🤔🤔జానపద జాదూ... కదిరి వెంకటరెడ్డి🤔🤔
🙏జులై1కె వి రెడ్డి గారి 109వ జయంతి🙏
తెలుగు చలనచిత్రరంగానికి ఒక ఊపును, మెరుపును దిద్దిన మహనీయుడు కదిరి వెంకటరెడ్డి. ఆయన చిత్రరంగంలో కె.వి. గా చిరపరిచితుడు. ‘భక్తపోతన’, ‘పాతాళభైరవి’, ‘పెద్దమనుషులు’, ‘మాయాబజార్’, ‘దొంగరాముడు’, ‘జగదేకవీరుని కథ’, ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ వంటి సినిమాలను ఒక్క పాతతరమే కాదు నేటి ఆధునిక తెలుగు ప్రేక్షకుడు కూడా మరచిపోలేరు. ఆ రోజుల్లోనే ఆధునిక వివాహ వ్యవస్థ మీద ‘పెళ్లినాటి ప్రమాణాలు’ చిత్రం నిర్మించి ప్రశంసలు అందుకున్న మహానీయుడాయన. ఆయన సినిమాలు రంగుల కాలంలో రాలేదు...
కానీ ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూస్తుంటే వానవెల్లి రంగులన్నీ అంతర్లీనంగా కనపడుతూనే వుంటాయి. ఆయన సినిమాలు సినిమా కళకే పాఠ్య పుస్తకాలుగా పరిగణించవచ్చు. ఖద్దరు పంచె కట్టు, ఫ్రెంచి మీసకట్టు, పొట్టిచేతుల చొక్కా, మెడచుట్టూ తెల్ల తువాలుతో అచ్చం పల్లెటూరి రైతులా కనపడే కె.వి.రెడ్డి బి.ఎస్.సి (ఆనర్స్) పట్టభద్రులంటే వెంటనే నమ్మలేం. డిసెంబరు శీతాకాలంలో ‘‘జలకాలాటలలో’’ పాటను ‘జగదేకవీరుని కథ’ కోసం చిత్రీకరించవలసి వచ్చినప్పుడు ప్రొడక్షన్ మేనేజర్‌కు ‘ఫుట్ నోట్’లో ‘‘కొలనులో వేడి నీళ్లను సిద్ధం చేయాలి’’ అని రాసిపెట్టి రెండ్రోజుల్లో చిత్రీకరించాల్సిన పాటను ఒక పూటలోనే పూర్తిచేసి ఆ నాయికలకు ఉల్లాసం కలిగించిన దర్శకడు మరొకరు వుండరు. కె.వి.రెడ్డి (జూలై 1, 1912) 109 వ జయంతి. ఆ సందర్భంగా ఆ మహనీయుని గుర్తించి కొన్ని విశేషాలు...
* బాల టామ్ సాయర్‌గా...
కె.వి.రెడ్డి అనే కదిరే వెంకటరెడ్డి సొంతవూరు అనంతపురం జిల్లా, తాడిపత్రికి దగ్గరలోవున్న తేళ్ళమిట్టపల్లి గ్రామం. కె.వి. రెడ్డి తండ్రి కొండారెడ్డి ఆ వూరి మునసబు... నూట యాభై ఎకరాల భూస్వామి. మొదటి ప్రపంచ యుద్ధానికి పూర్వం ఆ గ్రామంలో చదవను, రాయను నేర్చింది కొండారెడ్డి ఒక్కరే. కె.వి.రెడ్డి ఆయనకు ఏకైక సంతానం. కె.వి.రెడ్డి తల్లిది తాడిపత్రి. వారిది కూడా సంపన్న కుటుంబమే. అందరూ విద్యావంతులే. కె.వి.రెడ్డి మాతామహుయుడు తాసిల్దారు వుద్యోగం చేశారు. కె.వి.రెడ్డి పుట్టింది తాడిపత్రిలో మాతామహుల ఇంటనే. ఆయనకు రెండేళ్ల వయసున్నప్పుడే తండ్రి కొండారెడ్డి కాలం చేశారు. దాంతో కె.వి.రెడ్డి, తల్లితో సహా తాడిపత్రిలోని మాతామహుల ఇంటికి వచ్చేశారు. ఆయన చదువు సంధ్యలు మేనమామ పర్యవేక్షణలో తాడిపత్రిలోనే జరిగాయి. భర్త మరణించడంతో తట్టుకోలేని కె.వి.రెడ్డి తల్లి వైరాగ్యం చెంది కుమారుని పెంపకం గురించి పట్టించుకోలేదు.
కె.వి.రెడ్డి బాల్యం ఆహ్లాదకరంగా సాగింది. మార్క్ ట్వేన్ పాత్ర టామ్ సాయర్‌లాగే ఈతకొట్టటం, చేపలు పట్టటం, కొండలెక్కటం, పోలాలమీదకు వెళ్లి అజమాయిషీ చెయ్యటం వంటి పనులు ఎంతో ఆసక్తికరంగా చేసేవారు. స్మశానానికి వెళ్లి ఎముకలు ఏరుకొనివచ్చి వాటిని పరిశోధించేవారు. స్కూలు ఫైనల్ వరకు కె.వి.రెడ్డి తాడిపత్రిలోనే చదివారు. నాలుగవ తరగతి మొదలు స్కూలు ఫైనల్ వరకు కె.వి.రెడ్డికి ఒక జిగరీ దోస్త్ ఉండేవాడు. ఇద్దరూ ఒకే బెంచిలో కూర్చోనేవారు. అతని పేరు మూలా నారాయణ స్వామి. ఇద్దరికీ చాలా పెద్ద పెద్ద పనులు చేయాలనే ఊహలు ఉండేవి. చిన్నతనం నుంచే అందుకోసం ప్రణాళికలు వేసుకుంటూ వుండేవారు. వారు చదువుకునే రోజుల్లో ఆ వూరికి బయస్కోప్ వచ్చింది. మిత్రులిద్దరూ సినిమాలు చూసేవారు. ఆ సినిమాల తీరు వారికి వింతగా తోచేది. ఎప్పటికైనా సినిమాలు నిర్మించాలని ధృడంగా ఆశించారు. పదిహేనేళ్ల వయసులోనే సినిమా నిర్మాణం కోసం లొకేషన్ కూడా నిర్ణయించేశారు. వారి వూరికి ఐదు మైళ్ల దూరంలో ఒక చిన్న కొండ, దాని ప్రక్కనే ఒక లోయ, ఆ లోయ మధ్యలో చిన్న నీటి ప్రవాహం ఉండేది. తమ స్నేహితులతో వీరిద్దరూ తరచూ అక్కడకు వెళ్లి వారి ఊహలకు రూపమిస్తూ, వాటిని స్నేహితులతో చర్చిస్తూ ఆనందిస్తూ వుండేవారు. ఎప్పటికైనా ఆ లొకేషన్‌లో సినిమా నిర్మించాలనేది వారి అభిలాష.
కె.వి.రెడ్డికి ప్రతి సబ్జెక్ట్‌లోనూ మొదటి మార్కులు వచ్చేవి. ఆ రోజుల్లోనే వీరిద్దరూ ఫుట్‌బాల్, హాకీ వంటి క్రీడల్లోనూ, పరుగు పందెం వంటి జిమ్నాస్టిక్స్‌లోను ముందుండేవారు. 1930లో కె.వి.రెడ్డి స్కూలు ఫైనల్ పరీక్షలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం (ప్రెసిడెన్సీ) మొత్తం మీద రెండవ స్థానంలో నిలిచారు. అయితే స్నేహితుడు నారాయణ స్వామి మాత్రం స్కూలు ఫైనల్ తప్పారు.
* మద్రాసుకు మకాం..
అనంతపురంలో కాలేజి ఉన్నా తను మాత్రం మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చదవాలని కోరడంతో వారి కుటుంబ సభ్యులు కె.వి.రెడ్డిని మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చేర్చారు. అప్పట్లో విక్టోరియా హాస్టల్‌లో కె.వి.రెడ్డి వుండేవారు. మద్రాసులో అడుగు పెట్టాక తరచూ సినిమాలు... ముఖ్యంగా ఇంగ్లీషు సినిమాలు చూడడం అలవాటయింది. అయితే ఆ సినిమాలను కేవలం వినోదం కోసం మాత్రమే చూసేవారు కాదు. భాషా జ్ఞానం పెంచుకోవడం కోసం, ఆ సినిమాల్లో మంచి విషయాలను గుర్తుపెట్టుకొని విశ్లేషించుకోవడం కోసం చూసేవారు. సినిమా వాల్ పోస్టర్లను కూడా నిశితంగా పరీక్షించి వాటి ప్రయోజనాన్ని ఆకళింపు చేసుకోనేవారు. అందువలన సినిమాల్లోకి రాకపూర్వమే కె.వి.రెడ్డికి చిత్రనిర్మాణం గుర్తించి, ప్రచార సాధనాల గురించి మంచి అవగాహన వుండేది. కె.వి.రెడ్డి 1935లో బి.ఎస్సీ (ఆనర్స్ ...అంటే ఎం.ఎస్సీకి సమానం) పూర్తి చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవి చేబట్టిన పట్టాభి రామారావు, ‘ఆంధ్ర మహిళా’ సంపాదకులు ఎ.వి.వి.కృష్ణారావు, ఎం.కె.వి.రెడ్డి వీరికి సహాధ్యాయులు. ప్రముఖ దర్శక నిర్మాత పి.పుల్లయ్య కాలేజిలో కె.వి.రెడ్డికి ఒక సంవత్సరం సీనియర్. కె.వి.రెడ్డి ఆనర్స్ డిగ్రీ పూర్తీ చేసేనాటికే పి.పుల్లయ్య సినిమా రంగంలో ప్రవేశించి స్టార్ కంబైన్స్ వారు నిర్మించిన ‘హరిశ్చంద్ర’ చిత్రానికి దర్శకుడు టి.ఎ.రామన్‌కు సహాయ దర్శకుడిగా పనిచేశారు. కె.వి.రెడ్డి రాత్రిపూట పుల్లయ్యతో కలిసి స్టార్ కంబైన్స్ లాడ్జిలో కూర్చొని సినిమాలకు పనికి వచ్చే కథల గురించి చర్చించుకునేవారు. వారు చర్చించుకున్న కథలన్నీ కాలక్రమంలో సినిమాలుగా రూపుదిద్దుకున్నాయి! ఆనర్స్ డిగ్రీ ప్రధమ శ్రేణిలో పాసైనా కె.వి.రెడ్డికి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఉద్యోగం చేయడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆఖరకు టీచర్ ఉద్యోగానికి దరఖాస్తు పెడితే బోధనానుభవం లేదని నిరాకరించారు. దాంతో కె.వి.రెడ్డి తన సహాధ్యాయి ఎ.వి.వి.రెడ్డితో కలిసి ‘ది స్టాండర్డ్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ కంపెనీ’ని ప్రారంభించారు. స్కూళ్లకు, కాలేజీలకు కావలసిన శాస్త్రోపకరణాలను ప్రామాణికంగా తయారుచేసి సరఫరా చేసేవారు. ఈ వ్యాపారం లాభసాటిగా మారింది.
* రోహిణీ ఫిలిమ్స్ నుంచి వాహిని సంస్థకు...
1937లో మూలా నారాయణ స్వామి కె.వి.రెడ్డికి తాడిపత్రి నుంచి కబురంపారు. తను రోహిణీ ఫిలిమ్స్ అనే సినిమా కంపెనీలో భాగస్తుడుగా చేరినట్లు, కె.వి.రెడ్డికి సినిమాల మీద ఆసక్తి వుంటే తనుకూడా అందులో చేరవచ్చని ఆ కబురు సారాంశం. కె.వి.రెడ్డి మిత్రుడు ఎ.వి.వి.రెడ్డితో ఈ విషయం మీద చర్చిస్తే ‘ఆరునెలలు వెళ్లి చూసి లాభాదాయకమనిపిస్తే సినిమా రంగంలో స్థిరపడు. లేకుంటే మన కంపెనీ ఉండనే వుంది కదా’ అని మంచి సలహా ఇచ్చాడు. ఆ సలహామీద కె.వి.రెడ్డి రోహిణీ ఫిలిమ్స్ సంస్థలో చేరారు. ఈ రోహిణీ సంస్థను హెచ్.ఎం.రెడ్డి స్థాపించగా అందులో నారాయణస్వామి తోబాటు బి.ఎన్.రెడ్డి, ఛాయాగ్రాహకుడు రామనాథ్, కళాదర్శకుడు శేఖర్, బ్రిజ్ మోహన్ దాస్, నాగిరెడ్డి, సముద్రాల రాఘవాచార్య భాగస్వాములు. ఈ బ్యానర్ మీద నాగయ్య హీరోగా ‘గృహలక్ష్మి’ సినిమా నిర్మించారు. అందులో కె.వి.రెడ్డి తొలుత క్యాషియర్. సైన్స్ విద్యార్థి కనుక సౌండ్ రికార్డింగ్ నేర్చుకోవాలనిపించినా, షూటింగులన్నిటికీ హాజరవుతూ నిర్మాణ కార్యకలాపాలని, ఎడిటింగ్, రీ-రికార్డింగ్‌తో సహా అన్ని ‘క్రాఫ్టు’లలోని విభాగాలను క్షుణ్ణంగా గమనిస్తూ అధ్యయనం చేయసాగారు. ఆ సినిమా విడుదలవుతుండగానే మూలా నారాయణ స్వామి రోహిణీ సంస్థ నుండి విడిపోయి బి.ఎన్.రెడ్డి, నాగిరెడ్డి, సముద్రాల, బ్రిజ్ మోహన్ దాసు, కె.వి.రెడ్డి, నాగయ్యలను కలుపుకొని వాహినీ సంస్థను స్థాపించారు. వాహినీ సంస్థ కె.వి.రెడ్డి పెరుగుదలకు ఆదర్శవంతమైన వాతావరణాన్ని కల్పించింది. సంస్థలో అందరూ విద్యావంతులే కావడం, బి.ఎన్. రెడ్డి అందరికన్నా పెద్దవాడు కావడంతో ఆయన నేతృత్వంలో పనిచేయడంతో వాహినీ సంస్థకు మంచి బీజం పడింది. వాహిని పిక్చర్స్ బ్యానర్ మీద బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన తొలిచిత్రం ‘వందేమాతరం’. ఇందులో కె.వి.రెడ్డి నాగయ్య సహాధ్యాయిగా నటించారు. తరువాత బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో నిర్మించిన ‘సుమంగళి’, ‘దేవత’ చిత్రాలకు కె.వి.రెడ్డి ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేశారు. అయినా ప్రొడక్షన్‌కు సంబంధించిన ప్రతి విషయంలోనూ కె.వి.రెడ్డి ఇమిడిపోయేవారు.. అంతే కాదు ఆ సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించారు కూడా.
* దర్శకుడుగా ‘భక్తపోతన’...
1941లో ‘దేవత’ చిత్ర నిర్మాణం పూర్తి, విడుదలయ్యాక మూలా నారాయణస్వామి ప్రోత్సాహంతో కె.వి. రెడ్డికి దర్శకత్వం నిర్వహించే అవకాశం దొరికింది. అందుకు తను ఎన్నుకున్న కథ ‘భక్తపోతన’. దర్శకత్వంలో ఏమాత్రం అనుభవం లేని కె.వి.రెడ్డిని దర్శకుడిగా నియమించడం పట్ల కొంత అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నారాయణస్వామి కల్పించుకొని ‘ఈ సినిమా ద్వారా లాభం వస్తే కంపెనీది. నష్టం వస్తే నాది’ అని గట్టిగా చెప్పి కె.వి.రెడ్డికి భరోసా కల్పించారు. ‘దేవత’ చిత్ర నిర్మాణం జరుగుతున్నప్పుడే కె.వి.రెడ్డి రాత్రిపూట సముద్రాలతో కూర్చొని పోతన గురించి చర్చలు జరిపేవారు. అలా ‘భక్త పోతన’ స్క్రిప్టు పనులు పూర్తిచేసిపెట్టుకున్నారు. అనుభవజ్ఞుడైన రామనాథ్ చేత స్కీన్ర్ ప్లే రాయించారు. కొందరు భాగస్వాములు పోతన పాత్రకు దైతా గోపాలం పేరును ప్రతిపాదించినా కె.వి.రెడ్డి మాత్రం నాగయ్యనే తీసుకున్నారు. ఈ సినిమా నిర్మాణ సమయంలోనే రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతోంది. జపాన్ వాళ్లు కోస్తా పట్టణాల మీద బాంబులు కురిపించారు. మద్రాసు మీద కూడా యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. దాంతో యూనిట్ మొత్తం మద్రాసు ఖాళీ చేసి వెళ్లాల్సి వచ్చింది. ‘భక్తపోతన’ సినిమా అప్పటికి మూడువంతులు పూర్తయింది. సినిమా నెగటివ్‌ను భద్రపరచడానికి తాడిపత్రికి పంపించారు. అసలు ఈ సినిమా పూర్తవుతుందని ఎవరికీ నమ్మకం లేదు. పరిస్థితులు కుదుటపడ్డాక మద్రాసు తిరిగివచ్చి మిగిలిన సన్నివేశాల చిత్రీకరణ, ప్యాచ్ వర్కులు, ట్రిక్ షాట్లు పూర్తిచేసి సినిమా విడుదలకు సిద్ధం చేశారు. సినిమా 1943 జనవరి 7న విడుదలై డంకాబజాయించింది. కోయంబత్తూరులో స్వర్ణోత్సవం జరుపుకుంది. పిఠాపురం రాజావారు ఈ చిత్రాన్ని చూసి ముగ్ధులై లక్షరూపాయల చెక్‌ను కె.వి.రెడ్డికి అందజేశారు. ఈ సినిమా ప్రభావం ఎలాంటిదంటే, ఒక కోర్టులో కేసు విచారణ జరుగుతుండగా హటాత్తుగా జడ్జిగారు లేచి ‘ఈ కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను. ఎందుకంటే నేను ‘భక్తపోతన’ చిత్రాన్ని చూడడానికి వెళ్ళాలి’ అన్నారట. ఈ సినిమా చూసిన వాళ్ళెవరూ ఇది కె.వి.రెడ్డి తొలిచిత్రమంటే నమ్మరు. అపారమైన కె.వి.రెడ్డి దర్శకత్వ ప్రతిభ ప్రతి ఫ్రేములోనూ కనబడుతుంది. ఈ సినిమా రాబడిలో పది శాతం వాటాగా మూలా నారాయణస్వామి కె.వి.రెడ్డికి ఇచ్చారు.
* తదుపతి చిత్రం ‘యోగి వేమన’ ...
‘భక్తపోతన’ విజయం మరో చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని కల్పించింది. ఆ చిత్రం ‘యోగి వేమన’ (1947). కె.వి. రెడ్డికి వేమనయోగి అంటే ఎంతో అభిమానం. ఈ చిత్రానికి చేసినంత కృషి కె.వి.రెడ్డి మరే చిత్రానికీ చేయలేదంటే నమ్మితీరాల్సిందే. అదే కె.వి.రెడ్డి మాటల్లో చెప్పాలంటే ‘ఈ కృషిలో నాకు సముద్రాల వలన కలిగిన సహాయం అంతులేనిది. నా లోపాలన్నిటినీ ఆయన కమ్మేశారు’. వేమన తత్త్వం గురించి, వేదాంతం గురించి సముద్రాలకు బాగా తెలుసు. అదీ కాకుండా సముద్రాల ఈ చిత్ర కథ కోసం రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, వేటూరి ప్రభాకరశాస్త్రి, మల్లంపల్లి సోమశేఖరశర్మ వంటి నిష్ణాతుల అభిప్రాయాలు సేకరించి వాటిని కథలో పొందుపరచారు. ‘కామికానివాడు కవి కాడు. కామిగాక మోక్షగామి కాడు. కామి అయినవాడు కవియగు, రవియగు’ అనే సూత్రాన్ని ‘యోగి వేమన’ చిత్రంలో చక్కగా పొందుపరచారు కె.వి.రెడ్డి. అనుభవాల బలం తప్ప సెంటిమెంట్ల బలహీనతలేని నాస్తికుడుగా వేమన పాత్రను రూపుదిద్దారు కె.వి.రెడ్డి. పసిపాప ‘జ్యోతి’ చనిపోతే, కాంత, కనకాల మధ్య కొట్టుమిట్టాట మానేసి విరాగిగా మారిన అంశాన్ని అద్భుతంగా చిత్రీకరించి సినిమాను సూపర్ హిట్ చేశారు. వేమనకు అతి గుప్తమైన ఆత్మవిద్యను భగవానుడు బోధించే సన్నివేశాన్ని, ఆ బోధన ఆధారంగా వేమారెడ్డి, యోగి వేమనగా పరిణామం చెంది చివరికి గుహలోనికి వెళ్ళిపోయే దృశ్యాన్ని కె.వి.రెడ్డి చిత్రీకరించిన విధానం నభూతో న భవిష్యతి అని చెప్పాలి. ఈ సన్నివేశ చిత్రీకరణలో యూనిట్ సభ్యులంతా కన్నీరుపెట్టుకున్నారు. దర్శకుడు ‘కట్’ చెప్పడం మర్చిపోయి నిశ్చేష్టులై నిలిచిపోయారని ఆ రోజుల్లో చెప్పుకునేవారు. దర్శక నిర్మాత వి.శాంతారాం ఈ చిత్రాన్ని చూసి కె.వి.రెడ్డి పనితీరును ఎంతగానో మెచ్చుకున్నారు. ‘యోగి వేమన’ చిత్రం న్యూటోన్ స్టూడియోలో నిర్మించారు. మేలురకం సినిమాలు తయారవ్వాలంటే అన్ని సౌకర్యాలతో కూడిన స్వంత స్టూడియో వుండాలనిపించి మూలా నారాయణ స్వామి వాహిని స్టూడియో నిర్మాణానికి నడుం బిగించారు. స్టూడియో నిర్మాణానికి అయ్యే ఖర్చును భరించేందుకు ముందుకు వచ్చారు. అప్పటికీ ఇండియాలో ఎక్కడాలేని ‘వెస్టెక్స్ర్ సౌండ్’ ఎక్విప్మెంట్ ఈ స్టూడియోలో అమర్చారు.
* వాహిని స్టూడియోలో ‘గుణసుందరి కథ’...
ఆ రోజుల్లో ‘బాలనాగమ్మ’, ‘గొల్లభామ’ వంటి జానపద చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరించడంతో కె.వి.రెడ్డికి అటువంటి జానపద చిత్రాన్ని నిర్మించాలనే సంకల్పం కలిగింది. అప్పటికి వాహినీ సంస్థ ఆరు సినిమాలు నిర్మించింది. ఆ సంస్థకు బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి ఒకరి తరువాత ఒకరు సినిమాలు చేయాలనేది ప్రత్యేక ఒడంబడిక. అయితే స్టూడియో నిర్మాణ పనుల్లో బి.ఎన్.రెడ్డి తలమునకలై ఉండడంతో కె.వి.రెడ్డికి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. ఆ చిత్రమే బాక్సాఫీస్ హిట్ అయిన ‘గుణసుందరి కథ’. వాహినీ సంస్థకు ఆస్థాన రచయిత వున్న సముద్రాల ఇతర చిత్రాల రచనలో బిజీగా ఉండడంతో కె.వి.రెడ్డి కమలాకర కామేశ్వరరావు సూచనతో పింగళి నాగేంద్రరావును రచయితగా తీసుకున్నారు. ‘కింగ్ లియర్’ నాటకం ఆధారంగా ‘గుణసుందరి కథ’కు రూపకల్పన జరిగింది. మూడు నెలల్లో స్క్రిప్టుతో సహా పాటలు కూడా తయారయ్యాయి. కె.వి.రెడ్డి, కమలాకర కలిసి స్కీన్ర్ ప్లే సిద్ధం చేశారు. కె.వి.రెడ్డి నిర్మాణ శైలే వేరు. స్క్రిప్టు సిద్ధం కాగానే ‘షాట్ డివిజన్’ చేసేవారు. అసిస్టెంట్ డైరెక్టర్లతో సీన్లు చదివించుకుంటూ స్టాప్ వాచీ పెట్టుకొని ఫుటేజ్ నోట్ తయారు చేసుకునేవారు. ఒక్కో సన్నివేశానికి ఎంత టైం పట్టేదో స్పష్టంగా నోట్ అయ్యేది. నటీనటుల వాచాకాన్ని బట్టి రెండు నిమిషాలు అటోయిటో జరిగేది. దాంతో ముడి ఫిలిం ఎంత అవసరమో తేలిపోయేది. కె.వి.రెడ్డి తీసిన సినిమాలు అన్నీ తన అంచనాకు మించి ముడిఫిలిం ఖర్చయిన దాఖలాలు లేవు. అందుకే కె.వి.రెడ్డిని ‘మిస్టర్ పర్ఫెక్షనిస్ట్’ అని ప్రశంసించేవారు. సినిమా షూటింగ్ వాహినీ స్టూడియో రెండు ఫ్లోర్లలో 1948 ఆగస్టు 13న ప్రారంభమైతే 1949 డిసెంబరు 29న సినిమాను విడుదల చేశారు. వినోదంతోబాటు సెంటిమెంటు కలగలిపిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చింది. క్లాసు, మాసు తేడా లేకుండా జనం విరగబడి చూశారు. జనం కోరికమీద రోజుకి నాలుగు ఆటలు వేశారు.
* జై...‘పాతాళ భైరవి’....
1949 ప్రాంతంలో వాహిని స్టూడియో యాజమాన్యంతోబాటు, ఆబ్కారీ వ్యాపారం మరికొన్ని ఇతర సంస్థలు వున్న మూలా నారాయణస్వామి మీద ఆదాయపు పన్నుశాఖ రెయిడ్ చేసి ముప్పై లక్షల అపరాధ పన్ను వసూలు చేసేందుకు ఆస్తులు జప్తుచేసింది. వాహిని స్టూడియోను కాపాడాలని నారాయణస్వామి అప్పటికప్పుడు స్టూడియోని విజయా ప్రొడక్షన్స్ పేరిట లీజుకు ఇచ్చినట్లు రాశారు. తరువాత నారాయణస్వామి ఆర్ధిక పరిస్థితి క్షీణించి కాలంచేశారు. ఈ పరిస్థితుల మధ్య విజయా ప్రొడక్షన్స్ సంస్థను నాగిరెడ్డి, చక్రపాణి నిలబెట్టి ‘షావుకారు’ చిత్రాన్ని నిర్మించారు. చిత్రం విజయం సాధించకపోవడంతో కె.వి.రెడ్డిని ఒక జానపద చిత్రాన్ని నిర్మించవలసిందిగా కోరారు. అరేబియన్ నైట్స్ కథలను దృష్టిలో వుంచుకొని కె.వి.రెడ్డి పింగళితో ‘పాతాళ భైరవి’ కథను తయారు చేయించారు. కమలాకర, పింగళితో కలిసి స్క్రిప్టు, స్కీన్ర్ ప్లే సిద్ధం చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించారు. ఇందులో పాతాళభైరవిని ప్రసన్నం చేసుకోవడానికి మాంత్రికుడు చదివే మంత్రాల కోసం మంత్రపుష్పంలోని వేదమంత్రాలను తిరగరాయించి విచిత్రమైన భాషగా రంగారావు చేత పలికించారు. అలాగే పద్మనాభం చేత పలికించిన ‘మోసం గురూ’ అనే మాట తరువాతి కాలంలో ‘గురూ’ అనే మాటతో వూతపదమై కూర్చుంది. మాంత్రికుడు పలికే ‘సాహశం శాయరా....రాజకుమారి లభిస్తుందిరా’, ‘నరుడా ఏమి నీ కోరిక’, ‘ఏ డింబకా... ఏ బుల్ బుల్, ఏ డింగరీ’ వంటి మాటలు అందరి నోళ్లలో నానాయి. కేవలం 13 ప్రింట్లతో విడుదలైన ఈ చిత్రం 10 కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది. నాలుగు కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకుంది. బెంగుళూరు మినర్వాలో 30 వారాలు, గోల్డన్ గ్లోరీ థియేటర్‌లో 50 వారాలు ఆది రికార్డు సృష్టించింది. తరువాత 11 వారాలకు అరవై ప్రింట్లు వేసి ఆంధ్రదేశమంతా సినిమాను పంపిణీ చేశారు. ఈ సినిమాకు వచ్చిన లాభాలతో వాహినీలో ఇంకొక ఫ్లోరు నిర్మాణం చేశారు. సినిమా అఖండ విజయం సాధించిన విషయం విదితమే. ఈ చిత్రం భారతీయ తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శనకు నోచుకుంది. వాహినీ సంస్థ అధిపతి బి.ఎన్.రెడ్డి ‘మల్లీశ్వరి’ చిత్ర నిర్మాణంలో బిజీగా వుండగా తదుపరి వాహినీ వారి చిత్రాన్ని నిర్మించే బాధ్యత కె.వి.రెడ్డి మీద పడింది. ‘పాతాళభైరవి’ తరువాత మరలా మరో జానపదం తీయకుండా ఈసారి కె.వి.రెడ్డి సాంఘిక చిత్ర నిర్మాణానికి పూనుకున్నారు. ఆ చిత్రమే ‘పెద్దమనుషులు’(1954). ఈ చిత్రానికి కూడా పింగళి రచన చేయాల్సివుండగా, నాగిరెడ్డి సహకరించకపోవడంతో డి.వి. నరసరాజును రచయితగా తీసుకున్నారు. స్క్రిప్టు తయారయ్యాక నరసరాజు, కె.వి.రెడ్డిలతోబాటు డి.జి.బి.తిలక్ (డి.వి. సుబ్బారావు కుమారుడు) కలిసి స్క్రీన్ ప్లే సమకూర్చారు. నరసరాజు సంభాషణలు సహజంగాను, పాత్రోచితంగాను ఉండడంతో ప్రేక్షకులకు చిత్రం బాగా నచ్చింది. ఇందులో ప్రధాన పాత్రధారి అయిన మునిసిపల్ చైర్మన్ పాత్రకు జంధ్యాల గౌరీనాథ శాస్త్రిని తీసుకున్నారు. కీలకమైన తిక్క శంకరయ్య పాత్రలో రేలంగి లీనమై నటించారు. కొంత సినిమా రేవతి స్టూడియోలో చిత్రీకరించారు. గ్రూప్ విలనిజానికి ఈ సినిమా బీజం నాటింది. ‘శివశివమూర్తివి గణనాధా నీవు శివుని కుమారుడవు గణనాధా’, ‘నందామయా గురుడ నందామయా’ పాటలు తెలియనివారెవరూ వుండరు. ఈ పాటలతో కొసరాజు రాఘవయ్య చౌదరి మంచి పేరుతెచ్చుకున్నారు. సమాజంలోని సమస్యల నేపథ్యంలో, వ్యంగ్య ధోరణిలో కె.వి.రెడ్డి రూపొందించిన ‘పెద్దమనుషులు’ సాంఘిక చిత్రాల విభాగంలో అజరామరంగా నిలిచిపోయింది. ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో ద్వితీయ ఉత్తమ చిత్ర బహుమతి లభించింది. కేంద్ర ప్రభుత్వ బహుమతి పొందిన తొలి తెలుగుచిత్రమిదే. కె.వి.రెడ్డికి ఇబ్సెన్ రాసిన నాటకాలంటే ఇష్టమే కాదు, ఇబ్సెన్ కె.వి.రెడ్డికి ఆరాధ్య దైవం. ఇబ్సెన్ నాటక పోకడలు ‘పెద్దమనుషులు’ చిత్రంలో అక్కడక్కడా కనిపిస్తాయి.
* అన్నపూర్ణలో కె.వి.రాముడు...
తెలుగు సినిమాకు స్వర్ణయుగం తీసుకువచ్చిన సంస్థల్లో అన్నపూర్ణా సంస్థ పెరెన్నికగలది. అక్కినేని నాగేశ్వరరావు, దుక్కిపాటి మధుసూదనరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు, కొరటాల ప్రకాశరావు, టి.ఎ.వి.సూర్యారావు భాగస్వాములుగా ఏర్పడి దుక్కిపాటి సవతి తల్లి పేరిట ‘అన్నపూర్ణా పిక్చర్స్’ సంస్థను ఏర్పాటు చేశారు. తొలి చిత్రానికి భరణీ రామకృష్ణరావును దర్శకుడిగా నియమిస్తే వ్యక్తిగత ఇబ్బందులవలన ఆయన తప్పుకున్నారు. తరువాత బి.ఎన్.రెడ్డిని సంప్రదిస్తే లక్షరూపాయల పారితోషికం అడిగారు. పుల్లయ్య ‘అర్ధాంగి’ సినిమాతో బిజీగా వుండడం వలన చేతులెత్తేశారు. తలవని తలంపుగా వాహినీ సంస్థతో తలెత్తిన మనస్పర్థల వలన దర్శకుడు కె.వి.రెడ్డి బయటకు వచ్చేశారు. అప్పుడు అక్కినేని, దుక్కిపాటి ఇద్దరూ వెళ్లి కె.వి.రెడ్డిని కలిశారు. ఆ సమయంలోనే కె.వి.రెడ్డి నిర్మాత, దర్శకుడుగా వాహినీ బ్యానర్ మీద ‘పెద్దమనుషులు’ చిత్ర నిర్మాణంలో బిజీగా వుండడంతో ఆ సినిమా నిర్మాణం పూర్తయ్యాకే అన్నపూర్ణావారి సినిమా చేస్తానని అన్నారు. అంతటి గొప్ప దర్శకునితో సినిమాతీస్తే అన్నపూర్ణా బ్యానర్‌కు మంచి గుర్తింపు వస్తుందని భావించి కొంతకాలం ఆగేందుకు వారు సమ్మతించారు. ఆ నిరీక్షణ చివరికి ‘పెద్దమనుషులు’ (1954) విడుదలయ్యేదాకా, రెండు సంవత్సరాల పాటు కొనసాగింది. అయితే ఆ శ్రమ వృధా పోలేదు. అన్నపూర్ణా పతాకం నలభై యేళ్లదాకా అప్రతిహతంగా కొనసాగింది. ‘పెద్దమనుషులు’ సినిమాకు తొలి రచన చేసిన డి.వి.నరసరాజు కె.వి.రెడ్డి సలహాపై ‘దొంగరాముడు’ సినిమాకు మలిరచన చేశారు. షూటింగు ప్రారంభించే ముందు నరసరాజు స్క్రిప్టు చదువుతూవుంటే కె.వి.రెడ్డి టైం నోట్ చేయించి, ప్రతి షాట్‌కు ముడిఫిలిం ఎంత ఖర్చవుతుందో లెక్క వేసి, మొత్తం ఫిలిం నిడివి 17 వేలుగా తేల్చారు. సినిమా పూర్తయ్యేసరికి నిడివి మొత్తం 17,250 అడుగులు వచ్చింది. 70 కాల్షీట్లలో సినిమా పూర్తయింది. కాల్షీట్ అనుకున్న సమయానికన్నా పావుగంట ముందుగానే పూర్తయ్యేది. అంత ఖచ్చితమైన ప్రణాళికతో కె.వి.రెడ్డి ఈ సినిమా తీశారు. అందుకే పుణే ఫిలిం కళాశాలలో ‘దొంగరాముడు’ సినిమా ఇప్పటికీ ఫిలిం మేకింగ్ సిలబస్‌గా కొనసాగుతోంది. ‘సినిమాలో నవరసాలు వున్నాయి. మంచి హిట్ అవుతుంది. నా అంచనా తప్పితే నేను చిత్రరంగం నుండి విరమిస్తాను’ అని కె.వి.రెడ్డి అన్నపూర్ణా భాగస్వాములకు భరోసా ఇవ్వడం ఆయన ప్రతిభకు నిదర్శనం. భానుమతిని హీరోయిన్‌గా తీసుకుంటే బాగుంటుందని దుక్కిపాటి భావించినా కె.వి.రెడ్డి సావిత్రి వైపే మొగ్గుచూపారు. ‘దొంగరాముడు’ సినిమాకు కె.వి.రెడ్డి తీసుకున్న పారితోషికం యాభై వేలు. 1955 అక్టోబరు 2 గాంధి జయంతినాడు సినిమా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. నాటకీయత లేకుండా సహజసిద్ధమైన సన్నివేశాలు ఈ తరం ప్రేక్షకులను కూడా అలరిస్తూనే వున్నాయి.
* హై... హై... కె.వి. రెడ్డి...
‘పాతాళభైరవి’ తరువాత కె.వి.రెడ్డి విజయా వారి తదుపరి చిత్రానికి సినిమా చేయాల్సివున్నా, అన్నపూర్ణావారి ‘దొంగరాముడు’ సినిమాకు పనిచేయాల్సి రావడంతో వీలుపడ లేదు. 1955లో ‘దొంగరాముడు’ సినిమా విడుదలయ్యాక కె.వి.రెడ్డి ‘మాయాబజార్’ (1957) నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సంవత్సరం పాటు శ్రమించి స్క్రిప్టు పని పూర్తిచేశారు. ఈ సినిమా మీద నమ్మకం లేక పోవడం, అంతకుముందు భారీ ఎత్తున కమలాకర దర్శకత్వంలో నిర్మించిన ‘చంద్రహారం’ సినిమా పరాజయం పాలవడంతో నిర్మాతలు నాగిరెడ్డి-చక్రపాణి చిత్ర నిర్మాణాన్ని వాయిదావేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎ.వి.ఎం అధిపతి మెయ్యప్పచెట్టి మాయాబజార్ సినిమా తీసేందుకు ముందుకు వచ్చి కె.వి.రెడ్డి ఎంత పారితోషికం అడిగితే అంత ఇస్తానని కబురంపారు. అంతేకాదు సుందర్లాల్ నహతాతోబాటు మరో ఇద్దరు తమిళ నిర్మాతలు కూడా కె.వి.రెడ్డికి ఇదే ప్రతిపాదనను చేరవేశారు. కె.వి.రెడ్డి మాత్రం విజయా వారికి తప్ప వేరేవారికి తీయనని చెప్పడంతో, నాగిరెడ్డి-చక్రపాణి పునరాలోచనలో పడ్డారు. సినిమా బడ్జట్‌ను కె.వి.కి అప్పగించి నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. తెలుగుతోబాటు తమిళంలో కూడా ఈ చిత్రాన్ని ఏకకాలంలో నిర్మించాలనే నిర్ణయం జరిగింది. సినిమా స్క్రిప్టు రాసుకుంటున్నప్పుడే ఏయే పాత్రలకు ఎవరెవరిని ఎంపిక చేయాలి అనే విషయాన్ని ముందుగానే కె.వి.రెడ్డి నిర్ణయించేశారు. ఆ రోజుల్లో కృష్ణుడు అంటే కల్యాణం రఘురామయ్యే అనుకునేవారు. అయితే కృష్ణుడి పాత్రకు ఎన్.టి.రామారావును తీసుకొని, కళాదర్శకులు మాధవపెద్ది గోఖలే, కళాధర్‌లతో రకరకాల స్కెచ్‌లు గీయించి నిండుకిరీటం పెట్టించి, మేకప్ మెన్ పీతాంబరం, భక్తవత్సలం చేత ఆహార్యం మెరుగు పరచి, నడక, వాచకంలో మార్పులుచేసి ‘కృష్ణుడంటే ఇలా వుండేవాడా’ అనేలా తీర్చిదిద్దారు. ఇక హీరో ఘటోత్కచుడి పాత్రకు ఎస్.వి.రంగారావును తీసుకున్నారు. ఘటోత్కచుడుగా తదాత్మ్యంతో రంగారావు అసమాన అభినయాన్ని ప్రదర్శించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. పింగళి అనేక కొత్త మాటల్ని ఈ చిత్రం ద్వారా వెలుగులోకి తెచ్చారు. భారతీయ సినిమా స్వర్ణోత్సవం సందర్భంగా 2013లో సిఎన్‌ఎన్ ఐబిఎన్ సంస్థ నిర్వహించిన సర్వేలో వంద ఆల్ టైం గ్రేట్ భారతీయ సినిమాలలో మాయాబజార్ సినిమా ప్రధమ స్థానంలో నిలిచింది. 26 లక్షల వ్యయంతో నిర్మించిన మాయాబజార్ 27 కేంద్రాల్లో శతదినోత్సవం, నాలుగు కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకుంది.
* ముగింపు...
‘మాయా బజార్’ తరువాత ‘పెళ్లినాటి ప్రమాణాలు’, ‘జగదేకవీరుని కథ’ చిత్రాలకు కె.వి.రెడ్డి దర్శకత్వం వహించారు. సొంత బ్యానర్ ‘జయంతి పిక్చర్స్’ బ్యానర్ మీద ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ (1961) నిర్మించారు. అక్కినేని, నందమూరి నటించిన ఈ చిత్రం ‘జగదేకవీరుని కథ’ సినిమాతో సమానంగా విజయం సాధించింది. అయితే తరువాత కె.వి.రెడ్డి విజయా సంస్థకు దర్శకత్వం వహించిన ‘సత్య హరిశ్చంద్ర’, ‘ఉమా చండీ గౌరీ శంకరుల కథ’ విజయవంతం కాలేదు. ఎన్.టి.రామారావు సంస్థ కోసం దర్శకత్వం వహించిన ‘శ్రీకృష్ణ సత్య’ సుమారుగా ఆడింది. సొంత బ్యానర్ మీద నిర్మించిన ‘భాగ్యచక్రం’ కూడా సరిగా ఆడలేదు. కె.వి.రెడ్డి మూడు దశాబ్దాల కాలంలో దర్శకత్వం వహించిన చిత్రాలు కేవలం 14 మాత్రమే. అయినా అవి వేటికవే అజరామరాలు. కె.వి.రెడ్డి భార్య శేషమ్మ. వారిది అన్యోన్యమైన దాంపత్యం. భార్య తల దువ్వనిదే కె.వి.రెడ్డి అడుగు బయటకు పెట్టేవారు కాదు. వారికి తొమ్మండుగురు సంతానం. వారిలో ఎవరినీ సినిమా నిర్మాణపు గడప తొక్కనీయలేదు. పిల్లలు క్రమశిక్షణతో పెరిగి ప్రయోజకులయ్యారు. కె.వి.రెడ్డి అంటే తెలుగు చలచిత్ర చరిత్రలో చెరిగిపోని మచ్చలేని సుగంధ కుసుమం.
💐💐💐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి