3, ఆగస్టు 2020, సోమవారం

సోమవారం 03-08-2020 ఏడు పండుగలు

 ఈరోజు పలు పర్వదినాలు కలసివచ్చాయి.

1). శ్రావణ పౌర్ణమి- జంధ్యాల పౌర్ణమి.
2). రక్షాబంధన
3). హయగ్రీవజయంతి
4). గాయత్రీ జయంతి
5). లవకుశ జయంతి
6).సంస్కృతభాషా జయంతి.
7). విఖనసమహర్షి జయంతి.
వీటిని గురించి కొంచెం తెలుసుకొందాం!

మాన్యులందరికీ శ్రావణపౌర్ణమి సందర్భంగా అనేకమైన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. 

ఈరోజు చాలా ప్రత్యేకమైంది. 

ఏడు పండుగలు కలసివచ్చాయి.
వీటిలో
                                     🌷శ్రావణపౌర్ణమి- జంధ్యాల పౌర్ణమి అందరికీ తెలిసిందే! 

క్రొత్తజంధ్యాలను వేసుకోవడం ఇవాళ చేస్తారు. శ్రావణమాసంలో  వచ్చే పూర్ణిమ నాడు ఈ కార్యక్రమం చేస్తున్నారు.  అయితే,  పూర్ణిమ తిథితో పాటు, నక్షత్రం కూడా చూస్తారు. సూర్యోదయానికి
ఉత్తరాషాఢ ఉంటే ఆ రోజు పనికిరాదు.
శ్రవణం ఉంటే చాలు కొందరికి. 
సౌరమానాన్ని బట్టి కర్కాటకం పనికిరాదు. సింహంలో రవి ప్రవేశించాలి. ఇలా ఏవో నిబంధనలు ఉన్నాయి.  అవన్నీ మనకేం తెలుసు? అందుకే పంచాంగం చూసి, ఏ రోజున చేయాలో తెలుసుకొంటాం. ఆ రకంగా పంచాంగం మనకి ఉపయోగపడుతుంది.  పూర్వం పెద్దలు ఇవన్నీ చెప్పేవారు. ఇవాళ శాస్త్రం, సంప్రదాయం ఎరిగి,  నిర్దుష్టంగాను నిర్దిష్టంగాను చెప్పేవారు కరువైపోయారు.

జంధ్యాలు వేసుకోవడం  - ఋగ్వేదులకు రేపు, ఇతరులందరికీ ఇవాళ.

ఇవాళ జంధ్యాలు మార్చుకోవడమే కాదు..ఋషితర్పణాలు చేయాలి. బ్రహ్మచారులు ఉపాకర్మ చేసుకోవాలి.
కాండర్షులు అని వేదఋషులలో ఒక వర్గం. వారికి తర్పణం చేయాలి.

నూతనవస్త్రాలు ధరించాలి. కనీసం కౌపీనమైనా క్రొత్తది ధరించాలి. కటిసూత్రం (మొలత్రాడు) కొత్తది ధరించాలి. బ్రహ్మయజ్ఞం చెయ్యాలి. అప్పుడు కానీ ఈ నాటి కార్యక్రమం పూర్తికాదు.  ఇవాళ దోసెలు, తిమ్మనం చేస్తారు. ఇదీ నియతంగా చేసేదే!

🌷ఈ రోజు రక్షాబంధన దివసం!

దీనిని ఔత్తరాహుల సంప్రదాయంగా మనవాళ్ళు అనుకుంటారు.కానీ దేశమంతా దీనిని ఆచరించే సంప్రదాయం ఉండేది.  ఇవాళ రాఖీబంధన్ అని చేస్తున్నారు.  రక్షాబంధనమే వాడుకలో  అలా అయింది.

ఈ రక్షని కట్టినప్పుడు పఠించే మంత్రం కూడా మనకి పెద్దలు చెబుతారు.

యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః,తేన త్వా మపి బధ్నామి రక్షే  మాచల మాచల

🌷ఈరోజు సాయంత్రం హయగ్రీవజయంతి.

విద్యాధిదేవత హయవదనుడు. వేదాలను రక్షించి, మధుకైటభులను సంహరించి,  బ్రహ్మకి వేదాలను ఉపదేశించాడు. క్షణంలో సగంకాలం హయగ్రీవుని ధ్యానిస్తే చాలు - ఆయన అనుగ్రహం లభిస్తుంది. వారి వాక్ప్రవాహం ముందు మందాకిని మందగిస్తుంది. అయితే, అందరికీ హయగ్రీవారాధనం లభించదు. పూర్వజన్మలో చేసిన పుణ్యం పరిపాకానికి వస్తేనే ఈ జన్మలో ఆ స్వామిని ఆరాధించగలుగుతాం.

🌷ఈ రోజు గాయత్రీ జయంతి కూడా. 

మంత్రాలలో చాలా గొప్పది, గాయత్రి.
గాయత్రీమంత్రంకంటే గొప్ప మంత్రం లేదు అని సూక్తి ప్రచురమైనది. ప్రతిదినం సంధ్యావందనంలో గాయత్రీమంత్రం జపిస్తాం. ముప్పొద్దులా తప్పకుండా చేయవలసింది, ఇది. సంధ్యావందనం  వైదికకార్యక్రమాలను నిర్వహించడానికి అర్హతను కలిగిస్తుంది.  గాయత్రీ జపం పాతక, ఉపపాతకాలనుండి రక్షిస్తుంది. తేజస్సు నిస్తుంది.

🌷ఈరోజు రామాయణాన్ని గానంచేసి లోకానికి అందించిన లవకుశుల జయంతి!

వీరు కవలు! సీతమ్మ బిడ్డలు. వాల్మీకి శిష్యులు.  మంచి విద్యావంతులు, సౌందర్యశాలులు, శౌర్యపరాక్రమాలు కలవారు. రామకథని గానంచేసి  లోకాన్ని, రామచంద్రునీ ఆనందడోలికల నుర్రూతలూగించారు.  రాముని సంతానమని తెలిసాక, యువరాజులైనారు. రాజుగా కుశుడు చాలా ప్రసిద్ధికెక్కాడు. వారిద్దరి పుట్టినరోజు ఇవాళ.

🌷ఈరోజు సంస్కృతభాషా దినోత్సవం

భాషకి పుట్టినరోజు చేయడం వింతగా ఉంటుంది కదా! దేవభాష సంస్కృతం. విజ్ఞాన ఖని సంస్కృతం. వేదాలు, ఉపనిషత్తులు ,వేదాంగాలు, దర్శనాలు, శాస్త్ర, పురాణ,ఇతిహాసాలు మొదలైనవన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి.  గొప్ప కవులు సంస్కృతంలో రచనలు చేసారు. కంప్యూటర్ అంగీకరించినభాష సంస్కృతం!
అపవర్గం గురించి చెప్పే ఒకేఒక్క భాష సంస్కృతం!

ఇన్ని విశేషాలు కల రోజు,  ఈరోజు.
కనుక ఈ శుభదినాన శుభాకాంక్షలు చెబుతూ,  ఈ విషయాలను మీ ముందు ఉంచడం జరిగింది.

🌷విఖనసమహర్షి జయంతి కూడా ఈరోజే!

వైఖానసాగమం పాటించేవారు విఖనోమహర్షి జయంతిని విశేషంగా జరుపుతారు.

ఇన్ని విశేషాలు కల ఈ శుభదినం అందరికీ అనేకమైన శుభాలను అనుగ్రహించాలి

కామెంట్‌లు లేవు: