24, నవంబర్ 2023, శుక్రవారం

చిన్ననాటి ముచ్చట్లు.

 *చిన్ననాటి ముచ్చట్లు..*


" మాది కౌశికస గోత్రము..మేము ఆరువేల నియోగి బ్రాహ్మణులము..నాపేరు తలుపూరు కామసుందర రావు..మేము కామాక్షీఅమ్మవారి భక్తులం..అందువల్ల నాకు మా తల్లిదండ్రులు కామ సుందరరావు గా నామకరణం చేసారు..మాది నెల్లూరు జిల్లా..ఆనంతసాగరం మండలం లోని రేవూరు మజరా ఇసుకపల్లె గ్రామం..అంటే..ఈ దత్తాత్రేయ స్వామివారి మేనమామ గారి ఊరు..మా పెదతండ్రి గారు ఆవూరికి కరణం గా పనిచేసేవారు..రేవూరు మజరా ఇసుకపల్లె గ్రామం గా రికార్డులలో ఉంటుంది.. నేను సంస్కృత లెక్చరర్ గా పనిచేసి రిటైర్ అయ్యాను..ఇప్పటికీ మేము అక్కడే నివాసం వుంటున్నాము.." 


ఈమధ్య ఒక ఆదివారం నాడు పై మాటలు చెప్పిన శ్రీ కామసుందర రావు గారు దంపత్సమేతంగా మొగలిచెర్ల గ్రామం లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చారు..వారిని చూడటం అదే మొదటిసారి...శ్రీ దత్తాత్రేయ స్వామివారి మేనమామ నుంచి వచ్చారు కనుక..సహజంగానే శ్రీ స్వామివారి బాల్యం గురించి కొంత సమాచారం తెలిసి వుంటుందనే ఉద్దేశ్యంతో వారిని ఆనాటి విశేషాలు చెప్పమని అడిగాను..


"ఈ స్వామివారు చిన్నతనం నుంచీ మాకు బాగా తెలుసు.. వాళ్ళ మేనమామ గారైన నారా వెంకటప్ప నాయుడు గారి పెద్ద కుమారుడు నారా బలరామానాయుడు గారు ఆ ఊరు మునసబు గా పనిచేస్తుండేవారు..మా పెదనాన్నగారు కరణం.. కనుక మా రెండు కుటుంబాలకు..అదే విధంగా శ్రీ స్వామివారి కుటుంబం తోనూ బాగా సాన్నిహిత్యం వుండేది..వాళ్ళు మొత్తం ఐదుగురు అన్నదమ్ములు..స్వామివారి తండ్రిగారు వేమయ్య నాయుడు..కొంతకాలానికి ఆ కుటుంబం నెల్లూరు జిల్లా లోని తూర్పు ఎర్రబల్లె గ్రామం వద్ద కొంత పొలం కొనుక్కొని..అక్కడే స్థిరపడి వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళు..శ్రీ స్వామివారు చిన్నతనం నుంచీ మా ఇంటికి వస్తూ పోతూ వుండేవారు..తూర్పు ఎర్రబల్లె కు వెళ్లిన తరువాత..ఈయన సన్యాసం తీసుకున్నారు..ఏర్పేడు వ్యాసాశ్రమం లో ఉన్న రోజుల్లో కూడా ఒకటి రెండు సార్లు మా గ్రామానికి స్వామివారు వచ్చి వెళ్లారు..అప్పుడు కూడా మా ఇంటికి వచ్చారు..ఇక్కడ మీకోక ముఖ్య విషయం చెప్పాలి...మాకు తెలిసిన ఒక స్త్రీమూర్తి క్షయ వ్యాధితో బాధ పడుతూ ఉండేది..ఆమె కోసం స్వామివారు ప్రత్యేకంగా పూజ చేసారు.. సహజంగా స్వామివారు ఎవ్వరికీ జాతకాలు చెప్పడం..పూజలు చేయడం చేసినట్లు మా దృష్టికి రాలేదు కానీ..ఈ మనిషి కోసం పూజ చేసారు.." 


"శ్రీ స్వామివారు మా పెద నాన్నగారి ఇంటికి వచ్చినప్పుడు..ఆ ఇంటిముందు ఒక రాతి బండ ఉండేది..ఆ రాతి బండ క్రింద రాళ్లు పేర్చి అరుగులా వుంచాము..దానిమీద కూర్చునే వారు..ఆరోజుల్లో మేము బ్రాహ్మణులము కనుక..ఇతర కులస్తులు మా ఇళ్లకి వస్తే నేల మీద కూర్చునే వారు..స్వామివారు ఈ రాతి బండ మీద కూర్చునే వారు..ఇప్పుడు మేము మా ఇల్లు అంతా ఆ పాత రూపు రేఖలు మార్చివేసి..మళ్లీ కొత్తగా కట్టుకున్నాము కానీ..శ్రీ స్వామివారు కూర్చున్న రాతి బండ ను మాత్రం భద్రంగా మా ఇంటి ఆవరణలోనే వుంచాము..నేను వయసులో చిన్నవాడిని..నన్ను ఆశీర్వదించారు" 


"ఏది ఏమైనా..ఈ మహానుభావుడితో మాకూ కొంత అనుబంధం..సాన్నిహిత్యం ఉండటం మా పూర్వజన్మ సుకృతం..ఇన్నాళ్లకు ఆయన సమాధి మందిరాన్ని దర్శించుకోగలిగాము..చాలా ఆనందంగా ఉంది..మళ్లీ మళ్లీ ఇక్కడకు వస్తుంటాము.." అని శ్రీ కామ సుందరరావు గారు ఎంతో సంతోషంతో చెప్పుకొచ్చారు..


శ్రీ దత్తాత్రేయ స్వామి గా కొలువబడుతున్న ఈ అవధూత గురించి ఏదైనా సమాచారం తెలుసుకుంటున్నప్పుడు మా దంపతులము ఒకరకమైన ఆహ్లాదానికి గురవుతూ ఉంటాము..ఆ అనుభూతి ఎవరికి వారే అనుభవించాలి..కానీ మీబోటి దత్త భక్తులతో పంచుకుంటే..మరింత ఆనందంగా వుంటుంది..


సర్వం..

శ్రీ దత్తకృప!!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరము..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలము..వయా కందుకూరు..SPSR నెల్లూరు జిల్లా..పిన్ కోడ్ : 523 114..సెల్ : 99089 73699 & 94402 66380)

కామెంట్‌లు లేవు: