21, సెప్టెంబర్ 2024, శనివారం

శ్రీ భీమేశ్వర పురాణము - 1

 _*శ్రీ భీమేశ్వర పురాణము - 1 వ అధ్యాయము*_




🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️




*కథా ప్రారంభము*


*సూతుడు శౌనకాది మునులకు భీమేశ్వరపురాణమును చెప్పుట.*


నైమిశారణ్యములో పన్నెండు సంవత్సరాలు జరుగు దీర్ఘసత్రయాగము అను మహాయజ్ఞమునకు శౌనకాది మునులు వచ్చిరి. అచటకు ఒక రోజు వ్యాసులవారి శిష్యుడు , రోమహర్షి కుమారుడు అయిన సూతుడు వచ్చెను. శౌనకాది మునులు సూతుని యథోచితంగా గౌరవించి , చక్కని ఆసనంపై కూర్చుండచేసి *“ఓ మహాత్మా ! నీవు పౌరాణికుడవు. నీ వలన మేము లక్ష శ్లోకములు కలిగిన 105 ఖండములతో కూడిన స్కాంద పురాణము నందలి పూర్వఖండమునందు వ్యాసుడు తన అపరాధము వలన విశ్వేశ్వరునిచే వెడలగొట్టబడి కాశీక్షేత్రమును వదలి వెళ్ళవలసి వచ్చినదని వింటిమి. కాశీని విడిచిన వ్యాసుడు తన శిష్యులతో ఎక్కడికి వెళ్ళెను? ఏమి చేసెను ? ఏ తీర్థములను దర్శించెను ? ఆ మహాత్ముడైన వ్యాసుడు కాశీనివదలిన తర్వాతి వృత్తాంతమంతా మాకు వివరించి చెప్పుము"* అని కోరిరి. అపుడు వారి కోరికను మన్నించి సూతుడు యిట్లు చెప్పసాగెను.


*“ఓ మునులారా ! వినండి. ధర్మజ్ఞుడు , నాకు గురువు అయిన వ్యాసుడు విశ్వేశ్వరుని కోపముచే కాశీనగరం నుండి కదలి గంగానది ఒడ్డుకు చేరి శిష్యులతో కలసి కూర్చుని ఈభూమండలముపై గల సకల పుణ్య తీర్థములను తలచుకొని శిష్యులతో యిట్లు పలికెను. “శిష్యులారా ! విశ్వేశ్వరుడు నన్ను కాశీ విడచి పొమ్మనగానే నేను విచారించుచుండగా చూచి ఆ గౌరీమాత కనికరముతో నాతో యిట్లు చెప్పినది. “కుమారా ! ఈ భూమండలములోని తీర్థములన్నిటిలోను కాశీ గొప్పది. ఇట్టి కాశికా పురముకన్నా దక్షవాటిక మిన్నయైనది. ఆ దక్షవాటిక ఎల్లప్పుడూ భోగమోక్షములను యిచ్చు తీర్థరాజమై ఉన్నది. ఒకానొకప్పుడు ఆ దక్షవాటికలో దక్షప్రజాపతి యజ్ఞము చేయుటకు సంకల్పించెను. ఆ యజ్ఞమునకు బ్రహ్మ , విష్ణు , ఇంద్రాది దేవతలను , సకల మునిశ్రేష్ఠులను , దిక్పాలకులను , చంద్రుడు మొదలైన తన అల్లుళ్ళను అందరినీ పిలిచెను. కానీ శివునిపై ఆ దక్షునికి గల దుర్లక్షభావం వల్ల గర్వముతో శివుడు జగద్గురువని , సదాశివుడని ఎరుగక ఆయనను పిలవడం మానివేసెను. అజ్ఞానముతో ఆ మహాదేవుని అనాదరించి , దేవతల అనుజ్ఞతో ఆ యజ్ఞము చేయసాగెను. కాని అట్టి పనులు నెరవేరగలవా ? అటుల యజ్ఞము చేయుచున్న దక్షుడు సాక్షాత్తు ప్రళయరుద్రరూపుడైన ఆ వీరభద్రుని చేత దేవతలతో సహా దుర్గతి పొందెను. చివరకు ఆ ఈశ్వరుని పాదపద్మములకు శరణుజొచ్చి ముక్తుడయ్యెను. మహానుభావులు సమయాన్ని బట్టి నిగ్రహానుగ్రహములను చూపుదురే కానీ వారు ఎక్కువ కాలము కోపముతో ఉండువారు కాదు. దక్షుని ప్రార్ధనతో శాంతించిన ఆ సదాశివుడు కృపతో దేవతలను ఆనందపరచెను. భయంతో పరుగులు పెడుతున్న ఋషులకు అభయమిచ్చెను. రోషముతో అంత ర్తితురాలైన తన సతీదేవిని మరల ఆ శివుడు తన ఎడమ భాగమున ధరించెను. మృగరూపమును ధరించి పారిపోవుచున్న ఆ యజ్ఞముయొక్క శిరస్సును ఆకాశమున నిలిపెను (అదియే మృగశిర నక్షత్రము) న్యాయమునకు భీమేశ్వరుడే మారు పేరు. సమస్త భూమండలము నందు గల తీర్థములలో దక్షవాటికయే గొప్ప తీర్ధము. సర్వ దేవతలకు రాజైన శ్రీ భీమేశ్వరుడు హాలాహల విషమును కంఠమున నిలుపుకున్నవాడు , త్రిపురా సురులను సంహరించినవాడు , నిగ్రహానుగ్రహ సమర్థుడు. తన కడకంటి చూపుతోనే ఈ జగమంతటినీ సృష్టించువాడు. ఆ లోకేశ్వరుడు బ్రహ్మాది దేవతల యొక్క ప్రార్థన మన్నించి తన అర్థశరీరంగా ఉన్న మహాదేవిని హిమవంతుని తపఃఫల సిద్ధికొరకు , మేనకాదేవి నోముల పంటగ , దేవతలకు హితము చేకూర్చుటకొరకు హిమాలయము నందు జన్మింప చేసెను. ఆ భువనేశ్వరియు మహేశ్వరుని దేహమును విడచి ఆ హిమవంతునికి కుమార్తెయై పుట్టెను. మహాదేవిని తన శరీరం నుండి విముక్తను చేసిన క్షేత్రము కనుక దక్షవాటిక ముక్తిక్షేత్రమని కీర్తింపబడుచున్నది. దక్షుని గృహమును సంబంధించిన ఆరామము పూలతోట కావున యిది ద్రాక్షారామమని పిలువబడుతున్నది


సదాశివుడు సాక్షాత్కరించిన ప్రదేశము అగుటవలన ఈ క్షేత్రము భోగ , మోక్షప్రదమై వెలుగొందుతున్నది. ఈ భూమండలంలోని తీర్థములలో కొన్ని భోగమునే యిచ్చును. మరికొన్ని మోక్షమునే యిచ్చును. కానీ ఈ దక్షవాటిక భోగమును , మోక్షమును రెండింటిని యిచ్చును కనుక ఈ భూమిపై గల పుణ్యక్షేత్రములన్నిటికినీ ద్రాక్షారామ తలమానికమైనది.


*భీమేశ్వరుని కన్న ఉత్తమమైన దేవుడు , దక్షారామముకన్నా మిన్నయైన పుణ్యక్షేత్రము , సప్తగోదావరము కంటె గొప్పతీర్థము ఈ లోకంలోనే లేవు. భీమేశ్వర క్షేత్రములో నివసించిన వారికి భోగమోక్షములు కరతలామల కములు (అరచేతిలోని ఉసిరికాయల వంటివి). ఈ దక్షారామమున జీవించుట , మరణించుట రెండూ గొప్పవే ! సకల లోకనాధుడైన భీమనాధునిచే ఆ పురము శోభిల్లుతున్నది. ఈ భీమేశ్వరుడు పాలకడలి నందుపుట్టిన హాలాహలమును తన కంఠమునందు నిలిపి నీలకంఠుడయినాడు. ఆతడు శిరస్సుపై చంద్రరేఖతో శోభిల్లువాడు. సర్పములను కుండలములుగా కలిగిన చెక్కిళ్ళుగల చక్కని ముఖము కలిగినవాడు. అహంకార పూరితమైన బ్రహ్మ యొక్క అయిదవ తలను కొనగోటితో తీసివేసిన వాడు. అలాంటి మహాదేవుని లీలా విహారస్థలమే దక్షవాటిక. కనుకనే దాక్షారామము భోగమోక్షప్రదాయినిగా విశ్వవిఖ్యాత మయింది.


కావున నీవు నీ శిష్యులతో కూడి ద్రాక్షారామమునకు వెళ్ళి అచట భీమేశ్వరుని సేవించుము నీకు జయమగుగాక !.”* ఆ మాటలు విని నా మనసు కొంచెం తేలిక పడింది. కావున మనం తెల్లవారగానే ద్రాక్షారామమునకు బయలుదేరుదాము”. ఈ విధముగా వ్యాసుడు ద్రాక్షారామ మహిమను తన శిష్యులకు వర్ణిస్తూ భాగీరథీ (గంగానది) ఒడ్డున ఉండగా ఆ ముని విచారాన్ని చూడలేనట్లు సూర్యుడు అస్తమించెను.


వ్యాసుడు గంగలో స్నానం చేసి సంధ్యాకాలములో చేయవలసిన విధులను పాటించెను. ఆ తదుపరి ఒక నిర్మలమైన యిసుక తిన్నెపై కూర్చుని విశ్వేశ్వరుని యొక్క కోపమును తలచుకొని తలచుకొని దుఃఖితుడయ్యెను. ఆ మానసిక క్షోభ వల్ల ఆ రాత్రి చాలాసేపటి వరకు ఆ వ్యాసుని కన్నులకు నిద్ర రాదయ్యెను.


క్రమంగా చంద్రుడు విశ్రాంతుడై సూర్యోదయమయ్యెను. అంతట ఆ వ్యాసుడు ప్రాతఃకాలంలో చేయవలసిన కర్మలను ఆచరించి శిష్య బృందముతో దక్షవాటికకు పయనమయ్యెను. బంగారు మేడలచే , గోపురాలచే ప్రకాశించునది , మణిమయమైన ప్రాకారములు గలది , చిత్రవిచిత్రములైన జెండాలచే అలంకరింపబడినది , పుణ్యాత్ములైన స్త్రీ , పురుషులతో నిండినది , ఏనుగులు , గుర్రాలు , రధాలచే యిరుకైనది , అనేక దివ్యస్థలములతో నిండి నది , చెరువులు , ఉద్యానవనాల చేత ప్రకాశించునది. అనేక తీర్థములు కలిగినది , వేదశాస్త్రములు , పురాణముల పట్ల ఆసక్తిగల బ్రాహ్మణులతో నిండినది, తపస్వులు , యోగులచే సేవింపబడునది , శివతత్త్వము తెలిసిన పాశుపతులచే నిండినది , శ్రీహరి భక్తులచే , గణేశభక్తులచే , సూర్యుని భక్తులచే , శక్తి భక్తులచే , యింకను యితర మతస్థుల చేతను సేవించ బడునది , సర్వజ్ఞుడైన శివునికి కైలాసము వలె ప్రియమైనది , మోక్షమును యిచ్చునది అయిన కాశీ నగరానికి ప్రదక్షిణ విధంగా నడక సాగించెను.


ముందుగా బాల ఆదిత్యునకు నమస్కరించెను. కేశవుని స్తుతించెను. గంగానదికి మ్రొక్కెను. విశ్వనాధుని స్తోత్రము చేసెను. విశాలాక్షి ఎదుట చేతులు జోడించెను. మోక్షమండపమునకు మ్రొక్కెను. గర్భగుడికి నమస్కరించి , డుంఠి వినాయకుణ్ణి ఆరాధించెను. కాలభైరవుని శరణనెను. దండపాణికి దండము పెట్టెను. కుక్కుట చతుష్కానికి (నాలుగు కోళ్ళకు) నమస్కరించెను. ఇంకను కాశీలో ఉన్న సర్వదేవతలకు నమస్కరించెను. విడువలేక విడువలేక కళ్ళనీరు కారుతుండగా కాశీని విడచి ప్రయాగ క్షేత్రమునకు వెళ్ళెను. అక్కడ సమస్త దేవతలకు ప్రభువు , భక్తవత్సలుడు , మేఘము వంటినల్లనిదేహము కలవాడు , బంగారు వంటి వస్త్రములు కలవాడు , కిరీటమును ధరించిన వాడు , ఆది పురుషుడు అయిన మాధవ స్వామికి భక్తితో నమస్కరించి స్తోత్రము చేసెను. ఆ దేవుని ప్రసాదము , తులసి తీర్ధములను సేవించినప్పటికీ కాశీ వియోగము వల్ల కలిగిన దుఃఖమును చాలసేపటికిగానీ వ్యాసుడు శాంతింప చేసుకొనలేకపోయెను. అటు తర్వాత ఆ వ్యాసముని శిష్యులతో కలసి పురుషోత్తమ క్షేత్రమునకు (పూరీ జగన్నాథాలయము) బయలుదేరెను.



*ఇది శ్రీ స్కాంద పురాణమునందలి భీమ ఖండమున మొదటి అధ్యాయము సంపూర్ణము ॥ సర్వం శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వరార్పణమస్తు॥*🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: