24, నవంబర్ 2023, శుక్రవారం

పెరియ పురాణం

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 08*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

*8. ఏనాది నాథ నాయనారు*


ఏననల్లూరు అనే అందమైన గ్రామంలో ఏనాది నాధుడు జన్మించాడు. ఇతడు గొప్ప శివభక్తుడు.  ఖడ్గవిద్య శిక్షణలో నైపుణ్యాన్ని సంపాదించి ఆ వృత్తిలో తనకు తిరుగులేని నాయకుడుగా ప్రసిద్ధిచెందాడు. ఆ కాలంలో అతి శూరుడనే పేరుగల వాడు ఖడ్గవిద్యను నేర్పించే వృత్తిని అనుసరిస్తూ

ఆ వృత్తిలో ఈ భూ ప్రపంచంలో తనకు మించినవారు ఎవరూ లేరని

విర్రవీగుతూ ఉండేవాడు.


 కొంత కాలానికి ఖడ్గ శిక్షణ ఇచ్చే అతిశూరుని ఆదాయం రోజురోజుకు

తగ్గిపోతూ వచ్చింది. ఏనాది నాథుని ఆదాయం మాత్రం పెరుగుతూ

వచ్చింది. దీనిని చూసి అతిశూరుడు ఏనాదినాథునిపై తీరని పగను పెంచుకున్నాడు. 


బంధుమిత్రులతో ఏనాదినాధుని ఇంటిముందుకు వెళ్లి యుద్ధానికి రమ్మని ఆహ్వానించాడు. ఏనాదినాధుడు కూడ ఒక చేతిలో కరవాలాన్ని, మరొక చేతిలో డాలును పట్టుకొని యుద్ధం చేయడానికి

బయలుదేరాడు.


 "ఈ యుద్ధంలో ఎవరైతే విజయాన్ని సాధిస్తారో వారు

మాత్రమే ఖడ్గవిద్యా శిక్షణ వృత్తి హక్కును పొందగలరు" అని ఇరువురూ

ఒడంబడిక చేసుకున్నారు. ఇరువైపులకు చెందిన వీరులు ఎదురెదురుగా

నిలిచి కత్తులను, బల్లెములను ధరించి భయంకరంగా యుద్ధం చేశారు. అతిశూరుడు ఏనాది నాధుని చేతిలో ఓడిపోయి వెన్ను చూపి యుద్ధరంగం నుండి పారిపోయాడు. 


ఓడిపోయిన అవమానాన్ని తలచుకొని అతడు

నిద్రపోలేక పోయాడు. వంచనామార్గంతో ఏనాది నాధుని జయించాలని

ఒక కుతంత్రాన్ని పన్నుతాడు.

“మనం ఇరువురం ఏకాంతంగా ద్వంద్వ యుద్ధం చేద్దాం. నీవు

యుద్ధానికి రావలసింది" అని అతిశూరుడు ఏనాదినాధుని దగ్గరికి తన

మనిషిని ఒకరిని పంపించాడు. 


ఏనాదినాథుడు దీనికి సమ్మతించాడు.

నొసట విభూతి ధరించిన వారికి ఏనాదినాధుడు ఎలాంటి కీడు చేయడని

తెలుసుకొన్న వాడై అంతకుపూర్వం విభూతి పూసుకోవడం తెలియని

వాడైనప్పటికీ అతిశూరుడు తన ఫాలభాగమంతా విభూతిని పూసుకొన్నాడు.


అది కనిపించకుండా తన చేతిడాలుతో మరుగు పరిచి ఏనాదినాధుని

ముందుకు వెళ్లాడు. ఏనాదినాధుడు అతిశూరుని చంపడానికి కత్తి

దూసినపుడు అతిశూరుడు తాను మరుగు పరుచుకొన్న కెడయాన్ని పక్కకు

తీశాడు. అప్పుడు అతిశూరుని ఫాల భాగమందున్న విభూతిని ఏనాది  నాధుడు చూశాడు. "అయ్యో! నేనెంతటి పాపం చేశాను. 


ఇతడు శివభక్తుడని

తెలియక ఇతనితో యుద్ధం చేశాను” అని తన చేతిలోని ఖడ్గాన్ని జారవిడవాలని అనుకున్నాడు. కాని ఆయుధాలు లేనివాడిని చంపాడనే

అపకీర్తి ఇతనికి రాకుండా ఉండాలని భావించి చేతిలో పట్టుకొన్న వాడిలాగ

కనిపిస్తూ ఎదురుగా నిలిచాడు. అతిశూరుడు ఆ సమయంలో తన ఖడ్గంచే ఏనాదినాధుని సంహరించాడు. 


ఏనాదినాధుని భక్తి తత్పరతకు పరవశుడైన

పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఎదురుగా నిలిచాడు. మహాభక్తుడైన ఏనాదినాధుని

తనను ఎన్నడూ ఎడబాయకుండా శివగణాలలో ఒకడుగా తన సన్నిధిలోనే

ఉండమని అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు.


 *ఎనిమిదవ చరిత్ర సంపూర్ణం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

కామెంట్‌లు లేవు: