3, ఆగస్టు 2020, సోమవారం

*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*

*శ్రీమాత్రేనమః*
*52వ నామ మంత్రము*

*ఓం శివ కామేశ్వరాంకస్థాయై నమః*

శివస్వరూపుడు, కామస్వరూపుడు అయిన కామేశ్వరుని (శివుని) అంకమును (తొడను) స్దానముగా  విరాజిల్లు శ్రీమాతకు నమస్కారము

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శివ కామేశ్వరాంకస్థా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఉచ్చరించుచూ ఆ శ్రీమాతను ఉపాసించు సాధకునికి ఆత్మానందము, భౌతికసంబంధమైన సుఖసంతోషములు సంప్రాప్తమగును

నిర్గుణుడై సగుణ స్థితిని పొందిన కామేశ్వరుని యొక్క వామాంకము నందు ఉండునది శ్రీదేవి. ఈ నామము చాలా ప్రశస్తమైనది. ఇది శ్రీమాత నివాసస్థలము. దీనిలో రెంఢు నామములు తెలుపబడినవి. 1) శివుడు, 2) కాముడు. శివుడు మంగళప్రదుడు. శుభంబులను ప్రసాదించువాడు. శివపరమాత్మకు తల్లి, తండ్రి లేరు. ఆయస అవతరణకు అంతు, ఆధారము లేదు. సర్వము ఆయన విలాసమే. శివుని నుండే శ్రీజగన్మాత, జగత్తు రూపంగా వ్యక్తమైనది. ఈ విశ్వం వ్యక్తం కానప్ఫుడు తానొక్కడుగా ఉన్న శివుడు ఒక బిందువుగా వ్యక్తమగుతాడు. శివుడు ప్రపంచానికి ప్రధముడు. *అంకము* అనగా ఒక గుర్తు. *మచ్చ* అని గమనించాలి. కావున *శివుడి అంకము* అనగా బిందువు అని భావము. ఈ విధంగా కామేశ్వరుని అంకము అనవచ్చును. పూర్తిగా వ్యాపించిన బిందువు. అనగా ఈ బ్రహ్మాండము వరకు అని గ్రహించదగును. ఈ ప్రకారముగా, శివుని అంకస్థితి నుండి కామేశ్వరుని అంకస్థితి వరకు అనగా బిందువు నుండి బ్రహ్మాండము పరిణామము వరకు సృష్టి స్థాపింపబడినది. ఈ సువిశాల  విశ్వమంతయూ అమ్మవారి నుండి ప్రభవమైనది. అని గ్రహించాలి. *శివకామేశ్వరాంకస్థా* అను నామ మంత్రము చాలా ప్రాముఖ్యము వహించియున్నది. ఇది శ్రీమాత నివాస స్థలము. *సుధాసింధోర్మధ్యే పరమశివపర్యంకనిలయా* అని సౌందర్యలహరిలో శంకరాచార్యులవారు 8వ శ్లోకములో వివరించిన విధానము 
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*సౌందర్యలహరి - 8వ శ్లోకము*

*సుధాసింధోర్మధ్యే - సురవిటపివాటీపరివృతే*

*మణిద్వీపే నీపో-పవనవతి చింతామణి గృహే |*

*శివకారే మంచే - పరమశివపర్యంక నిలయామ్*

*భజంతి త్వాం ధన్యాః - కతిచన చిదానందలహరీమ్ || 8 ||*

అమ్మా...అమృతసముద్రము మధ్యలో కల్పవృక్షాలతో నిండియున్న మణిద్వీపంలో, కదంబపుష్ప వృక్ష  తోటలో,చింతామణులతో నిర్మించిన గృహమునందు,త్రికోణాకారపు మంచము మీద,పరమశివుని పర్యంకస్థితవై ప్రకాశించుచు,జ్ఞాన స్వరూపమై నిరతిశయ సుఖప్రవాహరూపముగా ఉన్న నిన్ను స్వల్ప సంఖ్యాకులైన ధన్యులు మాత్రమే సేవించుకోగలుగుతున్నారు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శివ-కామేశ్వర పదములు ప్రజ్ఞాన బోధకములు. అంకస్థగా వర్ణితమైన పరాశక్తి అమ్మవారు అటువంటిదియే అగును. అనగా శివునికి, శక్తికి భేదము లేదు. అందుచే పరాశక్తికి నామరూపాదులు లేవు. అయిననూ  స్థూల శరీర ధారులైన భండాసుర మహిషాసురాదులను  వధించుటకై కరచరణాది కల్పితమైన రూపమును పరాశక్తి ధరించినది. వాస్తవానికి లలితాంబికా పరాశక్తికి భేదాలు లేవు. అందుచే శివకామేశ్వర పదములకు మంగళకరమైన ప్రజ్ఞానము అని గ్రహింపదగును.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం శివకామేశ్వరాంకస్థాయై నమః* అని అనవలెను

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* అనుగ్రహముతో, వారి విరచితమైన *శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*  అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
నేడు సోమ వారము. ఇందు వారము అని కూడా అంటాము. నీలకంఠుని ఆరాధించు పవిత్రమైన దినము. *ఓం నమశ్శివాయ* అనే ఈ పంచాక్షరిని పదిసార్లు మననం చేసుకుందాము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉

కామెంట్‌లు లేవు: