పార్వతి సుందర రూపం !
చ: జిలుగగు వల్కలాంచెలము చెన్నయి చన్నులమీఁద జాఱఁగా
నలుకఁ దుషార శైలసుత యవ్వలి మోమయి , నాలుగేన్ పదం
బులు సని , భ్రూకుటీ కుటిల ముగ్ధ లలాట ముఖేందు బింబయై
మలఁగి కనుంగొనెన్ భుజగ మండనుఁడైన శఠ ద్విజోత్తమున్.
హరవిలాసము--4 ఆ--35 వ పద్యము; శ్రీనాధమహకవి.
పార్వతి తపమును గాంచి యామెమనో నిశ్చమును తెలిసికొనఁగోరి మాయా బ్రహ్మచారియైపరమేశ్వరుడు
అరుదెంచిన సందర్భము.
కఠినపదములకు అర్ధములు: జిలుగు- తళుకు : వల్కలాంచలము-నాఱచీర కొంగు;చెన్నయి- అందగించి; తుషారశైలసుత- హిమవత్పర్వత కుమారి; అవ్వలి - అటువైపు; భ్రుకుటీ- నుదిటిపై బొమముడిపాటు;కుటిలము-వంపుదిరుగుట;
మగ్ధ-చూడచక్కని ;లలాట-నుదురు; ముఖేందు బంబమై-చంద్రునిబోలు ముఖముగలదియై; మలగి-వెనుదిరిగి; మండనుడు- అలంకారములు గలవాడు; శఠ ద్విజోత్తమున్- శఠుడైన ( అప్రియ వచనములు చెప్పు) ద్విజోత్తమున్- బ్రాహ్మణుని;
భావము:- మెఱపులీనే నారచీర చెంగు అందముగా స్తనముల పైనుండి జారగా, కోపవశమున పార్వతి యటుమోమయి, నాలుగైదు అడుగులు ముందుకు నడచి, బొమ ముడిపాటుతో నందగించిన చందమామనుబోలు
ముఖముగలదియై సర్పభూషణుడై నిలచిన యా విప్రియ వాక్కులుబల్కు బ్రహ్మచారిని వెనుదిరిగి చూచినది.
విశేషాంశములు: "చక్కనమ్మ చిక్కినా అందమే!" అనేది సామెత. అదిపార్వతి యెడల చక్కగా సరిపోయినది.తపఃకృశయై
యున్న నగజ మనోనిశ్చయమును బరీక్షింప మాయామాణవకుడై శివుడరుదెంచు సమయమునకామె మిగుల చిక్కియుండుట నీ
పద్యము సూచించుచున్నది.
రాచ కన్నెయే యైనను వల్కలమును దాల్చుట యామె తపోనుష్ఠాన విధాయకమగు వస్త్రధారణను సూచించు చున్నది.
బ్రహ్మచారిమాటలకు కోపము వచ్చినది. సంవాదమును ముగించి ఆవలిమొగమై నాలుగైదు పదములు నడచుట ఆమెవైముఖ్యమును
సూచించుచున్నది. లాలాటమునందు బొమముడితో నందగించిన మోము ,ఆమెమదిలో రేగుచున్న యాలోచనలను సూచించుచున్నది. మలగిచూచుట- ఆమెలోని ఆశక్తిని దెలుపుచున్నది.పరమేశ్వరుడు భుజగ మండనుడై యగుపించుట. ఆమెను పరీక్షించుట పూర్తియగుటకు సంకేతము.
స్తనమండలమునుండి జిలుగ పైటజారుట, అందమొలుక నడచుట , బొమముడిపాటుతో వెనుదిరుగుట, మొన్నగునవి
శ్రీనాధుని శృంగార రసావిష్కరణమునందలి చిట్కాలు.
మొత్తానికి యీపద్యంలో శ్రీనాధుని రచనా శిల్పం అనల్పమై పార్వతి సౌందర్యానికి మెఱుపులు దిద్దిందనక తప్పదు.
స్వస్తి!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి