*పురాకృతం...* *( మూడవ భాగం.)*
*జ్ఞానాగ్ని స్సర్వ కర్మాణి*
*భస్మ సాత్కురుతే తధా.* (గీతా 4.37).
ఈ మాట భగవద్గీతలోది. ఆత్మజ్ఞానాన్ని సాధించిన జ్ఞాని యొక్క పాపాలన్నీ బూడిద అయిపోతాయి అని శ్రీకృష్ణుని వాక్యం. ఇది జ్ఞాన యోగం ద్వారా పాప విముక్తి పొందడం గురించిన మాట.
అలాగే..
*సర్వధర్మాన్ పరిత్యజ్య*
*మామేకం శరణం వ్రజ*
*అహం త్వా సర్వ పాపేభ్యో*
*మోక్ష యిష్యామి మాశుచః.* (గీతా 18.66)
ఈ మాట భక్తి యోగానికి సంబంధించినది. సంపూర్ణ శరణాగతిని చేసి భగవంతుని పూర్తిగా నమ్మిన భక్తుడి పాపాలన్నింటినీ పరిహరించి ముక్తిని ఇస్తాను అని శ్రీకృష్ణుని మాట.
ఇక
*కర్మజం బుద్ధి యుక్తా హి (గీతా 2.51)*
అనే శ్లోకం లోనూ అదే అధ్యాయంలోని మిగతా శ్లోకాల లోను ఆసక్తి లేకుండా ఈశ్వరార్పణం గా చేసే కర్మలు జన్మ బంధానికి కారణం కావు పైగా అటువంటి కర్మలు చేసేవాడు పాపాల నుంచి విముక్తుడు అవుతాడు అని శ్రీకృష్ణుడు చెప్పారు.
దీని వల్ల తేలిందేమిటంటే..... *జ్ఞాన మార్గంలో కానీ భక్తి మార్గం లో కానీ వైరాగ్యం తో కూడిన కర్మ మార్గం ద్వారా కానీ భవ బంధాల నుంచి ముక్తిని పొందవచ్చు...*
మరి ఈ శ్లోకాల్లో ఎక్కడా కూడా ప్రారబ్దం అనుభవించాలి మిగిలిన సంచితమూ అనారబ్దమూ మాత్రమే తొలగుతాయి అని చెప్పలేదు కదా అంటారేమో. ఆ మాట అక్కడ లేదు. కానీ లోక వ్యవహారంలో స్పష్టంగా కనిపిస్తున్నది.
రమణ మహర్షి మహా జ్ఞాని సర్వసంగ పరిత్యాగి. ఆయనకు సర్కోమా వచ్చింది. జీవితాంతం ఉన్నది. అలాగే ఆది శంకరాచార్యుల కు భగంధరం వచ్చి మరణ పర్యంతం అది ఉన్నది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణాం అన్నారు కదా ఇది ఏమిటి అని అడిగితే ప్రారబ్దం అని చెబుతారు. సంపూర్ణ శరణాగతి చేసిన భక్తులు కూడా బాధలు పడ్డ ఉదాహరణలు పురాణాల నిండా ఉన్నాయి. ఇవన్నీ పరిశీలించే పెద్దలు భక్తి జ్ఞాన కర్మ మార్గాల ద్వారా ప్రారబ్దం తప్ప మిగిలిన అన్ని పాపాలు నశిస్తాయి అని చెప్పారు.
భాగవతంలో వామనావతార ఘట్టంలో బలి చక్రవర్తిని అనుగ్రహించే టప్పుడు మహావిష్ణువు ఇలా అంటారు. " ఎవ్వని గరుణింప నిచ్చయించితి వాని అఖిల విత్తంబు నే నపహారింతు. " భక్తుడు అయిన వాడిని రకరకాలుగా కష్టపెట్టి పరీక్షించి గానీ వాడిని అనుగ్రహించను అని దాని భావము. ఈ పరీక్ష ఇంచుమించు ప్రారబ్దానికి సరిపోతుంది. ఒక్కొక్కసారి లోకం లో మరీ మంచి వాళ్ళు నిష్కారణంగా తీవ్ర భాధలను అనుభవిస్తుంటారు. వాళ్లను బహుశా భగవంతుడు అనుగ్రహించ దలుచు కున్నాడేమో. వాళ్లకది ఆఖరి జన్మ ఏమో. వాళ్లు జ్ఞానులు భక్తులు అయితే అలాగే అనుకుని బాధలకు చెలించరు.
ప్రారబ్దాన్ని అనుభవించడం లో కూడా భక్తులకు జ్ఞానులకు ఒక వెసులు బాటు ఉంది. రమణ మహర్షి ఆదిశంకరా చార్యులవారు ఇద్దరూ బ్రహ్మ జ్ఞానులు కనుక శరీరం పడే బాధను తమ బాధగా ఎప్పుడూ భావించలేదు. అందువల్ల వారికి ప్రారబ్ద బాధ నిజానికి అనుభవం లోకి రాలేదు. లోకం దృష్టికి మాత్రమే వాళ్లు ఆ బాధను అనుభవించినట్లు ఉంటుంది. భక్తులు కూడా తమ బాధలను భగవంతుడు పెట్టే పరీక్షలు గా భావిస్తారు. అందువల్ల వాళ్లను కూడా ఈ బాధ బాధించదు.
భక్తుడైనా మామూలు వాడైనా సమానంగా నెత్తి మీద మొట్టికాయ పడితే సమానంగా బాధ ఉంటుంది కదా. ఎవరైనా అనుకోవడం అనుకోక పోవడం అనే దానిమీద బాధ ఆధారపడి ఉంటుందా అనే సందేహం అందరికీ కలుగుతుంది. ఈ సందేహానికి సమాధానం మనకు కాశీ కి సంబంధించిన స్థల పురాణ కథలలో దొరుకుతుంది.
*పవని నాగ ప్రదీప్.*
...... (ఇంకావుంది).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి