3, ఆగస్టు 2020, సోమవారం

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - ఏడవ అధ్యాయము*

*సముద్రమథనము - పరమశివుడు విషమును భక్షించి సురాసురులను కాపాడుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*7.13 (పదమూడవ శ్లోకము)*

*ఉపర్యధశ్చాత్మని గోత్రనేత్రయోః  పరేణ తే ప్రావిశతా సమేధితాః|*

*మమంథురబ్ధిం తరసా మదోత్కటా మహాద్రిణా క్షోభితనక్రచక్రమ్॥6552॥*

ఈ విధముగా భగవంతుడు పర్వతముయొక్క పై భాగమును పట్టుకుని, క్రింద ఆధారముగా కూర్మరూపమును ధరించి, దానిని నిలిపెను. సురాసురుల శరీరములయందు శక్తిరూపమునను , పర్వతమునందు  దృఢత్వ రూపమునను, వాసుకియందు నిద్రారూపమునను ప్రవేశించి, వారికి ఎట్టి కష్టము కలుగకుండగజేసి, అందరిని శక్తి సంపన్నులను గావించెను. దేవాసురులు బలగర్వితులై మిగుల వేగముగా సముద్ర మథనమును గావింపసాగిరి. అప్పుడు సముద్రము, మరియు అందలి జలజంతువులు క్షోభకు గురియయ్యెను.

*7.14 (పదునాలుగవ శ్లోకము)*

*అహీంద్రసాహస్రకఠోరదృఙ్ముఖశ్వాసాగ్నిధూమాహతవర్చసోఽసురాః|*

*పౌలోమకాలేయబలీల్వలాదయో దవాగ్నిదగ్ధాః సరలా ఇవాభవన్॥6553॥*

నాగరాజైన వాసుకి యొక్క భయంకరమైన వేలకొలది నేత్రముల నుండియు, ముఖముల నుండియు, నిశ్వాసలనుండి విషాగ్నులు వెలువడెను. వాటి పొగలవలన పౌలోముడు, కాలేయుడు, బలి, ఇల్వలుడు మొదలగు అసురులు తమ తేజస్సును కోల్పోయిరి. వారు దావానలముచే దగ్ధమైన తెల్లతెగడ చెట్లవలె కన్పట్టిరి.

*7.15 (పదునైదవ శ్లోకము)*

*దేవాంశ్చ తచ్ఛ్వాసశిఖాహతప్రభాన్  ధూమ్రాంబరస్రగ్వరకంచుకాననాన్|*

*సమభ్యవర్షన్ భగవద్వశా ఘనాః వవుః సముద్రోర్మ్యుపగూఢవాయవః ॥6554॥*

వాసుకి యొక్క శ్వాసాగ్నిశిఖలు దేవతలనుగూడ వదలిపెట్టలేదు. వారును తేజోవిహీనులైరి. వారి వస్త్రములు, మాలలు, కవచములు, ముఖములు పొగచూరి పోయెను. వారి ఈ దుస్థితిని జూచిన భగవంతుడు మేఘములను ప్రేరేపింపగ అవి వారిపై జలములను వర్షించెను. వాయువులు సముద్ర తరంగములపై వీచుచు చల్లదనమును, పరిమళములను ప్రసరింప జేసెను. వారికి హాయిని గూర్చెను.

*7.16 (పదునారవ శ్లోకము)*

*మథ్యమానాత్తథా సింధోర్దేవాసురవరూథపైః|*

*యదా సుధా న జాయేత నిర్మమంథాజితః స్వయమ్॥6555॥*

ఇట్లు దేవాసురులు సముద్రమును మథించుచున్నను దానినుండి అమృతము వెలువడలేదు. అపుడు పరాజయములను ఎరుగని శ్రీమహావిష్ణువు స్వయముగా సముద్రమును మథింపసాగెను.

*7.17 (పదునేడవ శ్లోకము)*

*మేఘశ్యామః కనకపరిధిః కర్ణవిద్యోతవిద్యున్మూర్ధ్ని  భ్రాజద్విలులితకచః స్రగ్ధరో రక్తనేత్రః|*

*జైత్రైర్దోర్భిర్జగదభయదైర్దందశూకం గృహీత్వా మథ్నన్ మథ్నా ప్రతిగిరిరివాశోభతాథో ధృతాద్రిః॥6556॥*

సంపూర్ణజగత్తునకు అభయ ప్రదాతయు, విశ్వవిజేతయు ఐన శ్రీహరి తన బలిష్థములైన భుజములతో వాసుకి సర్పమును పట్టుకొని, కూర్మరూపమున పర్వతమును మోయుచు, మందరాచలమును కవ్వముతో సముద్ర మథనమును చేయ సాగెను. మేఘమువలె శ్యామవర్ణముగల ఆయన శరీరముపై బంగారు పీతాంబరము రెపరెపలాడుచుండెను. విద్యుత్కాంతుల నిచ్చెడి కర్ణకుండలముల కాంతులు తలపై నొక్కులుదీరిన ముంగురులు మనోజ్ఞముగా నుండెను. నేత్రముల యందు ఎర్రని రేఖలు, కంఠమున వనమాలలు శోభిల్లుచుండెను. ఆ సమయమున ఆ స్వామి రెండవ పర్వతరాజువలె విలసిల్లుచుండెను.

*7.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*నిర్మథ్యమానాదుదధేరభూద్విషం మహోల్బణం హాలహలాహ్వమగ్రతః|*

*సంభ్రాంతమీనోన్మకరాహికచ్ఛపాత్తిమిద్విపగ్రాహతిమింగిలాకులాత్॥6557॥*

ఆ పురుషోత్తముడు ఈ విధముగ సముద్రమును మథించుచుండగా అందలిజలము తీవ్రక్షోభకు గురియయ్యెను. అంతట చేపలు, మొసళ్ళు, నీటిపాములు, తాబేళ్ళు, భయముతో పైకి వచ్చి, అటునిటు పరుగులు తీయసాగెను. తిమి, తిమింగలములు మొదలగు జలజంతువులు సముద్రపు ఏనుగులు, గ్రాహములు, పెద్ద పెద్ద మొసళ్ళ వ్యాకుల పాటునకు లోనయ్యెను. అదే సమయమున మొట్టమొదట హాలాహలము అను భయంకరవిషము వెలువడెను.

*7.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*తదుగ్రవేగం దిశి దిశ్యుపర్యధోవిసర్పదుత్సర్పద సహ్యమప్రతి|*

*భీతాః ప్రజా దుద్రువురంగ సేశ్వరా అరక్ష్యమాణాః శరణం సదాశివమ్॥6558॥*

ఆ భయంకర విషము దశదిశలయందును, పైన క్రింద సర్వత్ర వ్యాపించెను.దుర్భరమైన ఆ  విషమునుండి రక్షించుకొను ఉపాయము కనబడకుండెను. అందులకు భయభ్రాంతులైన ప్రజలు, ప్రజాపతులు తమను రక్షించువారు కనబడక సదాశివుని శరణుజొచ్చిరి.

*7.20 (ఇరువదియవ శ్లోకము)*

*విలోక్య తం దేవవరం త్రిలోక్యాః భవాయ దేవ్యాభిమతం మునీనామ్|*

*ఆసీనమద్రావపవర్గహేతోస్తపో  జుషాణం స్తుతిభిః ప్రణేముః॥6559॥*

శంకరభగవానుడు, సతీదేవితో గూడి కైలాస పర్వతముపై విరాజిల్లుచుండెను. మహర్షులు, మునులు, ఆ ప్రభువును సేవించుచుండిరి. ముల్లోకవాసుల క్షేమమునకును, మోక్షమునకును ఆ శివుడు తపమొనరించు చుండెను. ప్రజాపతులు ఆ మహాదేవుని దర్శించి, ప్రణమిల్లి ఇట్లు స్తుతింపసాగిరి-

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

కామెంట్‌లు లేవు: