17, ఫిబ్రవరి 2021, బుధవారం

మాఘ పురాణం*_🚩 🚩 _*5 వ అధ్యాయము*_

 🚩 _*మాఘ పురాణం*_🚩 

🚩 _*5 వ అధ్యాయము*_🚩


    *మంగళవారం*

*ఫిబ్రవరి 16, 2021*


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*కుక్కకు విముక్తి కలుగుట*


🕉️🍀🍀🍀🍀🍀🍀🕉️


దిలీప మహారాజా ! సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావుకదా ! ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధముగా చెప్పెను. అదెట్లనగా.....,


మాఘమాసములో నదీస్నానములు చేయువారు గొప్ప ధనశాలురు అగుదురు. వర్తమానకాలమందు యెన్ని కష్టములు అనుభవించుచున్నప్పటికిని మాఘమాసము మొదలైన తరువాత, వారి కష్టములు క్రమేపి సమసిపోవును. 


మాఘశుద్ద దశమినాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించిన యెడల శ్రీహరి కటాక్షమునకు పాత్రులగుదురు. అందులో అణుమాత్రమైనను సంశయము లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతి -


*"నాధా ! శ్రీ లక్ష్మినారాయణుల వ్రతము చేసిన యెడల మనోవాంఛా ఫలసిద్ది కలుగునని చెప్పియుంటిరి గదా ! ఆ వ్రత విధానమెట్టిదో , యెటుల ఆచరించవలెనో తెలియ పరచుడని"* కోరినది. అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగెను. 


మాఘశుద్ధ దశమినాడు ప్రాతఃకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి నది ఒడ్డునగాని , ఇంటివద్ద కాని , మంటపము నుంచి ఆ మంటపము ఆవుపేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపము మధ్య ఎనిమిది రేకుల పద్మము వేసి , అన్ని రకాల పుష్పములు , ఫలములు తీసుకువచ్చి లక్ష్మినారాయణులను మంటపం మధ్యన ఉంచి , ఆ విగ్రహాలకు గంధము , కర్పూరము , అగరు మొదలగు ద్రవములు పూసి పూజించవలెను. రాగిచెంబులో నీళ్ళుపోసి మామిడిచిగుళ్లను అందులోవుంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్తవస్త్రము నొకదానిని కప్పి , లక్ష్మినారాయణుల ప్రతిమను ప్రతిష్టించి పూజించవలెను. ఆ మండపము మధ్యలో సాలగ్రామమునుంచి , ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి పూజించి వారిచేత ధూప దీప చందనాగరు పరిమళ వస్తువులుంచి నైవేద్యము పెట్టవలెను.


తరువాత రాగిపాత్రలో నీరుపోసి అర్ఘ్యప్రదానము చేయవలెను. అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్రప్రభువును మదిలో ధ్యానించవలెను. 


మాఘమాసస్నానము చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలయును. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము , బెల్లము, ఉప్పు, పప్పు, కాయగూరలు, పండ్లు మొదలగునవి ఏకపాత్రయందు వుంచికాని, క్రొత్తగుడ్డలో మూటగట్టికాని దానమియ్యవలయును. మాఘపురాణమును స్వయముగా పఠించునపుడుగాని , లేక వినునప్పుడు కాని చేతిలో అక్షితలు ఉంచుకొని , చివరిలో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షతలు తమ తలపై వేసుకొనవలయును గాన ఓ శాంభవీ ! మాఘస్నానముచేసి మాఘశుద్ధ దశమినాడు లక్ష్మినారాయణులను నిష్ఠతో పూజించిన యెడల ఎటువంటి మాహాపాపములైనను నశించిపోవును. 


ఇందులకొక ఉదాహరణ కూడా తెలియజేసెదను, సావధానురాలవై వినుము. 


గౌతమమహర్షి , ఒకనాడు తన శిష్యులతోగూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తరదిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్యనదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గమందున్న మునిపుంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుకున్నారు. అప్పటికి మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలయునని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. 


గౌతముడు తన శిష్యులతో గూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయములో స్నానము చేసి , తీరమున నున్న ఒక రావిచెట్టు వద్దకు వచ్చి


*శ్లో. మూలతో బ్రహ్మరూపాయ , మధ్యతో విష్ణురూపిణే |*

 *అగ్రతశ్శివరూపాయ , వృక్షరాజాయతే నమో నమః ||*


అని రావిచెట్టుకు నమస్కరించి , ఆ చెట్టు మొదట ఆసీనుడయి శ్రీహరిని విధియుక్తముగా పూజించెను. తరువాత శిష్యులందరికి మాఘమాస ప్రభావమును వినిపించెను. ఈ విధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమినాడు ఆ చెట్టు మొదట మండపమేర్పరచి ముగ్గులు , బొట్లుపెట్టి , మామిడాకుల తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మండపము మధ్యలో శ్రీహరి చిత్రపటము నుంచి పూజించినారు. ఆ విధముగా పూజించుచున్న సమయంలో ఒక ఆడ కుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచు  ఆ రావిచెట్టునకు యెదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అచటనుండి లేచి ఉత్తరం వైపు మళ్ళి మరల తూర్పునకు తిరిగి , రావిచెట్టునకు యెదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క రావిచెట్టు చుట్టు తిరిగివచ్చినది. అప్పటికి మూడుసార్లు ఆ మండపము చుట్టు ప్రదక్షిణము చేసినందున, అది మాఘమాసము అయివున్నందున అది వెంటనే తన కుక్క రూపమును వదలి ఒక రాజుగా మారిపోయెను. ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడై మునులయెదుట నిలబడి వారందరికి నమస్కరించెను. అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోవుటచూచిన మునులూ , గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యము నొందిరి.


*"ఓయీ ! నీవెవ్వరవు ? నీవిట్లు మారుటకు కారణమేమి ?"* అని గౌతముడు ప్రశ్నించెను.


"మునిచంద్రమా ! నేను కళింగరాజును.  మాది చంద్రవంశము. నాపేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలయందు ప్రావీణ్యత గలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ వున్నాను. దానధర్మములనిన నాకు అతిప్రేమ. నేను అనేక దానాలు చేసియుంటిని.  గో, భూ, హిరణ్య , సాలగ్రామ దానాలు కూడా చేసియున్నాను. ఎక్కువగా అన్నదానము, తిలదానము చేసియున్నాను. అనేక ప్రాంతాలలో చెరువులు త్రవ్వించాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం చెట్లను నాటించాను. ధర్మశాలలను కట్టించాను. పశువులు త్రాగుటకు నీటి గుంటలు త్రవ్వించాను. నిత్యము బీద ప్రజల నిమిత్తం అన్నదానములు , మంచినీటి చలివేంద్రములను, ఎన్నో పుణ్యకార్యాలు చేసియున్నాను. అనేక దేవాలయాలను నిర్మించి , దైవ విగ్రహాలను ప్రతిష్టించాను. సద్బ్రాహ్మణుల చేతను , వేదాలు చదువు పండితుల చేతను యెన్నో క్రతువులు చేయించాను. పురాణాలలో వున్న ధర్మాలన్నియును చేసియున్నాను. కాని, నేనిలా కుక్కనయ్యాను. దానికి కారణము లేకపోలేదు. ఆ కారణము కూడా నేను విశరపరచెదను వినుడు.


ఒకానొక దినమున ఒకముని పుంగవుడు గొప్ప యఙ్ఞ మొకటి తలపెట్టాడు. యజ్ఞము చేయుటన్న సామాన్య విషయము కాదు కదా ! దానికి ధనము, వస్తు సముదాయము చాలా కావలెను గాన , ఆ మునిపుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. ముని సత్తముడు వచ్చిన వెంటనే యెదురేగి కాళ్ళుకడిగి ఆ నీళ్ళు నా శిరస్సుపై జల్లుకొని కుశల ప్రశ్నలడిగితిని ఆ మునియు  నా సత్కారమునకు మిక్కిలి సంతసించి , 


'రాజా ! నీకు గుప్త విషయములు తెలియజేయుదును , ఈ మాసములో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయము అయిన తర్వాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్మ్యమును చదువుట కాని లేక వినుట కాని చేయుము. దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతియేకాగ , అశ్వమేధయాగము చేసిన యెడల యెంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము కాని , తీర్థస్నానములు చేయగా వచ్చిన ఫలముగాని లేక దానపుణ్యములు అనగా వందయాగాలు చేసినంత ఫలముగాని పొందగలవు. మాఘ శుద్ధ సప్తమి ఆదివారం వచ్చినగాని , దశమి ఆదివారం వచ్చిన కాని ఉదయమే స్నానము చేసిననూ మరియు మాఘపౌర్ణమిరోజు ఉదయమున స్నానము చేసిననూ మానవుడు యెటువంటి పాపములనైనను విడువగలడు.


ఒక వేళ యితర జాతుల వారైనను మాఘమాసమంతా నిష్ఠతో నదీస్నానమాచరించి , దానధర్మాలాచరించి మాఘపురాణము పఠించినను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణులై జన్మింతురు , అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా , నేను అతనిని అవమానించినటుల మాటలాడి యిట్లంటిని. 


అయ్యా ! మునిసత్తమా ! మీరు పలికిన విషయములు నాకు తెలియును , అన్నియు బూటకములు. వాటిని నేను యదార్థములని అంగీకరించను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటికాదు గాన నేను యే మాఘమాసములు చేయుటకాని, దాన పుణ్యాదులు చేయుటగాని, పూజా నమస్కారములు ఆచరించుటకాని చేయును. చలిదినములలో చన్నీళ్ళు స్నానము చేయుట యెంత కష్టము ? ఇక నాకు యీ నీతిబోధలు చెప్పకుడు. నాకున్న ఫలములు చాలునని ఆ మునితో అంటిని. 


నా మాటలకు మునికికోపము వచ్చినది. , ముఖం చిట్లించుకొని సరే , నేను చెప్పవలసినది చెప్పితిని. అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసికొనకుండానే వెడలిపోయినాడు. అంతట నేను ఆ మునిని చేతులుపట్టి బ్రతిమలాడగా , యెట్టకేలకు అంగీకరించి ధనమును తీసికొనిపోయెను , ఆ విధముగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములను విడిచితిని , తరువాత నాకు వరుసగా ఏడుజన్మలూ కుక్క జన్మయే వచ్చినది. నా పాపఫలమేమోగాని కుక్కగా ఏడు జన్మలూ బాధపడితిని ఇప్పుడు మీరు చేయు పూజాస్థలము చుట్టు మూడు పర్యాయములు ప్రదక్షిణము జేసితిని కాన నా పూర్వజన్మస్మృతి నాకు కలిగినది. దైవ యోగమును యెవ్వరునూ తప్పించలేరు గదా ! ఇటుల కుక్కజన్మలో ఉండగా మరల నాకు పూర్వ జన్మస్మృతి యెటుల సంక్రమించినదో వివరింపుడనివేడెదను అని రాజు పలికెను.


ఆ రాజు చెప్పిన వృత్తాంతము విని గౌతమముని ఆశ్చర్యపడి మాఘమాసమును నీవు చులకనగా చూచుటవలన యెంతటి విపత్తువాటిల్లెనో అనుభవమే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు. అతను పలికిన విషయములన్నియు యదార్థములే నీవు కుక్కవై యెటుల పవిత్రుడనైతివో ఆ వృత్తాంతమును వివరించెదను సావధానుడవై ఆలకింపుము.


నేను నా శిష్యులతో కృష్ణవేణీ తీరమందుండి ఈ మాఘమాసమంతయు కృష్ణానదిలో స్నానములు జపములు చేసి తిరిగి మరోక పుణ్యనదికి పోవుదమని వచ్చియుంటిని. మేమందరము ఈ వృక్ష రాజము క్రింద విష్ణు విగ్రహాన్ని పూజించుకొనుచున్నాము. కుక్క రూపములోనున్న నీవు దారినిపోతూ యిచ్చట నైవేద్యమును చూసి తినవలయుననెడి ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు యెలాగున్నావో తెలుసా ! నీ శరీరమున బురదమైల తగిలివున్నది. చూచుటకు చాలా అసహ్యముగా వున్నావు. పరిశుద్ధులమై భగవంతుని పూజచేయుచున్న సమయములో అచటకు జంతువు కాని , పక్షికాని , వచ్చియున్న దానిని తరిమివేయుట సహజమే కదా ! నీవు అసహ్యముగా వుంన్నందున నా శిష్యులు నిన్ను తపోదండములతో నిన్ను 

కొట్టబోవుటచే పారిపోయి , నైవేద్యమును తినవలెనను. ఆశతో తిరిగి యధాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరల నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే పారిపోయి తిరిగి మళ్ళి వచ్చినావు. అట్లు మూడు పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజరూపమును ప్రసాదించినాడు. అనగా భగవంతుని మండపము చుట్టూ తిరుగుటవలన మాఘమాస ఫలము  కలిగి పునర్జన్మ వచ్చినదన్నమాట. ఇక మాఘమాస మంతయు నదిలోస్నానం చేసి భగవంతుని ధ్యానించి , పురాణపఠనము చేసినచో యెంతటి ఫలమువచ్చునో ఊహించుకొనుము అని చెప్పగా రాజు వినుచుండగా, అంతలోనే ఆ రావిచెట్టునకున్న ఒక తొర్రనుండి ఒక మండూకము బయటకు వచ్చి , గౌతమఋషి పాదముల పైపడి బెకబెకమని అరచి , అటునిటు గెంతుచుండెను. అట్లు గెంతుటలో మండపము వద్దకు వచ్చి చూచుచుండగానే కొంచెములో హఠాత్తుగా కప్ప రూపమును వదలి  మునివనితగా మారిపోయెను. ఆమె నవ యవ్వనవతి , అతి సుందరాంగి , గౌతమఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది. అంత గౌతమముని *'అమ్మాయీ ! నీ వెవ్వరిదానవు ? నీ నామధాయమేమి ? నీ వృత్తాంతము  యేమి ?'* అని ప్రశ్నించెను. ఆమె తన పూర్వజన్మ వృత్తాంతము తెలియ జేయుటకై యిట్లు చెప్పదొడంగెను.


*ఐదవ అధ్యాయము సమాప్తం*

 

🌹🌷🌼🛕🔔🌼🌷🌹


  🙏🙏 *సేకరణ*🙏🙏

      *న్యాయపతి వేంకట*  

     *లక్ష్మీ నరసింహా రావు*

కామెంట్‌లు లేవు: