24, నవంబర్ 2023, శుక్రవారం

నవగ్రహా పురాణం

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *85వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*గురుగ్రహ చరిత్ర - 1*


బృహస్పతి ప్రాతఃకాల పూజ చేయడానికి సిద్ధమై కూర్చున్నాడు. తార ఆయన వద్దకు వచ్చింది.


*"పువ్వుల కోసం వెళ్ళిన పుంజికస్థల ఇంకా రాలేదు. మరెక్కడికైనా వెళ్ళిందా , తారా ?"* తారను అడిగాడు బృహస్పతి.


*"లేదు , స్వామీ ! పువ్వుల కోసమే వెళ్ళింది. వచ్చేస్తుంది లెండి. నేను నదికి వెళ్తున్నాను. స్నానం చేసి నీళ్ళు తీసుకుని వస్తాను."* అంటూ భర్త సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది తార.


పుంజికస్థల రాక కోసం ఎదురు చూస్తూ , అటూ ఇటూ తిరగడం ప్రారంభించాడు బృహస్పతి.


పుంజికస్థల పూల తోటలో నెమ్మదిగా నడుస్తోంది. రంగురంగుల పువ్వులు పూచే మొక్కలున్న ఒక చోట ఆగి , రెమ్మ వంచి పువ్వుల్ని కోయబోయింది.


ఉన్నట్టుండి ఓ మూల నుండి నవ్వులు ఆమె వైపు గాలిలో దూసుకువచ్చాయి. పుంజికస్థల చెయ్యి పువుల్ని ముట్టుకోకుండా అల్లంత దూరంలో స్తంభించింది. గాలి మళ్ళీ నవ్వుల్ని ఆమె వైపు రువ్వింది. ఇద్దరి నవ్వులు. స్త్రీ , పురుష నవ్వులు ! ఆశ్రమవనంలోకి ఎవరొచ్చారు ? ఎందుకు నవ్వుతున్నారు ? పుంజికస్థల చప్పుడు చేయకుండా నవ్వులు వినవస్తున్న దిశగా అడుగులు వేసింది.


ఇప్పుడు నవ్వులు స్పష్టంగా , దగ్గరగా వినిపిస్తున్నాయి. ఎవరో స్త్రీ ఎవరో గిలిగింతలు. పెట్టినట్టు నవ్వుతోంది. ఆగి , ఆగి... నవ్వుతోంది... ఆగి , ఆగి... నవ్వుతోంది. పుంజికస్థల తన ముందు గుబురుగా ఉన్న కొమ్మను కిందికి వంచి , చూసింది. ఆమె ఎడమచేతిలోని పూలసజ్జ తటాలున జారి కింద పడింది. పుంజికస్థల ఒక్కసారిగా ఊపిరి బిగపట్టింది. మరుక్షణం ఆమె గుండె దడదడ కొట్టుకోవడం ప్రారంభించింది.


ఎదురుగా , పొదరింటి నీడలో.... ఇద్దరు స్త్రీపురుషులు... ఒకరి చేతుల్లో ఒకరు వొదిగి... సరససల్లాపాలలో ఉన్నారు. చూడగానే ఆ జంట ఎవరో అర్ధమైపోయింది. పుంజికస్థలకు , గంధర్వ మిథునం ! మైథునానందంతో మైమరచి నవ్వుతున్న గంధర్వ మిథునం !


గాలికి కదులుతున్న పల్చటి వస్త్రాల చాటులో , వాళ్ళ శరీరాలు నివురుచాటున నిప్పుల్లా అవుపిస్తున్నాయి. తాంబూలంతో ఎరుపెక్కిన పెదవుల గుర్తులు వాళ్ళ శరీరాలు మీద అక్కడక్కడా... కనిపిస్తున్నాయి.


పుంజికస్థల తాను వచ్చిన పనిని మరిచి పోయింది. కాలాన్ని మరిచిపోయింది. స్థలాన్ని మరిచిపోయింది. ఏ ఆనందం తనకు దూరంగా ఉందో , ఏ ఆనందానికి తాను దగ్గర కాలేకపోయిందో ఆ రసానందం తన కళ్ళ ముందు రూపం ధరించి దర్శనమిస్తోంది. పుంజికస్థల దృష్టిలో అక్కడ గాలి స్తంభించింది. కాలం స్తంభించింది. సమస్త విశ్వమూ తన చలనం కోల్పోయి స్తంభించింది.


ఒక్కసారిగా పుంజికస్థల కళ్ళు చెదిరాయి. సరససల్లాపాలలో మునిగితేలిన గంధర్వమిథునం అంతర్ధానమైంది ! నెమ్మది నెమ్మదిగా పుంజికస్థల వర్తమానంలోకి వచ్చింది. ఆమె శరీరం చెమటతో తడిసి పోయింది. ఏదో ఆవేశం , ఏదో ఆశ ఆమెలో సుడిగాలిలా తిరుగుతున్నాయి. వణుకుతున్న శరీరాన్ని అదుపు చేసుకుంటూ నేల మీద పడిన పూలసజ్జను అందుకుంది. వణుకుతున్న కుడిచేయి పువ్వుల్ని దూసిపోస్తోంది. సజ్జలో ! పుంజికస్థల దూస్తున్న పువ్వులు సగం నేలపాలవుతున్నాయి.


అంతర్ధానమైన గంధర్వ దంపతులు ఇంకా ఆమె మనోయవనిక మీద సయ్యాటలు ఆడుతూనే ఉన్నారు. ఆమెకు హఠాత్తుగా బృహస్పతి గుర్తుకు వచ్చాడు. ఔను ! తనకు అందుబాటులో ఉన్న పురుషుడు ఆయనే ! భర్త లేని తనకు భర్త యజమానే.


పుంజికస్థల మంత్రముగ్ధలాగా ఆశ్రమం వైపు నడిచింది. ఆమెను రకరకాల ఆలోచనలు చుట్టుముట్టుతున్నాయి. వెనక నుంచి గంధర్వ దంపతులు ఆమెను తరుముతున్నారు. యజమాని బృహస్పతి ఇప్పుడు ఆశ్రమంలో వొంటరిగా ఉంటారు. తనకు తెలుసు. తార నదీతీరానికి వెళ్ళి ఉంటుంది. ఆమె ఇప్పుడప్పుడే తిరిగిరాదు.


పుంజికస్థల ఆశ్రమంలో ప్రవేశించింది. ఆమె తెచ్చే పువ్వుల కోసం అసహనంగా ఎదురు చూస్తున్న బృహస్పతి , ఆమెను చూడగానే , అటూ ఇటూ తిరగడం ఆపివేశాడు. 


*"పుంజికా ! ఏమిటీ ఆలస్యం ? పూజా సమయం దాటిపోతోంది తెలుసా ?"* బృహస్పతి కోపంగా అన్నాడు.


పుంజిక సమాధానం చెప్పకుండా , చిరునవ్వుతో ఆయనను సమీపించింది.


*"ఏమిటిది ? సచేల స్నానం చేశావా ?"* చెమటతో తడిసి , పుంజిక శరీరానికి వంపులు తిరుగుతూ అతుక్కుపోయిన ఆమె వస్త్రాలను చూస్తూ , అన్నాడు బృహస్పతి. 


పుంజికస్థల పెదవి కదపలేదు. ఆమె కళ్ళు తీక్షణంగా , వెర్రిగా బృహస్పతినే చూస్తున్నాయి. హఠాత్తుగా సజ్జలోని పూలని పైట చెరగులో పోసుకుని , ఆయన వైపు అదో రకంగా నవ్వింది. ఆమె చేతులు తటాలున కదిలాయి. పైటలోని పువ్వులు బృహస్పతి మీద వర్షించాయి. పైట పూలతో బాటు నేలకు వాలిపోయింది. 


*"ఆ పువ్వులు... భక్తి కోసం కాదు , రక్తి కోసం ! అవి... భక్తి కుసుమాలు కావు , రక్తి కుసుమాలు !”* పుంజికస్థల మత్తుగా అంది , పైట సర్దుకునే ప్రయత్నం చేయకుండానే. 


*"పుంజికా !"* బృహస్పతి అరిచాడు కోపంగా , ఆమె చర్యతో బిత్తరపోయి. *"ఏమిటీ అహంకారం ?"*


పుంజికస్థల మత్తుగా నవ్వింది. *"ఇది అహంకారమా ? కాదు... మమకారం ! అనురాగం ! నా తనువు మీ కోసం... మీ పొందు కోసం తపించిపోతోంది. రండి !"* అంటూ తనే ముందుకు వెళ్ళి బృహస్పతిని గట్టిగా కౌగిలించుకుంది.


కామజ్వరంతో కాలిపోతున్న పుంజికస్థల శరీరస్పర్శ బృహస్పతిని ఆశ్చర్య పరిచింది. ఆమెను దూరంగా తోసే ప్రయత్నం చేశారాయన. అయితే చెట్టు బోదెను అల్లుకున్న తీగల్లా తన చుట్టూ ఆతుక్కుపోయిన పుంజికస్థల చేతుల్ని విడదీయలేకపోతున్నారాయన. 


*“స్వామీ... నేను మీదాననే ! స్వీకరించండి ! మన ఐక్యత ఆ గంధర్వ దంపతుల ఐక్యత కన్నా బాగుంటుంది."* పుంజికస్థల కలవరిస్తున్నట్లు మత్తుగా అంది.


*"పుంజికా !”* బృహస్పతి అరిచాడు. వదిలించుకునే ప్రయత్నం చేస్తూ. *"ఆ గంధర్వుల జంటలాగే , అదే పొదరింటిలో ప్రతీ రోజూ మీరూ , నేనూ... ఒకరికి ఒకరై... వాళ్ళలాగా ఇద్దరూ ఒక్కరై...”*


కళ్ళు మూసుకుని పారవశ్యంతో కలవరిస్తున్న పుంజికస్థల ముఖాన్ని చూశాడు. బృహస్పతి. ఆయనకు అంతా అర్థమైపోయింది. ఈ పిచ్చిపిల్ల తోటలో గంధర్వ శృంగారం తిలకించినట్టుంది !


*"స్వామీ... కాలిపోతోంది నా దేహం. ఆ తాపాన్ని మీరే చల్లార్చాలి. ఆ తాపం మీ కౌగిలిలోనే చల్లారాలి ! రండి ! రండి , స్వామీ !”*


బృహస్పతి శరీరం ఆగ్రహంతో వణికిపోయింది. పుంజికస్థల పట్టు నుండి తన శరీరాన్ని బలంగా విడదీశాడు. 'అగ్నిలత'ను విసిరి వేస్తున్నట్లు ఆమెను దూరంగా తోశాడు. నేల మీద విసురుగా పడిన పుంజికస్థల లేచి నిలబడింది. మత్తుగా , ప్రాధేయ పూర్వకంగా ఆయనవైపు చూసింది. ఆమె కళ్ళు వశం తప్పిన కామంతో ఎర్రగా ఉన్నాయి.


*"పుంజికా !”* బృహస్పతి హుంకరించాడు.


పుంజిక కామాగ్నిగోళాల్లా ఉన్న కళ్ళతో ఆయనను తదేకంగా చూసింది. *“రండి... . ఇక్కడ కాదు... పొదరిల్లు మన కోసం కాచుకుంది...”*

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

కామెంట్‌లు లేవు: