#✳️ఋణానుబంధం✳️
అన్నిటిని పరిత్యజించి మోక్షానికి వెళ్లవలసిన ఒక యోగి, ఒకనాటి మండుటెండలో వెడుతూ ఎండకి ఓర్చుకోలేక, ఒక చెప్పులు కుట్టే వాడు దారిలో పెట్టిన చెప్పులపై కొంత సేపు నిలబడ్డాడు.
ఆ మాత్రం నిలబడినందున, ఆ ఋణం తీర్చు కోవడానికి మరుజన్మలో ధారానగరంలో పరమేశ్వరి, సోముడు - అనే దంపతులకు సునందుడు అను పేరుతో పుట్టాడు.
జాతకం చూపిస్తే, పెద్దలు ఆ తలిదండ్రులకు ఒక హెచ్చరిక చేస్తారు.
ఈ బాలుడు మీకు చాలా చాలా తక్కువ రుణపడి ఉన్నాడు. 'వాడి చేతి నుంచి పైసా కూడా తీసుకోకండి. అతడికి మీరే అన్నీ ఇస్తూండండి' అని చెప్తారు.
నాటినుంచీ తల్లిదండ్రులు వానినుంచి ఏమీ ఆశించకుండా పెంచుతారు.
పూర్వజన్మ గుర్తున్నందున ఆపిల్లవాడు వారి రుణంతీర్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు.
ఒకరోజు రాత్రి రాజభటుడైన తన తండ్రికి బదులుగా
తాను రాజనగరుకు కాపలా కాయవలసి వచ్చింది.
అపుడు ప్రతి జాముకీ ఒకసారి ఆ యువకుడు నగరప్రజలను హెచ్చరిస్తూ హితవు ఒకటి చెబుతుండే వాడు.
రాజుగారు మారువేషంలో తిరుగుతూ ఇవన్నీ విని ఇతడు సామాన్యుడు కాడని గుర్తిస్తాడు.
మరునాడు స్వయంగా అతడి ఇంటికి వెళ్లి రాత్రి తాను అన్నీ విన్నాననీ, తన మనసు ప్రశాంతి పొందిందనీ అంటాడు.
పళ్లెంలో వెంట తెప్పించిన ధనాన్ని అతడికి అందిస్తాడు.
అతడు వెంటనేె ఆ ధన రాశిని తల్లికి ఇవ్వగా ఆమె పుత్రోత్సాహంలో, నియమం మరచి ఆ పళ్లెం అందుకుంటుంది.
వెంటనే అతడు తనువును విడిచి ముక్తి పొందుతాడు.
తలిదండ్రులు దుఃఖిస్తే రాజు ఆ యువకుడు రాత్రి కావలి సమయంలో చెప్పిన ఈ క్రింది ఉపదేశాలు వినిపించి ఓదారుస్తాడు :
1. మాతా నాస్తి, పితా నాస్తి,
నాస్తి బంధు సహోదరః|
అర్థం నాస్తి, గృహం నాస్తి,
తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు.
కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.
2. జన్మ దుఃఖం, జరా దుఃఖం,
జాయా దుఃఖం పునః పునః|
సంసార సాగరం దుఃఖం
తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా:- ఈ జన్మ, వృద్ధాప్యము, భార్య, సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి.
కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.
3. కామః క్రోధశ్చ, లోభశ్చ
దేహే తిష్ఠతి తస్కరాః|
జ్ఞాన రత్నాపహారాయ
తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా :- కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు.
కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.
4. ఆశయా బధ్యతే జంతుః
కర్మణా బహు చింతయా|
ఆయుక్షీణం న జానాతి
తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఏదో ఆశకు, కర్మకు కట్టుబడి ఏవేవో ఆలోచనలతో, జీవితాలు
గడుపుతుంటారు. ఆయుర్ధాయం తరిగిపోతుందన్న
విషయాన్ని గమనించరు.
కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.
5. సంపదః స్వప్న సంకాశాః
యౌవనం కుసుమోపమ్|
విద్యుచ్చంచల ఆయుషం
తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి, అంటే అశాశ్వతాలు. యౌవనం పూవుతో సమానం అంటే ఎపుడు వాడి నశిస్తుందో తెలియదు. ఆయుష్షు మెరుపుతీగవలె చంచలమైనది.
కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.
6. క్షణం విత్తం, క్షణం చిత్తం,
క్షణం జీవితమావయోః|
యమస్య కరుణా నాస్తి
తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.
7. యావత్ కాలం భవేత్ కర్మ
తావత్ తిష్ఠతి జంతవః|
తస్మిన్ క్షీణే వినశ్యంతి
తత్ర కా పరివేదన||
తా:- ప్రపంచంలో తమ కర్మబంధము ఎంతవరకు ఉంటుందో, అంతవరకే ప్రాణులు జీవిస్తాయి. ఆ కర్మబంధం వీడిపోగానే మరణిస్తారు. జననమరణాలు జీవుని ధర్మము. దానికి బాధపడటం ఎందుకు.
8. ఋణానుబంధ రూపేణ
పశుపత్నిసుతాలయః|
ఋణక్షయే క్షయం యాంతి
తత్ర కా పరివేదన||
తా:- గత జన్మ ఋణానుబంధము ఉన్నంతవరకే భార్య, సంతానం, ఇల్లు, పశువులు ఉంటాయి. ఆ బంధం తీరగానే ఇవన్నీ నశించిపోతాయి. అందుకు వ్యథ చెందడ మెందుకు.
9. పక్వాని తరుపర్ణాని
పతంతి క్రమశో యథా|
తథైవ జంతవః కాలే
తత్ర కా పరివేదన||
తా:- పండిన ఆకులు చెట్టునుండి ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?
10. ఏక వృక్ష సమారూఢ
నానాజాతి విహంగమాః|
ప్రభతే క్రమశో యాంతి
తత్ర కా పరివేదన||
తా:- చీకటి పడగానే అనేక జాతులు పక్షులు ఒకే వృక్షం
ఆశ్రయించి విశ్రమిస్తాయి. తెల్లవారగానే ఆ పక్షులు
అన్నీ చెట్టును విడచి తమతమ ఆహార సంపాదనకు
వెళ్ళిపోతాయి. అదే విధంగాబంధువులతో కూడిన
మానవుడు కాలమాసన్నమైనపుడు తన శరీరాన్ని
ఇంటిని వదలి వెళ్ళిపోతాడు. అందుకు బాధపడ
నవసరములేదు.
11. ఇదం కాష్టం ఇదం కాష్టం
నధ్యం వహతి సంగతః|
సంయోగాశ్చ వియోగాశ్చ
కా తత్ర పరివేదన||
తా - ప్రవహించే నదిలో రెండు కట్టెలు దగ్గరకు చేరతాయి. కొంతదూరం కలిసి పయనిస్తాయి తరువాత విడిపోతాయి. అదేవిధంగా మానవుడు ఈ ప్రపంచ ప్రవాహంలో కొంతకాలం సంయోగసుఖమును, మరికొంతకాలం వియోగదుఃఖమును అనుభవిస్తాడు. దానికి పరివేదన చెందనవసరములేదు.
ఈచివరి శ్లోకం భార్యభర్తల గురించి సంకేతంగా చెప్పినదే! ఒక అమ్మాయి,ఒక అబ్బాయి వేరు వేరు కుటుంబాలలో జన్మిస్తారు. వీరిద్దరు జీవితమనే నదిలో కలుస్తారు. కొంతకాలం కలిసి బతుకుతారు. కాలం సమీపించడంతో ఒకరు కైవల్యం చెందుతారు, మరొకరు ఉండిపోతారు మరికొంతకాలం. ఇది సహజం మరియు సృష్టి క్రమం.
ఇందులో వేదన ఉండదని చెప్పలేదు. వేదన పడవద్దనీ చెప్పలేదు. సృష్టి సహజంగా వేదన తప్పదు. అందునా ఇద్దరు చాలా సంవత్సరాలు కలిసి జీవించిన వారిలో ఒకరు జారిపోతే మరొకరు వేదన పొందక ఎలా ఉండగలరు? సహజమైన వేదనను అడ్డుకోలేం. దానిని అనుభవించవలసినదే!
మరి పరివేదన పనికిరాదన్నారు. వేదనకి, పరివేదనకి తేడా ఉంది. వేదన సహజాతం. దానిని అను భవించాలి, పరివేదన అలాకాదు, మనం తలుచుకుని తలుచుకుని వేదన చెందడాన్నే పరివేదన అంటారు. ఈ పరివేదన పనికి రాదన్నారు.
యఇది సహజం, సృష్టి క్రమం సుమా! ఏడిస్తే పోయినవారు తిరిగొస్తారా? రాగలరా? సాధ్యమా? సృష్టి క్రమం ఇలాగే జరుతుంది, వేదన తప్పదు, పరివేదన పడకు అన్నారు.
మానవులలో చాలా రకాల బంధుత్వాలున్నాయి, కాని భార్యాభర్తలది ప్రత్యేక బంధం, ఇటువంటిది మరొకటి లేదు. అందుకే వీరిగురించి మాత్రమే ప్రత్యేకంగా ఉదహరించి చెప్పేరు. దంపతులిద్దరూ ఒకసారి పోరు, ఎవరి సమయమొస్తే వారు జారిపోతారు, రెండవవారు మిగిలిపోతారు,కొంతకాలం, ఒంటరిగా.
ఇది అందరు భార్యభర్తలకీ జరిగేదే!
ఇది సహజ పరిణామం,సృష్టి క్రమమని చెప్పి ఓదార్చడమే లక్ష్యం
✳️ సర్వే జనా: సుఖినో భవంతు🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి