2, జులై 2021, శుక్రవారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*ఇచ్చా మరణం..కపాలమోక్షం..*


1976 మే నెల ఆరవ తేదీనాడు ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల మధ్య, మొగలిచెర్ల గ్రామస్థుడు ఎఱుకలయ్య మామూలుగానే తన గొఱ్ఱెలను మేపుకోవడానికి శ్రీ స్వామివారి ఆశ్రమం వున్న ఫకీరు మాన్యానికి వచ్చాడు..కుతూహలం ఆపుకోలేక శ్రీ స్వామివారి ఆశ్రమ ప్రహరీ గోడ మీద నుంచి..ఆశ్రమం లోపలికి చూసాడు..శ్రీ స్వామివారు ఆశ్రమం ముందున్న పందిరి క్రింద పద్మాసనం వేసుకొని కూర్చుని వున్నారు..ధ్యానం లో ఉన్నారేమోనని అనుకొని.. ప్రహరీ దిగి వెళ్ళిపోయాడు..అప్పటి నుంచీ రెండు మూడు సార్లు తొంగిచూసాడు..శ్రీ స్వామివారు ఒకే భంగిమలో కూర్చుని వున్నారు..మధ్యాహ్నం ఒంటి గంట వేళ ఎఱుకలయ్య మళ్ళీ చూసాడు..ఈసారి శ్రీ స్వామివారి దేహం ప్రక్కకు ఒరిగి వున్నది..చలనం లేదు..అతనికి భయం వేసింది..ఆలస్యం చేయకుండా పరుగు పరుగున మొగలిచెర్ల లోని మా ఇంటికి వచ్చాడు..నాన్నగారితో తాను చూసిన విషయాన్ని చెప్పాడు..శ్రీ స్వామివారి దేహం ప్రక్కకు ఒరిగిపోయి ఉన్నదనీ..తనకేదో అనుమానంగా ఉన్నదనీ..చెప్పాడు..ఈలోపల అమ్మకూడా వచ్చి, ఈ విషయం విన్నది..ఒక్కసారిగా అమ్మా నాన్న మాన్ప్రడి పోయారు..క్షణాల్లో ఈ వార్త నలుగురికీ తెలిసిపోయింది..నాన్నగారు నన్ను పిలచి.."నువ్వు ముందుగా కొంతమందిని తీసుకొని ఆశ్రమానికి వెళ్ళు.. నేనూ అమ్మా వెనుక బండిలో వస్తాము.." అన్నారు..


నేను వెంటనే ఓ ఇరవై మందిని సమాయత్తం చేసుకొని ఆశ్రమానికి పరుగులాంటి నడకతో వెళ్లాను..ప్రహరీ తలుపు తీసి లోపలికి వెళ్ళేసరికి..అక్కడ పందిరి క్రింద శ్రీ స్వామివారి దేహం పద్మాసనం వేసుకున్న స్థితిలోనే ఎడమ ప్రక్కకు ఒరిగి వున్నది..కుడివైపున దండము, కమండలమూ వున్నాయి..కమండలం క్రింద  ఓ కాగితం ఉన్నది..అందులో తన సాధన పూర్తి అయిందనీ.. తనను దత్తాత్రేయ స్వామి గా పిలువమనీ.. తన సమాధి దర్శనం ఒక్క శనివారం నాడు తప్ప మిగిలిన రోజుల్లో చేయమనీ.. వ్రాసిపెట్టి వున్నారు..


వచ్చిన మేమందరమూ శ్రీ స్వామివారి దేహాన్ని ముట్టుకోవడానికి సందేహిస్తూ వున్నాము..మాతోబాటు వచ్చిన శ్రీ గోపీశెట్టి బలరామయ్య మాత్రం.."ప్రాణం పోయిన తరువాత అంతా ఒకటే కదయ్యా.. కట్టే కదా మిగిలుండేది.." అంటూ..శ్రీ స్వామివారి దేహాన్ని రెండుచేతులతో ఎత్తుకొని..జాగ్రత్తగా శ్రీ స్వామివారు ధ్యానం చేసుకునే ప్రధాన గది గోడకు ఆనించి..అదే పద్మాసనం స్థితి లో కూర్చోబెట్టాడు..శ్రీ స్వామివారి ముఖంలో ఏమాత్రం కళ తగ్గలేదు..కేవలం కళ్ళుమూసుకొని ధ్యానం లో వున్నట్టే వున్నారు..శరీర అవయవాలు కూడా బిగుసుకుపోలేదు..మామూలుగానే వున్నాయి..


మరో పది నిమిషాల కల్లా నాన్న అమ్మ వచ్చారు..శ్రీ స్వామివారిని చూసిన వెంటనే అమ్మ దుఃఖం ఆపుకోలేక భోరున ఏడ్చేసింది..నాన్నగారు మనసులోనే తన మనసులోనే బాధను దిగమింగారు..ఈలోపల మొగలిచెర్ల గ్రామస్థులు  అక్కడికి చేరారు..శ్రీ స్వామివారు హఠయోగం ద్వారా ప్రాణ త్యాగం చేశారని ఒక అభిప్రాయానికి అమ్మా నాన్న వచ్చేసారు..ఆరోజుల్లో మొగలిచెర్ల గ్రామానికి కానీ ఆశ్రమానికి కానీ కరెంట్ సౌకర్యం లేదు..నాన్నగారు ఊరి నుంచి పెట్రో మాక్స్ లైట్లు తెప్పించారు..రాత్రి తొమ్మిది గంటలకు గానీ శ్రీ స్వామివారి కుటుంబ సభ్యులు ఆశ్రమానికి చేరుకోలేక పోయారు..కాలినడకనే రావాలి కదా..వాళ్ళు వచ్చీ బాధపడ్డారు..ఆ తరువాత ఒక గంట గంటన్నర గడిచింది..అప్పుడొక సంఘటన జరిగింది..


ఆశ్రమం లో వున్న మాకు, బైట వున్న గ్రామస్థులకు ఎక్కడి నుంచో ఒక మోటార్ సైకిల్ వస్తున్న చప్పుడు వినబడింది..తీరా శ్రద్ధగా వింటే..ఆ శబ్దం శ్రీ స్వామివారి శరీరం లోంచి వస్తోంది..నాభి ప్రాంతం నుంచి వస్తున్న ఆ శబ్దం..క్రమంగా పెరగసాగింది..కొద్ది సేపటి దాకా ఆ శబ్దం అలా పెరుగుతూ పోయి..ఒక్కసారిగా ఆగిపోయింది..ఆ వెంటనే శ్రీ స్వామివారి నడి నెత్తి మీద చీలిక లాగా ఏర్పడి..అందులోంచి రక్తం ధారగా కారసాగింది..అంతవరకూ శ్రీ స్వామివారు తన ప్రాణాన్ని లోపలే బంధించి ఉంచారని అమ్మకూ నాన్నగారికి అర్ధం అయింది..తీవ్ర సాధన చేసిన ఆ సిద్ధపురుషుడు తన మరణాన్ని తానే కపాలమోక్షం ద్వారా ఇచ్చా పూర్వకంగా కోరుకున్నారు..అదే సమయంలో ఆశ్రమం బైట వున్న వ్యక్తులకు ఒక నీలిరంగు కాంతి పుంజం ఆశ్రమం పైనుంచి ఆకాశం లోకి దూసుకు వెళ్లినట్లు కనబడింది..


ఒక అవధూత తనకు తాను కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందే క్షణాలను ప్రత్యక్షంగా చూడగలిగే భాగ్యం మా అమ్మానాన్న లతో పాటు నాకూ కలిగింది..నేను చేసుకున్న అతి కొద్ది పుణ్యం ఈ రకంగా ఫలించింది.. 


శ్రీ స్వామివారి పార్ధివ దేహాన్ని..శ్రీ స్వామివారి కుటుంబ సభ్యుల సమక్షం లోనే..ఆ మరుసటిరోజు ఉదయాన్నే..శ్రీ స్వామివారు త్రవ్వించుకున్న నేలమాళిగ లోనే.. పద్మాసనం వేసుకున్న భంగిమలోనే... ఉత్తరాభిముఖంగా కూర్చోబెట్టి సమాధి చేసేసారు..


శ్రీ స్వామివారితో నాకు పరిచయం ఏర్పడిన నాటినుంచీ..శ్రీ స్వామివారు సిద్ధిపొందే దాకా నేను పొందిన అనుభవాలను ఇంతవరకూ పొందుపరచాను..శ్రీ స్వామివారు సమాధి చెందిన తరువాత..2004 వ సంవత్సరం దాకా మా తల్లిదండ్రులే శ్రీ స్వామివారి మందిరం నిర్వహించారు..2004 వ సంవత్సరం సంక్రాంతి పండుగ రోజుల్లో మా తండ్రిగారు అనారోగ్యం పాలయ్యారు..ఆ సమయం లో తప్పనిసరి పరిస్థితులలో నేను శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిర నిర్వహణా బాధ్యతను తీసుకోవాల్సి వచ్చింది..నేను బాధ్యతలు చేపట్టిన తరువాత..నేను వ్యక్తిగతంగా కానీ..మా దంపతులం కానీ పొందిన అనుభవాలను రేపటి నుంచీ ధారావాహికంగా తెలియచేస్తాను..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).

9 కామెంట్‌లు:

ఉడుత.నాగరాజు చెప్పారు...

దత్త అవధూత నమో

ఉడుత.నాగరాజు చెప్పారు...

దత్త అవధూత నమః

ఉడుత.నాగరాజు చెప్పారు...

దత్త అవధూత నమః

ఉడుత.నాగరాజు చెప్పారు...

శ్రీ దత్త అవధూత నమః

ఉడుత.నాగరాజు చెప్పారు...

శ్రీ దత్త అవధూత నమః

ఉడుత.నాగరాజు చెప్పారు...

శ్రీ దత్త అవధూత నమః

ఉడుత.నాగరాజు చెప్పారు...

శ్రీ దత్త అవధూత నమః

ఉడుత.నాగరాజు చెప్పారు...

శ్రీ దత్త అవధూత నమః

ఉడుత.నాగరాజు చెప్పారు...

శ్రీ దత్త అవధూత నమః