14, ఆగస్టు 2021, శనివారం

కడుపులోని పిండం ఖరీదు 300

 కడుపులోని పిండం ఖరీదు 300 రూపాయలు మాత్రమే.

........................................................


కన్యాశుల్కమంటే తెలియని తెలుగువాడుండడు. పెండ్లి కావాల్సిన పురుషుడు అమ్మాయి తండ్రికి చెల్లించే కట్నమునే కన్యాశుల్కమని అనేవారు. 19వ శతాబ్దం ప్రారంభం నుండి ఇరవయ్యో శతాబ్దం ప్రారంభ దశాబ్దాల వరకు ఈ పద్ధతి వుండేది.


కన్యాశుల్కమనే దానిని ఓ పద్ధతనే దానికన్నా పెద్ద దురాచారమనడం సబబుగా వుంటుంది. ఆంధ్రదేశంలో ముఖ్యంగా తీరస్ధ తెలుగునాడులో ఈ మూఢచారం నాడు వేళ్ళూనుకొని స్త్రీజాతిని సంతపశువుగా చేసింది.


నాటి హిందూసమాజంలో సతీసహగమనం వంటి భయంకర దురాచారాలను అరికట్టడంలో రాజారామమోహనరాయ్ చేసిన కృషి ప్రశంసనీయం. అలాగే తెనుగుసీమలో వరకట్నం, బాల్యవివాహాలు, వితంతు విధానముపై కత్తికట్టి జయమును పొందినవాడు కందుకూరి వీరేశలింగం పంతులుగారు.


అలాగే బాల్యవిహహాల వ్యవస్థ వ్యతిరేక ఉద్యమాలకు, కన్యాశుల్క దురాచారాలను వ్యతిరేకంగా కలం పట్టి ముందుకు నడిచినవాడు గురుజాడ వేంకట అప్పారావు (1862 - 1915).


గురుజాడ వెంకట అప్పారావుకు చేయూతనిచ్చి ప్రోత్సహించినవాడు విజయనగం జమీందారు ఆనందగజపతిరాజు. కన్యాశుల్కం వలన ఎంతమంది బాలికలు బలైపోతున్నారనే బోగట్టా సేకరించాలని రాజావారు తలంచారు. తన జమీందారీ వ్యవస్థలో కన్యాశుల్క దురాచారం ద్వారా ఎంతమంది ఆడపిల్లలు బలైనారో తెలుసుకోవాలని ఆనంద గజపతిరాజు గారు, ఆ పని చేయటానికి తన జమీందారీ ఉద్యోగులను పురమాయించారు. వారు 3 సంవత్సరకాల సమాచారాన్ని సేకరించి రాజావారి ముందుంచారు.


3 సంవత్సరాల కాలంలో జరిగిన కన్యాశుల్క బాల్యవివాహాల సంఖ్య 1034. అంటే సంవత్సరానికి జరిగిన సగటు వివాహాల సంఖ్య 344. వీరిలో ఆరేళ్ళవయసుకే ముసలివరులకు భార్యలైనవారు 99 మంది. ఇంకా దారుణమేమిటంటే వీరిలో రెండేళ్ళ వయసు బాలికలు ఆరుగురు, మూడేళ్ళ వయసువారు 36 మంది. ఇంకా దారుణమేమిటంటే సంవత్సరపులోపు వయసుగల పసిగుడ్డులు ముగ్గురు పెండ్లిపీఠలెక్కారు.


మరీ ఘోరమైన విషయమేమిటంటే గర్భస్థశిశువు ఆడపిల్లగానే పుడుతుందనే ఉద్దేశ్యంతో ఆ పిండాలను 300 రుపాయలకే అమ్మిన ప్రబుద్ధ తల్లిదండ్రులు కూడా ఆ రోజులలో వున్నారు.


కన్యాశుల్కమనే డబ్బుకు కక్కుర్తిపడి పసిపిల్లలను అమ్ముకొన్న తల్లిదండ్రులుకు దక్కింది 300 నుండి 400 రూపాయలు. ఆ రోజులలో 300 రూపాయలంటే ఇప్పటి విలువలో దాదాపు 30 లక్షల రూపాయలనుకోండి.


ఈ వివరాలన్ని చూడగానే రాజావారికి కడుపు మండింది. అప్పటికే రాజావారు మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిలులో సభ్యులు. ఈ భయంకర కన్యాశుల్క దురాచారాన్ని ఆపటానికి కౌన్సిలులో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలించింది. సమాజ ఆచారాలు వ్యవహారాలలో జోక్యం చేసుకోడానికి తటపటాయించింది. నిపుణుల అభిప్రాయం కొరకు సుబ్రమణ్య అయ్యరు, చంచలరావులతో కమీటివేసింది.


వారు కన్యాశుల్కానికి ప్రధానకారణం బాల్యవివాహాలని, కనుక బాల్యవివాహాలను రద్దుచేస్తే కన్యాశుల్కమనే సమస్య రాదని తేల్చిచెప్పారు. అంతటితో కన్యాశుల్కమనే దురాచారచట్ట నిరోధానికి అవరోధం ఏర్పడింది.


తరువాత తర్వాత ఇలాంటి మహానీయుల కృషివలన ప్రభుత్వం Child Marriage Restraint Act - 1929 లో తీసుకురావడం, Dowry Prohibition Act-1969 ప్రవేశపెట్టడం వలన ఇలాంటి సంఘ దురాచారాలు చాలా వరకు ఆగిపోయాయనుకోండి.


ఇంత చెప్పికూడా కన్యాశుల్క దురాచారాన్ని ఆపటానికి గురజాడ వేంకట అప్పారావుగారి నాటకం ప్రజలలో చైతన్యమనే విప్లవాన్ని తెచ్చిందనే విషయాన్ని గుర్తు చేసుకోకపోవడం శోచనీయం కదా !

....................................................................................................... ...... జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

కామెంట్‌లు లేవు: