2, ఆగస్టు 2023, బుధవారం

ధ్యానం చేద్దాం

 శు భో ద యం🙏


గోవిందపదసమాశ్రయణమే!సర్వశ్రేయోదాయకము.


గోవింద పదారవింద  మహిమ!


                  ఉ: పొందరు  దుఃఖముల్,  భయము పొందరు, పొందరు  దైన్య మెమ్మయిన్,


                       పొందరు  తీవ్ర దుర్దశలు , పొందు ప్రియంబులు , పొందు   సంపదల్


                      పొందు సమగ్ర సౌఖ్యములు , పొందు సమున్నత  కీర్తు  లెందు,,   గో


                       వింద  పదారవింద  పదవీ  పరిణధ్ధ   గరిష్ట   చిత్తులన్;


                            నృసింహ పురాణము-  ఎఱ్ఱాప్రెగ్గడ;


                      

                 గోవింద పదారవింద  ధ్యాన పరాయణులకు  దుఃఖములు రావు. (దుఃఖములకు వెరువరని భావము)  భయముండదు.

జీవన దైన్యముండదు. దుర్దశలు  దాపురించవు.  ప్రియములు  కలుగుచుండును. సంపదలు కలుగును. సంపూర్ణమైన  సుఖములు కలుగును. సర్వోన్నతమైన కీర్తికలుగును.ననిభావం!


                         ఈపద్యంలో  ఒక  చమత్కారం ఉన్నది. గోవిందుని గొలచినవారికి  కలుగని  కీడులు ఒకవరుసగాను, కలిగెడు

లాభములను మరియొక వరుసగాను వివరించుట.


                      నవ విధ భక్తి మార్గాలలో  పాద సేవ సముచిత మైనది. అహంకార రాహిత్యము నొనగూరిచి, మనో విశుధ్ధిని  కలిగించుటకు  అది చక్కనిమార్గం.  సనక సనందనాది భక్తులు గోరిన దదియే! నేడు  తొలి  యేకాదశీ  సందర్భముగా మనమందరం

ఆదేవదేవుని పై మనసు నిలిపి  ధ్యానం  చేద్దాం. ముక్తిమాట  యేమైనా కనీసం  చిత్త శాంతితో  ప్రశాంతంగా  బ్రతికే అవకాశం కోసం

ప్రయత్నం చేద్దాం!


                                                           స్వస్తి!🙏🌷🌷🌷

కామెంట్‌లు లేవు: