24, జులై 2020, శుక్రవారం

*ఏంటొదినాసంగతులూ* !

       *" వదినా! వదినా!"*

     " వచ్చే.. వచ్చే.. ఈరోజేంటో నెట్ సరిగ్గా లేదొదినా! అందుకే లేటయింది రావడం.  మీ ఇంట్లో వైఫై ఎప్పుడూ బానే ఉంటుందేమో?  అందుకే చటుక్కున వచ్చేస్తావు. ఏంటొదినా సంగతులూ!

     " అయ్యో! వదినా!ఇది వాయిస్ కాలు కాదు.. వీడియో కాలు.. ఇది ఆపి, అది తెరువు."

     " ఔనా! నా మతిమండా! చూసుకోనేలేదు.. అక్కడే ఉండు, వీడియో కాలు తెరుస్తా! ఆ.. బానే కనిపిస్తోందా? చెప్పు, చెప్పు.. అదేంటొదినా అలా చిక్కిపోయావూ? నిన్న చూసినప్పుడు బానే దిట్టంగా ఉన్నావూ.. ఒక్కరోజుకే అలా చిక్కిపోయావూ? "

    " అదేం లేదులే.. నిన్న టీవీ లో పెట్టుకుని చూసుకున్నాం మనం. మర్చిపోయావా?  ఇప్పుడు ఫోన్ లో చూసేసరికి అలా కనిపిస్తున్నానులే.. "

  " ఓ, అదా సంగతీ! సరే ఏంటి చెప్పు? ఎందుకు ఫోన్ చేసావూ? "

      " శ్రావణ శుక్రవారం పేరంటానికి పిలుద్దామని వచ్చాను వదినా! ఇదిగో బొట్టు పెట్టించుకో. ఆ రోజు సాయంత్రం ఐదింటికల్లా జూమ్ పేరంటానికి వచ్చెయ్యి. అదేదో కలర్స్ వేసే యాప్ పెడతానంది మా అమ్మాయి.. మీరు కాస్త కాళ్లు, మెడ చూపిస్తే, గంధం కలరూ, పసుపు రంగూ బ్రష్ తో పూసేయొచ్చుట. . "

     " అలాగే , వదినా ! తప్పకుండా వస్తాను.  మీ ఇంటికొచ్చే దారిలోనేగా మా మూడోఆడబడుచు తోడికోడలి వియ్యపురాలి ఇల్లు. మీ ఇంటి జూమ్ కి వచ్చి ఆవిడ జూమ్ కి వెళ్ళకపోతే అలుగుతుంది. ముందు అటెళ్ళి తర్వాత మీ జూమ్ కి వస్తాను.
అదవగానే మా జూమ్ కి వచ్చెయ్యి.. మీ అమ్మాయి ని కూడా తీసుకురా..
వాయినాలు ఆ అమెజాన్ వాడికి ఆర్డరిచ్చేసింది మా కోడలు. వాడే శుభ్రంగా రాళ్లు ఏరి, శెనగలు నానబోసి, కవరు లో పండూ తాంబూలం, రిటర్న్ గిఫ్ట్ పెట్టి పంపుతాడట. మీ అడ్రసు లు అన్నీ ఇచ్చేసింది మా కోడలు. శుక్రవారం సాయంత్రం ఆరింటికల్లా శెనగలు డెలివరీ అవుతాయట. "

      " ఔనా! వదినా!  ఎంచక్కా వాయినాల పని కూడా సులువయిపోయింది. ఔనూ! ఇంతకీ  వాడు మడి కట్టుకుని నానపోస్తాడంటావా?  "

     " భేషుగ్గా పోస్తాడట. బరంపురం పట్టుపంచె కట్టుకుని.. మంచి శెనగలే పుచ్చులూ చచ్చులూ లేకుండా.. ఇంత పసుపు కూడా వేసి నానపెడతాడట.  వాడికి ఫైవ్ స్టార్ రేటింగ్ కూడా ఉందట. అన్నీ చూసే ఆర్డర్ ఇచ్చింది
మా కోడలు. "

     " అయితే సరే.. బానేవుంది.ఇంతకీ కొత్తగా ఏం  నగ చేయించుకున్నావూ వరలక్ష్మి వ్రతానికి. "

     " అయ్యో, నీకు చెప్పనేలేదు కదూ.. మామిడిపిందెల నెక్లేసు.. ఆన్ లైన్ లోనే చేయించేసాను. మరి నువ్వో.. "

      " ఆన్లైన్ లో బంగారం వద్దని మా ఆయన ఐదు లక్షలు ఇచ్చేసాడొదినా! "

      " ఎవరన్నారూ? ఆన్లైన్ లోది మంచిది కాదనీ.. బంగారం లాంటి బంగారం. అయినా మీ ఆయన అభిప్రాయం ఆయనది. నాకెందుకులే.  సరేకానీ.. ఆ మీనాక్షి వజ్రాల ముక్కుపుడక చేయించుకున్నానని మెసేజ్ పెట్టింది. నిజమేనంటావా?"

  " ఔనొదినోయ్! నాకూ డౌటే.. ఆ మాస్కు వెనకాల ఏ ముక్కు పుడకుందో.. మనం చూడొచ్చేమా? ఏంటి?  వజ్రమైనా అంటుంది.. వైఢూర్యమైనా అంటుంది .. ఎవడికి తెలుసూ? "

 " ఆ.. మనకెందుకులే వదినా! ఉంటామరి.  మర్చిపోకు. జూమ్ కి రావడం. "
                   😜 
వాట్సాప్ లో నాకు వచ్చిన సందేశం.

కామెంట్‌లు లేవు: