తృప్తి (ఓ మంచి కాఫీ లాంటి కథ)
(వాట్ అప్ సేకరణ....అసలు రచయిత ఎవరో తెలియదు.)
కళ్యాణ మండపం ముందు క్యాబ్ ఆగింది.
నేను, మా ఆవిడ క్యాబ్ దిగి లోపలకు వెళ్ళగానే
"అక్కా! బాగున్నావా? అంటూ ఒకావిడ ఆప్యాయంగా పలుకరిస్తూ, దగ్గరకు వచ్చి నా శ్రీమతి చేయి పట్టుకుని బంధువుల దగ్గరకు తీసుకుని వెళ్ళింది. ఇక చూడాలి ఆ ఆత్మీయ పలుకరింపుల జడివాన.
"ఏం వదినా! బాగున్నావా?" ,
" ఏం పిన్నీ! ఇంత ఆలస్యంగా వచ్చావేం? "
"అవునే అమ్మాయి! ఇల్లా చిక్కిపోయావేమిటే?"
"అత్తా! నువ్వు వస్తే గానీ సందడి రాలేదు "
అలా రక రకాల పలుకరింపులకు ఆనందంగా నవ్వుతూ నా శ్రీమతి
" నేను బాగానే వున్నాను. మీరందరూ బావున్నారా?" అని అప్పుడు నా గురించి వెనుకకు తిరిగి చూసింది.
నేను మా ఆవిడ వున్న వైపు అడుగులు వేసాను. అడపా దడపా, నేను కూడా నా శ్రీమతి తో ఫంక్షన్లకు వెళ్ళడం వల్ల నేను అక్కడ వున్న చాలా మందికి పరిచయస్తుడనే.
అక్కడ ఒక కుర్చీలో సెటిల్ అయిపోయి తెలిసిన వాళ్ళను పలుకరించడం మొదలుపెట్టాను.
మా ఆవిడ చలాకీగా తిరుగుతూ, సంతోషంగా నవ్వుతూ, అందరినీ పలుకరిస్తూ, వారి వారి కష్ట సుఖాలు అడిగి మరీ తెలుసుకోసాగింది.
"అత్తా! ఏమిటి చాలా పాడైపోయావు? కిందటి సారి నిన్ను చూసినప్పుడు బాగానే వున్నావు" అని మా ఆవిడ పలుకరింపు విని అటు వైపు నా దృష్టి సారించాను. ఒక ముసలావిడ బాగా చిక్కిపోయి వుంది.
ఆ ముసలావిడ రాని నవ్వును ముఖం మీదకు తెచ్చుకునే వ్యర్థ ప్రయత్నం చేస్తూ " వయసు అయిపోయింది కదే " అని నెమ్మదిగా అంది.
"ఎప్పుడూ చలాకీగా వుండే నీ లాంటి వారిపై వయసు ప్రభావం వుంటుందంటే నేను నమ్మను" అని నా శ్రీమతి నవ్వింది.
ఇంతలో పెళ్లి బాజాలు మ్రోగటంతో అందరూ అక్షింతలు పట్టుకుని స్టేజ్ దగ్గరకు వెళ్ళడం మొదలుపెట్టారు.
"అక్కా! క్రిందటి వేసవి సెలవులకు మీ ఇంటికి మా అమ్మాయి వచ్చినప్పుడు ఏం చెప్పావొ, ఏమిటో, అంతవరకూ పెళ్లి అంటే విముఖత చూపిన అది ఇప్పుడు పెళ్లికి సుముఖంగా వుంది. అంతే కాదు దాని ప్రవర్తనలో కూడా చాలా మార్పు కనిపించింది. కోపం, తొందరపాటు తనం బాగా తగ్గించుకుంది. ఇప్పుడు దానికి సంబంధం కుదిరింది" అని ఆనందంగా చెప్పింది పెళ్ళిలో మొదట పలుకరించిన ఆవిడ.
"చాలా మంచి కబురు చెప్పావ్!" అంటూ ఆవిడ భుజం మీద ఆప్యాయంగా తట్టింది నా శ్రీమతి.
"పిన్నీ! మా రెండో అబ్బాయి సరిగ్గా చదవడం లేదు. ఈ సంవత్సరం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఎలా రాస్తాడో ఏమిటో?" బాధ వెళ్ళగక్కుకుంది మరొకావిడ.
"ఏం భయపడకు. నీకు ఏ మాత్రం అనుమానం వున్నా, పరీక్షలకు నెల రోజుల ముందు అబ్బాయిని మా ఇంటికి పంపించేయ్. బాబాయ్ గారు కూడా తీరికగానే వున్నారు" అని భరోసా ఇచ్చింది నా శ్రీమతి.
దాంతో ఆవిడ ముఖం వికసించి, "థాంక్స్" చెప్పింది.
అందుకే అందరూ నా శ్రీమతిని బాగా ఇష్టపడతారు. తన దగ్గర ఏముంది, ఏం చేయగలదు అని ఎప్పుడూ ఆలోచించదు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు ధైర్యం చెప్పి తర్వాత తాను చేయగలిగిన సహాయం చేస్తుంది.
పెళ్లి అయిపోయిన తర్వాత మధ్యాహ్న భోజనాల దగ్గర నా శ్రీమతి, తన అత్తయ్య కష్టాలలో వున్నట్లు తెలుసుకుంది. వున్న ఒక్క కొడుకూ ఆవిడ పెన్షన్ డబ్బులు తీసుకుంటూ సరిగ్గా చూడటం లేదని బంధువులు చెప్పగా వింది.
భోజనాలు అయ్యాక నా శ్రీమతి "రండి. ఒకసారి మా అత్తయ్య ను పలుకరిద్దాం" అని పిలిచింది.
"సరే, పదా" అని తనను అనుసరించాను.
"బాగున్నారా పిన్నీ గారూ?" అని ఆవిడను పలుకరించేను.
"దేవుడి దయ వల్ల బాగానే వున్నాను బాబూ" అని సమాధానమిచ్చింది.
నా శ్రీమతి, వాళ్ళ అత్త దగ్గరకు వెళ్ళి, ఆమె చేతులను ఆప్యాయంగా అందుకుని
"అత్తా! నాకు ఒక సాయం చేయగలవా? రిటైర్ అయిన తర్వాత మీ అబ్బాయి గారికి జిహ్వ చాపల్యం పెరిగి రోజుకొక రకం వంట చేయమని నన్ను తినేస్తున్నారు. ఇంత కాలం ఈయన గారికీ, పిల్లలకూ కారేజ్ లు కట్టీ కట్టి అలసిపోయాను. ఇప్పుడు పిల్లలు ఉద్యోగరీత్యా వేరే చోట వుండడం వల్ల, ఈయనగారు రిటైర్ అవడం వల్ల కొంత వూపిరి తీసుకో గలుగుతున్నాను. ఇప్పుడు కూడా నన్ను సుఖపడనీయక ఏవేవో పిండివంటలు చేయమని కోరుతున్నారు. నాకేమో నడుము నొప్పి కూడా వచ్చింది. పనిమనిషి వున్నా కూడా ఇల్లు చక్కదిద్దుకోలేకపోతున్నాను. ఇలాంటప్పుడు ఎవరైనా 'నా వారు' అనే వారు పక్కన సాయంగా వుంటే బాగుంటుంది అని అనిపిస్తోంది. ఒక నెల రోజులు మా ఇంటికి వచ్చి నాకు సాయంగా ఉండకూడదూ" అని అర్థించింది.
నా మీద అంత అభాండం వేసేసరికి నేను ఖంగుతిన్నాను.
"నేనెప్పుడు నిన్ను అది చెయ్యమని, ఇది చెయ్యమని వేధించాను?" అని ఆశ్చర్యంతో ప్రశ్నించాను.
"చూసావా అత్తయ్యా! ఇంటి విషయాలు బయటకు చెబితే ఈయనగారికి నచ్చదు." అని టపీమని జవాబిచ్చింది నా శ్రీమతి.
మా ఆవిడ సమయస్ఫూర్తి కి మరొక్కసారి ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది.
"పోనీ ఒక వంట మనిషిని పెట్టుకోలేకపోయావా?" ప్రశ్నించింది ఆవిడ.
"ఆ ముచ్చటా తీరిపోయింది. వంట మనిషిని పెట్టుకున్నాము. ఆవిడ ఏ రోజూ సమయానికి రాలేదు కదా, రాని రోజు కనీసం రాలేనని ఫోన్ కూడా చేయదు. ఏ రోజు వస్తుందో, రాదో తెలియక ఆవిడ కోసం చూసి, చూసి, సమయం వృధా చేసుకుని, తర్వాత వంట పని చేసుకోవాలంటే చిరాకు వచ్చేది. పైగా మన లాగ పద్ధతిగా పని చేయరు. ఎన్ని సార్లు వాళ్లకు పని చేసే పద్దతి నేర్పినా కూడా వాళ్ళ పద్దతి లోనే వాళ్ళు పనిచేస్తారు. స్టౌ మంట ఎక్కువ పెట్టీ, గిన్నెలు మాడ్చేసి, స్టౌ చుట్టూ పథార్థాలు జల్లేసి, వంట సామాన్లు ఎక్కువగా వృధా చేసి కాల్చుకుని తినేసేది అనుకో" అని తన గోడును వెలిబుచ్చింది.
"మా ఇంటిలో ఇన్ని సీన్లుఊఋ జరిగాయా!" అని ఆశ్చర్య పోవటం నా వంతైంది. అబద్ధాలంటే అసహ్యించుకునే మా ఆవిడ అతి సులభంగా ఇన్ని అబద్ధాలు ఆడిందంటే దానికి తిరుగులేని కారణమేదొ తప్పకుండా వుండే వుంటుంది అని అనుకున్నాను..
"అయ్యో! అలా జరిగిందా? నేను వచ్చినా నీకు సుఖం వుండదే. నా బరువు కూడా నువ్వే మొయ్యాలి. ఆరోగ్యం బాగుంటే నెల రోజులు ఏమిటే? ఒక సంవత్సరం పాటు వచ్చి వుండేదాన్ని" అని బలహీనంగా చెప్పింది ఆవిడ.
" నీ అనుమానాలన్నీ పక్కన పెట్టు. మీ అబ్బాయి, కోడలితో మేము మాట్లాడతాం. నువ్వు మాతో వచ్చేసేయి" అని బలవంతంగా ఆవిడను వొప్పించింది నా శ్రీమతి.
తర్వాత, ఎవరూ పక్కన లేని సమయం చూసి నా శ్రీమతి "అత్తయ్య చాలా ఆత్మాభిమానం గల మనిషి. ప్రస్తుతం ఆవిడ కొన్ని కష్టాలకు గురై అనారోగ్యం పాలైంది. ఆవిడను ఒక నెల రోజులు పాటు మనింట్లో పెట్టుకుని ఆవిడ ఆరోగ్యం బాగయ్యాక పంపిద్దామని అనుకుంటున్నాను. మనమేమాత్రం జాలితో ఆవిడను పిలిచామని అనిపించినా ఆవిడ రాదు. అందుకే ఇంత నాటకం ఆడవలసి వచ్చింది" అని గుట్టు విప్పింది.
మొత్తం మీద ముగ్గురము మా ఇంటికి వెళ్లిపోయాము.
"ఏంటీ! ఇవ్వాళ, పులిహోర, పాయసం కావాలా? రేపు దద్దోజనం, చక్ర పొంగలి చేయాలా? చాలా బాగుంది మీ కోరికల లిస్ట్" అని వంట గదిలోనుండి మా ఆవిడ అరుపులు విని నవ్వుకున్నాను. ప్రతి రోజూ నా పేరు చెప్పి "అత్తా! ఇవ్వాళ మీ అబ్బాయి గారు ఇది చేయమంటున్నారు, రేపు అది చేయాలంటున్నారు" అని రోజుకొక రకం పిండివంట చేసి ఆవిడతో ఆప్యాయంగా తినిపించేది నా శ్రీమతి. మొదటి రోజు ఆవిడ చాలా సిగ్గుపడి సరిగ్గా తినకపోతే, నా శ్రీమతి బలవంతంగా ఆవిడతో తినిపించింది.
"అత్తా! నువ్వు పక్కన నిలబడితే చాలు. నాకు చాలా ధైర్యంగా వుంటుంది. ఏ పనైనా చేసెయ్యగలను" అని అంటే ఆవిడ "ఇప్పుడు నేను నిలబడటం తప్పితే ఏం చేస్తున్నానే" అంటూ సిగ్గు పడింది.
"మీ అబ్బాయి గురకతో నాకు అస్సలు నిద్ర పట్టటం లేదు బాబూ" అని ప్రతి రాత్రి ఆవిడతో నే పక్క గదిలో పడుకుని పాత విషయాలు అన్నీ గుర్తుకు తెచ్చి ఆవిడను సంతోషంలో తేలేటట్లు చేసేది.
వేళకు తిన్న తిండి కంటే,
ఈ నెల రోజులలో నా శ్రీమతి చూపెట్టిన ఆప్యాయతకు, అనురాగానికి, ఆ ముసలావిడ ఆరోగ్యం చాలా, చాలా మెరుగైంది. ఆవిడే స్వయంగా నా శ్రీమతి తో
" మా అబ్బాయిని ఇక రమ్మనవే. ఇంటికి వెళతాను" అని చెప్పింది.
నా శ్రీమతి వొప్పుకోకుండా ఇంకో రెండు వారాలైనా కనీసం వుండాలని బలవంతం చేసింది.
అప్పుడు ఆవిడ చెమర్చిన కళ్లతో " ఒసేయ్! దేవుడు నీకు ఎంత మంచి మనసును ఇచ్ఛాడే. ఇక్కడకు వచ్చిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు నువ్వు నాకు సాయం చేయడానికే తీసుకొచ్చావు అని. నడుం నొప్పి వంకతో నన్ను తీసుకువచ్చి, మొత్తం పనంతా నువ్వే చేసుకున్నావు. మీ ఆయన పేరు చెప్పి రక రకాల రుచికరమైన వంటలు చేసి నాతో తినిపించావు. మీ ఆయన గురక పెడతాడు అని అబద్దం చెప్పి రాత్రిళ్ళు నా పక్కనే పడుకుని, తియ్యటి పాత జ్ఞాపకాలను గుర్తు చేసి నాలో తిరిగి వుత్సహాన్ని నింపావు.
కొన వూపిరితో వున్న నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించేవు. వచ్చే జన్మలో నైనా నీ ఋణం తీర్చుకునే భాగ్యం ఆ దేవుడు నాకు కలిగించాలని ప్రార్థిస్తున్నాను" అని చేతులు రెండూ జోడించింది.
"తప్పు అత్తా! నీ లాంటి వారు నాకు దణ్ణం పెట్టకూడదు. ఆశీర్వదిస్తే చాలు" అని ఆప్యాయంగా కౌగలించుకుంది నా శ్రీమతి.
"పది కాలాల పాటు మీ కుటుంబం మొత్తం చల్లగా వుండాలి. మీరు చల్లగా వుంటే పది కుటుంబాలని మీరు చల్లగా వుండేటట్లు చేయగలరు" అని ఆప్యాయంగా ఆవిడ మమ్మల్ని దీవించింది.
ఈ దృశ్యం చూస్తున్న నాకు కూడా కళ్ళు చెమర్చాయి.
మా ఆవిడ ఫోన్ చేసి వాళ్ళ అబ్బాయిని పిలిపించింది. తల్లి లోని వుత్సాహం, ఆనందం చూసి అతను ఆశ్చర్య పోయాడు. కుశల ప్రశ్నలు అయిన తర్వాత, వాళ్ళఫ అత్తయ్యను వంట గదిలోకి పని మీద పంపి, నా శ్రీమతి ఆ అబ్బాయితో " నిన్ను ఎంత ముద్దు, మురిపెంగా మీ అమ్మ పెంచిందో నాకు తెలుసు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆవిడకు పెన్షన్ కూడా వస్తుంది. అటువంటప్పుడు మీ అమ్మను నువ్వెంత బాగా చూసుకోవాలి? మనిషి బ్రతికి వున్నప్పుడే చేయగలిగింది చేయాలి. మనిషి బ్రతికి ఉన్నప్పుడు పట్టించుకోకుండా తర్వాత వాళ్లకు గుడి కట్టినా ప్రయోజనం లేదు. నీ చదువు నీకు సంస్కారం నేర్పలేదా? ఇంకోసారి మీ అమ్మని బాధ పెట్టేవని నాకు తెలిస్తే నేను వూరుకోను. ఈ వయసు వాళ్లకు ప్రేమ, అభిమానాలు పుష్కలంగా కావాలి. ఇకనైనా ఆవిడను జాగ్రత్తగా చూసుకో" అని మెత్తగా చివాట్లు వేసింది.
"అమ్మకూ, నా భార్యకు, తేడాలు వచ్చి ఇలా జరిగింది. ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగనీయను" అని సిగ్గుతో తల దించుకున్నాడు అతను.
మంచి పని చేశామన్న తృప్తి మా ఇద్దరికీ కలిగింది.
🙏🙏🙏శుభోదయం🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి