21, సెప్టెంబర్ 2024, శనివారం

_*శ్రీ శంకరాచార్య చరిత్రము 19

 _*శ్రీ శంకరాచార్య చరిత్రము 19 వ భాగము*_

🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴


శంకరుని ప్రతిజ్ఞ సఫలమై ప్రకాశించింది. శంకరాచార్యుని శిష్య వర్గంతోసహా సాదరంగా భిక్ష కాహ్వానించి మండన మిశ్రుడు లోనికి తీసుకొని వెళ్ళాడు. భిక్షానంతరం ఉభయ భారతి శంకరుని ఉద్దేశించి ఇలా చెప్పింది: “యతివర్యా! సత్య లోకంలో ఒకనాడు నిండుసభలో దూర్వాసుడు కమలభవుని సమక్షంలో నన్నుభూలోకంలో మానవశరీరాన్ని ధరించమని శపించాడు. నీ దర్శన భాగ్యంతో శాపవిముక్తి కలుగుతుందని చెప్పాడు. నాకు శాపవిముక్తిగా నా లోకానికి వెళ్ళాలి. సెలవు ఇవ్వండి పరాత్పరా!" అని వేడుకొన్నది. అందుకు సమాధానంగా శంకరులు "అమ్మా! సత్యలోకానికి నేను అంగీకరించినపుడే వెడుదువుగాని. అనుగ్రహింపుము” అని ఉభయభారతిని కోరగా ముదంగాసమ్మతించింది ఆ అవతార మూర్తి.


*మండనమిశ్రుని సంశయములు:*


పరాజయము పొందినా మండనమిశ్రుని కొన్ని సంశయాలు పీడిస్తు న్నాయి. శంకరునితో ఇలా విన్నవించు కొన్నాడు: “శంకరాచార్యా! మహానుభావుడైన జైమిని మహర్షి జగద్గురువని పేరు పడ్డవాడు. నిష్ఠతో కర్మ ననుష్ఠించమని స్పష్టంగా చెప్పిన వారి వచనాలను నిర్వీర్యం చేశావు. పైగా నీ మతాన్నే సిద్ధాంతం చేశావు. ఇది నాకు దుర్భరంగా ఉంది" అని దీనాననుడై మండన పండితుడు అడగ్గా శంకరుడిట్లా పలికారు:


“మండనమిశ్రా! నీవు అన్నట్లు జైమిని మహావిజ్ఞాని.సర్వజ్ఞుడు. అతడు చెప్పిన దేదీ ధర్మవిరుద్ధం కాదు. వారి సూత్రాలు అర్థం చేసికోవడం దుష్కరం. కర్మిష్ఠులకు కర్మయే శరణ్యమని, వేదాంతు లకు కర్మ చేయుట వలన చిత్తశుద్ధి కలుగునని తోస్తుంది. జ్ఞానాన్ని కోరుకొనే వారికి జ్ఞానమార్గ మును చూపును”.


మరల ఇంకా ఇలా వివరించారు. “మండనమిశ్రా! ఈ సంసారమొక మహా సాగరము. దీనిని ఈది దరిగానడం సామాన్యం కాదు. పామరులకు ఎలాగూ సాధ్యం కానిది. వారికై వారి లోని మాలిన్యాన్ని తొలగించడానికి కర్మమార్గం విధి విహితమై యున్నది. ఇహసుఖాలకంటే గొప్ప వైన స్వర్లోకసుఖాలను పొందవచ్చునన్న ఆశ చూపించిన పద్దతి అది. తత్త్వోపదేశం పొందడం అందరికి సాధ్యం కానిది. అధికారం లేనివానికి తత్త్వబోధ నిరుపయుక్తము. మొదటగా చిత్తశుద్ధి కలగాలి. అందుకు పనికివస్తుంది కర్మా చరణ. తత్త్వజ్ఞానార్జ నలో విధిగా బ్రహ్మచర్యాది వ్రతములు పాటించాలి. అట్లాచరించినను మోక్షప్రాప్తి కలుగునని రూఢిగా చెప్పలేదు జైమిని. ఈ కర్మకాండ విషయమంతా వేదం మొదటి భాగమందు చెప్పబడింది. పిమ్మట జగత్తును తెలిసి కొనుచూ, తానెవరో శాశ్వతమైన ఆనందమును పొందు టెట్లో జన్మ లేకుండే విధానము మొదలగు పెక్కు విషయాలు తరువాతి భాగమందు క్రోడీకరింపబడ్డాయి. జైమిని తత్త్వవేత్త కాడని నిరీశ్వరవాది యని కొందరు తలపోశారు. 'వేదాల నెఱిగిన వారు పరమేశ్వరుని తెలిసి కొందురు' అను ప్రమాణములను మహర్షులు నిష్కర్షగా త్రోసిపుచ్చారు. 'కర్మఠుడు నిరీశ్వర వాది' అనుట బుద్ధి హీనత” అన్న మాటలతో జైమిని హృదయాన్ని విప్పి చూపించారు.


*జైమిని ప్రత్యక్ష మగుట:*


ఇంత జరిగినా మండనమిశ్రుని మనశ్శంకలు తీరలేదు కదా మరి! ఇన్నాళ్ళు అవిచ్ఛిన్నంగా అద్వితీయంగా ఎదురు లేకుండా కర్మిష్ఠి శ్రేష్ఠునిగా బ్రదికినవాడు. జైమిని ముని అడుగు జాడలలో నడచిన వాడు. ఈ నాడు తనకు ఎదురు దెబ్బగా తన మతాన్ని తన ఆచారాల్ని త్రోసిరాజని శంకరాచార్యుడు నిలబడ్డాడు. ఎట్లా ఈ సందిగ్ధ పరిస్థితిని భరించడం? తీవ్రమైన మనోవ్యథతో గత్యంత రం లేక ఆ జైమిని మహర్షినే ప్రార్థించాడు మండనమిశ్రుడు: 


“జగద్గురో! మిమ్ములనే నమ్మి మీ పవిత్రమార్గం పట్టి ఇన్నాళ్ళు వ్యవహరించినవాడను. ఈనాడు శంకరా చార్యుడు అలా కాదని ‘తత్త్వమసి’ వాక్యాన్ని సమర్థించి నన్ను పూర్తిగా నిరుత్తరుణ్ణి చేశారు. పైగా ఈ శంకరుడు మిమ్ము కాదనడం లేదు సరి కదా మిమ్ము అత్యంత గౌరవంతోచూస్తున్నారు. నాకు ఏమీ పాలు పోవడం లేదు. తమరే నా మొర ఆలించి నా సందేహ నివారణ చేయాలి ప్రభో!". ఆర్తితో పిలచిన మండనమిశ్రుని ఆవేదన తెలిసిన జైమిని మహర్షి సంతోషంగా ప్రత్యక్ష మయ్యాడు మండనుని ముందు. జైమిని ఈ విధంగా అన్నాడు: “మండనమిశ్రా! ఈ ఆచార్యుడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడైన శంకరుడే. సందేహము లేదు. వేద వేదాంగ ములు సమస్త వేదాంతము, అన్ని శాస్త్రములు క్షుణ్ణంగా అవగాహన చేసికొన్న లోకోత్తర పురుషుడు. ఎవరికీ కొరకబడని బ్రహ్మసూత్రములను అరటి పండు ఒలిచి చేత బెట్టినట్లు తెలియ జేస్తూ భాష్యం వ్రాసిన బ్రహ్మజ్ఞాని. ఆతడికతడే సాటి. ఈయన వాక్కు నుండి వచ్చినది అంతా యథార్థము. నేను పలికినా వ్యాసుడు పలికినా ఇంతే. మేము ముగ్గురము ఒకటే అని తెలిసికో.


కృతయుగంలో కపిలుడు జ్ఞానమును, త్రేతాయుగంలో దత్తా త్రేయుడు వేదాంతమును, కలియుగంలో శంకరుడు పరతత్త్వ జ్ఞానమును ఉపదేశించడానికి వెలసిన అవతార మూర్తులు. ఈ సంగతి శివపురాణంలో చెప్పియే యున్నారు. ఈస్వామి ప్రబోధము లను మన్నించి సంసార సాగరము దాటుము” అని చెప్పి జైమిని అంతర్ధాన మయ్యాడు.


*మండనుడు శంకరుని స్తుతించుట:*


జైమిని పలుకులతో మండనునికి తగిన ఊరటలభించి మనస్సు పరిపక్వమై శంకరా చార్యుని దిక్కు తిరిగి ఆచార్యులను ఈ విధంగా స్తోత్రం చేశాడు: “స్వామీ! మీ ప్రతిభ అపురూపము. నీవు ద్వంద్వాతీతు డవు.


మీ మహిమ ఎఱుగక మిమ్ము ఎదిరించి మీతో వాదనకు దిగిన ఈ అజ్ఞుని క్షమించండి. నా పూర్వజన్మ పుణ్య వశాత్తూ మీ దర్శన భాగ్యం, మీతో సంభాషించే అవకాశం ఈదీనునికి దొరికింది. కరుణామూర్తివి. లోకంలోని అజ్ఞానాంధ కారాన్ని రూపుమాపు టకు అవతరించిన చిత్స్వరూపుడవు. అటు సాంఖ్యతత్త్వ కర్త కపిలుడు, న్యాయ దర్శన కర్త గౌతముడు, వైశేషిక దర్శనకర్త కణాదుడు, యోగశాస్త్ర నిర్మాత పతంజలి వీరు అందరూ కీర్తి గడించిన వారే. శ్రుతి రహస్యాలు బోధపడక ద్వైత కూపాంధకారంలో పడి నాస్తికత్త్వాన్నే ప్రచారం చేశారు. తమ రాకతో అద్వైత మత ప్రాముఖ్యాన్ని స్థాపించి నావంటి వారిని తరింపజేస్తున్నారు. పరమేశ్వరా! నేను ఇంత వరకూ అజ్ఞానంతో కర్మే అన్నింటికి గతి అని నమ్మి ఆలుబిడ్డలు, భోగభాగ్యములు స్థిరమని సమస్త శాస్త్రాలూ చదివి కూడా తెలివి లేని వాడనైవిర్రవీగితిని. మీ సాన్నిధ్యం తో నాకు జ్ఞానోదయమైంది. జనన మరణములు లేనిది, శాశ్వతానంద ము ఇచ్చునది మీరు ప్రసాదించిన అద్వైత తత్త్వ జ్ఞానమే. మీ పాదాల నాశ్రయించ గల సేవాభాగ్యం కలిగితే ధన్యుడను. మిమ్ములను శరణు వేడుకొంటున్నాను. నాకు మీ పాదసన్నిధిని కొంత ఆశ్రయమివ్వండి. తమ ఆజ్ఞకు సదా బద్ధుడనై ఉంటాను”. 


శంకరాచార్యుడు ఆదరంగా మండన మిశ్రుని దగ్గరగా చేర్చు కొన్నారు.


*ఉభయభారతి కథ:*


నిండు సభలో నున్నపుడు ఉభయ భారతి శంకరస్వామితో తన చిన్ననాటి వృత్తాంత మొకటి తెలియ జేసింది. మా తల్లి కడ నేనుండగా ఒకనాడు జడధారి ఒకడు మా ఇంటికి విచ్చేయగా మా అమ్మ వారికి అర్ఘ్యపాద్యాదు లిచ్చి నా భవిష్యత్తు గూర్చి అడిగింది. ఇది ఏ ఇంటికి జేరుతుంది? దీని భవిష్యజ్జీవనం ఏ గతిలో ఉన్నదని. ఆ ముని మా అమ్మతో అన్న మాట ఇది: "అమ్మా! నీవు ఏమీ చింతిల వలసిన పని లేదు. దేశంలో నాస్తికత తాండవిస్తోంది. కర్మ మార్గాన్ని పునరుద్ధరిం చడానికి చతురానను డు మండన మిశ్రునిగా ఉదయిస్తాడు. అతనికి పత్ని కాబోతోంది నీ కుమారిత, చిరకాలం దోసపంటగా ఆ కుటుంబం పేరు ప్రఖ్యాతులతో వర్ధిల్లు తుంది. మరి కొంత కాలానికి వేదాంత మార్గాన్ని ప్రతిష్ఠించ డానికి పరమేశ్వరుడు శంకరాచార్యుడై మండనమిశ్రునితో వాదయుద్ధం చేయగా మండనమిశ్రుడు విరాగియై శంకరుని శిష్యుడవుతాడు". ఆ మాటలు నేడు సత్యమయ్యాయి. ఈ విశేషము విన్న అందరూ ఆశ్చర్య పడ్డారు.

ఉభయభారతి శంకరుల మధ్య వాదము: 


శంకరాచార్యుల నుద్దేశించి ఉభయభారతి "శంకరాచార్యా! నా భర్త మీతో వాదించి ఓడిపోయెను. అంత మాత్రాన తమ జయము పూర్తి కాదు. భార్యగా నేను వారిలో సగము భాగాన్ని కాబట్టి మీరు నాతో వాదించి నెగ్గితే గాని మీ జయము నిశ్చయము కాదు” అని ప్రస్ఫుటం గా పలికిన మాటలు విన్నవారు విభ్రాంతు లయ్యారు. "దేవీ! నీ కోరిక సమంజసము కాదు. స్త్రీల తోడి వాదము నిషిద్ధము. పైగా అది అపకీర్తి దాయకము” అని శంకరుడన్నారు. ఆ మాటను అంగీకరించ కుండా ఉభయభారతి ఇలా బదులు పలికింది: “మహనీయా! మీకు తెలియని దేమున్నది? శాస్త్రములలో అట్టి నిబంధనలు లేవే! పైగా ఇది శాస్త్ర విషయిక మైనచర్చ. జనకమహా రాజు కొలువులో గార్గి యాజ్ఞవల్క్య మహర్షితో వాదించలేదా? బృహదారణ్యకోపనిషత్తు లోని మాట ఇది. ఆ జనకునితోనే సులభ వాదించలేదా? ఇవేమియు మీకు తెలియనివి కావు. మీతో తత్త్వ చర్చ చేసే అవకాశం నాకు ప్రసాదించండి స్వామీ!" అని నిర్ధారణగా ఉభయభారతి మాట్లాడడంతో శంకరుడింక ఏమీ అనలేక పోయాడు. ఆ విధంగా మొదలయిన వారి మధ్య వాద ప్రసంగాలు పదునేడు దినముల వరకు సాగాయి. మధ్యమధ్య కర్మకాండ నిమిత్తమై కొంత కాలాన్ని వినియో గించుకొనగా. వారిరువురి వాదం కేవలం వాదం కోసం కాక విన్నవారికి జ్ఞానం పంచి పెట్టడానికే జరిగిన చర్చ. పేరుపడిన శాస్త్రజ్ఞులు హనుమంతుడు, ఆదిత్యుడు, శుక్రుడు దిగివచ్చారా అనిపించింది. మండనునకు గగుర్పాటు కలిగినది ఆ వాదప్రతిభలతో. ఎన్నివిధాల యత్నించినా శంకరుని జయించడం కష్టమేఅని గ్రహించిన ఉభయ భారతికి ఒక ఉపాయము తట్టింది. బాల్యం నుండి బ్రహ్మచారి ఇతడు. ఇతడు కామశాస్త్రము చదివే అవకాశము లేదు. అందుచేత చర్చ ఆ శాస్త్రం వైపు మళ్ళించాలని నిశ్చయించింది ఆ మహాతల్లి.


*కాలడి శంకర కైలాస శంకర*


*శ్రీ శంకరాచార్య చరిత్రము*

*19 వ భాగముసమాప్తము*

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

కామెంట్‌లు లేవు: