||శ్రీమాత్రేనమః||
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*అద్వైతదర్శనము - ఉపనిషత్సిద్ధాంతము*
------------------కర్మసిద్ధాంతమును తదనుగుణమైన పునర్జన్మ సిద్ధాంతమును తొలుదొలుత లోకమునకు ఉపదేశించినది వేదము.
లోకమున దుఃఖమునకు కారణము జన్మ. జన్మకు కారణము సంసారమందు ప్రవర్తించుట. సంసారమున ప్రవృత్తికి కారణము రాగద్వేషములు. వీనినే దోషములని శాస్త్రజ్ఞులు వ్యవహరింతురు. రాగద్వేషమునకు కారణము మిత్యాభూతమైన జగత్తు సత్యమని , యథార్థమని భ్రమించి ప్రవర్తిల్లుట.
జగత్తు ' మిథ్య'యని దృఢనిశ్చయము కలిగినవానికిమిథ్యాభూత ప్రపంచమును గూర్చిన రాగద్వేషములుదయింపవు. రాగద్వేషములు లేనివారికి సంసారమున ప్రవృత్తియుండదు సంసారమున ప్రవృత్తి లేనివారికి జన్మ యుండదు. జన్మలేనిచో దుఃఖమేలేదు. దుఃఖము లేనివానికి అద్వయానందాత్మ స్వరూపస్థానమే మోక్షము.
ఉపనిషత్తులు స్థూల సూక్ష్మ కారణ శరీరములు మూడు ఉండునని చెప్పుచున్నవి. జాగ్రద్దశయందు స్థూలశరీరాభిమానముతో పురుషుడు ప్రవర్తించును. అట్టి జీవునకు ' విశ్వు ' డనిపేరు. స్వప్నదశ యందు స్థూలశరీరాభిమానముండదు. తైజసమైన అంతఃకరణ తాదాత్మ్యముండదు. తైజసరూపుడై మనోవిలాసములగు స్వాపనికపదార్థానుభవము తత్ప్రయుక్తమైన సుఖదుఃఖాద్యనుభవము కలిగియుండును. ఈ స్థితి యందు సూక్ష్మశరీరాభిమానియై జీవుడు ' తైజస ' నామముతో వ్యవహరింపబడును. గాఢ సుషుప్తి యందు ఇంద్రియములతోపాటు మనస్సుకూడా లయముచెందును. జీవుడు కారణ శరీరాభినివిష్ఠుడై యుండును. దీనిని సంప్రసాదావస్థయందురు. ఈ అవస్థయందు ' ప్రాజ్ఞ ' నామముతోజరుగును. " నకించి దవేదిషం - సుఖ మహ మస్వాప్సం " యనెడి అనుభూతులు కలిగి యుండును. మరల ప్రాక్తన సంస్కారవశమున జాగ్రత్ప్రపంచమునను ; మరల స్వప్న ప్రపంచమునను తిరిగి కారణావస్థను పొందుచుండును. సుషుప్తియే దైనందిన ప్రళయము. జీవుడు స్థూలదేహమును విడచి సూక్ష్మ శరీరమును సుక్శ్మశరీరమును విడచి కారణశరీరమును మరల ఆ శరీరమును విడచి స్థూలాది శరీరమును బొందుట అనుభవసిద్ధమైన విషయము. అట్లే శరీరపాతానంతరము జీవుడు సూక్ష్మ శరీరముతో పుణ్యపాపానుభవ భోగసాధకములైన శరీరములనుదాల్చి , ఆ యా పుణ్యలోకముల చరించుచుండును. తిరిగిభోగానుభవానంతరం కర్మఫలానుభవయోగ్యము లైన నా యా శరీరముల దాల్చును. మానవుని శరీర పాతానంతరం తిరిగి నరజన్మ పాండునంతవరకు జీవుడే యే దశలయందు ఏ యే రూపమున ఏ యే యవస్థల గాంచునో పంచాగ్ని విద్యా ప్రకరణము ఉపనిషత్తులు విపులుగా వివరించినవి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి