మా ఇంటి ఘటో....
💐💐💐💐💐💐
"అట్టు అట్టు పెసరట్టూ..ఉల్లిపాయ పెసరట్టూ...
ఉప్మాతో జత పెట్టు, భల్ చెట్నీతోటీ కలేసి కొట్టూ..."
ఎక్కణ్ణించో పిఠాపురం నాగేసర్రావు పాట వినిపిస్తోంది.
'ఈ పాట ఎప్పుడో విన్నట్టుందే' అనుకుంటున్నానో - లేదో...
"ఇదిగో...ఏవోయ్...రేప్పొద్దున్న మనింట్లో టిఫిన్...
పెసరట్టుప్మా చేసుకుందామా ?" అనే అడ్వాన్స్
బుకింగు ఆర్డరొచ్చేసింది !
"చచ్చాంరా దేవుడా...ఇప్పుడు...ఎప్పటిదో...
నేను పుట్టనిక్రితం పాట వినబడ్డట్టుంది...
నా తిండిపుష్టి మొగుడికి" అనుకున్నాను.
"మా ఆయన బంగా........రం !" అని మా పుట్టింట్లో సాగదీసి చెబుతాను గాని, ఈయన తిండిగోల గురించి చెబితే, నవ్వుతారని, పుట్టింట్లో కూడా చెప్పట్లేదు.
ఈయన ఓ మోస్తరు మంచోడే కానీ, అదేం గోలో...
ఈయనకి, ఎక్కడ తినేవి ఏం చూసినా, విన్నా,
వెంఠనే అవన్నీ తినెయ్యాలనిపించేటంత జిహ్వ చాపల్యం !
ఆమధ్యెప్పుడో...ఎవరో రికమండు చేశారన్జెప్పి,
మేవిద్ధరం, వెళ్ళక వెళ్ళక, "మిథునం" సినిమాకెళ్ళాం...ఈడూ - జోడూగా...
అసలీమధ్య, ఈయన్తో బయటికెళ్ళడం మానేశాను...
పోకిరీ కుర్రాళ్ళు, మమ్మల్ని చూసి, "ఏనుగు - ఎలక" అంటున్నారని !
ఎందుకో...నిజంగానే, నాకు నేను, ఎలకలాగే అనిపిస్తున్నాను, ఈయన ముందు !
సినిమాలో ఆ అప్పదాసు పాత్రలో ఈయన దూరిపోయినట్టున్నారు, ఎప్పటికీ బయటికి రారే...!
పైగా, "ఈ అప్పదాసున్నాడే...నాకు అగ్రజుడు, దగ్గిరచుట్టం" అని తెగ మెచ్చేసుకుంటున్నారు !
చెప్పొద్దూ... నేనుకూడా...ఆ బుచ్చిలక్ష్మి పాత్రలో,
ఎంతోకొంత దూరిపోయాను...
వాళ్ళది అదోరకం దాంపత్యం...
మొగుడిమీద ప్రేమ వుంటుంది కానీ, ఆయన తిండిగోలమీద విసుక్కుంటూనే, మళ్ళీ అన్నీ చేసిపెడుతూనే వుంటుంది, నాలాగ !
ఇంటికొచ్చిందగ్గిర్నించీ, ఈయన...
"ఆవకాయ మన అందరిదీ...గోంగూర పచ్చడీ మనదేలే" అనే పాటట్టుకుని వదల్రే !
అందులో వర్ణించిన, ఇడ్డెన్నులు, కొబ్బరిచెట్నీ, పెసరట్టు, అల్లం, పులిహోర, మిర్చిబజ్జీ, వేడి పాయసం, ఆవడ - పెరుగు, దిబ్బరొట్టి, తేనెపానకం, గుత్తివంకాయ కూర, గుమ్మడికాయ పులుసు, ఆవపెట్టిన పనసపొట్టు కూర వగైరాలన్నీ...ఈయనకి ఆరాధ్య దైవాలే కదా ?
ఇంక చెప్పేదేముంది...ఆ పాట, ఈయన సెల్ లో అస్తమానూ మారుమోగిపోతోంది !
💐💐
మా పెళ్ళైన కొత్తలో, రేడియోలో ఏదో పాతపాట వస్తోంది...
"అందమైన బావా...ఆవుపాల కోవా...
విందుగా, పసందుగా, నా ప్రేమనందుకోవా..." అని !
అందులో శిష్ట్లా జానకమ్మ,
"హాటు హాటు గారీ...స్వీటు స్వీటు బూరీ...
రాగాల రవ్వట్టూ...భోగాల బొబ్బట్టూ...
నా ప్రేమ పెసరట్టూ..." అనుకుంటూ,
చాలా రకాల తిళ్ళ గురించి వర్ణిస్తుంది.
ఖర్మ కాలి, అవన్నీ ఈ మనుగుడుపుల అల్లుడుగారు విన్నట్టున్నాడు !
"మా పదహార్రోజుల పండగలోపు, అవన్నీ చేయించమని, నాద్వారా, మా అమ్మకి చెప్పించారు !
అత్తలకి, కొత్తల్లుడికి అన్నీ చేసిపెట్టాలనే వుంటుంది కానీ, బొత్తిగా ఇలా, "వెంకటాద్రి వంటిల్లు" లెవెల్లో అడుగుతాడని మా అమ్మకేం తెల్సు ?
ఇంక తప్పేదేముంది...మా ఆస్థాన వంటలక్క,
శేషమ్మ గారిని పిలిచి, రోజుకోరకం చేయించి పెట్టింది.
అప్పణ్ణించీ మా అమ్మకి, కూతురు - అల్లుడూ రావడం ఇష్టమే కానీ, భయంకూడా పట్టుకుంది !
దాన్నే, "అల్లుడు ఫోబియా" అంటారని, మా డాట్రారు చెప్పేశారు !
💐💐
పెళ్ళైన కొత్తలోనే మా అత్తగార్ని అడిగేశా...
"అత్తయ్యగారండీ...ఈయన్ని చిన్నప్పుడు గాని,
'మాయాబజార్' సినిమాకి గాని తీసికెళ్ళారా ?" అని !
"అయ్యో...మాయాబజార్ చూడని వాళ్ళెవరమ్మా...
మా ఇంట్లో అందరం, చాలాసార్లు చూశాం.." అన్నారు.
కొంచెం మొహమాటపడుతూనే అడిగాను,
"వివాహభోజనంబు పాట వచ్చినపుడు,
ఈయన ఎలా వుండేవారూ..." అని.
"నువ్వంటే గుర్తొచ్చింది, అందులో ఘటోత్కచుడు తిన్నవన్నీ...తనకీ కావాలని ఒకటే పేచీ...
ఇంక వాడితో పడలేక, వాళ్ళ నాన్న, ఏవో రెండు మూడు రకాలు మిఠాయి కొట్లోంచి, రకానికి అరకిలో చొప్పున తెచ్చి, సీసాల్లో పోసి, 'ఇంక నెలాఖరుదాకా పరవాలేదులే' అనుకున్నారు.
వీడు, ఓ కర్రని గదలాగ, భుజమ్మీద పెట్టుకుని,
'హహహ్హహ హహహ్హా' అనుకుంటూ, వాటిచుట్టూ తిరుగుతూ, ఎవరికీ మిగల్చకుండా, అన్నీ తనే తినేశాడు ! దిష్టి తగుల్తుందని, ఎవరికీ చెప్పలేదు."
అని నిట్టూర్చింది.. ఆవిడ !
💐💐
టీవీలో ఏదైనా సినిమా గాని, సీరియల్ గాని చూస్తుంటే, ఎక్కడ భోజనాల సీన్లు వస్తాయో అని భయపడి ఛస్తుంటాను.
టీవీలో ఏదైనా సినిమాలో భోజనాల సీను వస్తే,
సినిమా వాళ్ళదేంపోయింది, షో కోసం, ఆ టేబుల్ నిండా, రకరకాల పదార్ధాలు, పది రకాల ప్లాస్టిక్ పళ్ళు పెట్టేస్తారు.
ఆ సినిమాలో నటించేవాళ్ళు, అవేం తినరు సరికదా,
ఏదో మాటా - మాటా వచ్చి, మొహాలు ముడుచుకుని, కంచంలోనే చేతులు కడిగి చక్కా పోతారు !
తరవాత, ఇక్కడ మాకుంటుంది...రుద్రవీణ !
ఈయనెళ్ళి, ఫ్రిడ్జ్ లో వెతికేస్తుంటారు !
ఎప్పుడైనా రైల్లో వెడుతుంటామా...
ఎవరెవరో అమ్ముకునేవాళ్ళొచ్చి, ఏవేవో అమ్మేస్తుంటారు...జాం కాయలు, మావిడి తాండ్రలు,
వేశనక్కాయలు, పాకుండలు, చిక్కీలు గట్రా...
వాళ్ళందర్నీ పోషించే బాధ్యత ఈయనే తీసుకుంటారు, ఎవణ్ణి వదలరు !
ఈయన ఇంటిదగ్గిరే...చిల్లర మార్చుకుని, మరీ
ఆటో ఎక్కుతారు. ముందు జాగర్త !
ఇది చాలదన్నట్టు, ప్రతీ స్టేషన్లోనూ దిగి, అక్కడ
ప్లాట్ ఫారమ్మీదున్న అడ్డమైనవీ కొనుక్కుతింటారు.
ఇంటికెళ్ళగానే మొదలవుతుంది...
"ఘల్లు ఘల్లు ఘల్లు...గజ్జల సంగీతం !"
పొట్టలోపలికి తోసేసినవన్నీ విడివిడిగాను, సామూహికంగాను కలిసి, మిశ్రచాపుతాళంలో నాట్యప్రదర్శన ప్రాక్టీసు చేస్తాయనుకుంటా...ఆ చిత్ర విచిత్ర శబ్దాల గురించి, తదనంతర పరిణామాల గురించీ మీరడగనూ కూడదు - నేను చెప్పనూ కూడదు... ఎడిటింగులో పోతాయన్నమాట !
సినిమాకి వెళ్ళిన ప్రతిసారీ...ఇంటర్వల్లో ఈయన బయటికెళ్ళాల్సిందే, అక్కడ అమ్మే నానా రకాలు కొనాల్సిందే, సినిమా అయ్యేదాకా పరపరలాడించాల్సిందే !
రెండు మూడుసార్లు, ఆ సౌండ్లు భరించలేక, పక్కసీటువాళ్ళు కొట్టడానికొచ్చారుకూడానూ...
💐💐
ఓ రోజు, మొదటిసారి నాగేసర్రావు డబల్ పోజు వేసిన "ఇద్దరు మిత్రులు" సినిమాకెళ్ళాం.
అందులో, రేలంగి - రవణారెడ్డి గారెలు తినడంలో
పోటీ పెట్టుకుంటారు. అంతే... ఆ సీను ఈయనకి
తెగ నచ్చేసింది !
మర్నాడు..మాఇంట్లో...గారెల పండగ అని చెప్పఖ్ఖర్లేదుగా ? పైగా, ఎవరైనా అలాంటి గారెల పోటీ పెడితే బాగుణ్ణుట !
పరుగు పందాలు, బరువులు ఎత్తడాల్లో పోటీలు ఈయనకి పడవు !
"నేను జపాన్లో అయినా పుట్టాను కాదు" అంటుంటారు.
"ఎందుకు ?" అంటే, అక్కడ సుమోగాళ్ళని బాగా మేపుతార్ట ! అందుకుట !
మా తమ్ముడు, ఈయనకి, "తుమ్ముల తిమ్మయ్య బావ" అని పేరెట్టాడు.
'ఎందుకురా, అలా ?' అనడిగితే,
"అక్కా, బావని నువ్వు సరిగ్గా చూళ్ళేదులా వుంది, బావ బయట ఎండలోకి వస్తే చాలు...ముక్కు ఆకాశం వైపు పెట్టి, కళ్ళు చిట్లించి, నోరు తెరిచి, ఇంకో రెండు నిమిషాల్లో గేరంటీగా తుమ్ముతాడు అనేట్టుగా హడావిడి చేస్తాడు.." అన్నాడు.
వాడన్నాక, నాక్కూడా, 'అవును, నిజమేగా...' అనిపించింది.
💐💐
మొన్న ఆదివారంనాడు, ఈటీవీ వాళ్ళు, "శ్రీకృష్ణపాండవీయం" సినిమా వేస్తున్నారు.
ఆ సినిమా మాఇంట్లో అందరికీ చాలా ఇష్టం.
ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టదు.
అందరం చేరి, సరదాగా చూస్తున్నాం...
సినిమా చూసేటప్పుడు, ఈయనకి పక్కని ఓ కిలో జంతికల్లాంటివి ఉండాల్సిందే !
భీముడు - బకాసురుణ్ణి చంపడానికి, తన తల్లి
కుంతీదేవి ఆశీస్సులు తీసుకుని, రెండు
దున్నపోతుల బండెక్కి, బయల్దేరతాడు.
నాకు హఠాత్తుగా గుర్తొచ్చింది...
అప్పుడే భీముడికోసం, మాధవపెద్ది సత్యం,
ఒకపాట అందుకుంటాడని...
"భళా భళా నా బండి...పరుగూ తీసేబండి..."
అని పాడుతూ...
"అట్టుర...మినపట్టుర...దీన్నొదిలిపెట్టేదెట్టురా...
తీపి తీపి బొబ్బట్టుర...ఇది తింటే ఆకలి కట్టురా..."
అని పాడేలోపు, మా ఇంట్లో కరెంటు కట్టు అవడం
దేశానికి చాలా అవసరమనిపించి, లోపలికెళ్ళి,
మెయిన్ స్విచ్చి కట్టేసి వచ్చి, "వెధవ కరెంటు,
సరిగ్గా ఇప్పుడే పోవాలా ?" అని ఊర్వశి శారదని మించిపోయాను.
పాపం ఈయన, నన్ను ఓదారుస్తున్నారు...
....ఒక బాధిత ఇల్లాలి స్వగతం !
😜😜😜
వారణాసి సుధాకర్.
💐💐💐💐💐💐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి