*పరమపదం*
*’శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు!' అనటంలోని ఆంతర్యం- చీమనుంచి బ్రహ్మవరకు సర్వం శివాజ్ఞకు లోబడి ఉంటుందనే. సమస్త విశ్వమూ, సృష్టిలోని అణువణువూ శివమయమే. శివం కానిది 'శవ'మంటారు జ్ఞానులు. అంటే మృతపదార్థమని అర్థం.*
*శివమే సత్యం, శివమే సుందరం, శివమే నిత్యం. శివమే అనంతం. శివమే జ్ఞానం. శివమే చైతన్యం. శివమే సర్వజగత్తులకు మూలాధారం.*
*అనేక లక్షల జన్మల అనంతరం లభించే మానవజన్మ, ముక్తి సోపానానికి ముందుమెట్టు లాంటిది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే శివభక్తిని వదలకూడదు.*
*శివానందలహరిలో ఒక శ్లోకముంది. సారాంశం ఏమిటంటే…*
*శివుని పేరు పలికే నాలుకే నాలుక, శివుని దర్శించే కన్నులే కన్నులు, శివుని పూజించే చేతులే చేతులు. శివుని సదా స్మరించేవాడే ధన్యుడు..*
*పరిపూర్ణ జ్ఞానస్థితికి చేరుకున్న ఆదిశంకరులను 'నీవెవరు?' అని అడిగినప్పుడు- 'చిదానంద రూపం శివోహం శివోహం'- నేను చిదానంద స్వరూపుడనైన శివుణ్ని. మిగతా మరేమీ కాను అని ఆత్మస్థితిలో చెప్పగలిగారు.*
*అదే 'శివసిద్ధి'.*
*అంటే, సాధకుడు అనేక జన్మలనుంచి అనుభవిస్తున్న అజ్ఞానపు పొరల్ని ఒక్కొక్కటిగా చీల్చుకుంటూ బయటికి వచ్చి, తనను తాను చూసుకున్నప్పుడు, తాను ఆత్మననీ, అనగా సాక్షాత్తు శివస్వరూపమని గ్రహిస్తాడు.*
*పూజలు, అర్చనలు, ప్రార్థనలు, ఉపవాసాలు, తపస్సులు, గురుశుశ్రూషలు- ఇవన్నీ ఈ అత్యున్నత స్థితిని అందుకోవటానికే.*
*శివానుగ్రహం అత్యంత సులభతరం. అందరికీ అందుబాటులో ఉంచటానికే- బిల్వార్చన, రుద్రాక్షధారణం, విభూతి లేపనం, అభిషేకంవంటి అతి సామాన్య విధానాలను పరమశివుడు భక్తుల కోసం ఏర్పరచాడంటారు.*
*జీవితకాలంలో మన ప్రతి చర్యనూ శివారాధన భావనతో ఆచరించడానికి మనసును అనుక్షణం హెచ్చరిస్తూ, అప్రమత్తంగా ఉంచుతుండాలి. అప్పుడు మనం సదా శివ సాన్నిధ్యంలో ఉన్నట్లే. క్రమంగా అదే మన ఆత్మకు శివసిద్ధిని కలిగిస్తుంది. అదే పరమపదం.*
🙏ఓం నమః శివాయ 🙏
🔥శివాయ గురవే నమః 🔥
🔱సర్వం శివమయం 🔱
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి