21, సెప్టెంబర్ 2024, శనివారం

22. " మహా దర్శనము

 22. " మహా దర్శనము " -- ఇరవై రెండవ భాగము---విప్రుడైనాడు


22. ఇరవై రెండవ భాగము-- విప్రుడైనాడు 


         ఆచార్యుడు వచ్చు వేళకు బుడిలులు అగ్నిహోత్రాదులను ముగించుకొని , మడిలోనే పాలు , అటుకులు సేవిస్తున్నారు . చివరి పిడికిలి నోట్లో వేసుకుంటూండగా ఆచార్యులు వచ్చారు . కొడుకును పిలచి , ఆచార్యునికి పాద్యము నిప్పించినారు . అతడు కూర్చొనుటకు కృష్ణాజినమును ఇచ్చినారు . " మీ ఇంటికి వస్తే కూర్చొనుటకు వేత్రాసనమును ఇస్తారు . మేము ఒక కృష్ణాజినమును పరచినాము . దీనితోనే తృప్తులు కావలెను . ఇక త్రాగుటకు కొన్ని పాలు తెప్పిస్తాను " 


" ఇప్పుడే ఇంటిలో అన్నీ ముగించుకొని వచ్చినాను , ఏమీ వద్దు " 


          " నేను ఇచ్చుట మీకు కావాలని కాదు , మీకు గతిలేదు అని కాదు , ఇంటికి బ్రాహ్మణుడు వస్తే అతడు తనతో ఐదు అగ్నులను తెస్తాడట. పాదములలో ఒకటి , తదుపశమనమునకై పాద్యము . చేతులలో ఒక అగ్ని , దానికై అర్ఘ్యము , ముఖములో ఒకటి , దానికోసమై ఆచమనము , పృష్టములో ఒకటి , దానికని ఆసనము . , ఉదరములో ఇంకొకటి, దానికోసమై ఏదైనా కించిత్ భోజన పానీయములు . భుజించుటకు ఏదైనా ఇస్తే , మీ ఇంటిలో చేయు రుచి రుచియైన భోజనమునకు అపోహ వస్తుందని కించిత్ పానీయము . పాలు వద్దంటే , చక్కెర వేసిన పెరుగు , ఏదో అనుమతివ్వండి ’ 


" పూర్వ రూపము వద్దు , ఉత్తర రూపమే కానివ్వండి " 


’ సరే ’ యని బుడిలులు చక్కెర కలిపిన పెరుగు తెప్పించినారు . ఆచార్యులు దానిని తీసుకున్నారు . 


         " సరే , ఇక సమాహిత మనస్కులై, ప్రసన్న చిత్తులై వచ్చిన కారణమేమో అనుజ్ఞనివ్వండి . దీనికోసమే కదా , మేము గృహస్థులై ఇంటిలో నుండునది ? అతిథి సత్కారము వాన ప్రస్థులకు కూడా తప్పలేదు ., గృహస్థులు తప్పించు కొనుటకగునా ? ఎందుకు ? కఠోపనిషత్తు జ్ఞాపకము తెచ్చుకోండి , ఆకాశవాణి , " వైవస్వత , హరోదకం ’ అని గద్దించి బెదరించి వదలలేదా ? సరే , అదలా ఉంచు , ముసలివాడు ఏదో వదరుతున్నాడు అనుకోకుండా , తాము దయచేసినదెందుకో , చెప్పండి " 


" నేను మీవద్దకు వచ్చితి ననగానే మీకు అర్థమయ్యే ఉంటుంది . మీరు హాస్య మాడుతారేమోనని సంకోచము . " 


         " నాకు తెలుసయ్యా , ఆచార్యుడు వచ్చినాడంటే కొడుకు విషయమేదో తెచ్చి ఉంటాడని ! ప్రస్తుతానికి ఆ మహానుభావుడు ఇంకా మనకు అర్థమగు నటువంటి కార్యములను చేస్తున్నాడు . పక్షులన్నీ ఎగిరిపోయిన తరువాత , గరుడుడూ , హంసలూ ఎగిరిపోతాయట ! అలాగ హంసలు , గరుడుల మార్గమును ఈ పక్షి ఇంకా పట్టుకోలేదన్నదే అదృష్టము . సరే , ఇప్పుడే విశేషము తెచ్చినారు ? "


" నిన్నటి దినము పిల్లవాడు మందతో పాటు వెళ్ళినాడట . "


" సరే , ? "


" గోపాలకుడొకడు , పిల్లవాడి కాళ్ళకి రాళ్ళు , ముళ్ళు తగులుతాయని ఎత్తుకొని వెళ్ళినాడట " 


" సరే , ?"


" దారిలో వీడిని ఎత్తుకున్నపుడు , వీడి నుండీ వాడికి ఏదో దిగి వచ్చినట్లై వాడికి సుఖ నిద్ర పట్టేసిందంట ! " 


         గోడకానుకుని ఒరిగియున్న బుడిలులు లేచి కూర్చున్నారు . ప్రసన్నముగా నున్ననూ , వారి ముఖము ఏదో ధ్యానములో ఉండుటను సూచించినది . అడిగినారు , " ఏమిటేమిటీ ? మళ్ళీ చెప్పూ ? "


ఆచార్యుడు మరలా చెప్పినాడు . 


         బుడిలులు, " నీ కొడుకు ఉపనయనమగుటకు ముందే విప్రుడైనాడు . ఆ వికిరణము ఏమనుకున్నావు ? అదే , ప్రాణమయ కోశపు క్రియ. సూర్యుడి నుండీ కిరణములు వెడలునట్లే , ఈ వికిరణము ప్రతి యొక్కరిలోనూ , జడచేతనములను భేదము లేకనే , ప్రతియొక్క వస్తువు నుండీ అగుచుండును . అయితే , కొన్ని దేహములలో గోచరమగునంత ప్రబలముగా ఉండును . ఇతర దేహములలో ప్రబలముగా నుండదు . అట్లయిన , ఇప్పుడే ప్రకటమైనదా ? " 


" ఔను " 


" ఇదయిన తర్వాత ఇంకా ఏమేమో అయి ఉండవలెను . ఏమేమయిందో అదంతా చెప్పు " 


         " పిల్లవాడు గోవుతో సంభాషించినాడట ! వాడికి తన రక్షకుడైన అగ్ని పురుషుని దర్శనమైనదట ! గోవు , అగ్ని, వాయు, ఆదిత్యులు ముగ్గురూ ఒకటే రూపము అని చెప్పిందట " 


" ఇది ఎలాగ విన్నాడూ ? "


" అది కూడా ధేనువే చెప్పిందట . "


         " ఏమిటి , ఒక దేహములోని ఉదానము నుండీ ప్రాణమునకు , దేహములోని ఆ ప్రాణము నుండీ జగత్తులోని ప్రాణమునకు , మరలా జగత్ ప్రాణము నుండీ ఇంకో దేహ ప్రాణమునకు , దాని నుండీ ఆ దేహపు ఉదానమునకు అని చెప్పిందా ? " 


" ఇది తమరికీ తెలుసా ? " 


         " దానికేమిటి , తెలిసుండవచ్చు ! ఏదేమైనా నీ కొడుకు దర్శనీయుడైనాడు . పద , వెళ్ళి వాడిని దర్శనము చేసుకొని వచ్చెదము . అయితే , వెళ్ళుటకు ముందే నీకు దీని రహస్యము తెలియవలెనా ? అయితే విను , వికిరణము వలెనే , మాటలు లేకున్ననూ వినగలిగే విద్య అందరికీ తెలుసు . అయితే అది స్థూల రూపములో తెలుసునే కాని సూక్ష్మ రూపములో తెలియదు . ఎన్నో సార్లు మనకు ఎవరూ లేని ఏకాంతములో మాటలు వినిపించవా ? మాట అంటే ధ్వనియొక్క వైఖరి రూపము . ఆ ధ్వనిని వైఖరీ రూపమునకు మార్చవలెనంటే ఒక యంత్రము తప్పక కావలెను . ఆ యంత్రము ఏదో ఆలోచించినావా ? " 


" నేను కూడా ఇలాగ ఏకాంతములో మాటలు విన్నాను , కానీ అవి ఎవరి మాటలు ? అన్నది ఆలోచించలేదు " 


          " ఔను , నువ్వు విని ఉంటావనే నేను చెబుతున్నది . ఆ కంఠపు లక్షణాలను పట్టి చూస్తే అది ఎవరిది అన్నది తెలియును . అప్పుడు ఏమనవలెను ? ఆ కంఠము ఉన్నవారు దగ్గరకు వచ్చి నిలచి మాట్లాడినారు అనవలెనా ? లేక , విన్నవాడి మనసే ఆ రూపమును ధరించినది అనవలెనా ? ఇది చాలా సూక్ష్మమైన విషయము . శాస్త్రజ్ఞులను కూడా తికమక చేయునట్టి విషయము . కాబట్టి , తెలిసిన వారు రెండు విధములు గానూ ఉంటుంది అంటారు . అదికూడా ఒక జాగ్రత్-స్వప్నము అనుకో . ధ్వనిని వైఖరిగా మార్చు యంత్రము ఒక్క మనుష్యునిలో మాత్రమే ఉంది . కానీ , ఆ యంత్రమును నడిపించు ఉదాన వాయువు మాత్రము ప్రాణము ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడక్కడంతా ఉండును . అదీగాక , పలికించునది ఉదానము యొక్క కార్యము మాత్రమే . ఎడ్లబండిలో కూర్చున్న వానికన్నా , గుర్రపు బండిలో కూర్చున్న వాడు వేగముగా పోవును . గుర్రపు బండి లో కూర్చున్న వాని కన్నా గుర్రము పైన కూర్చున్న వాడు ఇంకా వేగముగా పోవును . అయితే , బండిలో కూర్చున్న వాడైనా , గుర్రముపై కూర్చున్న వాడైనా , పాద చలనము లేకుండానే సంచారమును చేయునట్లే , ఇది కూడా ! తెలిసిందా ? 


" ఈ విద్యను మీరు ఇంతవరకూ చెప్పనే లేదు కదా ? " 


        " నువ్వు అడుగలేదు , నేను చెప్పలేదు . ఇప్పుడింకొక విషయము చెబుతాను విను , నేను అపరిగ్రహ వ్రతమును పాటించుట నీకు తెలుసు కదా ? దాని వలన ఎంత ప్రయోజనమైనదో తెలుసా ? ఈ విద్యలన్నీ తాముగా అపరిగ్రాహుల వద్దకు వచ్చి చేరుతాయి , ఎందుకో తెలుసా ? మనస్సు దర్శనాది చపలత్వమును విడుచును . రౌతు తనపై కూర్చోగానే , విధిలేక , చపలత్వమును వదలిన గుర్రము వలె , మనస్సు పట్టులోనికి వచ్చును . అది చెప్పినట్లు మనము వినుట తప్పి , మనము చెప్పినట్లు అది వినును. అప్పుడు ఈ విద్యలన్నీ అర్థమగును . " 


" అటులనా ? అయితే ఎప్పుడు కావాలన్న అప్పుడు అపరిగ్రహ వ్రతమును పట్టవచ్చునా ? " 


         " నీ సంగతి అడుగుచున్నావా ? నీకేమి , అగ్న్యుపాసకుడివి . నువ్వు సుఖముగా పట్టవచ్చును . కానీ అది అంత సులభము గాదు , ఎందుకంటావా ? ఇప్పటివారు ఉపాసన అంటే నదికి స్నానమునకు పోవునట్లు అనుకుంటారు , అదికాదు . ఉపాస్యమాన దేవత సర్వగతమైనది . అన్నిచోట్లా ఉండును అనుదానిని మనసుతో చూచి , అనుక్షణమూ తాను ఆ దేవత ఒడిలో ఉన్నానని మనసుకు నమ్మకము వచ్చుటే ఉపాసన. అలాగ కాకున్న , అపరిగ్రహము సిద్ధించదు . అలాకాక, నదీస్నానము వలె అయితే , నదినుండీ ఇంటికి వచ్చులోపే మరలా చెమట్లు పట్టి ఇంకొకసారి స్నానము చేస్తేకానీ సరిపోదు అన్నట్లవుతుంది . దానికి బదులు , తాను ఎల్లపుడూ నదిలోనే ఉండేలా అయితే ? అది అపరిగ్రహము చేయుటకు సిద్ధుడైన వాడి గుర్తు . అప్పుడు కూడా వీడు తనను దైవానికి అర్పించుకోవలెను . ఆ సమర్పణను ఆ దైవము అంగీకరించవలెను . అప్పుడు , శిష్యుడిని నడిపించు గురువు వలె , ఎద్దును తోలుతూ కావలసిన చోటికి వెళ్ళు బండివాని వలె దైవము వీడిని సన్మార్గములోనే నడిపించును . అప్పుడు ఉపాసకుడు తాను చేసినది కార్యమో , అకార్యమో అనే చింత లేకనే స్వస్థ మానసుడగును. అప్పుడు వానికి రాని విద్య ఏది ? ఇవి వట్టి మాటలు కావు , ఆత్మోద్ధారపు మొదటి మెట్టు అపరిగ్రహము . రెండో మెట్టు ఉపాసన. "  


         ఆచార్యుడు అవాక్కై , వింటూ కూర్చున్నాడు . " అలాగయిన , పౌరుషము లేదా ? మనుష్యుడు ఉపాసకుడైనంత మాత్రాన పౌరుషమునకు తర్పణము ఇవ్వవలెనా ? " అని ఏమేమో ప్రశ్నలను అడుగవలెను అనిపించిననూ , శిష్యుడిని నడిపించు ఆచార్యుడివలె , ఎద్దును తనకు కావలసిన వైపుకు అదిలిస్తూ వెళ్ళు బండివాని వలె ... వంటి ఉపమానములను చెప్పిన బుడిలుల మాటకు ప్రతి మాట్లాడలేక , నిట్టూర్చి , ’ సరే ’ అన్నాడు . 


బుడిలులు , ’ పద , మీ ఇంటికి వెళ్ళి ఆతని దర్శనము చేసుకొని వస్తాము ’ అని తొందర పెట్టినారు . 

Janardhana Sharma

కామెంట్‌లు లేవు: