24, నవంబర్ 2023, శుక్రవారం

మన అద్దంకోడు

 *మన అద్దంకోడు!*


🎬🎼📽️


అది 1945 ప్రాంతం. మధ్యాహ్నం రెండు గంటలైంది. అద్దంకి లోని రామాటాకీసు వద్ద

జనాలు గుమికూడి ఉన్నారు. ఎడ్లబళ్ళల్లా కట్టుకోని సినిమా చూడటానికి జనం వచ్చారు. కలవకూరు నుంచి వచ్చిన ఆసామి "మా రామయ్య పంతులు తెర మీద కనపడ్తారుట" అన్నాడు. ప్రక్కన ఉన్న అద్దంకి శెట్టి గారు శాంతయ్యతో..

 

“ఒరే శాంతయ్య, మన అద్దంకోడు, అదేరా! మన వెంకట్రాయుడు కొడుకు, అయిదోవాడు శ్రీరామ్మూర్తి సినిమాల్లో చేరాడట్రా ." అన్నాడు.


తిమ్మాయపాలెం కన్నయ్య పంతులు "అవునన్నా! పాదుకా పట్టాభిషేకం సినిమాలో దశరథుని వేషం వేస్తున్నాడు." అన్నాడు.


అవున్రా ఎంత పెద్దోడయ్యాడ్రా!వీడు. ఈ పిల్లగాడు చిన్నప్పుడు మన బుజ్జయ్య హార్మోనియం వాయిస్తే పద్యాలు పాడేవాడు. పద్యాలు నేర్చుకోవడానికి కలవకూరు నుండి మన తిమ్మాయపాలెం వచ్చేవాడ్రా!" అంటూ మన చల్లా సుబ్రహ్మణ్యం సినిమాకు టిక్కెట్లు ఇవ్వడేంటిరా! శాస్త్రుర్లు” అన్నాడు కన్నయ్య పంతులు తమ్మునితో.


అప్పడే జట్కా బండి నుండి దిగి వస్తున్న సినిమా హాలు యజమాని చల్లాసుబ్రహ్మణ్యం కన్నయ్య పంతుల్ని "బాబాయి" అని

పలకరించి, సినిమా హాలులో కూర్చోబెట్టి, సినిమా ప్రారంభ సూచకంగా గంటను మ్రోగించమని, గుమస్తాకు చెప్పి, మరో గుమస్తా నాగయ్యకు టిక్కెట్లమ్మటానికి పురమాయించాడు. సినిమా ఆపరేటర్ కాంతారావు రీలు ఎక్కించాడు.


ఈ లోపు జనాలు తోసుకుంటూ లోపలకు వచ్చారు. నేల టిక్కెట్లు పుల్ అయినాయి. బెంచి టిక్కెట్లు కూడా పూర్తిగా అమ్ముడు పోయాయి. మనూరోడి సినిమా కదరా, హాలు నిండిపోతుంది. కేబిన్ టిక్కెట్లు కూడా అమ్ము” అన్నాడు చల్లా సుబ్రహ్మణ్యంగారు. 


నేల టిక్కెట్టు పావలా, బెంచి టిక్కెట్టు అర్థ రూపాయి, కుర్చీ టికెట్టు ముప్పావల, కాబిన్ టిక్కెట్టు రూపాయి. కాబిన్ లో అద్దంకి డాక్టర్ ఉప్పలపాటి సుబ్రహ్మణ్యం, డాక్టర్ వెంకట రత్నం గారు, మునుసుబ్ పాపయ్యగారు, ఎస్సై గారు, తాసిల్దారు గారు ఉన్నారు. మన ఊరి అబ్బాయి సినిమాల్లోకి వెళ్ళాడని, గొప్పోడయ్యాడని, చిత్తూరు నాగయ్య, సి.యస్ ఆర్, కన్నాంబ, బొమ్మరాజు వారి అడపడుచు భానుమతి వాళ్ళతో నటిస్తున్నా డని తెలిసి, చిన్నా, పెద్ద అందరూ సినిమా చూడటానికి వచ్చారు. 


ఇంతలో గంట మ్రోగింది. లైట్లాపారు. తెల్లటి గుడ్డ పైన లైటు ఫోకస్ పడింది. తమాషాగా పేర్లు ఎగిరెగిరి తెర మీద పడుతున్నాయి.

వింత వింత శబ్దాలు చెవికి చేరుతున్నాయి. తారాగణం అన్న టైటిల్ పడగానే మన అద్దంకి శ్రీరామ్మూర్తి పేరు పడింది. జనాలు ఈలలు వేశారు. చప్పట్లకొట్టారు. శ్రీరామ్మూర్తి నటన అద్భుతమని మెచ్చుకున్నారు. 


ఇంటర్వెల్ అయ్యింది. 


“అబ్బూర్ని మించి పోయాడ్రా మనోడు” అన్నాడు కన్నయ్య పంతులు శాస్త్రుర్లయ్య తో.


“అవునన్నా” అని గుప్పెడు వేయించిన శెనక్కాయలు అన్న చేతీలో పోసి, మళ్ళా హాల్లోకి వెళ్ళారు. కైక వరాలడగడం జరిగింది, రాముణ్ణి అడవులకు పంపాలనటం, భరతు నికి పట్టాభిషేకం చేయాలనే సీను వచ్చింది. దశరథుని పాత్రలో జీవించాడు శ్రీరామ్మూర్తి గారు. సినిమాలో దశరథునితో పాటు హాల్లో ఉన్న వాళ్ళు గొల్లుమన్నారు. తమ పిల్లాణ్ణి అడవులకు పంపించినట్లుగా జనం బాధపడ్డారు. సినిమా అయిపోయింది. అందరూ దశరథుని పాత్ర గూర్చే మాట్లాడుకుంటున్నారు.


అద్దంకి కి కొత్తగా వచ్చిన ఎస్సైకి గ్రామ మునుసుబు పాపయ్య గారు అద్దంకి వారి గూర్చి అంతా వివరంగా ఇలా చెప్పసాగాడు. తెలుగు నాటక రంగాన దశరథ పాత్రకు పేటెంట్ అద్దంకి శ్రీరామ్మూర్తి. నాటకరంగాన ఒక ధ్రువతారగా వెలుగొంది, సినీ రంగాన ప్రవేశించిన గాయకుడు, నటుడు అద్దంకి శ్రీరామ్మూర్తి. అద్దంకి వెంకట్రాయుడు, లక్ష్మీ నరసమ్మల అయిదవ సంతానం వీరు. వెంకట్రాయుడు గారిది అద్దంకి. వృద్ధాప్యంలో వెంకట్రాయుడు గారు కల్వకూరులో స్థిరపడ్డారు.


దశరథునిగా,ధర్మరాజుగా, రాజరాజ నరేంద్రు నిగా, శివయోగిగా, కణ్వమహర్షిగా, హరిశ్చంద్రునిగా, మహరాష్ట్రంలోనే గాక ఇతర రాష్ట్రాలలో కూడా తన వాచికం, అభినయంతో మెప్పించి జన్నభూమి అద్దంకికి 

ఖ్యాతి తెచ్చిన తొలితరం రంగస్థల నటుడు అద్దంకి. గజారోహణ,గండ పెండేరాది సత్కారాలు అందుకున్నారు. సంగీత విద్వాన్, నాట్రకళావిశారద బిరుదులు పొందారు. 1935 లో చిత్రరంగంలో ప్రవేశించారు.1945 లో పాదుకాపట్టాభిషేకం విడుదలైంది. ఈ సినిమా శ్రీరామ్మూర్తి గారికి పేరు ప్రఖ్యాతలు సాధించిపెట్టింది.


పాపయ్య గారి ద్వారా శ్రీరామ్మూర్తి గారి విషయాలు విన్న ఎస్సైగారు ఆనందానికి లోనయ్యారు. అద్దంకికి ఘనత తెచ్చిన అద్దంకి వారిని స్మరిస్తూ వారి విగ్రహం అద్దంకి లో ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అది వారికిచ్చే గౌరవమని ఎస్సై గారు తలపోశారు.


- పుట్టంరాజు

కామెంట్‌లు లేవు: