3, ఆగస్టు 2020, సోమవారం

అహంభావం - కధ

'' నేను నిన్ను పట్టుకోలేదు , నీవే పట్టుబడ్డావు '' అంది ఆమె.

ఒక మహానగరం లో ఒక గొప్ప శిల్పి వుండేవాడు. ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే , పేరు ప్రఖ్యాతులున్న  విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పునూ  పట్టలేకపోయేవారు. ఆయన చెక్కిన శిల్పాలున్న పెద్ద గది లోకి వెళితే , అవన్నీ ప్రాణమున్నవాటివిగా , మన పక్కనవున్నట్టు , మనకు చేయి అందిస్తున్నట్టు , మనతో మాట్లాడుతున్నట్టు ... సజీవంగా వుండేవి. ఎటూవంటివారైనా మంత్రముగ్ధులు కావాల్సిందే !  ఆ అసాధారణ ప్రతిభ , నైపుణ్యం నెమ్మదిగా అతనిలో అహంభావాన్ని [Ego]  నింపాయి. ఇదిలావుండగా , ఒకరోజు ఒక జ్యోతిష్కుడు ఆయన చేతిని , జన్మ నక్షత్ర  వివరాలను పరిశీలించి '' మీరు ఫలానా రోజు చనిపోతారు సుమా ! '' అని చెప్పాడు.

శిల్పికి చెమటలు పట్టాయి. ఆయన ఇలా అనుకొన్నాడు : ' నేను బ్రహ్మ లాంటివాడిని కదా , ఆయన [ బ్రహ్మ ] మనుషులను సృష్టిస్తే , ఆ రూపాలకు నేను ప్రతిరూపాలా అనిపించే శిల్పాలు చేస్తానుకాబట్టి , నేను అపర బ్రహ్మ అవుతాను. మృత్యువు వచ్చిన రోజున నాలాగే వున్న మరో ఏడు శిల్పాలను చెక్కివుంటాను. అపుడు మృతుదేవత ప్రాణమున్న శిల్పి ఎవరో , బొమ్మ ఏదో కనుక్కోలేక వాపసువెళ్ళిపోతుంది. నేను మృత్యువుకు దొరకను .' అచ్చు తనలాగా వున్న శిల్పాలు ఏడు చెక్కి , ఆరోజు ఒక దానివెనుక దాక్కొన్నాడు. మృత్యుదేవత ఆ గది లోకివచ్చింది. శిల్పి శ్వాసను పూర్తీగా నియంత్రించి కదలకుండా నిలుచున్నాడు. దేవత వెతుకుతూ వస్తోంది. ఊపిరిబిగపట్టి చూస్తున్నాడు శిల్పి. ఇక కనుక్కోలేదు అని అనుకొన్నాడు. అపుడు దేవత అంది : '' ఈ శిల్పి ఎవరోకానీ , ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కాడు ! కానీ ఈ ఒక్క శిల్పం లోనే అతను ఒక చిన్న తప్పు చేసాడు ! ''  అంతే ! మన అపరబ్రహ్మ కు అహం దెబ్బ తింది. వెంటనే తాను దాక్కొన్నాడు అన్న సంగతి కూడా మరచి కోపంతో '' ఎక్కడుంది తప్పు ? అంతా చక్కగావుంది. ఏ తప్పూ లేదు ! '' అనేసాడు.

అపుడు మృత్యుదేవత నవ్వుతూ , '' నాకు తెలుసు అందులో ఏ తప్పూ లేదని. కానీ నిన్ను గుర్తించడానికి చిన్న అపద్ధం చెప్పానంతే. నేనేమీ నిన్ను పట్టుకోలేదు , నీకు నువ్వే పట్టుబడ్డావు ! చూడు , ప్రాణాధారమైన నీ శ్వాస ను కూడా నియంత్రించగలిగావు కానీ , నీ అహంభావాన్ని మాత్రం నియంత్రించలేకపోయావు, చివరకు అదే నిన్ను పట్టించింది ,'' అని ఆయన్ను తీసుకెళ్ళిపోయింది.

మనం పెంచుకొనే అహంభావం [Ego] అంత ప్రమాదకరమైనది. అది సత్యాన్ని చూడనివ్వదు , వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు , మనం అనుకొన్నదే కరెక్టు ,  ఇతరులదే తప్పు అని మనం అనుకొనేలాగా చేస్తుంది. నెమ్మదిగా అది స్వార్థానికి దారి తీసి '' నేను బాగుంటే చాలు , నా కుటుంబం బాగుంటే చాలు '' అనుకొంటాము. స్వార్థం ప్రకృతి విరుద్ధం , దైవం నుండి మనకు అందాల్సిన అనుగ్రహన్ని అడ్డుకొనే దెయ్యం స్వార్థం. మీరు గమనించారా ? '' అహంభావం '' అనే పదం లోంచి ' అహం ' తీసేస్తే మిగిలేది ' భావం '. అంటే ' అర్థం'. అర్థమైతే అనర్థం జరగదు.

కామెంట్‌లు లేవు: