24, నవంబర్ 2023, శుక్రవారం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


పుట్టిన బిడ్డడు రోదిస్తున్నాడు. తల్లి ఉంటే చన్ను కుడిపేది. ఇప్పుడు ఏమిటి చెయ్యడమా అవి

మంత్రులు మల్లగుల్లాలు పడుతున్నారు. అప్పుడు ఇంద్రుడు తన చూపుడు వేలిని (దేశిని) అందించి

మామ్ (నన్ను) ధాతా (నా చేతివేలిని చీకును) అన్నాడు. అప్పటినుంచీ అతడికి అదే నామధేయమయ్యింది.

అందరూ మాంధాత మాంధాత అన్నారు. మహాబలిష్ఠుడై చాలాకాలం భూగోళాన్ని పరిపాలించాడు.

(అధ్యాయం - 9, శ్లోకాలు - 630

కం ధాస్యతి కుమారో యం మంత్రిణశ్చుక్రుశుర్భృశమ్ |

తథేంద్రో దేశవీం ప్రాదా న్మాంధాతేత్యవదద్వచః

సోఽభవద్బలవాన్ రాజా మాంధాతా పృథివీపతిః

తదుత్పత్తిస్తు భూపాల ! కథితా తవ విస్తరాత్


ఆ మాంధాత సర్వభూగోళాన్ని జయించి చక్రవర్తి అయ్యాడు. దస్యులు ఇతనికి భయపడి

గాఢారణ్యాలలోకి పారిపోయి కొండగుహలలో దాక్కున్నారు. ఈ లోకోపకారానికి సంతోషించి దేవేంద్రుడు

త్రవదస్యుడు అనే బిరుదునిచ్చి గౌరవించాడు.

శశబిందు మహారాజుగారి గారాల కూతురు బిందుమతి ఇతనికి పట్టమహిషి ఈ దంపతులకు

ఇద్దరు తనయులు కలిగారు. పురుకుత్సుడు - ముచుకుందుడు. వీరిలో పురుకుత్సుడికి అరణ్యకుడు

జన్మించాడు. పరమధార్మికుడు. ఇతని కుమారుడు పితృభక్తి పరాయణుడైన బృహదశ్వుడు. ఇతనికి

హర్యశ్వుడు తనయుడు. హర్యశ్వుడి కొడుకు త్రిధన్వుడు. త్రిధన్వుడి సంతానం అరుణుడు.

సత్యవ్రతుడు త్రిశంకుడైన తీరు

ఈ అరుణుడి సుపుత్రుడు సత్యవ్రతుడు. మహాపాపాత్ముడు. కామలోలుడు. ఒక విప్రకన్యను

పెళ్ళిపీటలమీదనుంచి అపహరించాడు. బ్రాహ్మణులంతా కలిసి హాహాకారాలు చేస్తూ అరుణుడికి

మొరపెట్టుకున్నారు. తనయుడు చేసిన దుర్మార్గానికి అరుణుడు మండిపడ్డాడు. దేశబహిష్కారం

విధించాడు. శ్వపచులతో కలిసి అడవుల్లో నికృష్టంగా జీవించమని గెంటేశాడు. వాడు అడవుల్లోకి పోయి

కవచమూ ధనుర్బాణాలూ ధరించి శ్వపచులతో జీవించసాగాడు.

వెడుతూ వెడుతూ కులగురువులుగదా వసిష్ఠులవారు తండ్రికి చెప్పి కోపం చల్లారుస్తారేమోనని

ఆశపడి అభ్యర్థించాడు. వసిష్ఠుడు నిష్కర్షగా తిరస్కరించడమేకాదు అరుణుడి చర్యను సమర్థించాడు. ఈకఠినశిక్షకు తండ్రిని ప్రేరేపించింది ఈయనగారేనని గ్రహించి సత్యవ్రతుడు వసిష్ఠులపై అలిగి

గత్యంతరంలేక శిక్షను శిరసావహించి అరణ్యాలకు వెళ్ళాడు.

కామెంట్‌లు లేవు: