నాసదీయ సూక్తము
శ్రీ శివాయ గురవే నమః
నాసదీయ సూక్తము(ప్రతి పదార్థ తాత్పర్యములు)
అక్కడ పుస్తకము ఉందా? లేదా? అని ఎవరయినా ప్రశ్న అడిగారనుకోండి. అక్కడ పుస్తకము ఉంటే ఉందని చెబుతాం. లేదంటే లేదని చెబుతాం. కాని పుస్తకం ఉంది.. లేదు అని జవాబు చెబుతామా? ఏమిట్రా ఇలా చెబుతున్నాడు. ఉంటే ఉందని చెప్పాలి. లేక పొతే లేదని చెప్పాలి. ఉంది... లేదు ఏమిట్రా బాబూ ! అనుకొంటాం. పరమపవిత్రమయిన ఋగ్వేదంలో ఉన్న నాసదీయ సూక్తము ఇలాంటిదే. ఉంది, లేదు అను జవాబులు ఈ సూక్తములో వస్తాయి.
సరస్వతీ దేవికి సంబంధించిన మేధా సూక్త వివరణ పూర్తయిన పిదప, పెద్దలు శ్రీ గుడిపాటి రామకృష్ణ శర్మగారు ఈ నాసదీయ సూక్తాన్ని వివరించమని కోరారు.వారు అడిగి చాలా రోజులయింది. శివయ్య అనుగ్రహంతో నమక చమకాల చివరి భాగం పూర్తి చేసి ఆత్మ జ్యోతి మాస పత్రికకి పంపించిన తర్వాత ఈ సూక్తవివరణను ధైర్యం చేసి ఈరోజు మొదలుపెడుతున్నాను..(త్వరలో పెద్దలు శ్రీ గుడిపాటి రామకృష్ణ శర్మగారు నా నమకచమక వివరణలను పుస్తకంగా ప్రచురించబోతున్నారు.వారికి ధన్యవాదములు)
ఋగ్వేదంలో ఉన్న 1017 సూక్తాలలో నాసదీయ సూక్తము ఒకటి. సృష్టికి ముందు ఉన్న ప్రళయ స్థితి ఈ సూక్తములో చెప్పబడింది. ఈ సూక్తములో సామాన్యుల భావనకు అతీతమైన ఒక విచిత్రమైన శైలి కనిపిస్తుంది. పేరు కూడా చాలా గమ్మత్తుగా ఉంది .
న, అసత్ = నాసత్ . సత్ అంటే ఉంది. అసత్ అంటే లేదు. నాసత్ అంటే లేదని ఏదయితే చెబుతున్నామో అది లేదు. అంటే ఉంది. (At first there was no being nor non being )
ఉంది, లేదు,లేదని చెబుతున్నది ఉంది . ఈ మూడింటి విశ్లేషణ ఈ నాసదీయ సూక్తములో కనబడుతుంది. మహానుభావుడయిన సాయణాచార్యులవారు ఈ నాసదీయ సూక్తానికి వ్రాసిన భాష్య సహాయముతో, బ్రహ్మ సూత్రాల వ్యాఖ్యాన సహాయముతో పెద్దల అనుగ్రహము ద్వారా , నేను తెలుసుకొన్నంత వరకు ఈ నాసదీయ సూక్తాన్ని వివరించటానికి ప్రయత్నిస్తాను.
సహేతుకంగా దోషాలు తెలియచేస్తే వెంటనే సవరించుకొంటాను.
01
नासदासीन्नो सदासीत्तदानीम् नासीद्रजो नो व्योमा परो यत्।
किमावरीव: कुह कस्य शर्मन्नंभ: किमासीद्गहनं गभीरम्॥१॥
నాసదాసీన్నోసదాసీత్తదానీం నాసీద్రజో నో వ్యోమాపరో యత్ ।
కిమావరీవః కుహకస్యశర్మన్నంభః కిమాసీద్గహనం గభీరం ॥ ౧ ॥
పద విభాగము
న, అసత్, ఆసీత్, నో ఇతి, సత్, ఆసీత్, తదానీం, న , ఆసీత్, రజః, న , వి, ఓమ, పరః, యత్, కిమ్, ఆ,అవరీవరీతి, కుహ, కస్య, శర్మన్,అమ్భః, కిమ్, ఆసీత్, గహనమ్, గభీరమ్
ప్రతి పదార్థము
సృష్టికి పూర్వము ఉన్న ప్రళయావస్థ వర్ణించబడుచున్నది
తదానీం= ప్రళయ కాలములో అప్పుడు ఈ ప్రపంచానికి మూల కారణమువలె ఉన్నది
తద్ అసత్= కుందేలు కొమ్ములా లేనే లేదు (కుందేలుకు కొమ్ములు అసంభవము. ఎలుకకు కొమ్ములు అసంభవము)
తథా నోసత్= సత్ పదార్థము ఆత్మ వలె ఉన్నది కావున నిర్వచింఛుటకు వీలులేనిది
న ఆసీత్ రజః= ఆకాశము కింద ఉన్న భూమితో అంతమైన పాతాళము మొదలైన లోకములు లేనే లేవు
వ్యోమ= ఆకాశము
తదపి నో= అది కూడా లేనే లేదు
పరః= ఆకాశమునకు పై భాగము ఉన్న స్వర్గలోకమునుండి సత్య లోకమువరకు లేదు
అవరీవః= ఏదైతే ఆవరించదగినదో - ఆవరించదగిన(ఆక్రమించుకొన్న) భూత సమూహములు - వరించబడుగాక ! అదియునులేదు
కుహ= వరించదగిన వస్తు స్వరూపము ఏ ప్రదేశమునుండి వరించబడుతోందో అదికూడా లేదు
కస్య శర్మన్ =ఏ భోక్త అయిన జీవునియొక్క సుఖ దుఃఖ సాక్షాత్కారములు నిమిత్తములు కాగా ఆవరించిన కలిగిన వస్తు స్థితి ఆవరించబడుగాక !
గహనం= ప్రవేశించుటకు వీలులేని అగాధమైన
ఈదృశః= ఇటువంటి
అంభః= నీరు
కిమాసీత్= ఏమైనది?(నీరు కూడా లేదు)
తాత్పర్యము
సృష్టికి పూర్వము ఉన్న ప్రళయావస్థ ఈ సూక్తములో చెప్పబడుతోంది.
మొదట్లో ఉనికి అనేది లేదు, ఉనికి లేకపోవటం అంటూ కూడా లేదు. మనకి అర్థమయ్యే విశ్వం లేదు.
ఆకాశం లేదు. ఆకాశమునకు పై భాగము ఉన్న స్వర్గలోకమునుండి సత్య లోకమువరకు లేనే లేదు
అలా అని ఏదీ లేదనటానికి వీలు లేదు. నీరు ఏమైనది? ఈ నీరు దేనిచే ఆవరించబడి ఉంది? అది ఎక్కడ ఉంది?
ఏదయితే ఉన్నదో అది ఎఱుగరానిది; చొరరానిది.మిక్కిలి లోతైనది.
నాసదీయ సూక్తము(ప్రతి పదార్థ తాత్పర్యములు)-02.(31-08-2016)
2
न मृत्युरासीदमृतं न तर्हिन रात्र्या अह्न आसीत्प्रकेतः।
आनी॑दवातं स्वधयातदेकं तस्मा॑द्धान्यन्न परः किञ्चनास॥२॥
న మృత్యురాసీదమృతం న తర్హి న రాత్ర్యాఆహ్నఆసీత్ప్రకేతః ।
ఆనీదవాతం స్వధయా తదేకం తస్మాద్ధాన్యన్నపరః కిఞ్చనాస ॥ ౨ ॥
పదవిభాగము
న మృత్యుః, ఆసీత్, అమృతమ్, న తర్హి, న రాత్ర్యాః, ఆహ్నః,ఆసీత్ , ప్రకేతః ।
ఆనీత్, అవాతం, స్వధయా, తత్ ,ఏకం తస్మాత్, హ, అన్యత్, నపరః కిమ్, చన, ఆస
ప్రతి పదార్థము
న మృత్యుః+ ఆసీత్= మృత్యువు లేదు
అమృతం న తర్హి॒= అమృతము(అమర్త్వము) లేదు
రాత్ర్యా = రాత్రితో
ఆహ్నః= పగలు యొక్క
ప్రకేతః = జ్ఞానము, చిహ్నము
న ఆసీత్ = లేకుండెను (ఎందుకంటె వీటికి కారణములైన సూర్యచంద్రులు లేరు కనుక)
స్వధయా= బ్రహ్మతో(మాయ, ప్రకృతి. శక్తిని ధరించినది , తనయందు ధరించబడియుండునది స్వధా)
అవాతం = వాయురహితమైన
తత్ ,ఏకం = కేవలము ఏక ప్రాణము మాత్రమే (బ్రహ్మము )
ఆనీత్ హ = ఉండెను కదా !
తస్మాత్ = ఇదివరకు చెప్పిన బ్రహ్మము కంటె భిన్నముగా
అన్యత్ =వేరొకటి
పరః కించన న ఆస= = సృష్టికి పూర్వము కొంచెము కూడా లేదు.
తాత్పర్యము
ప్రళయకాలపు పూర్వకాలములో మృత్యువు లేదు ; అమృతము(అమర్త్యము) లేదు
రాత్రి పగలు యొక్క జ్ఞానము, చిహ్నము లేదు (ఎందుకంటె వీటికి కారణములైన సూర్యచంద్రులు లేరు కనుక)
మాయతోలేదా, ప్రకృతితో వాయురహితమైన ఏక ప్రాణము మాత్రమే (బ్రహ్మము )ఉండెను.
ఇదివరకు చెప్పిన బ్రహ్మము కంటె భిన్నముగా వేరొకటి సృష్టికి పూర్వము కొంచెము కూడా లేదు.
విశేషాలు
ఈ మంత్రంలో వినబడే స్వధా అనే పదానికి విస్తృతార్థ ప్రయోగాలు ఉన్నాయి.
1. అగ్నికార్యంలో/ యజ్ఞాలలో స్వాహా శబ్దం వినిపించినట్లే పితృ దేవతలకు తర్పణాలు ఇవ్వడంలో స్వధా శబ్దం వినిపిస్తుంది. పితృయజ్ఞాలలో స్వాహాదేవియే తర్పణాలలో స్వధా రూపిణిగా వస్తున్నదని శాస్త్రం. (పితృ యజ్ఞేషు స్వధా మాతా.) పితృ దేవతలను ఉద్దేశించి వషట్కారం చేయడం స్వధాకారం.(స్వధానమ ఇతి వషట్కారపి.)
2. అగ్ని దేవుని భార్య స్వాహాదేవి. ఆమె మరో రూపం స్వధా.
3. స్వధా శబ్దానికి అన్నం అని కూడా అర్థం ఉంది.
4. స్వధా : పితృహోమము చేయుట.(సంస్కృత-తెలుగు నిఘంటువు వావిళ్ల 1943 )
5. కౌసల్యాదేవి రామునితో బాధ పడుతూ “ నాయనా రామా ! నువ్వు నా ఎదుట లేనప్పుడు పితృ లోకమున లభించే స్వధతో కాని, స్వర్గప్రాప్తి వలన కలిగే అమృతముతో గాని ఏమి లాభము ? “ (వాల్మీకి రామా.అయోధ్య 021 వ సర్గ- 51వ శ్లో) అని చెబుతుంది.
6. అయితే ఈ నాసదీయ సూక్తానికి భాష్యము రచించిన సాయణాచార్యులవారు “స్వస్మిన్ ధీయతే ధ్రియత ఆశ్త్రిత్యవర్తత ఇతి స్వధా “ (తనయందు ధరించబడియుండునది, ఆశ్రయించి ఉండునది) అని వ్రాసారు.అందుకే నేను కూడా స్వధా పదానికి “తనయందు ధరించబడియుండునది” అను అర్థాన్ని స్వీకరించాను.
నాసదీయ సూక్తము(ప్రతి పదార్థ తాత్పర్యములు)-03.(01-09-2016)
तम आसीत्तमसा गूळ्हमग्रे॑ऽप्रकेतं सलिलं सर्व॑मा इदं।
तुच्छ्येनाभ्वपि॑हितं यदासीत्तप॑सस्तन्म॑हिना जायतैकं॥ ३॥
తమ అసీత్తమసా గూళ్హమగ్రే॑ ప్రకేతం సలి॒లం సర్వమాఽఇదం ।
తుచ్ఛ్యేనాభ్వపిహితం యదాసీత్తపసస్తన్మహినా జాయతైకం ॥ ౩ ॥
పదవిభాగము
తమః, అసీత్ , తమసా గూళ్హమ్,అగ్రే , అప్రకేతం, సలిలమ్, సర్వమ్ ,ఆః, ఇదం ।
తుచ్ఛ్యేన, ఆభు అపిహితం , యత్, ఆసీత్ . తపసః , తత్ మహినా, అజాయత, ఏకం
ప్రతి పదార్థము
అగ్రే = సృష్టికి ముందు ప్రళయ దశలో జీవులకు సంబంధించిన (భూత భౌతికమైన) సర్వ ప్రపంచము
తమసా = చీకటితో
గూళ్హమ్= ఆవరించబడియున్నది.
తమః = అన్ని పదార్థాలలో ఆవరించిన చీకటి ఏరకంగా అయితే ఈ శ్వరుని ఆవరించదో అటువంటి చీకటి
అసీత్ = ఈ సర్వ ప్రపంచమును ఆవరించినది..
ఇదం సర్వమ్ సలిలమ్ = ఇప్పుడు కనబడే సకల జగత్తు నీటితో కూడినది
అప్రకేతం= పాలతో కూడిన నీరును ఎలా వేరు చేసి చెప్పుటకు వీలుపడదో అలా అంధకారముతో కూడిన ఈ ప్రపంచమును విడదీసి తెలుసుకొనుటకు బోధ పడుటలేదు
తుచ్ఛ్యేన = అవ్యక్తావస్థలో అనగా వివరించుటకు వీలు కాని స్థితిలో
ఆభుః= మళ్ళీ
అపిహితం = జగత్తు కప్పబడి ఉన్నది.
యత్= ఏదయితే
ఏకం ఆసీత్ = చీకటితో కలిసి విడదీయుటకు వీలు కాకుండా ఒకటిగా ఉన్నదో
తత్= అది(సృష్టి)
తపసః = సృష్టించవలెనని భగవంతుని చక్కని ఆలోచనరూపమగు
మహినా=మాహాత్మ్యముతో (గొప్పతనముతో)
అజాయత= పుట్టింది.
తాత్పర్యము
సృష్టికి ముందు ప్రళయ దశలో జీవులకు సంబంధించిన సర్వ ప్రపంచము చీకటితో కప్పబడియున్నది.
అన్ని పదార్థాలలో ఉన్న చీకటి ఏరకంగా అయితే ఈ శ్వరుని కప్పలేదో అటువంటి చీకటి ఈ సర్వ ప్రపంచమును కప్పివేసింది..
ఇప్పుడు ఈ ప్రళయ కాలములో కనబడే సకల ప్రపంచము నీటితో కూడినది
పాలతో కూడిన నీరును ఎలా వేరు చేసి చెప్పుటకు వీలుపడదో అలా అంధకారముతో కూడిన ఈ ప్రపంచమును విడదీసి తెలుసుకొనుటకు బోధ పడదు.
అవ్యక్తావస్థలో అనగా వివరించుటకు వీలు కాని స్థితిలో జగత్తు కప్పబడి ఉన్నది.
చీకటితో కలిసి విడదీయుటకు వీలు కాకుండా ఒకటిగా ఉన్న సృష్టి - సృష్టించవలెనని భగవంతుని చక్కని ఆలోచనరూపమగు
గొప్పతనముతో మరలా ప్రారంభమవుతుంది.
విశేషాలు
సత్వము, రజస్సు, తమస్సు – ఈ మూడింటికి సమానమయిన పదము ప్రకృతి
ఈ ప్రకృతికి ప్రధానము, అవ్యక్తము, మరియూ అదృశ్యము- ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి.
వేదములో ఈ ప్రకృతి శబ్దము తమస్సు అనే పదముతో చెప్పబడింది.
వేదాంతములో ప్రకృతిని అజ్ఞానము అన్నారు. ఎందుకంటే ఆ పరమాత్మ జ్ఞానము తెలుసుకోవటం కష్టం కనుక.
చివరగా ఒక మాట
బిగ్ బ్యాంగ్ (మహా విస్ఫోటం) అని ఒక మాట ఆధునిక కాలములో వింటున్నాం. బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఎక్కువ వేడి పుట్టిందని చెబుతున్నారు.
భగవంతుని తపస్సుచే (తపముచే , వేడిచే) సృష్టి ఏర్పడిందని నాసదీయ సూక్తములోని ఈ మూడవ మంత్రం చెబుతోంది.స్వస్తి.
నాసదీయ సూక్తము(ప్రతి పదార్థ తాత్పర్యములు)-04.(02-09-2016)
कामस्तदग्रे समवर्तताधि मनसो रेत: प्रथमं यदासी॑त्।
सतो बन्धुमसति निरविन्दन् हृदि प्रतीष्या॑ कवयो॑ मनीषा॥४॥
కామస్తదగ్రే సమవర్త॒తాధి మనసో రేతః॑ ప్రథమం యదాసీ॑త్ ।
సతోబన్ధుమసతి నిరవిన్దన్హృది ప్రతీష్యా కవయో మనీషా ॥ ౪ ॥
పదవిభాగము
కామః ,తత్ అగ్రే , సమ్ అవర్త॒త, అధి మనసః ,రేతః ప్రథమం యత్ ,ఆసీత్ ।
సతః బన్ధుమ్ , అసతి నిః, అవిన్దన్, హృది ప్రతి ఇష్య కవయః మనీషా ॥ ౪ ॥
ప్రతి పదార్థము
తత్ అగ్రే = ఇప్పుడు కనబడే సృష్టికి పూర్వము
కామః =సృష్టి చేయవలెనని కోరిక
సమ్ అవర్త॒త,= కోరిక కలిగింది.
యత్= ఆ
అధి మనసః = అంతః కరణమునకు సంబంధించిన వాసనాశేషముతో
ప్రథమం = జరిగిపోయిన కల్పమునందు
రేతః = సృష్టించబోవు ప్రపంచమునకు సంబంధించిన బీజ భూతము
ఆసీత్ = ఉండెను
కవయః= క్రాంతదర్శులైన యోగులు, మునులు
మనీషా=తమ సాత్విక బుద్ధి చేత
అసతి= వినశ్వరమైన
హృది =హృదయములో
ప్రతి ఇష్య =విచారణ చేసి
సతః = సత్పదార్థము చేత ఇప్పుడు అనుభవిస్తున్న సకల జగత్తుకు
బన్ధుమ్ = కల్పాంతరములో ప్రాణులచే అనుభవించబోవు కర్మ సమూహ బంధకము
అసతి =సద్విలక్షణము అన్యాకృతమగు కారణము నందు
నిః, అవిన్దన్= వివేచన చేసి తెలుసుకొనిరి
పద విశేషాలు
1. అంతఃకరణము
అంతర్ + కరణమ్. లోపలి యింద్రియము.
అంతఃకరణము లు - వేదాంతుల మతమున మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అని నాలుగు విధములు. వీనికి క్రమముగా సంశయము, నిశ్చయము, గర్వము, స్మరణము - విషయములు. ఇవి సాంఖ్యుల మతమున బుద్ధి, అహంకారము, మనస్సు లని మూడు విధములు.
2. వాసనాత్రయము
ఇవి మూడు 1.లోకవాసన, 2. దేహవాసన, 3. శాస్త్రవాసన.
3. కల్పము :
a day of Brahma or 1000 Mahayugas, being a period of 432, 000, 000 years of mortals and measuring the duration of the world;( శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953)
తాత్పర్యము
కల్పము అనగా కృత ,త్రేతా ,ద్వాపర కలియుగములు
ఈనాలుగు కలిపి ఒకకల్పాంతరము.
ప్రతి యుగమునకు మహాప్రళయం సంభవిస్తుంది .
మరల తర్వాత యుగం ప్రారంభం కావడానికి మధ్య సంధి కాలం వుంటుంది
ఇప్పుడు కనబడే సృష్టికి పూర్వము భగవంతునికి సృష్టి చేయవలెనని కోరిక కలిగింది.
ఆ అంతః కరణమునకు సంబంధించిన వాసనాశేషముతో జరిగిపోయిన కల్పమునందు సృష్టించబోవు ప్రపంచమునకు సంబంధించిన బీజ భూతము ఉండెను
క్రాంతదర్శులైన యోగులు, మునులు తమ సాత్విక బుద్ధి చేత నశించే దానిని హృదయములో విచారణ చేసారు. సత్పదార్థము చేత ఇప్పుడు అనుభవిస్తున్న సకల జగత్తుకు కారణమయిన - కల్పాంతరములో ప్రాణులచే అనుభవించిన కర్మ సమూహ బంధకములను వివేచన చేసి తెలుసుకొన్నారు.
తదైక్షత అని చాందోగ్యోపనిషత్తు. పరమాత్మ విస్తరించాలని సంకల్పించింది — ఆ సంకల్పం చేతనే జగమేర్పడింది. ఈ భావమే ఈ నాసదీయ సూక్త నాలుగవ మంత్రములో చెప్పబడింది.కామము లేకపొతే సృష్టి లేదు. అందువలన జీవులకు తమ కర్మలకు తగిన ఫలములను అనుభవింపచేయుటకు ఈశ్వరుడు సృష్టి చేయాలనుకొన్నాడు.ఇది తమ బుద్ధి చేత ఋషులు తెలుసుకొన్నారని భావం.
సృష్టికి కారణం కోరిక. అదే ప్రధమ బీజం, దేవుని యొక్క మనసు నుంచి ఆ కోరిక పుట్టింది. ఆ కోరిక నుంచే జగత్తు వికసించింది. తమ హృదయాలను శోధించిన ఋషులు , ఉనికికి, ఉనికి లేకపోవటానికి కారణమైన చైతన్యాన్ని దర్శించి . వాటి మధ్య సంబంధాన్ని తెలుసుకున్నారు.
నాసదీయ సూక్తము(ప్రతి పదార్థ తాత్పర్యములు)-05.(03-09-2016)
तिरश्चीनो विततो रश्मिरेषामधः स्विदासीदुपरि स्विदासीत् |
रेतोधा आसन् महिमान आसन्त्स्वधा अवस्तात् प्रयतिः परस्तात् ||
తిరశ్చీనో వితతో రశ్మిరేషామధః స్విదాసీదుపరిస్విదాసీ త్ ।
రేతోధా ఆసన్మహిమానఆసన్త్స్వధా అవస్తాత్ ప్రయతిః పరస్తాత్ ॥ ౫ ॥
పదవిభాగము
తిరశ్చీనః, వితతః , తతః రశ్మిః ఏషామ్ ,అధః స్విత్, ఆసీత్, ఉపరిస్విత్ ఆసీత్ ।
రేతః ధాః ఆసన్ మహిమాన ఆసన్ , స్వధా అవస్తాత్. ప్రయతిః, పరస్తాత్
ప్రతిపదార్థము
ఏషామ్= ఆకాశాది భూత సమూహములను సృష్టించు ఈ సృష్టి పదార్థముల అవిద్యా కామ కర్మలు( మహా మోహం మొదలైనవి)
రశ్మిః= సూర్య కిరణ సమానములు( సూర్య రశ్మి ఉదయము తరువాత నిమేష కాలములో ప్రపంచమంతటా ఎలా వ్యాపించుచున్నదో ఆవిధముగా అవిద్యా కామ కర్మలు వ్యాపించుచున్నవని భావము. ఏ కార్య వర్గము)
వి తతః= విస్తరించబడెనో ఆ కార్య వర్గము మొట్టమొదట
కింతిరశ్చీనః ఆసీత్ = మధ్యలో ఉండెనా?
కింవాధః అసీత్ = కింద భాగములో ఉండెనా?
అహోస్విత్ = లేక (స్విత్=వికల్పము; ప్రశ్నము; సందేహము)
ఉపరి ఆసీత్ = పై భాగములో ఉండెనా?
రేతః ధాః ఆసన్= సృష్టించబడిన కార్యముల మధ్యలో కొన్ని భావములు బీజ భూతమగు కర్మకు సృష్టి కర్తలు, జీవులు , భోక్తలుగా ఉండిరి.
మహిమాన ఆసన్ = గొప్పవగు ఆకాశాదులు భోగ్యములుగా(భోగింపతగినవిగా) ఉండినవి.
స్వధా అవస్తాత్.= అన్నము (భోగ్య పదార్థము) తక్కువగా ఉండెను.
ప్రయతిః,= ఈశ్వరీయ ప్రయత్నము( భుజించువాడు)
పరస్తాత్= గొప్పగా ఉండెను. ( భోగ్యప్రపంచమును భోక్తృ ప్రపంచముకంటె తక్కువగా చేసెను.భోగ్య= భోగింపదగిన; భోక్తృ= అనుభవించు )
తాత్పర్యము
మాయా సహితుడగు పరమేశ్వరుడు సక ల జగత్తును సృష్టించి తానే స్వయముగా వాటిలో ప్రవేశించి, భుజించువాడు, భుజించునది అను విభాగము చేసాడని తాత్పర్యము
సాయణాచార్యుల వారి నాసదీయ సూక్త వివరణము చివరి భాగము (04-09-2016)
को अद्धा वेद क इह प्र वोचत् कुत आजाता कुत इयंविसृष्टिः ।
अर्वाग् देवा अस्य विसर्जनेनाथा को वेद यतआबभूव ॥6॥
ప్రతి పదార్థము
కోఅద్ధా వేద కఽఇహ ప్రవోచత్ కుత।ఆజాతాకుతఽఇయం విసృష్టిః ।
అర్వాగ్దేవా।ఆస్య విసర్జనేనాథాకో వేద యత ఆబభూవ ॥ ౬ ॥
కః= ఏ పురుషుడు
అద్ధా = పరమార్థ రూపములో (విశేష సత్య రూపములో)
వేద = తెలుసుకొనుచున్నాడు?
కోవా ఇహ=ఎవరు ఈలోకమునందు
ప్రవోచత్ =దీనిని వివరించగలరు?
ఇయం= ప్రత్యక్షముగా కనబడు
విసృష్టిః = ఈ వివిధ సృష్టులు( భూత భౌతిక, భోక్తృ, భోగ్యాది రూపములుగా ఉన్న సృష్టి) (భోగ్య= భోగింపదగిన; భోక్తృ= అనుభవించు)
కుతః= ఏ ఉపాదాన కారణము వలన
కుతః= ఏ నిమిత్త కారణము వలన
ఆజాతా=పుట్టింది?(ఈ రెండు విషయములను బాగా)
కోవేద= విస్తారంగా ఎవరు చెప్పగలరు?
దేవాశ్చాస్య= దేవతలు ఈ ప్రపంచములో
విసర్జనేన తేన = ఆకాశాది భూతోత్పత్తికి తరువాత వివిధ భౌతిక పదార్థముల సృష్టి జరిగిన దానితో
అర్వాగ్=పిమ్మట దేవతలు నవీనులుగా చేయబడిరి.
వేద= ఎవరు ఈ జగత్కారణమును తెలుసుకొనుచున్నాడు?
యతః= ఏకారణము వలన ఈ సకల జగత్తు
ఆబభూవ= ఉద్భవించెను
తాత్పర్యము
ఏ పురుషుడు పరమార్థ రూపములో ఈ సృష్టి కారణము తెలుసుకొనుచున్నాడు?ఎవరు ఈలోకములో
దీనిని వివరించగలరు?
ప్రత్యక్షముగా కనబడే భూత, భౌతిక, భోక్తృ, భోగ్యాది రూపాలుగా ఉన్న ఈ సృష్టి ఏ ఉపాదాన కారణము వలన
ఏ నిమిత్త కారణము వలనపుట్టింది? ఈ రెండు విషయములను బాగా విస్తారంగా ఎవరు చెప్పగలరు? (ఒక కుండ తయారీకి మట్టి కారణము, దాన్ని ఉపాదానము అంటారు.తయారు చేయాలని సంకల్పించే వాడు ఒక కారణము దానిని నిమిత్తము అంటారు. )
ఈ ప్రపంచములో ఆకాశాది భూతోత్పత్తికి తరువాత వివిధ భౌతిక పదార్థముల సృష్టి జరిగిన తర్వాత దేవతలు కొత్తవారిగా చేయబడ్డారు. . ఇటువంటి దేవతలు – సృష్టి తర్వాత ఉన్న దేవతలు ఈ సృష్టి కారణాన్ని ఎలా తెలుసుకోగలరు? ఎలా వివరించగలరు?
దేవతలే తెలుసుకోలేని సందర్భములో వారికంటె వేరైన మనుష్యుడు ఎలా తెలుసుకొనుచున్నాడు? ఏకారణము వలన ఈ సకల జగత్తు పుట్టింది?
इयं विसृष्टिर्यत आबभूव यदि वा दधे यदि वा न ।
यो अस्याध्यक्षः परमे व्योमन् सो अङ्ग वेद यदि वा नवेद ॥7॥
ఇయం విసృష్టిర్యత ఆబభూవ యది వా దధే యది వా న।
యో అస్యాధ్యక్షః పరమే వ్యోమన్ సో అంగ వేద యది వా న వేద॥
ప్రతి పదార్థము
ఇయం = ఈ
యతః= ఉపాదాన భూతుడగు పరమాత్మ నుండి (ఒక కుండ తయారీకి మట్టి కారణము, దాన్ని ఉపాదానము అంటారు)
విసృష్టిః = వివిధ పర్వత , నదీ , సముద్ర రూపమైన విచిత్రమగు ఈ సృష్టి
ఆబభూవ =పుట్టింది
యది వా దధే = ఆ పరమాత్మ జగత్తును ధరించవచ్చును
యది వా న=ధరించలేకపోవచ్చును. (ఒకవేళ ధరించగలిగితే భగవంతుడే ధరించవచ్చును. ఇతరులు ధరించుటకు సమర్థులు కారు.
అన్య= భూత భౌతికాత్మకమగు జగత్తుకు
యః అధ్యక్షః= ఎవరు అధిపతియో
పరమే = గొప్పదగు
వ్యోమన్= ఆకాశమునందు(ఆకాశమువలె నిర్మలమైన స్వప్రకాశమందు)
వ్యోమని= నిరతిశయ ఆనందములో ఏ పరమేశ్వరుడు కలడో
వ్యోమని= విశిష్ట స్వరూపమయిన ఆత్మయందు ఏ పరమేశ్వరుడు కలడో
సో అంగ = అతడే
వేద= తెలుసుకొనుచున్నాడు
యది వా న వేద= ఇతరులు తెలుసుకొనలేకున్నాడు
సర్వజ్ఞుడగు ఈ శ్వరుడు తప్ప సృష్టి విషయము మరెవ్వరూ తెలుసుకొనలేరని భావము.
తాత్పర్యము
ఉపాదాన భూతుడగు పరమాత్మ నుండి (ఒక కుండ తయారీకి మట్టి కారణము, దాన్ని ఉపాదానము అంటారు)వివిధ పర్వత , నదీ , సముద్ర రూపమైన విచిత్రమగు ఈ సృష్టి పుట్టింది
ఆ పరమాత్మ జగత్తును ధరించవచ్చును.ధరించలేకపోవచ్చును. ఒకవేళ ధరించగలిగితే భగవంతుడే ధరించవచ్చును. ఇతరులు ధరించుటకు సమర్థులు కారు.
భూత భౌతికాత్మకమగు జగత్తుకు, ఎవరు అధిపతియో గొప్పదగు నిర్మలమైన స్వప్రకాశమందు,నిరతిశయ ఆనందములో ఏ పరమేశ్వరుడు కలడో, విశిష్ట స్వరూపమయిన ఆత్మయందు ఏ పరమేశ్వరుడు కలడో, అతడే ఈ సృష్టిని తెలుసుకొనుచున్నాడు
ఇతరులు తెలుసుకొనలేకున్నారు.సర్వజ్ఞుడగు ఈ శ్వరుడు తప్ప సృష్టి విషయము మరెవ్వరూ తెలుసుకొనలేరని భావము.
ఇంతటితో సాయణాచార్యులవారు రచించిన నాసదీయ సూక్త భాష్యానికి తెలుగు అనువాదం సమాప్తం.
మంగళమ్ మహత్
-సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి