24, జులై 2020, శుక్రవారం

పత్ర హరితం



*"ప్రేమ అంటే చిన్నపాటి నది కాదు, కాస్తంత ఎత్తైన కొండ కాదు అది అవధుల్లేని అహంకారం లేని మహా సముద్రం" అంటాడు సూఫీ కవి మౌలానా జలాలుద్దీన్ రూమి. సహసవంతులు ఈ సముద్రంలోకి దూకి ఈదులడతారు, మునకలేస్తారు, సహా జీవనం సాగిస్తారు. ఇతరులు ఆ ఒడ్డు చెంతకు వెడతారు. కాళ్ళు తడుపుకుని బయటకు వస్తారు. అనేకులు ఆ సముద్రపు హోరుని చూసి భయంతో,  విస్మయంతో ఒడ్డు నే ఉండిపోతారు. ఆనంతాకాసాన్ని తాకే ఆ సముద్రం వారికి ఒక కలగా, జ్ఞాపకంగా మిగిలిపోతుంది. కలలు కనడం సులువు. ఆ కలల్ని సాకారం చేసుకోవడానికి అసిధారవ్రతం పూనాలి. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగాలి. జయాపజయాలుతో సంబంధం లేకుండా ప్రేమ సముద్రంలోకి ప్రయాణించాలి. ఈ సాహసం, ధైర్యం, తెగువ ఉన్నవారు ప్రేమలోనే కాదు జీవితంలో కూడా రాణిస్తారు. దేనికి వెరవని ధీరగుణాన్ని సంతరించుకుంటారు. వీరినే ప్రేమ వరిస్తుంది. ప్రేమలోని తేజస్సు వారి జీవనయానాన్ని కాంతివంతం చేస్తుంది. ఇలాంటి ప్రేమ అడిగితే వచ్చేదికాదు. ప్రాధేయపడితే ప్రసాదించేదికాదు. త్రికరణ శుద్ధిగా నమ్మాలి. అంకితమవ్వాలి. బలంగా తపించాలి. ఎలాంటి సంసయాల్లేకుండా ప్రేమని విశ్వసించాలి. చాలామంది ప్రేమని విభ్రమంతో చూస్తారు. ముచ్చట పడతారు. తన్మయులవుతారు. హృదయాన్ని విప్పార్చి ఆవాహన చేసుకోవాలంటే జంకుతారు. లోకరీతులు, నీతులు, లౌకిక వ్యవహారాలు అడ్డుగా నిలుస్తాయి. వీటికి ప్రాధాన్యమిచ్చేవారు ప్రేమ అంచులని సైతం తాకలేరు. లోకం మీద సమస్త ధిక్కారం ప్రకటించే చేవ ఉండాలి. అదే సమయాన కరుణాంతరంగంతో లోకాన్ని చూడగలగాలి. ఎందుకంటే ప్రేమ వినా జీవితానికి మరేదీ శాంతినివ్వదు. ఈ ప్రేమే ప్రపంచ మనుగడకి ఆలబనంగా నిలిచే ప్రాణవాయువు, పత్రహరితం!!*

*సర్వేజనా సుఖినో భవంతు....మీ ఆకొండి రామ మూర్తి....24.07.2020....శుక్రవారం....🙏🙏🙏🙏🙏*

*మరొక అంశంతో రేపు మీ ముందుకు....🙏🙏🙏

కామెంట్‌లు లేవు: