*బమ్మెర పోతనామాత్యులవారి గజేంద్రమోక్షం లోని త్రికూటపర్వత వర్ణనము*
8-28 కంద పద్యము
తలఁగవు కొండలకైనను
మలఁగవు సింగములకైన మార్కొను కడిమిం
గలఁగవు పిడుగుల కైనను
నిల బలసంపన్న వృత్తి నేనుఁగు గున్నల్.
*తాత్పర్యము*
ఆ గుంపులోని గున్న ఏనుగులు భూలోకంలో మిక్కిలి బల సంపదతో కొండలను ఢీకొనుట కైన వెనుదీయవు. సింహాలకైన వెనుదీయ కుండ ఎదిరించి నిలబడతాయి. చివరకి పిడుగులకు కూడ బెదరవు.
రహస్యార్థం: కొండలంత కష్టాలు వచ్చినా, ధైర్యం విడనాడకుండా, కామాదులను జయించుటకు సింగము వంటి పట్టుదల కలవి అయి ఎదుర్కుంటాయి. పిడుగుల వంటి ఆపదలు మీద పడినా తట్టుకుంటాయి కాని చలించవు. అంతటి అవిద్యావృత పారమార్దిక జీవులు అవి.
8-29 సీస పద్యము
పులుల మొత్తంబులు పొదరిండ్లలోఁ దూఱు;
ఘోరభల్లూకముల్ గుహలు జొచ్చు;
భూదారములు నేల బొఱియలలో డాఁగు;
హరిదంతముల కేఁగు హరిణచయము;
మడువులఁ జొరఁబాఱు మహిషసంఘంబులు;
గండశైలంబులఁ గపులు ప్రాఁకు;
వల్మీకములు జొచ్చు వనభుజంగంబులు;
నీలకంఠంబులు నింగి కెగయు;
8-29.1-తేటగీతము
వెఱచి చమరీమృగంబులు విసరు వాల
చామరంబుల విహరణశ్రమము వాయ
భయదపరిహేల విహరించు భద్రకరుల
గాలివాఱిన మాత్రాన జాలిఁ బొంది.
*తాత్పర్యము*
ఆ మదపుటేనుగులు భయంకరంగా విహరిస్తున్నాయి. వాటి గాలి సోకితే చాలు భయపడిపోయి, పులులన్నీ పొదలలో దూరుతాయి. భీకరమైన ఎలుగుబంట్లు గుహలలో దూరతాయి. అడవి పందులు గోతులలో దాక్కుంటాయి. జింకలు దిక్కులు పట్టి పోతాయి. అడవిదున్నలు మడుగుల్లో చొరబడతాయి. కోతులు కొండరాళ్ళపైకి ఎగబాకుతాయి. అడవిలోని పాములు పుట్టలలో దూరతాయి. నెమళ్ళు ఆకాశానికి ఎగురుతాయి. సవరపు మెకాలు తమ తోకకుచ్చుల చామరాలతో ఏనుగుల శ్రమ తీరేలా విసురుతాయి.
రహస్యార్థం: బాహ్యంగా భయంకరంగా విహరించే ఏనుగులను చూసి ఇతర జంతువులు బెదురుతున్నాయి అనే చక్కటి స్వభావాలంకారం అలరిస్తుంది. కాని ఆయా జంతువుల రహస్య సంజ్ఞా భావం తీసుకుంటే; కామ,క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈర్ష్య మున్నగునవి వాటి అధిదేవతల యందు అణగి ఉన్నాయి అని భావం.
8-30-కంద పద్యము
మదగజ దానామోదముఁ
గదలని తమకములఁ ద్రావి కడుపులు నిండం
బొదలుచుఁ దుమ్మెదకొదమల
కదుపులు జుం జుమ్మటంచు గానము చేసెన్.
*తాత్పర్యము*
పడచు తుమ్మెదల గుంపులు ఆ మదపుటేనుగుల సుగంధాల మదజల ధారలు కమ్మగా కడుపులనిండా తాగి సంతోషంతో జుం జుమ్మని పాడుతున్నాయి.
8-31 కంద పద్యము
తేటి యొకటి యొరు ప్రియకును
మాటికి మాటికిని నాగ మదజల గంధం
బేటి కని తన్నుఁ బొందెడి
బోటికి నందిచ్చు నిండు బోఁటు దనమునన్.
*తాత్పర్యము*
గండుతుమ్మెద ఒకటి తనతో క్రీడిస్తున్న ప్రియురాలైన ఒక ఆడ తుమ్మెదకి అస్తమాను ఆ ఏనుగుల మదజలం ఎందుకులే అని నిండుమగతనంతో అందించింది.
రహస్యార్థం: మనస్సు సమాధి స్థితిలో ఉన్న ఆనందమును మరిగి, జగదాకార వృత్తులను వదలి, సంపప్రజ్ఞతా సమాధి యందలి ఆనందమును పొందింది.
8-32 కంద పద్యము
అంగీకృత రంగ న్మా
తంగీ మదగంధ మగుచు దద్దయు వేడ్కన్
సంగీత విశేషంబుల
భృంగీగణ మొప్పె మ్రానుపెట్టెడి మాడ్కిన్.
*తాత్పర్యము*
తుమ్మెద కదుపులు ఇంపైన మదగజాల మదజలగంధా లెంతో వేడుకతో ఆస్వాదిస్తూ చెవులు గింగిర్లెత్తేలా ఝంకారం చేస్తున్నాయి.
రహస్యార్థం: “తృష్ణా హృత్పద్మషట్పదీ” (హృదయ పద్మంలో ఉండే తుమ్మెద అంటే తృష్ణ). అలా హృదయ పద్మంలో ఉండే సంకల్పాలు అను తుమ్మెదల గుంపు, మాతంగీ అంటే పరాప్రకృతి సంబంధమైన నిర్వికల్పానందంచే, నిశ్చేష్టముగా ప్రణవనాదం చేశాయి.
8-33 కంద పద్యము
వల్లభలు పాఱి మునుపడ
వల్లభ మని ముసరి రేని వారణదానం
బొల్లక మధుకరవల్లభు
లుల్లంబులఁ బొందిరెల్ల యుల్లాసంబుల్.
*తాత్పర్యం*
ఆడతుమ్మెదలు ఆత్రంగా పోయి ప్రియులని ముసురు కొన్నాయి. మగ తుమ్మెదలు ఏనుగుల మదజల ధారలకు ఆశపడకుండా నిండుగా తమ మనసులలో సంతోషపడ్డాయి.
రహస్యార్థం: జీవులు, అవిద్యా ఉపాధులతో కూడి పృథక్కుగా ఉండే గజగంధము అను విషానందమును గైకొనక, సహజ ఆనందమును, తాదాత్మ్య ఆనందమును ఆస్వాదిస్తున్నాయి.
8-35 .మత్తేభ విక్రీడితము
కలభంబుల్ చెరలాడుఁ బల్వలము లాఘ్రాణించి మట్టాడుచున్
ఫలభూజంబులు రాయుచుం జివురు జొంపంబుల్ వడిన్ మేయుచుం
బులులం గాఱెనుపోతులన్ మృగములం బోనీక శిక్షించుచుం
గొలఁకుల్ జొచ్చి కలంచుచున్ గిరులపై గొబ్భిళ్ళు గోరాడుచున్.
*తాత్పర్యము*
గున్నేనుగులు చెర్లాటలాడుతున్నాయి. పచ్చిక బయళ్ళని వాసన చూసి తొక్కుతున్నాయి. పళ్ళచెట్లని రాసుకు పోతు చిగుళ్ళు గబగబ మేసేస్తున్నాయి. పులుల్ని, అడవి దున్నలని, జింకల్ని తప్పించుకు పోనీయక నిలిపి శిక్షి స్తున్నాయి. మడుగులలో దిగి కలచేస్తున్నాయి. కొండల మీద వినోదంగా విహరిస్తున్నాయి.
రహస్యార్థం: జీవులు జీవన్ముక్తి విహారాలతో ఆనందిస్తూ, మధ్య మధ్య జలభ్రాంతితో ఎండమావులను జలం అని మోసపోతూ, వివేకంతో సంసార పాదపాలను నిర్లక్షిస్తూ, విషయాది అను చివుళ్ళు భక్షిస్తూ, కామాది క్రూరమృగాల ఉద్రేకాలను అణచేస్తున్నారు.
8-36 కంద పద్యము
తొండంబుల మదజలవృత
గండంబులఁ గుంభములను ఘట్టన చేయం
గొండలు దలక్రిందై పడు
బెండుపడున్ దిశలు చూచి బెగడున్ జగముల్.
*తాత్పర్యము*
తొండాలతో మదజలం నిండిన చెక్కిళ్ళతో కుంభస్థలాలతో ఆ మదగజాలు ఢీకొంటుంటే కొండలు తలకిందులౌతాయి దిక్కులు బద్ధలౌతాయి. లోకాలు భయపడిపోతాయి. (ఎంతచక్కటి అతిశయోక్తి అలంకారం)
రహస్యార్థం: జీవుడు అహంభావంతో ఇంద్రియ వ్యాపారలకు ఆజ్ఞలను ఇచ్చే స్థానం ఆజ్ఞా చక్రం. గండస్థలం అను ఆజ్ఞా చక్రం. అందుండే మదజలం, మదించిన చలం అంటే పట్టుదల. అదే కర్తృత్వకాది అహంభావం. తొండం అంటే ఉచ్వాసం అంటే ప్రాణాయామం. అలా ప్రాణాయామంతో అహంభావాన్ని ఘట్టన అంటే నిరోధం చేస్తుంటే, జగములు అంటే శరీరం గగుర్పాటు పొందింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి