14, ఆగస్టు 2021, శనివారం

*శ్రీ సూక్తము...* *( మూడవ భాగము.)*

 *శ్రీ సూక్తము...* *( మూడవ భాగము.)*


*హరిణి* :: ఈ శబ్దానికి పసుపు అని అర్థము. పసుపు స్వయంగా పవిత్రమైనది. వేరే వస్తువులను అది పవిత్రంగా చేయగలదు. పసుపును ముద్దగా చేసి అందులోకి దేవీ దేవతలను ఆవాహన చేయడం సాంప్రదాయము.


హరిణి అంటే ఆడ లేడి పిల్ల అని ఒక అర్థము. మనసును హరించేది (ఆకర్ష ణీయమైనది) వేటాడబడేది అనే ఉత్పత్తిలో ఆ అర్థం వస్తుంది.


హరి అంటే మహావిష్ణువు. భవ భవాని, శివ శివాని, రుద్ర రుద్రాణి, ఇంద్ర ఇంద్రాణి, అలాగే హరిణి అంటే హరి కి సంబంధించిన స్త్రీ శక్తి. నారాయణి పదము లాగా. నిజానికి ఈ పదాలన్నీ ధాత్వంత పదాలు. సేనాని గ్రామణి పదాల లాగా శివుడిని నడిపించే మూల శక్తి శివాని. హరిని నడిపించే మూలశక్తి హరిణి ఇలాగన్నమాట. 


హరి అంటే ఇంద్రుడు అనే అర్థం కూడా ఉంది. అందువల్ల హరిణి అంటే ఇంద్రుని భార్య శచీ దేవి అని ఒక అర్థము, ఇంద్రుడిని నియంత్రించే శక్తి అని ఒక అర్థము. ఇంద్రుడి శక్తి అంటే వజ్రాయుధము లేదా పిడుగు అని ఇంకొక అర్థము. అక్కడ నుంచి వచ్చిందే మెరుపుతీగ అనే అర్థం కూడా ఉన్నాయి. ఐశ్వర్యాన్ని ప్రసాదించే దేవతలలో ఇంద్రుడు కూడా ఒకడు.


హరిణి అంటే పాపాలను దారిద్ర్యాన్ని హరించేది అనే అర్థాలున్నాయి. పై అర్ధాలన్ని కలిపి హరిణి అంటే లక్ష్మీదేవి కి పేరు.


*సు॒వర్ణ॑ రజ॒త స్ర॑జాం*

 :: సువర్ణ మంటే బంగారము. కానీ ఆ పదానికి సంధి విడదీసి సు+వర్ణ అన్నప్పుడు మంచి అక్షరాలు ( బీజాక్షరాలు) అన్న అర్థం వస్తుంది. (వర్ణము అంటే అక్షరము). బీజాక్షరాలు మాలికగా కలిగినది. మాలా మంత్ర రూపంలో ఉన్నది అని మంత్ర శాస్త్రపరమైన అర్థము. 


రజిత మంటే వెండి. వెలుగులు విరజిమ్మడము అనే ఉత్పత్తి అర్థం దానికి ఉంది. రాజత్ అంటే ప్రకాశించుట. ప్రకాశించే బంగారు నగలు ధరించినది లేదా వెండి బంగారు నగలు ధరించినది. 


స్రజం అంటే ప్రకృతి సహజమైన పూలు మొదలైన వాటితో చేసిన మాల, లేదా విలువైన లోహాలు రత్నాలు మొదలైన వాటితో చేసి మెడలో వేసుకునే గొలుసు అనే రెండు అర్ధాలు వస్తాయి.


హరిణి, హేమమాలిని అని లక్ష్మీ అష్టోత్తరం లో ఉంది. హరిణి గురించి పైన చెప్పుకున్నాము. సు॒వర్ణ॑ రజ॒త స్ర॑జాం అంటే హేమమాలిని అనేది వాచ్యార్ధము. శ్రీ సూక్తం, లక్ష్మీదేవి అష్టోత్తరం రెండూ పక్కపక్కన చదివితే రెండిట్లోనూ ఎన్ని నామాలు కలిసివస్తాయో చూసుకోవచ్చు.


లక్ష్మీ కరమైన వస్తువుల్లో బంగారము గంధము పసుపు ఆవులు ఆవు పేడ పూలు అందులో కూడా తామర పూలు చంద్రబింబము బిల్వము, మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ శ్రీ సూక్తం లో వస్తాయి. 


*"మాతర్నమామి కమలే కమలాయతాక్షి"* అని మొదలయ్యే అగస్త్య కృత లక్ష్మీ స్తుతిలో రెండో శ్లోకంలో రెండవ మూడవ పాదాలు ::


 *"జ్యోత్స్నాసి చంద్రమసి చంద్ర మనోహరాస్యే*

*సూర్యే ప్రభాసి చ జగత్త్రితయే ప్రభాసి"* అని ఉంటుంది.


 అందులోనే మూడవ శ్లోకం లో మొదటి పాదం :: *"త్వం జాతవేదసి సదా దహనాత్మ శక్తిః"*. అని ఉంటాయి. 


ఇవి చాలా ప్రసిద్ధమైన శ్లోకాలు. ఈ శ్లోకాల లోని భావాలు ఉపనిషత్తుల్లో నూ పురాణాల్లో చెప్పిన విషయాన్నే చెబుతాయి. వీటి అర్థం ప్రకారం చంద్రుడికి వెన్నెలకు సూర్యునికి అగ్నికి లక్ష్మి తో అభేదం ఉన్నది.


పద్మ అనే పేరు తామర పువ్వు కూ లక్ష్మీదేవికి రెండిటికీ వర్తిస్తుంది. అబ్జ శబ్దానికి లక్ష్మి చంద్రుడు తామర పువ్వు మూడు అర్ధాలున్నాయి. ( ఇంకా శంఖం మొదలైన అర్ధాలు కూడా ఉన్నాయి. అప్ +జ నీటి నుంచి పుట్టినది అని ఆ పదానికి ఉత్పత్తి అర్థము.) కాబట్టి చంద్రా అంటే లక్ష్మీదేవి. చంద్ర శబ్దం ఛది ఆహ్లాదనే అనే ధాతువు నుంచి వచ్చింది. చంద్రుడు సంతోషాన్ని కలిగిస్తాడు. ఆ ఉత్పత్తి ప్రకారం లక్ష్మీదేవి ఆనంద స్వరూపిణీ.


హిరణ్యము, పద్మము, చంద్రుడు, ఈ మూడు పదాలను లక్ష్మీదేవి అనే అర్థములోనే వాడతారు. 


ఇది ఐశ్వర్యమ్ అనే ధాతువు నుంచి పుంలింగం లో ఇంద్ర స్త్రీ లింగం లో ఇందిరా అనే పదాలు వస్తాయి. రెండింటికి కూడా ఐశ్వర్యాన్ని ఇచ్చేవాళ్ళు అని అర్థము. అగ్ని శివుడు ఇంద్రుడు కుబేరుడు వీళ్లంతా ఐశ్వర్యాన్నిచ్చే దేవతలు. వీళ్ళలో ఉండే ఐశ్వర్య శక్తి లక్ష్మీదేవి.


*అన్నీ చెప్పుకుంన్నాం కానీ ఇంతకూ లక్ష్మీ పదానికి అర్థం ఏమిటంటే నిరుక్తం లో " జ్ఞానై శ్వర్య సుఖారోగ్య ధనధాన్య జయాదికం" ఈ లక్షణాలన్నీ ఉన్నావిడ, వీటిని అనుగ్రహించే ఆవిడ అని ఉంది. ఆఖరలో "ఆదికం" (etc.,) అన్నందువల్ల సౌభాగ్యము సౌందర్యము సంతానము మొదలైన ఐశ్వర్య గుణాలన్నీ కలుపుకొని ఊహించుకోవాలి. ఈ శుభ లక్షణాలన్నీ ఉన్నది లక్ష్మి. వాటిని అనుగ్రహించే ది లక్ష్మి.*


 ఈ అర్ధాలన్నీ తెలిస్తే మొదటి ఋక్కుకు తాత్పర్యం తెలుస్తుంది. ఈ ఋక్కు లో పదాలకు అర్ధాలు చెప్పుకోవడము లో కాస్త సాగదీత అయింది. 15 ఋక్కులు ఇలా ఉండవు. మొదటి రెండు ఋక్కులు దాటితే ఇవే పదాలు వీటికి సంబంధించిన పదాలు వస్తాయి అందువల్ల ఇంత ఇంత అవస్త పడనక్కర్లేదు. మొదటి రెండు ఋక్కులకు తాత్పర్యం తెలుసుకుంటే తర్వాత వాటిని సులభంగా అర్థం చేసుకోవచ్చు. మరీ ఆఖర లో ఉన్న నాలుగైదు ఋక్కులకు అర్థము తాత్పర్యము చాలా సులభంగా ఉంటుంది.


 ఇంకా ఉంది.....


 *పవని నాగ ప్రదీప్*

కామెంట్‌లు లేవు: