకు తెలియచేస్తే మంచిదనే అభిప్రాయం తో నేను ఈరోజు చెపుతున్నాను.." అన్నాడు.."మీరెవరు?..ఏ ఊరి నుంచి వచ్చారు?..మీ పాటికి మీరు ఉన్నారనే ఉద్దేశ్యంతో నేను కానీ..మా సిబ్బంది కానీ మిమ్మల్ని ఏమీ అడగలేదు..అసలు ఏదైనా సమస్యతో ఇక్కడికి వచ్చారా?..లేక కేవలం ఇక్కడ ధ్యానం చేసుకుందామని వచ్చారా?.." అని అడిగాను..


"నా పేరు నారాయణమూర్తి..మాది కృష్ణాజిల్లా..బ్రాహ్మణ కుటుంబం..అర్చకత్వం చేసుకుంటూ వున్నాను..నేను పూజారిగా ఉన్న ఆలయ ధర్మకర్తలు ఏ కారణం చేతో నన్ను తొలగించి వేరే వారిని నియమించుకున్నారు..ఉపాధి కోల్పోయాను..చాలా రోజులు నుంచీ నేను మానసికంగా వేదన అనుభవిస్తున్నాను..ఇంటా బైటా సమస్యలు..ఆర్ధిక ఇబ్బందులు..లోకం లో ఉన్న కష్టాలు అన్నీ నన్నే చుట్టుముట్ఠాయేమో ననే భావన బలంగా పాతుకుపోయింది..ఆసమయం లో నా మిత్రుడు నాకు ఈ క్షేత్రం గురించి చెప్పాడు..ఒకసారి వెళ్లి దర్శనం చేసుకో..ఏదైనా పరిష్కారం లభిస్తుంది అని చెప్పాడు..మా ఆడవాళ్ల తో ...ఓ పదిరోజుల పాటు ఆ క్షేత్రం లో ఉంటాను..ఆ స్వామి నా మోర ఆలకించి ఏదైనా ఉపశమనం కలిగిస్తాడేమో చూస్తాను..అని చెప్పి ఇలా వచ్చేసాను..ఈ ఐదు రోజులు స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకున్నాను..నాకెందుకో నమ్మకం కలిగింది..మరో వారం ఉండాలని అనుకుంటున్నాను.." అన్నారు..


అతను అర్చకత్వం చేస్తాడు అని తెలిసిన తరువాత.."ప్రతి శని ఆదివారాల్లో ఈ మందిరానికి విశేషంగా భక్తులు వస్తారు..ఈసారి శని ఆదివారాల్లో మా శివాలయం పూజారి గారు సెలవు పెట్టారు..మీకు వీలుంటే ఆ ఆలయ బాధ్యత ఆ రెండు రోజులూ చూడండి..ఎంతో కొంత పారితోషికం ఇస్తాము.." అన్నాను..అతని ముఖం ఒక్కసారిగా విప్పారింది..సంతోషంగా ఒప్పుకున్నాడు..ఆ శని ఆదివారాల్లో శివాలయం వద్ద పూజారిగా వున్నాడు..ఆదివారం సాయంత్రం నాలుగు గంటల వేళ..మందిరం వద్దకు దర్శనం కొఱకు వచ్చిన భక్తులలో ఒకరు నావద్దకు వచ్చి.."ప్రసాద్ గారూ..మేము శ్రీ సాయిబాబా మందిరం కట్టాము..రెండు సంవత్సరాలు అవుతున్నది..అదేమిటో పూజారి దొరకలేదు..వచ్చిన వాళ్ళు ఒక్క నెల కూడా ఉండటం లేదు..మంచి జీతం ఇస్తాము..వసతి ఇస్తాము..మీకెవరన్నా తెలిస్తే చెప్పండి.." అన్నారు..నాకెందుకో నారాయణమూర్తి కోసమే వీళ్ళు వచ్చారేమో అని అనిపించింది..వెంటనే నారాయణ మూర్తిని పిలిపించాను..విషయం చెప్పాను..వచ్చిన వాళ్ళూ..నారాయణ మూర్తి మాట్లాడుకోవడం..అంగీకారం కుదరడం..అన్నీ ఒక గంటలో జరిగిపోయాయి..ఆ ప్రక్క గురువారమే నారాయణ మూర్తి అర్చకుడిగా బాధ్యతలు తీసుకునేటట్టు ఒప్పుకున్నారు..


"ప్రసాద్ గారూ..ఇంత త్వరగా నాకు పరిష్కారం లభిస్తుందని నేను ఊహించలేదు..ఈ దత్తుడే నాకు మరో దత్తావతారుడైన సాయినాథుని సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించి..నా కుటుంబం నిలద్రొక్కుకునే మార్గం చూపాడు.." అంటూ నారాయణ మూర్తి ప్రతి పదిరోజులకూ ఒకసారి ఫోన్ చేసి నాకు చెపుతూ ఉంటాడు..


నిజమే..నారాయణమూర్తి మొర స్వామివారు విన్నారు..అతనికి తగ్గ ఉపాధి చూపించి..అతనికి ఉపశమనం కలిగించారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: