3, ఆగస్టు 2020, సోమవారం

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - ఏడవ అధ్యాయము*

*సముద్రమథనము - పరమశివుడు విషమును భక్షించి సురాసురులను కాపాడుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*ప్రజాపతయ ఊచుః*

*7.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*దేవదేవ మహాదేవ భూతాత్మన్ భూతభావన|*

*త్రాహి నః శరణాపన్నాంస్త్రైలోక్యదహనాద్విషాత్॥6560॥*

*ప్రజాపతులు ఇట్లు సదాశివుని స్తుతింపసాగిరి*- "దేవతలకు ఆరాధ్యుడవైన మహాదేవా! నీవు సకల ప్రాణులకును ఆత్మవు. జీవనదాతవు. మేము నిన్ను శరణు జొచ్చుచున్నాము. ముల్లోకములను దహన మొనర్చుచున్న ఈ భయంకర విషము నుండి మమ్ములను రక్షింపుము.

*7.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*త్వమేకః సర్వజగత ఈశ్వరో బంధమోక్షయోః|*

*తం త్వామర్చంతి కుశలాః ప్రపన్నార్తిహరం గురుమ్॥6561॥*

*ప్రజాపతులు ఇంకను ఇట్లు సదాశివుని స్తుతింపసాగిరి*

జగత్తులోని సకల జనులకు బంధములను కలిగించుటకును, ముక్తి నొసంగుటకును నీవు ఒక్కడవే సమర్థుడవు. కనుక జ్ఞానులు నిన్నే ఆరాధించెదరు. ఏలయన, నీవు శరణాగతుల బాధలను తొలగించునట్టి జగద్గురుడవు.

*7.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*గుణమయ్యా స్వశక్త్యాస్య సర్గస్థిత్యప్యయాన్ విభో|*

*ధత్సే యదా స్వదృగ్భూమన్ బ్రహ్మవిష్ణుశివాభిధామ్॥6562॥*

*ప్రజాపతులు ఇంకను ఇట్లు సదాశివుని స్తుతింపసాగిరి*

ప్రభూ! త్రిగుణాత్మకమైన నీ శక్తిద్వారా ఈ జగత్తును సృష్టించుటకును, పాలించుటకును, ప్రళయమొనర్చుటకును, పరబ్రహ్మమైన నీవు బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలగు పేర్లతో ఒప్పుచుందువు.

*7.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*త్వం బ్రహ్మ పరమం గుహ్యం సదసద్భావభావనః|*

*నానాశక్తిభిరాభాతస్త్వమాత్మా జగదీశ్వరః॥6563॥*

*ప్రజాపతులు ఇంకను ఇట్లు సదాశివుని స్తుతింపసాగిరి*

నీవు స్వయంప్రకాశుడవు. పరమ గోప్యమైన బ్రహ్మతత్త్వమునకు నీవే కారణుడవు. దేవతలు, మనుష్యులు, పశుపక్ష్యాదులు, వృక్షములు, మొదలగు చరాచరప్రాణులకు నీవే జీవనదాతవు. నీవు లేకుండా ఈ సృష్టియు, దాని అస్తిత్వము గూడ ఉండదు. ఏలయన, అన్నింటికిని నీవే ఆత్మవు. అనేక శక్తుల ద్వారా నీవే జగద్రూపమున ప్రతీతమగుచుందువు. నీవు సర్వేశ్వరుడవు. సర్వసమర్థుడవు.

*7.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*త్వం శబ్దయోనిర్జగదాదిరాత్మా  ప్రాణేంద్రియద్రవ్యగుణస్వభావః|*

*కాలః క్రతుః సత్యమృతం చ ధర్మస్త్వయ్యక్షరం యత్త్రివృదామనంతి॥6564॥*

సమస్త వేదములు నీ నుండియే ప్రకటములైనవి. కనుక, స్వయముగా జ్ఞానస్వరూపుడవైన నీవే సకల శాస్త్రజ్ఞానములకు మూలము. జగత్తునకు ఆదికారణమైన మహత్తత్త్వము, మూడు అహంకారములు (సాత్ప్విక, రాజస, తామస అహంకారములు) నీవే. ప్రాణములు, ఇంద్రియములు.పంచమహాభూతములు,అట్లే, శబ్దాది విషయములయొక్క వేర్వేరు స్వభావములు, వాటి మూలకారణములును నీవే. ప్రాణుల యొక్క ఆయువును వృద్ధిచేయుటకును, తగ్గించుటకును కారణమైన కాలస్వరూపుడవు నీవే. శుభములను ప్రసాదించు యజ్ఞములు, సత్యవాక్యములు, ధర్మము యొక్క స్వరూపములు నీవే. అ, ఉ, మ్ (ఓమ్) అను మూడక్షరములతో కూడిన ఓంకార స్వరూపుడవు నీవే. త్రిగుణాత్మకమైన ప్రకృతియు నీవేయని వేదవేత్తలు పేర్కొందురు.

*7.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*అగ్నిర్ముఖం తేఽఖిలదేవతాత్మా  క్షితిం విదుర్లోకభవాంఘ్రిపంకజమ్|*

*కాలం గతిం తేఽఖిలదేవతాత్మనో దిశశ్చ కర్ణౌ రసనం జలేశమ్॥6565॥*

*ప్రజాపతులు ఇంకను ఇట్లు సదాశివుని స్తుతింపసాగిరి*

ముల్లోకములకు అభ్యుదయమును చేకూర్చునట్టి శంకరా! సర్వదేవతాస్వరూపుడైన అగ్ని నీముఖము, పృథ్వి నీ పాదపద్మములు. కాలమే నీ గమనము, దిక్కులు నీ కర్ణములు. వరుణుడు నీ నాలుక. నీవు సకల దేవతా స్వరూపుడవు.

*7.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*నాభిర్నభస్తే శ్వసనం నభస్వాన్ సూర్యశ్చ చక్షూంషి జలం స్మ రేతః|*

*పరావరాత్మాశ్రయణం తవాత్మా  సోమో మనో ద్యౌర్భగవన్ శిరస్తే॥6566॥*

*7.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*కుక్షిః సముద్రా గిరయోఽస్థిసంఘాః రోమాణి సర్వౌషధివీరుధస్తే|*

*ఛందాంసి సాక్షాత్తవ సప్తధాతవస్త్రయీమయాత్మన్ హృదయం సర్వధర్మః॥6567॥*

*ప్రజాపతులు ఇంకను ఇట్లు సదాశివుని స్తుతింపసాగిరి*

పరమేశ్వరా! ఆకాశము నీ నాభి, వాయువు నీ శ్వాస, సూర్యుడు నీ నేత్రములు. జలము నీ రేతస్సు. ఉన్నత-నిమ్న జీవులందఱికిని నీ స్వరూపము ఆశ్రయము. చంద్రుడు నీ మనస్సు. స్వర్గము నీ శిరస్సు. వేదస్వరూపుడవైన పరమాత్మా! సముద్రములే నీ ఉదరము. పర్వతములు నీ అస్థిసమూహములు. ఓషధులు, లతాగుల్మములు నీ రోమములు. గాయత్రి మొదలగు ఛందస్సులు నీ సప్తధాతువులు. సకలధర్మములు నీ  హృదయము.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

కామెంట్‌లు లేవు: