24, నవంబర్ 2023, శుక్రవారం

శ్రీ వివేకానందస్వామి

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                      *భాగం 96*


*నరేంద్రుని ప్రయత్నాలు*


వరాహ  నగర మఠ ప్రారంభానికి ముందే సమయం చిక్కినప్పుడల్లా వెళ్లి వారిని కలుసుకొని  భగవదానుభూతి పొందకపోతే జీవితమే వ్యర్థమని,గురుదేవుల మహత్వాన్ని , సన్న్యాస జీవితపు ఔన్నత్యాన్ని గురించి మాట్లాడేవాడు. వ్యతిరేకత, నింద, అవమానాదులను వేటినీ అతడు ఖాతరు చేయలేదు. ఎందుకంటే గురుదేవులు అప్పగించిన కార్యం ఒక్కటే అతని మనస్సును నింపి ఉంచింది. పేదరికం, న్యాయస్థానం, వ్యాజ్యాలు లాంటి కుటుంబ సమస్యల భారం అణగద్రొక్కిన సమయంలో, ఈ విధంగా పలువురి నిందలను, అవమానాలను భరించీ అతడు అందరినీ సమైక్యపరిచాడు.


చివరికి నరేంద్రుని ప్రేమకూ, ఎడతెగని ప్రయత్నాంతో 1886 డిసెంబర్ లో దాదాపు అందరినీ  సమైక్యపరచగలిగాడు. దీని తరువాతే నిజానికి మఠ జీవితం ప్రారంభమయింది. తాము తిరస్కరించీ, తల్లితండ్రులు తిరస్కరించీ, ప్రతిఘటనలను, అవమానాలను ఖాతరు చేయక తమను ఈ జీవితానికి అంకితం చేసిన నరేంద్రుని పట్ల తక్కిన యువ శిష్యుల హృదయాలలో కృతజ్ఞతాభావం పొంగిపొరలింది; అతణ్ణి అందరూ మనఃస్ఫూర్తిగా తమ నేతగాను, మార్గదర్శిగాను అంగీకరించారు. పలువురు అతణ్ణి గురువుగా గౌరవించారు.


"వరాహ నగర మఠంలో" ఈ యువ సన్న్యాసులు గడపిన కఠోర ఆధ్యాత్మిక జీవితం గురించి ఏం చెప్పాలి! బాహ్య ప్రపంచం నుండి నిష్క్రమించిన శ్రీరామకృష్ణులను తన హృదయాంతరాళంలో ఆవాహనం చేయాలనే ఉద్విగ్నతలో వారు మునిగివున్నారు. అప్పుడప్పుడు వారు గాంచిన దివ్యదర్శనాలు ఎంతటి దారిద్ర్యాన్ని, ఆవేదనను, బహిష్కరణను, ఎకసెక్కాలను లెక్కించక పదే పదే ప్రయత్నించే స్థితికి వారిని పిచ్చివారిని చేసినవి. బాహ్యచైతన్యరహితులై భక్తి గీతాలను ఆలపించడంలో, నృత్యం చేయడంలో రుచి గలిగినవారై అహర్నిశలూ ప్రార్థనలలోను, ధ్యానంలోను, శాస్త్రాధ్యయనంలోను ఆసక్తిపరులై వారు విరా జిల్లారు. 


భగవద్దర్శనమే వారి జీవిత ఏకైక లక్ష్యంగా మారింది. వేదపురాణ తంత్ర గ్రంథాలలో పేర్కొన్న సన్న్యాస జీవిత నియమాలు తు.చ. తప్పక మనఃస్ఫూర్తిగా పాటించసాగారు. పగటి వేళ మఠంలోను, చెట్టు క్రింద, అర్ధరాత్రి వేళ సమీపంలోని శ్మశానంలోను, గంగాతీరంలోను ఆధ్యాత్మిక సాధనలు అనుష్టించారు; తపస్సు ఆచరించారు. శ్రీరామకృష్ణులు అనుష్ఠించి చూపిన అనుపమాన తపస్యాదుల గురించి జ్ఞాపకం వారి తపోగ్నిని ప్రజ్వలనం చేసింది. ధ్యానం కొనసాగించడానికై ఆ యువకులు పస్తులు వుండి చావడానికైనా సిద్ధమైనారు."🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: