అంతా అన్నంలోనే ఉంది..
అంపశయ్యపై ఉన్న భీష్ముడు తన చుట్టూ చేరిన పాండవులకు ధర్మ సూక్ష్మాలు వివరిస్తున్నాడు. అక్కడే ఉండి ఆ మాటలు వింటున్న ద్రౌపది ఫక్కున నవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ నవ్వు భీష్ముడి మాటల ప్రవాహానికి భంగం కలిగించడంతో ‘అమ్మా! ఇప్పుడు నువ్వెందుకు నవ్వావో నాతో పాటు వీళ్లకీ తెలియాలి.. కాస్త చెప్పమ్మా’ అన్నాడు.
ద్రౌపది బదులిస్తూ ‘భీష్మాచార్యా! ఇంకొద్ది రోజుల్లో మరణించబోయే మీరు ఇంత చక్కగా ధర్మం గురించి చెబుతున్నారు, బాగుంది. కానీ నాడు నా వస్త్రాపహరణ సమయంలో ఈ ధర్మపరిజ్ఞానం అంతా ఏమైపోయిందో అనిపించగానే నవ్వు ఆగలేదు’ అంది.
ఆయన తల పంకించి ‘నువ్విలా నవ్వడం మంచిదయ్యిందమ్మా! నువ్వు గనుక నవ్వకపోయుంటే నాకూ నీకూ ఇక్కడ ఉన్న వారందరికీ కూడా ఇదొక శేష ప్రశ్నగా మిగిలిపోయేది. నీ సందేహానికి నా సమాధానం విను!
అప్పుడు నేను సుయోధనుడు పెట్టిన మలినమైన అన్నం తింటున్నాను. అది నా రక్తంలో కలిసి.. ఆ ప్రభావం నా విజ్ఞతను, వివేకాన్ని తెరలా కప్పేయడం వల్ల కర్తవ్యం గుర్తు రాలేదు. నేడు అర్జునుడి బాణాలతో నా రక్తంలో చేరిన ఆ కాలుష్యమంతా అంతరించింది కనుక ధర్మం మాట్లాడుతున్నాను. అన్నం మహిమ అంతటిది. మనం తినే ఆహారం కష్టార్జితంతో కొన్నదై ఉండాలి. పీడన సొమ్ముతో లభించింది తింటే.. అది చెడు ఆలోచనలు కలిగిస్తుంది. అందు వల్ల ఆహారం స్వార్జితం, దైవార్పితం, మితం అయ్యుంటే అది మనసును పరిశుద్ధంగా ఉంచుతుంది. ధర్మమార్గంలో నడిపిస్తుంది. సాత్విక ఆహారంతో ఆత్మ, దేహం రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. దైవసాధనలో మనసు నిగ్రహం కోల్పోదు’ అంటూ వివరించగా.. పాంచాలి హృదయపూర్వకంగా నమస్కరించింది.
సేకరణ:🤝🤝🤝మీ ! కోవెల
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి