🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
. *⚜️పెరియ పురాణం⚜️*
. *నాయనార్ల చరిత్ర - 09*
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
*9. కణ్ణప్ప నాయనారు*
'పొత్తపినాడు' లో 'ఉడుప్పూరు' అనే పేరుతో ఒక ప్రాచీన గ్రామం ఉంది. ఆ గ్రామంలో నివసించేవారందరూ గిరిజనులే. వారికి రాజుగా
‘నాగడు' అనే పేరుతో ఒక వేటగాడు ఉండేవాడు. అతనికి జీవన సహచరిగా
దత్తె అనే యువతి తోడైంది. మురుగదేవుని అనుగ్రహం వలన వారికి ఒక
కుమారుడు జన్మించాడు. ఆ పిల్లవాడికి తిన్నడు అనే పేరుపెట్టి అల్లారు.
ముద్దుగా పెంచారు.
కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత విలువిద్య
నేర్చుకునే పరువాన్ని తిన్నడు సమీపించాడు. కొద్దికాలంలోనే విలువిద్యను,
ఇతర యుద్ధకళలకు సంబంధించిన విద్యనూ పూర్తిగా నేర్చుకుని తిన్నడు
వాటిలో ప్రావీణ్యతను సంపాదించాడు.
ఆ సమయంలో అక్కడున్న కొండలలో పంటలు పండించే ప్రాంతాలలో
పందులు, పులులు, ఎలుగుబంట్లు, అడవి పశువులు మొదలైన క్రూర
మృగాలు వచ్చి పంటలకు ప్రజలకు హాని కలిగించాయి. ప్రజలందరూ
తమరాజైన 'నాగడు' దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నారు.
నాగడు తన కుమారుడైన తిన్నని ఆహ్వానించి “ఈ బోయకులాన్ని సంరక్షించే బాధ్యతను
స్వీకరించి క్రూర మృగాల బారినుండి వీరిని కాపాడు" అని చెప్పగా తిన్నడు
విల్లంబులను ధరించి వేటగాళ్లతో అడవిలోపలికి ప్రవేశించాడు, అడవి
పందులు, జింకలు, ఎలుగుబంట్లు, దుప్పులు, అడవి దున్నలు, ఏనుగులు,
క్రూరమైన పులులు మొదలైన వాటిపై బాణాలను ప్రయోగించి వాటిని నేల కూల్చాడు.
ఆ సమయంలో తిన్ననికి వేగంగా పరిగెత్తుతూ ఉండే ఒక
పంది కనిపించింది. తిన్నడు దానిని వదలకుండా వెన్నంటి వెళ్లి తన కరవాలంతో ఆ పంది శరీరం రెండు తునకలయ్యేలా ఖండించాడు.
కొంతసేపు విశ్రామం తీసుకున్న తరువాత తిన్నడు పక్కనే ప్రవహిస్తున్న
స్వర్ణముఖి (పొన్ ముగలి) నదిలో స్నానంచేసి పక్కనున్న కొండ సమీపించాడు.
పూర్వజన్మలో చేసిన తపోఫలం కారణంగా తిన్నడు శ్రీకాళహస్తి కొండ
మీద లింగాకారంతో నెలకొని ఉన్న పరమేశ్వరుని చూశాడు. ప్రేమ ఉప్పొంగగా పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ పరమేశ్వరుని ఆలింగనం చేసుకున్నాడు.
"స్వామీ! క్రూర మృగాలు సంచరించే ఈ అడవిలో తోడెవరూ లేక నీవిలా
ఒంటరిగా కొండమీద ఉండడం తగునా! నీవు తిని ఎంతకాలమైందో
కదా!" అని హృదయావేదనతో పలికాడు. వెంటనే తాను చంపిన పంది
మాంసాన్ని ఎర్రటి నిప్పులో పక్వంగా కాల్చి వాటి రుచిని ముందుగా తాను
తెలుసుకోవడానికై కొంత నోటిలో వేసుకొని రుచిచూసి వాటిని ఒక దొన్నెలో
పెట్టుకొన్నాడు.
పరమేశ్వరునికి స్నానం చేయించాలనే ఉద్దేశంతో తన
నోటిలో స్వర్ణముఖీ నదిలోని నీటిని తీసుకున్నాడు. అక్కడి పుష్పాలను కోసి
తలమీద పెట్టుకున్నాడు. “నా దేవుడు ఆకలితో సొమ్మసిల్లి ఉంటాడు”
అంటూ వేగంగా వచ్చి తన నోటిలోని నీటిని పరమేశ్వరుని శిరసుపై వదిలాడు. తలమీద ఉన్న పుష్పాలను దేవుని శిరసుపై అలంకరించాడు.
ఆకులదొన్నెలోని మాంసాన్ని శివుని ముందు పెట్టి "స్వామీ! మేలైన మాంసం తీసుకు వచ్చాను. మీరు దీనిని భుజించండి" అని చెప్పి మృదువైన మాటలు
మాట్లాడుతూ పరమేశ్వరునికి తిన్నడు మాంసాన్ని తినిపించాడు. తనతో
వచ్చిన వేటగాళ్లు ఇంటికి పోదామని చెప్పినప్పటికీ వాళ్ల మాటలను తిరస్కరించి తిన్నడు ఆ రాత్రి అక్కడే ఉండిపోయాడు.
సూర్యోదయానికి
ముందుగానే లేచి శివునికి మంచి మాంసం తెచ్చి ఇవ్వాలనే ఉద్దేశంతో
వేటకు వెళ్లాడు.
శ్రీకాళహస్తీశ్వరునికి సూర్యోదయాత్పూర్వమే నియమం తప్పక
పూజాదికాలు నిర్వర్తించే ఒక మునీశ్వరుడు అక్కడికి వచ్చాడు.
శివుని సన్నిధిలోపడి ఉన్న మాంసపు ముక్కలను, ఎముకలను చూసి "అయ్యో!
అసహ్యమైన ఈ పదార్థాలను ఇక్కడ ఎవరు పెట్టారో కదా! అని బాధపడి
ఆ ప్రదేశాన్ని శుభ్రంగా నీటితో కడిగాడు. స్వర్ణముఖి నది పవిత్రజలాలతో,
తాను తీసుకు వచ్చిన వస్తువులతో అభిషేకం మొదలైన పూజలు చేశాడు.
తరువాత తాను తపస్సు చేసుకుంటున్న ప్రాంతానికి వెళ్లిపోయాడు.
మునీశ్వరుడు వెళ్లిన తరువాత తిన్నడు దొన్నెలో తేనె కలిపిన మాంసాన్ని
పెట్టుకొని పుష్పాలను, అభిషేకార్ధమై నీటిని తీసుకొని వేగంగా వచ్చాడు.
అక్కడ మునీశ్వరుడు చేసిన పూజాద్రవ్యాలను తొలగించి తాను తెచ్చిన
మాంసాహారాన్ని స్వామికి తినిపించాడు.
ఆ రోజు రాత్రి మునీశ్వరుని కలలో శివుడు కనిపించి “నీకు ఆ వేటగాని భక్తిని చూపిస్తాను" అని చెప్పాడు. మునీశ్వరుడు యధాప్రకారం
సూర్యోదయాత్పూర్వమే స్వామికి పూజలు సలిపి వెనుకభాగంలో ఎవరికీ
కనిపించకుండా దాక్కున్నాడు. తిన్నడు జింకను వేటాడి చంపి దాని మాంసాన్ని తీసుకొని వేగంగా స్వామి సన్నిధికి వచ్చాడు.
మునీశ్వరునికి
తిన్నని భక్తి విశేషాలు తెలియజేయడానికై పరమేశ్వరుడు తన నేత్రములలో ఒకదాని నుండి రక్తం కారేటట్లు చేశాడు. దానిని చూసి తిన్నడు తీవ్ర సంతాపంతో మూర్ఛిల్లాడు. అరణ్యమంతా గాలించి మూలికలను సేకరించి
వాటి రసాన్ని కంటికి పూశాడు. అయినప్పటికీ రక్తం కారడం మానలేదు.
‘దీనికి పరిహారంగా ఏంచేయాలి' అని ఆలోచించిన తిన్నడు ఒకరి
అవయంలో ఏర్పడిన వ్యాధిని పోగొట్టడానికి దానిని పోలిన అవయవాన్ని
ఇవ్వాలి అనే పెద్దల వాక్యాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. స్వామి సన్నిధి
ముందు నిలబడి తన కంటిని అమ్ముతో పెకలించి స్వామి కంటిలో పెట్టాడు.
వెంటనే స్వామి కంటినుండి రక్తం కారడం ఆగిపోయింది. తిన్నడు సంతోషంతో గంతులు వేశాడు. తిన్నని శివభక్తిని లోకానికి తెలియజేయాలనే
తలంపుతో శ్రీకాళహస్తీశ్వరుడు తన మరొక కంటినుండి కూడ రక్తం కారేలా చేశాడు.
దానిని చూడగానే తిన్నడు పరమేశ్వరుని ఎడమకన్నులో తన ఎడమకన్నును పెట్టడానికి ఆ కన్ను ఉన్నచోటు మారకుండా ఉండడానికై
తన ఎడమకాలిని స్వామి కన్ను ఉన్నచోట ఊన్చి బాణంతో తన కన్నును
పెకలించబోయాడు.
తన కంటిని పెకలించడానికి ఎత్తిన కన్నప్పచేతిని
శ్రీకాళహస్తీశ్వరుడు తన చేతితో పట్టుకొని “అసమానమైన భక్తిని గలవాడా!
నీవు నా కుడివైపున నిత్యమూ ఉండాలి" అని ఆశీర్వదించాడు.
*తొమ్మిదవ చరిత్ర సంపూర్ణం*
*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి